– రాష్ట్ర ఎన్నికల కమిషన్ విశ్రాంత కమిషనర్ నిమ్మగడ్డ రమేష్
కాకినాడ : రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉన్నాయని అందువల్ల ఓటర్లు జాగ్రత్తగా తమ ఓటును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ విశ్రాంత కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.
కాకినాడలోని యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్‌లో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ‘ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ అనే నినాదంతో బుధవారం రాష్ట్ర స్థాయి కళాజాతా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ మాట్లాడుతూ స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం రాజ్యాంగ ప్రక్రియలో భాగమని చెప్పారు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలకు సంబంధించి సుమారు 30 వేల దొంగ ఓట్లు నమోదయ్యాయని, ఇటీవల అవి బయటపడడంతో ఇద్దరు ఉన్నత అధికారులను సస్పెండ్ చేసి ఎన్నికల కమిషన్ చేతులు దులుపుకుందన్నారు. ఓటర్లు తమ జాబితాను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. వలంటీర్ల నియమించుకునే సంస్థ వారి ద్వారా ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించి రహస్యంగా ఉంచాల్సిన జాబితాను ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలకు చేరవేస్తోందని చెప్పారు.
ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని, వలంటీర్లను సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి ఉపయోగించుకోకూడదని సుప్రీంకోర్టులో కేసు వేస్తామని తెలిపారు.ఎన్నికల విధుల్లోకి వలంటీర్లు తీసుకుంటామంటూ సిఎం, మంత్రులు చెప్పడం ఎన్నికల కమిషన్‌ను అవమానించడమేనన్నారు. యువత భారీ ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.