Suryaa.co.in

Andhra Pradesh

సంపద సృష్టితో సంక్షేమం, అభివృద్ధి చేస్తాం

-సకల వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాగళం మేనిఫెస్టో
-ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్‌
-రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌…ఉచితంగా సోలార్‌ పంపుసెట్లు
-ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
-రవాణా రంగలో ఉన్న డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం
-పంచాయతీల హక్కులు కాపాడతాం…నిధులు కేటాయిస్తాం.
-ఐదేళ్లలో రాష్ట్రాన్ని జగన్‌ విధ్వంసం చేశారు
-ఎన్నికల ఫలితాలకు ముందే జగన్‌ రాజీనామా చేశారు
-టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
-2024 కూటమి మేనిఫెస్టో విడుదల

అమరావతి : సకల వర్గాల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోను రూపొందించామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంపద సృష్టించి సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ప్రజాగళం పేరుతో రూపొందించిన ఉమ్మడి మేనిఫెస్టోను ఉండవల్లిలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ నేత సిద్ధార్థనాథ్‌ సింగ్‌తో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ బీజేపీ సూచనతో టీడీపీ, జనసేన కూర్చుని మేనిఫెస్టోను రూపొందించామన్నారు. తమ మేనిఫెస్టోకు కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉందన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని మూడు పార్టీలు బాధ్యతగా తీసుకుంటాయన్నారు. మూడు పార్టీలు రాష్ట్రం కోసమే కలిశాయని…ప్రజలు గెలిచి రాష్ట్రం నిలదొక్కుకోవాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకుని, తెలుగు జాతికి పూర్వవైభకం తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకు వచ్చామన్నారు.

యువతలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాం
రాష్ట్రంలో ఐదేళ్లుగా యువత తీవ్ర నైరాశ్యంలో ఉంది. యువశక్తి అంతా నిర్వీర్యం అయింది. అందుకే అధికారంలోకి వచ్చాక ఏడాదికి 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల భృతిగా ప్రతి నెలా అందిస్తాం. రాష్ట్ర భవిష్యత్తు అంతా మానవ వనరుల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల వ్యాపారం, ఉద్యోగాలకు మహిళలు వెళ్లడానికి సులభంగా ఉంటుంది. షణ్ముక వ్యూహం, సూపర్‌-6లో భాగంగా పలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందిస్తాం.

రాష్ట్రంలో కులగణనే కాదు…స్కిల్‌ గణన చేస్తాం. ఎవరికి ఎలాంటి స్కిల్స్‌ ఉన్నాయో బయటకు తీస్తాం. ఏ స్కిల్స్‌ ఇవ్వగలిగితే వారు స్థిరపడతారో చేస్తాం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.10 లక్షల దాకా సబ్సీడీలో రుణాలు ఇస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం. ప్రజా రాజధాని అమరావతిని నిర్మించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. యువత కోసం మెగా డీఎస్సీ పైనే తొలిసంతకం పెడతాం. ఉత్తారాంధ్ర, కోస్తా, రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలను ప్రోత్సహిస్తాం.

బీసీలకు ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు
బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించాం. 50 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.4 వేలు పెన్షన్‌ అందిస్తాం. రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీల సంక్షేమానికి రూ.1.5 లక్షల కోట్లను ఐదేళ్లలో ఖర్చు చేస్తాం. ఆచారంగా వస్తున్న వృత్తులకు సాకారం అందిస్తాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 34 శాతానికి పెంచుతాం. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో మాట్లాడతాం. నామినేటెడ్‌ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేస్తాం. దామాషా ప్రకారం ఆర్థిక పరిస్థితులను బట్టి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తాం.

