– ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ప్రకటన సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు వర్గీకరణకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దళితులకు అన్ని రంగాల్లో అపార అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ.
నేను 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నా రాజకీయ జీవితంలో నాకు ఆత్మసంతృప్తిని కలిగించిన రోజు ఇది. ఇలాంటి అవకాశం నాకు రావడం సంతోషం. చరిత్రపుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది. వర్గీకరణకు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలుకు చర్యలు చేపట్టింది.
అతి తక్కువ సమయంలో సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు. ఆనాడు ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అడ్జర్న్ మోషన్ అందిస్తే నన్ను సభ నుంచి బయటకు పంపించారు. కానీ ఈనాడు సభా నాయకుడిగా వర్గీకరణ అమలుకుకు సభలో నిర్ణయం తీసుకుంటున్నాం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైంది.
రంగుల గోడలు.. అద్దాల మేడలు కాదు… చివరి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించాలన్న అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందుకు సభ్యులందరి సహకారం ఉండాలని కోరుతున్నా.