Suryaa.co.in

Telangana

కేసీఆర్‌ తయారుచేసిన సైనికులం

– సర్కారు అక్రమ కేసులకు భయపడేది లేదు
– గద్దెనెక్కిన నాటి నుంచే బెదిరింపులు ప్రారంభం
– వైఫల్యాలను ఎత్తిచూపితే, హామీలపై ప్రశ్నిస్తే కేసులు
– ప్రభుత్వ తప్పులకు బీఆర్‌ఎస్‌ నేతలపై ప్రతీకార చర్యలు
– న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం..దోషులుగా నిలబెడతాం
– బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ వై.సతీష్‌రెడ్డి

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమే అజెండాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ వై.సతీష్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకుని అణచివేత ధోరణితోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోం దని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చీ రాగానే డిసెంబర్‌ 4నే హుజురాబాద్‌ లో రావుల భరత్‌రెడ్డి అనే బీఆర్‌ఎస్‌ కార్యకర్తపై కేసు పెట్టారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిపై లాఠీచార్జీకి నిరసనగా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టినందుకు అతనిపై ఓ పోలీసు ఫిర్యాదు చేస్తే కేసు పెట్టారు. పంటలు ఎండిపోతున్నా యి..కాలువల్లో నీళ్లు రావడం లేదని ప్రశ్నించినందుకు తుంగతుర్తికి చెందిన సురేష్‌ యాదవ్‌పై డిసెంబర్‌ 20న దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి అట్రాసి టీ కేసు పెట్టారు. ప్రభుత్వాన్ని విమర్శించాడని కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం పచ్చునూర్‌కు చెందిన పిట్టల శ్రవణ్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మార్చి 5న కేసు పెట్టారు. క్రిమినల్‌ను తీసుకొచ్చినట్టు లొకేషన్‌ ట్రేస్‌ చేసి అతని స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు కిడ్నాప్‌ చేసి తీసుకొచ్చారు. మార్చి 15న పంటలు ఎండుతున్నాయని ఎండిన పంటల వీడియో తీసి రైతులతో మాట్లాడించి సోషల్‌ మీడియాలో పెట్టిన ధర్మపురికి చెందిన సల్వాజీ మాధవరావుపై దాడి చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపించారు.

బీఆర్‌ఎస్‌ ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నాలు

ఓయూలో నీరు, కరెంటు కొరత ఉందంటూ సెలవులు ప్రకటిస్తూ హాస్టల్‌ వార్డెన్‌ ఇచ్చిన సర్క్యులర్‌ను సోషల్‌ మీడియాలో పెట్టినందుకు మే 1న బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్‌ క్రిశాంక్‌, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాగేందర్‌పై కేసు పెట్టి జైలుకు పంపించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా తన సోషల్‌ మీడియాలో ఫేక్‌ సర్క్యులర్‌ను పోస్ట్‌ చేశారు. అయినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఆర్టీసీ లోగో విషయంలో కొణతం దిలీప్‌, హరీష్‌ రెడ్డిపై కేసు పెట్టారు. అప్పటికే కాంగ్రెస్‌ వ్యక్తులు, పలు మీడియా సంస్థలు టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో ఇదేనంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికలు అదే లోగోను తమ పత్రికల్లో ముద్రించాయి. అయినా వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొణతం దిలీప్‌, హరీష్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే వీరితో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా వారియర్స్‌ అయిన ఉదయ్‌, బాలు యాదవ్‌, నాగేందర్‌ గౌడ్‌, దగ్గుబాటి రవి, బెజ్జంకికి చెందిన బండపల్లి సతీష్‌, ధర్మపురికి చెందిన సల్మాన్‌ఖాన్‌, కోటగిరి సుమన్‌, పెద్దపల్లికి చెందిన సదానందం, చెన్నూ రుకు చెందిన చింటుపై కేసులు పెట్టారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పిన రేవంత్‌ ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇవి చేస్తున్నారు.

తూటాలకు ఎదురెళ్లినోళ్లం..భయపడేది లేదు

పార్టీలో యాక్టివ్‌గా ఉంటూ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న వారిని ఇలా కేసుల తో వేధిస్తున్నారు. కేసులకు భయపడి ఆపేస్తారని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నట్టు న్నారు. కానీ మేమంతా కేసీఆర్‌ తయారు చేసిన సైనికులం, ఉద్యమం చేసి లాఠీ దెబ్బలు తిని తూటాలకు ఎదురెళ్లినోళ్లం. ఇలాంటి పిట్ట బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. మీరు మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైళ్లలో వేసినా వెనక డుగు వేసేది లేదు. తప్పుడు కేసులతో తాత్కాలికంగా మీకు సంతృప్తి కలగొచ్చు. కానీ నిజం బయటకు వచ్చినప్పుడు ప్రజలు రేవంత్‌ రెడ్డి సర్కారు మొహంపై ఉమ్మేయడం మాత్రం ఖాయం. మా నాయకులను, కార్యకర్తలను, సోషల్‌ మీడియా వారియర్స్‌ను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మేం తప్పు చేయడం లేదు. వాస్తవమేంటో న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటాం. మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తుంచు కోవాలి. దమ్ముంటే ఇచ్చిన హామీలు చెప్పిన సమయంలోగా నెరవేర్చి రైతులు, ప్రజల మన్ననలు పొందండి. వడ్లు కొనమని కన్నీళ్లతో రోడ్డెకిన రైతు గోస విని వారి కన్నీళ్లు తుడవండి. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ అని గద్దెనెక్కిన వాళ్లు మరవొద్దు అని సూచించారు.

LEAVE A RESPONSE