స్వయం ఉపాధికి బీసీలకు రూ.10 వేల కోట్లు ఐదేళ్లలో ఖర్చు చేస్తాం. ఆదరణ పథకానికి రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి పనిముట్లు అందిస్తాం. యాదవులు ఎక్కువగా పాడిపరిశ్రమపై ఆధారపడతారు. పాడి పరిశ్రమలకు కూడా బీమా తీసుకొస్తాం… రుణాలు ఇస్తాం. కురబలు గొర్రెల పెంపకంలో ఎక్కువమంది ఉంటారు..వారికి కూడా ఆదుకుంటాం. మగ్గాలున్న చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలున్న వారికి 500 యూనిట్లు ఉచిత విత్యుత్‌ అందిస్తాం. ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేలు యేటా అందిస్తాం. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలు గౌరవ వేతనం అందిస్తాం. బార్బర్‌ షాపులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అందిస్తాం. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 20 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం.

వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్లు
వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్లు, రాయల్టీ, సీనరైజ్‌ లో మినహాయింపు ఇస్తాం. రజకులకు దోబీ ఘాట్ల నిర్మాణాలకు సాయం అందిస్తాం. విద్యుత్‌ కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాం. మత్స్వకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేలు ఆర్థిక సాయంతో పాటు 217 జీవో రద్దు చేస్తాం. కొత్త బోట్ల కొనుగోలకు, బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం చేస్తాం. స్వర్ణకారుల అభివృద్ధి కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రభుత్వంలో దారుణంగా హత్యలకు గురైన తోట చంద్రయ్య, అమర్నాథ్‌ గౌడ్‌, పూల సుబ్బారావు, జల్లయ్య యాదవ్‌ ను క్రూరంగా చంపారు…ఆ కేసులను మళ్లీ తెరిపించి వారి కుటుంబాలకు న్యాయం చేస్తాం.

డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల దాకా వడ్డీలేని రుణాలు
డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. జగన్‌ రూ.10 ఇచ్చి వంద లాగేశారు… వెయ్యి దోచేశారు…ఈ విధానినికి స్వస్తి చెప్తాం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ. సంపద సృష్టించి పేదలకు చేర్చాలన్నది మా సంకల్పం. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఆదాయాన్ని పెంచేలా చేస్తాం. చేపలు ఇవ్వడమే కాదు…పట్టేలా చేస్తాం. పీ3 విధానంతో రోడ్లు, ఎయిర్‌ పోర్టు, పోర్టులు, పవర్‌ ప్రాజెక్టులు రావడంతో సంపద పెరిగింది. భవిష్యత్తులో పీ4తో ఆర్థికంగా బాగా ఉన్నవారు పేదవారిని పైకి తెచ్చే బాధ్యత తీసుకోవాలి. ఏ పని చేసినా పేద వారి కోసమే చేస్తాం. పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుంది.

అంగన్వాడీ కార్యకర్త లను ఆదుకుంటాం. ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తాం. మధ్యలో చదువు నిలిపేసిన వారికి కలలకు రెక్కలు కార్యక్రమం ద్వారా వడ్డీలేని రుణాలు ఇస్తాం. పండుగ కానుక, పెళ్లి కానుకలు, అన్నా క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు నష్టపోయారు. వ్యవస్థలు ఛిన్నాభిన్నం అయ్యాయి. పాలకులు చేసే పాలసీలతో ఉద్యోగులే సంపద సృష్టించాలి.. ఉపాధ్యాయులు అత్యంత గౌరవింపబడేవారు…కానీ నేడు నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

మద్యం షాపుల వద్ద కాపలా పెట్టి అవమానించారు. ఈ ప్రభుత్వంలో పీఆర్సీ లేదు…పీఎఫ్‌ లేదు, సరెండర్‌ లీవ్స్‌ లేవు…రూ.20 వేల కోట్లు బకాయిలు పెట్టారు. ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాం. ఐఆర్‌ కూడా అందించి ప్రతినెలా జీతాలు సక్రమంగా అందిస్తాం. సీపీఎస్‌ పైనా సమీక్ష చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. తక్కువ జీతాలు పొందే ఉద్యోగులు, అంగన్‌వాడీలు, పోలీసు వ్యవస్థలో చేసేవారికి సాయం అందిస్తాం.

కాపుల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు ఖర్చు
కాపుల సంక్షేమానికి ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తాం. కాపు యువత, మహిళల స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇస్తాం..కాపు భవనాలు నిర్మిస్తాం. ఆర్యవైశ్య సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తాం. దివ్యాంగులకు 6 వేలు పెన్షన్‌ ఇస్తాం. పూర్తి అంగవైకల్యం ఉన్నవారికి రూ.15 వేలు, కిడ్నీ, తలసేమియా వ్యాధితో దీర్ఘకాలికంగా బాధపడేవారికి రూ.10 వేలు పెన్షన్‌గా చెల్లిస్తాం. ఇంటి స్థలాలు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు కేటాయిస్తాం. ఇప్పటికే స్థలాలు మంజూరైన వారికి ఇళ్లు కట్టిస్తాం..ఎవరికీ పట్టాలు రద్దు చేయబోం. టిడ్కో ఇళ్లు కూడా పూర్తి చేసి బాధితులకు అప్పగిస్తాం.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్‌
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ అందిస్తాం. సబ్‌ ప్లాన్‌ నిధులు వారికే ఖర్చు చేస్తాం. ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామలు చేస్తాం. జీవో నెం-3ను మళ్లీ తీసుకొస్తాం. ఎస్సీలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. బ్యాక్‌ లాగ్‌ పోస్టులు భర్తీ చేస్తాం. ముస్లింలకు 50 ఏళ్లకే పెన్షన్‌ తెస్తాం. ఈద్గా, కబరిస్తాన్‌లకు స్థలాలు కేటాయిస్తాం. విజయవాడలో హజ్‌ హౌస్‌ కేటాయిస్తాం. నూర్‌ బాషా కార్పొరేషన్‌ కు యేటా రూ.100 కోట్లు కేటాయిస్తాం. మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల దాకా వడ్డీలేని రుణాలు అందిస్తాం. ఇమామ్‌ లకు రూ.10 వేలు, మౌజన్‌ లకు రూ.5 వేలు గౌరవ వేతనం అందిస్తాం. మసీదుల నిర్వహణకు ప్రతినెలా రూ.5 వేలు చెల్లిస్తాం. హజ్‌ యాత్రకు వెళ్లే వారికి రూ.1 లక్ష సాయం అందిస్తాం. క్రిస్టియన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.

వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌
వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తాం. సోలార్‌ పంపుసెట్స్‌ ఉచితంగా పెట్టించి మిగులు కరెంట్‌ గ్రిడ్‌కు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ప్రజలు వాడుకోగా మిగిలిన కరెంటును ప్రభుత్వం తరపున కొనుగోలు చేస్తాం. ఏ ఊరికి ఆ ఊరు కరెంట్‌ ఉత్పత్తిలో సబ్‌ స్టేషన్‌ వైజ్‌గా యూనిట్‌ ఏర్పాటు చేస్తాం. పంప్‌ డు ఎనర్జీ ద్వారా పవర్‌ జనరేట్‌ చేస్తాం. రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. రైతులకు యేటా రూ.20 వేల ఆర్థికసాయంతో పాటు, యంత్రాలు సబ్సిడీలో అందిస్తాం. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం. ప్రతి పార్లమెంట్‌లో వెయ్యి ఎకరాల్లో జడ్బీఎన్‌ఎఫ్‌ మోడల్‌ ఏర్పాటు చేస్తాం. గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. 90 శాతంతో డ్రిప్‌ అందిస్తాం. సెరీ కల్చర్‌ను ఆదుకుంటాం. ఆక్వాకు రూ.1.50లకే విద్యుత్‌ అందిస్తాం.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేస్తాం
జగన్‌ తెచ్చింది ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కాదు…జగన్‌ ల్యాండ్‌ గ్యాబ్లింగ్‌ యాక్టు. జగన్‌ కోసమే తెచ్చుకున్నాడు. ప్రజల ఆస్తులపై కత్తిపెట్టాడు.అధికారంలోకి వచ్చాక ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తాం. క్వారీలు, మైనింగ్‌, భూములు, పోర్టులు అన్నీ రాయించుకున్నారు. పోర్టులు, సెజ్‌లు, స్టూడియో భూములు చేతులు మారాయి. దుర్మార్గ కార్యక్రమాలకు ఒడిగట్టారు. కాకినాడ సెజ్‌ భూములు ఎందుకు చేతుల మారాయి. సిలికా శాండ్‌ను దోచేశారు. ఫైన్లు వేసి గ్రానైట్‌ క్వారీలను అక్రమంగా మూయించారు. ఇసుక తవ్వకాలు ఇస్టానుసారంగం చేశారు.

