Suryaa.co.in

Andhra Pradesh

నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం

– ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం
పార్టీ పెట్టాలంటే బాబాయిని చంపించి ఉండాలా?
ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదు
– మీ అందరినీ గుండెల్లో పెట్టుకున్నా
– మీరే నా కుటుంబం
పిఠాపురం జయకేతనం సభలో జనసేన దళపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం

పిఠాపురం: పార్టీ పెట్టాలంటే నాన్న సీఎం అయ్యిండాలా? బాబాయిని చంపించి ఉండాలా? అలా అని ఎక్కడా రాసి లేదు కదా? అంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైసీపీ అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు. పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన లక్షలాది మంది జనసేన సైనికులలో పవన్ కల్యాణ్ ఉత్సాహం నింపే ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా జససేన ప్రస్ధానం మొదలు నుంచి, నేటి వరకూ తనకు ఎదురైన అనుభవాలను జనసైనికులతో పంచుకున్నారు.

దశాబ్దం పాటు పార్టీని నడపాలంటే ఎన్ని తిట్లు తినాలి? వ్యక్తిగత జీవితం నుంచి ఆరోగ్యం వరకు ఎన్నో పోగొట్టున్నా. మార్షల్ ఆర్ట్స్‌లో మూడు గ్రానైట్ రాళ్లు పెట్టి పగులకొట్టించుకున్న తాను, ఇప్పుడు తన రెండో కొడుకుని ఎత్తుకోలేనంత బలహీనపడినట్లు తెలిపారు.

ప్రజలందరి ఆశీర్వాదంతో మళ్లీ బలం తెచ్చుకుంటానని పేర్కొన్నారు.
రాజకీయాల్లో పవర్ కోసం పని చేయాలి. లేదా బలమైన సైద్ధాంతికం ఉండాలని అన్నారు. పవర్ కోసం మర్డర్లు చేయిస్తాం. వేల కోట్లు దోచేస్తాం. కులాలను కెలికేస్తాం. రకరకాలుగా లాభపడతాం. కోడి కత్తిని వాడుకుంటాం అంటే నడవదని, అలాంటి వాటిని తాను ఎంచుకోలేదంటూ పరోక్షంగా వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు.

తాను సైద్ధాంతిక రాజకీయాన్ని ఎన్నుకున్నానని, అందుకే దేశ భద్రత కోసం ఆలోచిస్తానని అన్నారు. రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన ఎదిగిందని.. ఎలా మార్చేసుకుంటావని ఏదో మాట్లాడేస్తుంటారని, ప్రత్యర్థుల మాటను పవన్ ఉటంకించారు. సమాజంలో మార్పు కోసం పని చేయాలని వచ్చినవాడిని. ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదన్నారు.

రాజకీయాల్లో పవర్ కోసం పని చేయాలి. లేదా బలమైన సైద్ధాంతికం ఉండాలన్నారు. రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన ఎదిగిందన్నారు. ఇన్ని మాట్లాడే ఇంగ్లీష్ పేపర్ వాళ్లు , ఒకసారి ఆలోచన చేసుకోండని చురకలంటించారు.ఈ సందర్భంగా ఆయన తెలంగాణ గురించి ప్రస్తావించారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ.. అంటూ తెలంగాణ గురించి గొప్పగా చెప్పారు.

ఇల్లేమో దూరం. చేతిలో దీపం లేదు. గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాడిని కనుకే అన్నీ ఒక్కడినే అయి, 2014 లో జనసేన పార్టీ స్థాపించాను. భావ తీవ్రత ఉంది కాబట్టే 2018 లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019 లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాను. మనం నిలబడ్డాం. పార్టీని నిలబెట్టాం.

మనం నిలదొక్కుకోవడమే కాకుండా.. నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం. మనం 2019లో ఓడినప్పుడు మీసాలు మేలేశారు, జబ్బలు జరిచారు, తొడలు కొట్టారు. మన ఆడపడుచులను అవమానించారు. ప్రజలను హింసించారు. ఇదేమి న్యాయం అని మన జనసైనికులు, వీర మహిళలు గొంతెత్తితో వారిపై కేసులు పెట్టి జైళ్లల్లో పెట్టారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమంగా జైలులో బంధించారు. వారి పార్టీ సీనియర్ నాయకులను రోడ్డు మీద రావాలంటే భయపడేలా చేశారు.

ఇక నాలాంటి వాడిపై చేయని కుట్ర లేదు, తిట్టని తిట్టు లేదు, వేయని నిందలు లేవు. ఈ ఎన్నికలో అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేసి తొడలు గొట్టినవారికి బుద్ధి వచ్చేలా ఆ గేట్లను బద్దలు కొట్టాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌లో ఇద్దరు ఎంపీలతో అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా వంద శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించాం. ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈరోజు జయకేతనం ఎగురవేస్తున్నాం.

జనసేన జన్మ స్థలం తెలంగాణ.. కర్మ స్థలం ఆంధ్ర
జనసేన జన్మ స్థలం తెలంగాణ అయ్యింది. కర్మ స్థలం ఆంధ్రప్రదేశ్ అయ్యింది. కృష్ణమాచార్య మాటలు మాకే కాదు. మన ప్రజలకు ఊతమిచ్చాయి. నా గుండె లోత్తుల్లో నుంచి మీ అందరికీ ధన్యవాదాలు. మూగబోయిన కోటి మంది తమ్ముళ్ల గళాన్ని వినిపించిన నా తెలంగాణా కోటి రతనాల వీణ. అలాంటి కోటి దివిటీల కాంతి జ్యోతి తెలంగాణా. ఆనాడు కరెంటు షాక్ తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాకు, చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి ఆశీస్సులు. నన్ను ప్రేమించే ప్రజల దీవెన నాకు ఊపిరి ఇచ్చింది.

అలాంటి తెలంగాణ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. బండెనక గట్టి పదహారు బండ్లు కట్టి అంటూ, కాళ్లకు గజ్జె కట్టి చేతికి కర్ర పెట్టి ఆటని, పాటని ఆయుధంగా మలిచిన వాడు, యువతలో స్పూర్తిని నింపినవాడు, నేను కనిపిస్తే ఎలా ఉన్నావు తమ్ముడు అని ఆప్యాయంగా పలకరించే మన దగ్గర లేని నా గద్దరన్న.

మా ఆడపడుచులు, వీర మహిళల స్పూర్తి, పోరాటాన్ని నేను మరువను. మీరంతా రాణి రుద్రమలు. జనసేన వీరమహిళలు. అందరి క్షేమం కాంక్షించే సూర్య కిరణాల లేలేత కిరణాలు. తేడా వస్తే కాల్చి ఖతం చేసే లేజర్ భీమ్‌లు. మా జనసేన వీర మహిళలు

బహుభాషా ప్రావీణ్యం ఎంతో మంచిది
నేడు హెూలీ పండుగ. మైత్రిని పంచే పండుగ. చెడు పోయింది. మంచి వచ్చింది అని ఉత్సవం చేసే పండుగ. మన జయకేతనం ఎగుర వేసిన రోజు. హెూలీ రావడం యాధృచ్చికం కాదు. భగవంతుని నిర్ణయం. తమిళనాడు షణ్ముఖ్ యాత్రకు వెళితే, నాపై ఎంతో ప్రేమ చూపించారు. తమిళనాడు ప్రజలందరికీ మనస్పూర్తిగా నా నమస్కారాలు.

మహారాష్ట్ర వెళితే సినిమా పరంగా కాకుండా రాజకీయ పరంగా కూడా నాపై అబిమానం చూపారు. ఎన్డీయే కూటమి కోసం అక్కడ ప్రచారం చేయగా, 95శాతం విజయం సాధించాం. కర్నాటకలో కూడా నా మీద ప్రేమ చూపించేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. బహుభాషా ప్రావీణ్యం ఎంతో మంచిది

సినిమాల పరంగా ఎదగాలని అనుకోలేదు
2009 లో ప్రజారాజ్యంతో నా రాజకీయం ప్రారంభమైంది. కానీ 2003 లో నా తండ్రికి చెప్పా. నేను రాజకీయాల్లోకి వస్తా అని. నేను సమాజం మీద బాధ్యతతో ఆలోచించా. సినిమాల పరంగా ఎదగాలని అనుకోలేదు. నా ఖుషీ సినిమా చూసి, గద్దర్ మా అన్నయ్యల ద్వారా నన్ను కలిశారు. ఏ మేరా జహా అనే పాటలో నా సీన్స్ చూసి, నన్ను గద్దర్ అభినందించారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది.

2006 లో ఢిల్లీ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చి రాజకీయాల్లోకి వస్తారా అని నన్ను అడిగారు. నాకు అప్పుడు రాజకీయాలపై అవగాహన లేదని, మెచ్యూరిటీ వచ్చాక వచ్చి కలుస్తా అని చెప్పాను. ఆ వ్యక్తిని ఇప్పటికీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఆయనే ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు. నన్ను సినిమాల్లో చూసి ఓజీ అంటున్నారు. నేను సమాజం కోసం ఆలోచన చేసే ఇటువంటి వారిని చూస్తాను. అణగారిన వర్గాల కోసం పని చేసే వ్యక్తి మన ప్రొఫెసర్ గారు. నా గుండెల నుంచి ప్రొఫెసర్ గారికి ప్రేమను మాత్రం ఇవ్వగలను

నా పేరు అంటున్నారంటే నా మాట వినడం లేదని అర్థం
పవన్ కల్యాణ్ ప్రసంగిస్తుండగా, కొందరు అభిమానులు ఓజీ ఓజీ అని నినాదాలు చేశారు. దీంతో పవన్ కల్యాన్ వారిని వారించే ప్రయత్నం చేశారు. ఈ సభలో సినిమా గురించి మాట్లాడం సరికాదని హితవు చెప్పారు. ఇక్కడ జనసైనికులు ప్రాణలు తెగించి పోరాటం చేసినవాళ్లు. 450 మంది పైగా జనసైనికులు సిద్దాంతాలు నమ్మి చనిపోయారు. వారి గౌరవం కోసం, మనం సినిమాలు ఇక్కడ మాట్లాడవద్దు.

ఇక్కడ నా పేరు అంటున్నారంటే నా మాట వినడం లేదని అర్థం. 11 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఒక్కడినే. ఈ 11 యేళ్లల్లో నేను పడ్డ కష్టాలు, బాధలు ఏమిటో కొంతైనా మీతో పంచుకుంటాను. మీ అందరినీ గుండెల్లో పెట్టుకున్నాను. మీరే నా కుటుంబం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

నా రక్తంలోనే హిందుత్వం ఉంది
చాలామంది అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ హిందు ధర్మ పరిరక్షకుడు అయిపోయాడు. సనాతనవాది అయిపోయాడు అని మాట్లాడుతున్నారు. వారికి చెప్పేదొక్కటే. నా రక్తంలోనే హిందుత్వం ఉంది. నేను 21 సంవత్సరాల వయసు నుంచి దీక్షలు చేస్తూ వచ్చాను. మొదటి నుంచి సనాతన ధర్మం పాటిస్తున్నవాడినే. నాకు సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎవరి దగ్గరా ప్రూఫ్ చేసుకోవాల్సిన అగత్యం లేదు.

