Suryaa.co.in

Andhra Pradesh

జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చేసిందేమిటి?

-అబద్ధాల అభినయంలో జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే…
-250 ఎకరాలలో జనం నిండిపోయారని సాక్షి దినపత్రిక ఊదర కొట్టింది… కానీ 54 ఎకరాలలో మాత్రమే జనం పల్చగా హాజరయ్యారు…
-99% హామీలను జగన్ మోహన్ రెడ్డి అమలు చేయలేదు…
-ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి…
-సిద్ధం సభ ఖర్చు ప్రభుత్వానిదా?, పార్టీదా??
-ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాను..
-నేను హిందువుని.. నన్ను గెలిపించండని నేను ఎక్కడా ప్రచారం నిర్వహించలేదు…
-ఇంగ్లీష్ మీడియాన్ని జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చారట…!
-ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై దాడులా? ఇదెక్కడి విడ్డూరం??
-మేనల్లుడు వివాహానికి హాజరుకాని జగన్ మోహన్ రెడ్డి …
-బెంబేలెత్తిపోతున్న వైకాపా శ్రేణులు…
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమిటనీ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి పన్ను పత్రాలు, సరిహద్దు రాళ్లపై తన బొమ్మలు వేసుకోవడం తప్ప చేసింది ఏమీలేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. నవరత్నాలలో ముందు తండ్రి ఫోటో, తరువాత తండ్రి ఫోటోషాడోలో కొడుకు ఫోటో ఉండేదని, ఆ తర్వాత కొడుకు ఫోటోషాడో లో తండ్రి ఫోటో ఉండేదని… ఇప్పుడు తండ్రి ఫోటోనే లేకుండా చేశారని అన్నారు. అభివృద్ధి అనేది మీ ఫోటోలలో ఉందే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి అన్నదే జరగలేదన్నారు.

సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ప్రతి ఇంటికి ఎంతో చేశానని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారని, ప్రతి ఇంటికి ఆయన చేసింది చెత్త పన్ను వేయడం, విద్యుత్ చార్జీలను పెంచడమేనని అన్నారు. తాను చేసిన మంచి పనులను చూసి ఓట్లు వేయండి అంటున్న జగన్ మోహన్ రెడ్డి నిజానికి చేసిన మంచి పని అంటూ ఒక్కటి కూడా లేదన్నారు.

అబద్ధాల అభినయంలో జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే…
అభినవ హరిశ్చంద్రుడైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలేనని రఘురామకృష్ణ రాజు విమర్శించారు. అభినవ హరిశ్చంద్రుడే కాదు… జగన్ మోహన్ రెడ్డి అభినయ హరిశ్చంద్రుడు కూడా అని అపహాస్యం చేశారు. అబద్దాలను కూడా నిజాలు అన్నట్లుగా చెప్పడంలో ఆయన ఎక్స్ ప్రెషన్స్, కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఎదుటివారికి మతిపోవాల్సిందేనని, జగన్ మోహన్ రెడ్డి అభినయానికి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువేనని రఘురామకృష్ణ రాజు అన్నారు. రాప్తాడులో సిద్ధం పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభ కోసం ప్రజలను తరలించడానికి 6,450 బస్సులను ఏర్పాటు చేశారని, అందులో 3100 ఆర్టీసీ బస్సులు కాగా, మూడు వేలకు పైగానే స్కూల్ బస్సులు ఉన్నాయని అన్నారు.

రాయలసీమలో పూర్తిగా బంద్ వాతావరణాన్ని తలపించే పరిస్థితిని కల్పించారని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను పూర్తిగా కొల్లగొట్టారని, రాయలసీమ జిల్లాలోని 52 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలతో పాటు, కర్ణాటక నుంచి కూడా కిరాయి జనాన్ని రాప్తాడు సిద్ధం సభకు తరలించారని అన్నారు. కర్ణాటకలో మద్యం చౌకగా లభిస్తుందని భావించి అక్కడే కొనుగోలు చేసి, మగవారికి ఒక క్వార్టర్ సీసా బుడ్డి, బిర్యానీ ప్యాకెట్ అందజేశారని, సభా ప్రాంగణానికి వెళ్లకుండానే సభకు హాజరైన వారు చాలామంది బస్సుల్లోనే క్వార్టర్ సీసా తాగేసి, బిర్యానీ పొట్లాన్ని తినేశారన్నారు.