దీంతో సుప్రీంకోర్టు ఇసుక తవ్వకాలు నిలిపేయాలని చెప్పింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు కూడా పట్టించుకోలేదు. భాస్కర్‌ రెడ్డి అనే వ్యక్తి పులివెందులలో జగన్‌ సతీమణిని అడిగారు..మీ భర్త ఫోటో మా పాసు పుస్తకాలపై ఏంటని? రాజముద్ర వేసే దగ్గర నీ ఫొటో ఎందుకు జగన్‌? ఆస్తి నీ తాత ఇచ్చాడా…నువ్విచ్చావా…నీ భారతి సిమెంట్‌ నుంచి కట్ట సిమెంట్‌ ఇచ్చావా.? ప్రైవేట్‌ ఆస్తులపైనా పెత్తనం చేస్తున్నారు. ఆరుద్ర అనే మహిళ వారణాసి వెల్లి తలదాచుకున్నారు. తిండి కోసం వేరే రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి ఉందన్నారు.

పోలవరం పూర్తి చేస్తాం…సాగునీటి ప్రాజెక్టులు గాడిన పెడతాం
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ విధ్వంసం చేశారు. అన్నీ సమస్యల్లో ఉన్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. నీటి నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. రిజర్వాయర్లు కొట్టుకుపోయాయి.అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే ఏం చేస్తారో ఇప్పటికీ చెప్పలేదు. బాధితులకు ఇళ్లు కట్టించలేదు. పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి. అధికారంలోకి వచ్చాక పోలవరం పూర్తి చేస్తాం. నదుల అనుసంధానం పూర్తి చేస్తాం. డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహనాల కొనుగోళ్లకు రూ.4 లక్షల వరకూ పొందే రుణాలకు 5 శాతం వరకే వడ్డీ భారం ఉండే విధంగా చేస్తాం.

మిగిలిన వడ్డీ భారాన్ని సబ్సీడీ రూపంలో అందిస్తాం. డ్రైవర్లకు సాధికార సంస్థ పెట్టి ప్రమాద బీమా, విద్యా రుణాలు అందిస్తాం. బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్‌ కు , హెవీ లైసెన్స్‌ ఉన్న ప్రతి లారీ డ్రైవర్‌ కు రూ.15 వేలు యేటా అందిస్తాం. 21జీవో రద్దు చేసి ఫైన్ల భారం తగ్గిస్తాం. భారంగా మారిన గ్రీన్‌ ట్యాక్స్‌ రద్దుచేస్తాం. అసంఘటిత కార్మికులకు బీమా తెస్తాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం. సహజ మరణానికి రూ.5 లక్షలు…ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు భీమా అందిస్తాం.