నాకు హిందుత్వం, సనాతన ధర్మం అనేది ఓట్ల కోసం అయితే 219 ఆలయాల మీద దాడి జరిగినపుడు నేను ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలి కదా..? కాని నేను సంమయమనం పాటించాను. నిత్యం శ్రీరాముడిని కొలిచే మాకు రాముడు విగ్రహం తల నరికితే కోపం రాకూడదు అని చెప్పడానికి మీరెవరు..? హైదరాబాద్ లో ఓ నాయకుడు మాకు 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులందరినీ అంతం చేస్తామని చెబితే మేం మాట్లాడకూడదని చెబుతారేంటీ..?

బతుకమ్మను హేళన చేస్తూ మాట్లాడితే మౌనంగా ఉండమని చెబుతారేంటీ..? మేం పూజించే పార్వతీదేవి, లక్ష్మి దేవిలను తిడతారు. అయినా ఏం అనకూడదు అంటే ఎలా..? ఆ జనరేషన్ వెళ్లిపోయింది. ఇప్పుడు మేం తప్పును తప్పు అనే చెబుతాం. అల్లాకు, జీసస్ కు ఓ న్యాయం అమ్మవారికి ఓ న్యాయం అంటే కుదరదు.

సనాతనం అంటే మంచి ధర్మం
సనాతన ధర్మం పాటించిన విజయనగర రాజులు మసీదు నిర్మించారు. బంగ్లాదేశ్ ఏర్పాటుకు సనాతన ధర్మం పాటించే ఆలోచనే మూలం. పాకిస్థాన్ మొదటి లా మినిస్టర్ శ్రీ జోగింద్రనాథ్ మండల్ గారు పాకిస్థాన్ వెళ్లిన తర్వాత అక్కడ ఆయన కుటుంబం ఊచకోతకు గురైతే మళ్లీ భారతదేశానికి కాందిశీకుడిగా వచ్చి చనిపోయారు. ఒకప్పుడు పాకిస్థాన్ లో 10 నుంచి 12 శాతం మేర హిందువులు ఉంటే ఇప్పుడు అక్కడ 1 నుంచి 2 శాతానికి తగ్గిపోయారు.

బంగ్లాదేశ్ లో నిత్యం హిందువులు నరకయాతన అనుభవిస్తున్నారు. కాని భారతదేశంలో ముస్లింలను, క్రైస్తవులను ఎంతో గౌరవిస్తాం. వారికి సమాజంలో సొంతవారిగా చూసుకుంటాం. ఇది సనాతన ధర్మం చూపించిన గొప్ప దారి. అంతా బాగుండాలని, అందరూ బాగుండాలని కోరుకోవడమే సనాతన ధర్మ లక్ష్యం. తిరుపతి లడ్డూ కల్తీ జరిగినపుడు కూడా నేను దోషులను పట్టుకోవాలని అన్నాను తప్ప ఇస్లాం, క్రైస్తవం గురించి మాట్లాడలేదు. ఆఖరికి కల్తీ చేసిన వారు కూడా హిందువులనే తేలింది. తప్పు జరిగినపుడు తప్పు జరిగిందని నిర్భయంగా చెబుతాం. మా మనోభావాలు గాయపడినపుడు బయటకు వచ్చి మాట్లాడతాం. దానిలో తప్పేముంది.

సూడో సెక్యూలరిజం వద్దు
సెక్యూలరిజం అంటే ఎవరు తప్పు చేసిన వారిని శిక్షించడం కావాలి. ఓట్ల కోసం మాట్లాడటం కాదు. సూడో సెక్యూలరిస్టులకు అందరికీ చెబుతున్నా. ఎక్కడ తప్పు జరిగినా దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. గోద్రాలో అల్లర్లు జరిగినపుడు దాన్ని అంతా ఖండించాలి. అలాగే కరసేవకుల రైలును తగులబెట్టినపుడు కూడా అలాగే స్పందించాలి.
ఈ దేశంలో ఓట్ల కోసం కొందరు సూడో సెక్యూలరిస్టులుగా మాట్లాడటం మంచిది కాదు. జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. ఎక్కడా తప్పు జరిగినా తప్పుగా చెబుతాం. ఎవరైనా సరే ఏ మతం వారు అయినా సరే మొదట తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్షించాల్సిందే. ఇదే కోరుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుంది. దానికోసం సెక్యూలరిజం తీసుకురావడం కరెక్టు కాదు.

