Suryaa.co.in

Andhra Pradesh

వరికెపూడిసెల ప్రాజెక్టుని ఏడాదిలోపే పూర్తి చేస్తాం

– పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు, ఎంపీ లావు కృష్ణ దేవరాయలు

పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు, ఎంపీ లావు కృష్ణ దేవరాయలు, నరసరావుపేట నియోజకవర్గ ఇంఛార్జి చదలవాడ అరవిందుబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జివి ఆంజనేయులు మాట్లాడుతూ .. వరికెపూడిసెల ప్రాజెక్టు పల్నాడు రైతులకు 70 ఏళ్ల కల అని, దూరదృష్టితో ఆలోచించి ఆనాడు చంద్రబాబు దీన్ని ప్రారంభించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత పల్నాడు ప్రజల దశాబ్దాల కల అయినా వరికపూడిశల ప్రాజెక్టు ను పూర్తి చేస్తాడని అనుకున్నాం. కానీ ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం జగన్ రెడ్డి కు ఎలాగూ పల్నాడు ప్రాంతం పై ప్రేమ లేదనీ, కనీసం ఈ పల్నాడు జిల్లా నుంచే ఇరిగేషన్ శాఖ మంత్రి గా ఉన్నటువంటి అంబటి రాంబాబు కూడా వరికపూడిసెల ప్రాజెక్ట్ ని పట్టించుకోలేదన్నారు. వైసీపీ నేతలు హడావిడిగా శంకుస్థాపనలు చేస్తున్నారని, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు కేంద్రం నుండి అన్ని అనుమతులు వచ్చేలా కృషి చేసారని, కేవలం ఒకే ఒక్క ప్రొక్లైన్ తీసుకెళ్లి అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు పెద్ద డ్రామా చేస్తున్నారన్నారు.

పల్నాడు ఎమ్మెల్యేలు గత ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని… లేదంటే తాము ఓట్లు అడగమని చెప్పిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

కొత్తగా ఒక్క ఎకరo కూడా సాగులోకి తీసుకురాగలిగారా అని, పల్నాడు ప్రజలను అమాయకులు అనుకుంటున్నారని, చంద్రబాబు ఇచ్చిన 340 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నారా లోకేష్ యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లా లో ప్రజలు బ్రహ్మ రధం పట్టారని, టిడిపి అధికారం లోకి రాగానే వరికపూడిశల ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇస్తూ నారా లోకేష్ శిలా ఫలకం వేయడంతో జగన్ రెడ్డి వెన్ను లో వణుకు పుట్టిందని, వరికపూడిసెల పై టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అధికారం లోకి వచ్చిన వెంటనే వరికపూడిసెల ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తామని, జిల్లా ప్రజలకు సీఎం జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎంపీ లావు కృష్ణ దేవరాయలు మాట్లాడుతూ .. పల్నాడు జిల్లాలో నిత్యం ఒక మంచి టాపిక్ నడుస్తుందని, నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలో 40 శాతం పంటలు ఇప్పటికే ఎండిపోయాయని, ఎవరు వస్తే తమకు న్యాయం జరుగుతుంది అని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు.

వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది భయపడుతున్నారని, రాష్ట్రంలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులు, అమరావతి గురించి ఎమ్మెల్యేలు నోరు విప్పి మాట్లాడాలన్నారు. వైసీపీలో ఉన్న 80 శాతం మందికి ఓటమి భయం పట్టుకుందన్నారు. గడిచిన ఇదేళ్లలో రాష్ట్రం మొత్తం మీద వరికపూడిసెల ప్రాజెక్ట్ కు ఎక్కువగా అనుమతులు తెచ్చానని, ఏది జరిగినా ఒక్కడి వల్ల కాదన్నారు. వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని, అభివృద్ధి పనుల విషయంలో కూడా అలాంటి దూకుడు ఉండాలన్నారు.

నరసరావుపేట ఇంఛార్జి చదలవాడ అరవిందుబాబు మాట్లాడుతూ .. వరికెపూడిసెల పల్నాడు వాసుల చిరకాల కోరిక అని, ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లా వాసుల తాగు, సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పల్నాడు ప్రాంత ప్రజలను, రైతాంగాన్ని మరోసారి దగా చేసేందుకు వరికపూడిసెల పనులు ప్రారంభం…. అంటూ వైసీపీ నాయకులు సిద్ధమయ్యారన్నారు. సీఎం జగన్ ప్రాజెక్టు పై ఎన్నో అబద్ధాలు చెప్పారని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే వరికెపూడిసెల ప్రాజెక్టుని పూర్తి చేస్తాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం దారు నాయక్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెన్నా సాంబశివ రెడ్డి, యువ నాయకులు కడియాల లలిత్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు, లీగల్ సెల్ అధ్యక్షులు చండ్రా ఆంజనేయులు, టి. ఎన్. ఎస్. ఎఫ్ అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు తదితర నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE