Suryaa.co.in

Andhra Pradesh

కొంగుచాపి అడుగుతున్నాం న్యాయం చేయండి

-ఆడబిడ్డలు అడిగితే అన్న కాదంటాడా?
-పులివెందుల సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి

పులివెందుల: పులివెందుల నియోజకవర్గంలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం వేంపల్లెలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి నా ఆన్న. ఆయన ఇచ్చేది అంతా చెల్లె కోసమే. రాయలసీమలో చెల్లెల్ని ఎలా చూసుకుంటారో తెలుసు కదా. ఆడబిడ్డ ఇంటికి వచ్చి నోరు తెరిచి అడిగితే ఏ అన్న అయినా కాదంటాడా. వివేకా రక్తం ఈ గడ్డ మీద న్యాయం కోసం ఘోషిస్తోంది. ఐదేళ్లుగా సునీత తొక్కని గడప లేదు. ప్రజా కోర్టులో న్యాయం కోసం వచ్చాం. ఆడబిడ్డలం కొంగు చాపి అడుగుతున్నాం న్యాయం చేయండని కోరారు. ఎంపీ అవినాష్‌ ఏనాడైనా జిల్లా ప్రజల కోసం పనిచేశారా? కడప స్టీల్‌ ప్రాజెక్టు వైఎస్సార్‌ కల. జిల్లా ప్రజలకు లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవి. ఎంపీగా అవినాష్‌ రెడ్డికి బాధ్యత లేదా? పార్లమెంట్‌లో పోరాటం చేశాడా? ఒక్క నాడైనా ఉద్యమం చేశాడా? సీబీఐ కేసుల్లో తప్ప ఆయన అక్కడకు పోడు. కడప స్టీల్‌ను శంకుస్థాపన ప్రాజెక్ట్‌గా మార్చారు. అవినాష్‌ రెడ్డి గెలిస్తే జైలుకి వెళ్లి కలవాలి. ఇలాంటి వారిని గెలిపించడం అవసరమా అని ప్రశ్నించారు.

వైఎస్సార్‌ ప్రాజెక్టులకు వారసుడి పాలనలో దిక్కులేదు…
సొంత నియోజకవర్గంలో జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. పులివెందుల మైక్రో ఇరిగేషన్‌ పథకం అన్నాడు. తట్టెడు మట్టి తీయలేదు. గండికోట రిజర్వాయర్‌కు 365 రోజులు నీళ్లు ఉండేలా చూస్తా అన్నాడు. ఒక్క హామీ నెరవేరలేదు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ జలయజ్ఞం కింద 54 ప్రాజెక్టులు కట్టారు. పెండిరగ్‌లో ఉన్న 42 ప్రాజెక్టులకు వారసుడి హయాంలో దిక్కులేదు. ఐదేళ్లు సీఎంగా ఉండి ఎంతో చేయాలి. కనీసం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. జాబ్‌ క్యాలెండర్‌ అని మోసం చేశాడు. సీఎం అయ్యాక ఎర్రగుంట్లలో ఒక వాగ్దానం చేశాడట. 30 వేల విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమ బద్ధీకరిస్తామని చెప్పాడట. సీఎం అయ్యాక ఒక్కరోజు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. వైఎస్సార్‌కు, జగన్‌ పాలనకు పొంతనే లేదు.

LEAVE A RESPONSE