Suryaa.co.in

Editorial

జగన్‌కు డామేజీ.. బొత్సకు ఇమేజీ

  • వైసీపీలో మారుతున్న సీన్

  • జగన్ తాడేపల్లికి వచ్చేది రెండురోజులే

  • బెంగళూరు నుంచే రాజకీయాలు

  • బొత్సను చూసి నేర్చుకోమంటున్న సీనియర్లు

  • కోటరీని కాదని బొత్సను కలుస్తున్న నాయకులు

  • మండలిలో బొత్స వెనుకే ఎమ్మెల్సీలు

  • వైసీపీలో బొత్సకు పెరుగుతున్న ఫాలోయింగ్

  • బొత్స లే పోతే తేలిపోయేవాళ్లమంటున్న వైసీపీ ఎమ్మెల్సీలు

  • తాడేపల్లిలో జగన్‌ వారానికి రెండు రోజులే

( మార్తి సుబ్రహ్మణ్యం)

ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పార్ట్‌టైమర్‌గా మారిన వైసీపీ అధినేత జగన్ కంటే.. ఇప్పుడు మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణకే పార్టీలో ఇమేజ్ పెరుగుతోందా? జగన్ కోటరీ చుట్టూ తిరగడం ఇష్టం లేని నేతలు ఇప్పుడు బొత్స వద్దకు క్యూలు కడుతున్నారా? బొత్స మండలిలో లే పోతే తమ ప్రదర్శన దారుణంగా ఉండేదని వైసీపీ ఎమ్మెల్సీలు, సీనియర్లు భావిస్తున్నారా? ఆరుపదులు దాటి, గుండె ఆపరేషన్ చేయించుకున్న బొత్స ముందు, పనితీరు-రాజకీయ వ్యూహాల్లో.. యువకుడైన జగన్ తేలిపోతున్నారని వైసీపీ శ్రేణులు ఫీలవుతున్నారా? దానికి కారణం జగన్ ఎక్కువరోజులు ఏపీలో ఉండకపోవడమేనా?.. ఇదీ ఇప్పుడు వైసీపీ వర్గాల్లో హాట్‌టాపిక్.

11 స్థానాలకు పరిమితమైన వైసీపీని.. అధినేత జగన్ సమర్ధవంతంగా నడిపించలేకపోతున్నారన్న అసంతృప్తి, ఆ పార్టీ శ్రేణుల్లో మొదలయింది. పార్టీని సజ్జల, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి, తలశిల రఘురామ్ దయాధర్మానికి వదిలేసి, తాను మాత్రం చుట్టంచూపైగా రాష్ట్రానికి వస్తున్న వైనం వైసీపీ క్షేత్రస్థాయి అభిమానులను రుచించడంలేదు. అఘదే సమయంలో మండలి విపక్ష నేత బొత్స, క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో సహజంగానే ఆయన ఇమేజ్ పెరిగేందుకు కారణమవుతోంది. ఈ పరిణామాల ఫలితంగా జగన్ ఇమేజీ డామేజీ అయేందుకు దోహదపుడుతోందని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

కూటమి నిర్ణయాలను ఎండగట్టి వాటిని ప్రజలకు తెలిపే వేదిక అయిన అసెంబ్లీ నుంచి, జగన్ పారిపోవడాన్ని వైసీపీ శ్రేణులు సమర్ధించలేకపోతున్నారు. అదే శాసనమండలిలో విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తీరు, పార్టీలో ఆయన ఇమేజ్ పెంచుతోంది. బొత్స అడిగిన ప్రశ్నలకు మంత్రులు సరైన సమాధానాలివ్వడం లేదని, అదే బొత్స అసెంబ్లీలో పార్టీ నేతగా ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

విజయసాయిరెడ్డి పార్టీ నుంచి నిష్ర్కమించిన తర్వాత.. కోటరీ పెత్తనంతో విసిగివేసారిన నాయకులు, ఇప్పుడు బొత్స చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారం పోయినప్పటికీ, ఇప్పటికీ బొత్స చెప్పిన పనులు అధికారులు చే స్తున్న క్రమంలో, వైసీపీ నేతలు ఆయనను ఆశ్రయిస్తుండటం గమనార్హం. దీనితో వైసీపీలో బొత్స ఇమేజ్ రోజురోజుకూ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల బొత్స తిరుమల వెళ్లినప్పుడు.. ఆయనతో వచ్చిన రెండు డజన్ల మందికి కూడా దర్శనాలు అనుమతించిన వైనం, మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమరావతిలోనో, సొంత నియోజకవర్గంలోనో ఉండబుద్ది కావడం లేదు. ఆయన ఉన్నంత సేపు నిప్పుల మీద ఉన్నట్లుగా ఉండి, సందు దొరకగానే బెంగళూరు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం వచ్చిన ఆయన తర్వాత ఒక్క రోజు ఉండి మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. బెంగళూరులో పార్టీ కార్యకర్తలకు..నేతలకు అందుబాటులో ఉండరు. అత్యంత ముఖ్య నేతల్ని మాత్రమే పిలిపించుకుని మాట్లాడుతున్నారు. తెర వెనుక రాజకీయాలకు బెంగళూరు కేంద్రంగా మార్చుకున్నారు.

ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా సరే.. జగన్ ఏ మాత్రం పట్టనట్లుగా వెళ్లిపోయారు. అనర్హతా వేటు పడకుండా ఉండేందుకు అటెండెన్స్ కోసం అన్నట్లుగా గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు. తర్వాత ఆ పని కూడా చేయడం లేదు. అసెంబ్లీలో గత ప్రభుత్వ నిర్వాకాలను ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ముందు పెడుతున్నా, స్పందించే వారు ఉండటం లేదు. జగన్ మోహన్ రెడ్డి కూడా ఎవరేమనుకుంటే నాకేంటి అనుకుని వెళ్లిపోతున్నారు.

మండలిలో బొత్స అండ్ టీం పోరాడుతోంది. వారికి నైతిక మద్దతు ఇచ్చేందుకు కూడా జగన్ సిద్ధంగా లేరు. పోరాడుతున్న వారికి ప్రోత్సాహం ఇచ్చేందుకు దిశానిర్దేశం చేసేందుకు కూడా జగన్ ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. పరిస్థితి చూస్తూంటే.. ప్రజల్ని జగన్ ఇంకా తేలికగా తీసుకుంటున్నారని.. కూటమిపై కోపం వస్తే తనకే ఓటు వేస్తారని..తాను కష్టపడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు. ఇంతకు ముందు మూడు, నాలుగు రోజులు అయినా తాడేపల్లిలో ఉండేవారు. ఇప్పుడు ఏదైనా సందర్భం వస్తేనే వస్తున్నారు. రెండు రోజులు ఉంటున్నారు.

కాగా పార్టీ అధినేత జగన్ సంఖ్యాబలం పట్టించుకోకుండా అసెంబ్లీకి వస్తే, తమకూ నైతిక స్థైర్యం వస్తుందని వైసీపీ ఎమ్మెల్సీలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం మండలి ప్రతిపక్షనేత బొత్స ఒక్కరే కూటమి సర్కారుపై పోరాడుతున్నారని, ఆయన లేకపోతే తమ పార్టీ తేలిపోయేదని అంగీకరిస్తున్నారు.

కొన్ని అంశాలపై బొత్స అడిగిన ప్రశ్నలకు మంత్రులు కూడా సమాధానం ఇవ్వలేకపోతున్నారి గుర్తు చేస్తున్నారు. కూటమిని మిగిలిన వారిలా బూతులు తిట్టకుండా, పార్లమెంటరీ భాష వాడుతూ సద్విమర్శలు చేస్తున్న బొత్స తీరును అటు పార్టీ శ్రేణులు-ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అటు జగన్ కూడా అసెంబ్లీకి వస్తే.. తమకు మరింత నైతిక స్థైర్యం వస్తుందని చెబుతున్నారు. ‘ అయినా ఇంత చిన్న వయసులో జనంలో ఉండకుండా, అసెంబ్లీకి రాకుండా, పార్టీ ఆఫీసులో క్యాడర్‌కు అందుబాటులో ఉండకుండా బెంళూరులో ఉండటం ఏమిటో అర్ధం కాదు. అక్కడ మా సార్ ఏం చేస్తారో కూడా తెలియదు. జనంలో ఉంటే పార్టీ విస్తరిస్తుంది కదా? అదే బొత్సను చూడండి. 60 ఏళ్లు దాటినా కూడా ఎంత ఉత్సాహంగా తిరుగుతున్నారో? గుండె ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ విజయనగరం, విశాఖ, అమరావతి చుట్టూ తెగ తిరుగుతున్నారు. కనీసం జగన్ గారు ఆయనను చూసి నేర్చుకోకపోతే ఎలా? సభా వ్యవహారాలు, వ్యూహచరనలో బొత్స దగ్గర మా సార్ ట్రైనింగ్ అవ్వాలి. సీనియర్ల దగ్గర తెలియని విషయాలు నేర్చుకుంటే తప్పేమిటి? అన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సీనియర్లతో చర్చించడం లేదా?’’ అని ఓ సీనియర్ వైసీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తమను కూడా జగన్ సలహా అడగరని ఆ పెద్దాయన వాపోయారు.

ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న పరిణామాలు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల వ్యాఖ్యలు, నాయకుల వైఖరి బట్టి.. పార్టీ అధ్యక్షుడు జగన్ కంటే, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణే సమర్ధవంతంగా పనిచేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాయకులు-కార్యకర్తలకు అందుబాటులో ఉండే అంశం నుంచి, మండ లిలో సహచరులతో కలసి వ్యూహరచన చే యడం, ప్రభుత్వాన్ని తగిన సమాచారంతో ఉక్కిరిబిక్కిరి చేయడంలో జగన్ కంటే బొత్స బెటరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విజయసాయి పార్టీ నుంచి నిష్ర్కమించిన తర్వాత..జగన్ కోటరీ వద్దకు వెళ్లడం ఇష్టం లేని సీనియర్లు బొత్స వద్దకే ఎక్కువ వెళుతుండటం బట్టి, పార్టీ నేతలు జగన్ కంటే బొత్సను కలిసేందుకే ఇష్టపడుతున్నట్లు స్పష్టమవుతోంది. బొత్స తన వద్దకు వచ్చిన సమస్యలు తెచ్చిన అంశాలకు సంబంధించిన శాఖ అధికారులతో నేరుగా మాట్లాడుతున్నారు. ఇది పార్టీ నాయకులకు సంతృప్తి కలిగిస్తోంది. అదే జగన్ వద్దకు వెళ్లి సమస్య చెప్పుకోవాలంటే, బయట నలుగురు గణాచారులను దాటాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A RESPONSE