బహు భాషలు భారతదేశానికి మంచిది
దేశంలో అన్ని భాషలను గౌరవించాలి. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ బలం. త్రిభాష సిద్ధాంతం వద్దు.. హిందీ మాకొద్దు అనే తమిళనాడు నాయకులు వారి తమిళ సినిమాలను హిందీ డబ్ చేయడం మానుకోండి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పని వాళ్లను తీసుకురావడం మానేయండి. డబ్బులు మాత్రం హిందీ రాష్ట్రాల నుంచి కావాలి. వారి భాషను మాత్రం మాకొద్దు అంటే ఎలా..? భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. సంస్కృతంలో మంత్రాలు చదవకూడదని చెబుతారు. సంస్కృతం దేవ భాష. హిందూ ధర్మంలో ఆ భాషలోనే మంత్రాలను పఠిస్తారు.

ఇస్లాం ప్రార్థనలు అరబిక్ లో ఉంటాయి. కేవలం హిందువులను మాత్రమే మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం ఎందుకు..? భాషల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తే భారతీయుల మధ్య ఐక్యత, సమాచార మార్పిడి కూడా క్లిష్టమైపోతుంది. రూపాయి మార్కును బడ్జెట్ నుంచి తొలగిస్తే రాష్ట్రానికో పద్ధతి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది దేశానికి మంచిది కాదు.

దేశం నుంచి విడిపోతామని ఎలా చెబుతారు..?
ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. చర్చించుకోవాలి. అంతేగాని దేశం ఏమైనా కేకు ముక్కలాగ ప్రతిసారి దేశం నుంచి విడిపోతామని మాట్లాడతారేంటీ..? మీలాంటి వాళ్లు విడిపోతే నాలాంటి వాళ్లు కలపడానికి కోట్ల మంది వస్తారు.

ప్రతిసారి ఉత్తరాది, దక్షిణాది అని మాట్లాడతారు. ఉత్తరాదిన కైలాసంలో శివుడు కొలువైతే, దక్షిణాదిన ఆయన బిడ్డ మురుగన్ నివాసం ఉంది. తండ్రిబిడ్డలను ఎలా వేరు చేయలేరో, దేశాన్ని అలాగే వేరు చేయలేరు. దేశం నుంచి విడగొట్టాలని మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. భాష, భావం వేరు అని దేశాన్ని విడగొట్టాలని చూస్తే సహించేది లేదు. ఒక ఇంట్లోని కుటుంబ సభ్యుల్లోనే రకరకాల మార్పులుంటాయి. అలాంటిది ఇంత భిన్నమైన దేశంలో కొన్నిమార్పులు సహజం. రాజకీయ వైరుధ్యాలను దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మార్చకండి.

నియోజకవర్గాల విభజనపై చర్చకు రండి
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని కొందరు మాట్లాడుతున్నారు. ఇలాంటివి ఏమైనా ఉంటే పూర్తిస్థాయిలో చర్చిద్దాం రండి. ఇంకా అసలు ప్రకటన రాకముందే రాజకీయాల కోసం విషయాన్ని పెద్దగా చేయడం, లబ్ధి పొందాలని చూడటం సరికాదు. ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుoటే ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ద్రవిడ ఉద్యమాన్ని ప్రారంభించిన పెరియార్ కూడా బలిజ నేత. దేశమంతటికి బలమైన భావజాలం మనల్ని కలిపి ఉంచింది. దాన్ని గుర్తుంచుకోండి.

LEAVE A RESPONSE