దేశంలోనే మొదటిసారిగా ఆరోగ్య బీమా
దేశంలోనే మొదటి సారిగా ఆరోగ్య బీమా తీసుకొస్తున్నాం. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తాం. ప్రతి వ్యక్తికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులు అందిస్తాం. ప్రతి మండల కేంద్రంలో జనరిక్‌ మందుల కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. విద్యుత్‌ ఛార్జీలు నియంత్రించి చెత్తపన్ను రద్దు చేస్తాం. ఇంటి పన్నుల విధింపులో హేతబద్ధ కొనసాగిస్తాం. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నియంత్రిస్తాం. మద్యం ధరల నియంత్రించి, విషపూరిత బ్రాండ్లన్నీ రద్దు చేస్తాం. నకిలీ మద్యం సరఫరాపై విచారణ చేసి శిక్షిస్తాం. రేషన్‌ పంపిణీ సమీక్షిస్తాం. ఎయిడెడ్‌, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పునరుద్ధరిస్తాం. కాలేజీలకే నేరుగా ఫీజులు చెల్లించి సర్టిఫికేట్ల విషయంలో విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం. ఉచిత ఇసుక విధానంలో సమగ్రపాలసీ విధానాన్ని తీసుకొస్తాం. కేజీ టు పీజీ సిలబస్‌ రివ్యూ చేస్తాం. రాష్ట్రంలో స్కూళ్లు మూతపడటానికి కారణమైన 117 జీవో రద్దు చేస్తాం. అంబేద్కర్‌ విదేశీ విద్య మళ్లీ ప్రవేశపెడతాం. వంద రోజుల్లోనే గంజాయి నిర్మూలిస్తాం. ఊరూరా మంచినీళ్లు లేవు..గంజాయి దొరుకుతుంది.

ప్రతి గ్రామంలో మౌళిక సదుపాయాలు
ప్రతి గ్రామంలో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ప్రతి గ్రామం నుంచి మండలానికి…మండలాల నుండి జిల్లాలకు రోడ్డు సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ప్రజారాజధాని అమరావతిని నిర్మిస్తాం. ఉద్యోగ కల్పన ఉండేలా రాజధాని నిర్మాణం ఉంటుంది. పర్యాటకానికి రాష్ట్రంలో అవకాశం ఉంది. అన్నింటికంటే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రాధాన్యం ఇస్తాం. షుగర్‌ ఫ్యాక్టరీలకు ప్రత్యామ్నాయంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు వస్తున్నాయి.. .వాటితో ఉద్యోగాల కల్పన జరుగుతంది. దేవాలయాలు, బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.

హిందూ దేవాలయాలు, సత్రాల భూముల పరిరక్షణకు బోర్డు ఏర్పాటు చేస్తాం. వార్షిక ఆదాయం రూ.50 వేలు ఉన్న ఆలయాల్లో పని చేసే అర్చకులకు రూ.15 వేలు కనీస వేతనం పెంచుతున్నాం. రూ.50 వేలకు తక్కువ ఉంటే రూ.10 వేలు అందిస్తాం. ఈ ప్రభుత్వంలో ప్రార్థనాలయాల్లో కూడా రాజకీయ జోక్యం పెరిగింది. రామతీర్థంలో రాముడి తల నరికారు. నిందితులను ఇప్పటికీ కనిపెట్టలేదు. నాపై పెట్టిన 23 కేసుల్లో రామతీర్థం కేసు కూడా ఉంది. బ్రాహ్మణులందరికీ ప్రతి ట్రస్టులో మెంబర్లుగా పెడతాం. బ్రాహ్మణ కార్పొరేషన్‌ బలోపేతం చేస్తాం. అపర కర్మలకు భవనాలు నిర్మిస్తాం. వేద విద్యను అభ్యసించిన వారికి రూ.3 వేలు భృతి ప్రతి నెలా అందిస్తాం.

పంచాయతీలకు నిధులు…విధులు కల్పిస్తాం
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం. బాపనపాడు పోర్టు, విశాఖపట్నం ఎయిర్‌ పోర్టు అభివృద్ధి చేస్తాం. సీమను హార్టికల్చర్‌ హబ్‌గా చేస్తాం. ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో ఉండే రహదారులను అభివృద్ధి చేస్తాం. పంచాయతీరాజ్‌కు అధికారాలు పోయాయి…నిధులు, విధులు లేవు. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా లాక్కున్నారు. గ్రామంలో పూర్తి అధికారాలు సర్పంచులకు అందిస్తాం. మా ప్రభుత్వంలో జర్నలిస్టులకు 2500 మందికి అక్రిడిడేషన్లు ఉంటే ఇప్పుడు వెయ్యికి పడిపోయాయి. సాక్షి, టీవీ9, ఎన్టీవీ వాళ్లకు మాత్రమే అక్రిడేషన్లు ఉన్నాయి. మీడియాపైనా దాడులు చేసి బెదిరించారు. అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తాం. జూని యర్‌ న్యాయవాదులకు స్టైఫండ్‌గా రూ.10 వేలు అందిస్తాం. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటాం. గాడితప్పిన శాంతిభద్రతలు కాపాడతాం.

జగన్‌ ప్రకటించింది మేనిఫెస్టో కాదు…రాజీనామా
టీడీపీ, జనసేన, బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నా. జగన్‌ హామీలు ఇచ్చి నప్పుడు నెరవేర్చడానికి సాక్షి, భారతీ సిమెంట్‌ కంపెనీల నుంచి డబ్బులు తీసుకొచ్చారా? 2014లో అవకాశాలు ఉపయోగించుకుని వెల్త్‌ క్రియేట్‌ చేశాం. గొల్లపల్లి రిజర్వాయర్‌ పూర్తి చేసి కియా పరిశ్రమ తీసుకొచ్చాం. మొదటి కారు నేనే ప్రారంభించా. ఇప్పటికి 12 లక్షల కార్లు ఉత్పత్తి అయ్యాయి. 15 వేల కోట్లు పెట్టుబడితే 12 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. పరోక్షంగా డ్రైవర్లు, హోటళ్లు, ఇతర రంగాల్లో ఉద్యోగాల్లో కలుపుకుంటే 30 వేల కుటుం బాలు బాగుపడ్డాయి. ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిందా….మరి ఆదా యం ఎలా వస్తుంది.? ఏమీ చేయలేనని జగన్‌ ఇప్పుడు చేతులెత్తేశాడు. ఖర్చులు, ఆదాయం అప్పులు ఉంటాయి.

ఇప్పుడు జగన్‌ కు అప్పులు ఇచ్చేవాళ్లు లేరు. ఆదాయం వచ్చేవాటిని రద్దు చేశారు. అమరావతిలో రూ.3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరైపోయింది. అమరావతి నిర్మాణం జరిగుంటే ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూ.13 లక్షల కోట్లు అప్పులు చేశారు. జగన్‌ చేసిన విధ్వంసంతో రాష్ట్రం నాశనమైంది. అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుతాం. వీళ్లకు డ్రైవింగ్‌ రాదు…అయినా బస్సెక్కించి డ్రైవర్‌ సీట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు రివర్స్‌ లో తీసుకెళ్తున్నారు. ప్రాజెక్టులపై రివర్స్‌ టెండరింగ్‌ బుద్ధి ఉన్నవాళ్లు చేస్తారా.? జగన్‌ కమిట్మెంట్‌ లేని విధానాలతో రాష్ట్రం నాశనమైంది.

విభజన సమయంలో తెలంగాణ, ఏపీ మధ్య తలసరి ఆదాయ వ్యత్యాసం రూ.35 వేలు ఉంది. ఐదేళ్లు కష్టపడి రూ.27 వేలకు తగ్గించాను. తెలంగాణలో జనాభా తక్కువ ఆదాయం ఎక్కువ. ఇప్పుడు రూ.27 వేల నుండి తలసరి ఆదాయం రూ.40 వేలకు పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. మేము గతంలో సంపాదించి చెరువులో నీళ్లుపెట్టాం….కాల్వకు నీళ్లు తీసుకెళ్లాడు…చెరువులో నీళ్లు అయిపోయి చేతులు ఎత్తేశాడు. ఎన్నికల ఫిలితాలకు ముందే జగన్‌ రాజీనామా చేశాడు. 2047 నాటికి దేశాన్ని మోదీ వికసిత భారత్‌ చేస్తే…మా ఆశయం కూడా వికసిత్‌ ఆంధ్రా కావాలి. జగన్‌కు మాత్రం నార్త్‌ కొరియాలా రాష్ట్రాన్ని చేయాలని ఉంది.

LEAVE A RESPONSE