250 ఎకరాలలో జనం నిండిపోయారని సాక్షి దినపత్రిక ఊదర కొట్టింది… కానీ 54 ఎకరాలలో మాత్రమే జనం పల్చగా హాజరయ్యారు…
రాప్తాడులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభకు 250 ఎకరాలలో జనం నిండిపోయారని సాక్షి దినపత్రికలో ఊదర కొట్టారు కానీ 54 ఎకరాలలో మాత్రమే జనం పల్చగా హాజరయ్యారని రఘురామకృష్ణ రాజు తెలిపారు. యధా ప్రకారం శిలువ ఆకారంలో డబుల్ బారి కెడింగ్ తో రక్షణను ఏర్పాటు చేశారని, దానికి జనం వద్దకు జగన్ అని ప్రచారం చేసుకున్నారని అన్నారు. శిలువ ఆకారంలో కింద కెమెరా పెట్టి జగన్ మోహన్ రెడ్డిని అమితాబచ్చన్ లా పొడవుగా కనిపించేలా చూపించడానికి తీవ్రంగానే తాపత్రయపడ్డారని, ఆయన నిజంగానే పొడుగుగా ఉంటారేమోనని తాను చూసిన జగన్ మోహన్ రెడ్డి కంటే ఎత్తుగానే కనిపించారని రఘురామకృష్ణ రాజు అపహాస్యం చేశారు. ఇంత చేసి మీటింగులో ఏమి చేశారంటే అన్నీ అబద్ధాలనే చెప్పారని విమర్శించారు.

99% హామీలను జగన్ మోహన్ రెడ్డి అమలు చేయలేదు…
ప్రజలకు ఇచ్చిన హామీలను 99% అమలు చేశానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణ రాజు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలలో 99% ఆయన అమలు చేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రివర్స్ టెండరింగ్ పేరిట 2022 నాటికి నీళ్లు ఇవ్వకపోతే నా పేరు జగన్ మోహన్ రెడ్డే కాదని పేర్కొన్నారని, ఇప్పుడేమో 2025 నాటికి పోలవరం పూర్తి చేస్తామని అంటున్నారని, కానీ 2025 నాటికి కూడా జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేరని అన్నారు.

రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వం మారిపోతే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయవచ్చునని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే పట్టాలు వేసి, పట్టాలను బండి ఎక్కించి, గమ్యస్థానాన్ని చేర్చాల్సిన బాధ్యత రాబోయే ప్రభుత్వానిదేనని అన్నారు. రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేసి అమరావతిని నాశనం చేసారని, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను… అమరావతి నగరాన్ని హైదరాబాదు కంటే గొప్పగా అభివృద్ధి చేస్తానని చెప్పి జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టారని అన్నారు.

సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పి ఆ హామీని కూడా గాలికి వదిలేసి ప్రజల ఆరోగ్యాన్ని సర్వ నాశనం చేయడమే కాకుండా, మహిళల సొమ్మును జుర్రుకున్నారని అన్నారు. మూడు నాలుగు ఏళ్ల పాటు అంబేద్కర్ విదేశీ విద్యను అటకెక్కించి, నాలుగో ఏటా అంబేద్కర్ విదేశీ విద్య పేరును మార్చి జగన్ మోహన్ రెడ్డి విదేశీ విద్యగా నామకరణం చేసి, దానికి అంబేద్కర్ భక్తులుగా చెప్పుకునే కొంత మంది మహానుభావులు… ఎవరు డబ్బులు ఇస్తే వారి పేరు పెట్టుకుంటారని పేర్కొనడం విస్మయాన్ని కలిగించిందని అన్నారు. అంబేద్కర్ కన్నా జగన్ మోహన్ రెడ్డి మహానుభావుడని గుర్తించిన ఆ మహానుభావులకు నివాళులు అర్పించాలో, జోహార్ అని అనాలో, పుష్పాంజలి ఘటించాలో ఏదో ఒకటి రిస్క్ లేని అంజలి మీరే అనుకోవాలని ప్రజలకు సూచించారు.

విశాఖపట్నం అభివృద్ధి చేస్తామని చెప్పి అక్కడి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టారని, మగువల మాంగల్యాన్ని కూడా తాకట్టు పెట్టి మద్యంపై 40 వేల కోట్ల రూపాయల అప్పులను లాగేశారని అన్నారు. నా అక్కలు, చెల్లెమ్మలనే మాటలు చెప్పే జగన్ మోహన్ రెడ్డి మహిళలకు చేసిన మేలు ఏమిటో ఒక్కసారి ఆలోచించాలన్నారు. మీకు మేలు జరిగిందంటేనే ఓటు వేయండి అని ఒకవైపు చెబుతూనే మరొకవైపు ఇంటింటికి వెళ్లి మనము చేసిన మేలు గురించి వివరించాలని వాలంటీర్లకు జగన్ మోహన్ రెడ్డి పిలుపునివ్వడం సిగ్గుచేటు అని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి…
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని రఘురామకృష్ణ రాజు డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నిబంధనలన్నింటినీ ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు. అద్భుతమైన అభినయంతో అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి స్క్రిప్టు రాసి ఇచ్చే వ్యక్తి మారిపోయాడేమోనని పేర్కొన్న ఆయన, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గాజు సింక్ లో ఉండాలంటూ కొత్త, కొత్త డైలాగులను చెబుతున్నారన్నారు.

ఇది తొక్కుతున్న సైకిల్, నిన్ను తొక్కేసే సైకిల్, చేతిలో ఉండే గ్లాసు ఇది… సింక్ లో ఉండే గ్లాసు కాదు.. నీలాంటి మూర్ఖులు ముట్టుకుంటే, ఈ చాయి గ్లాస్ తో ఒళ్ళు కూడా కాలుతుందని హెచ్చరించారు. రొటీన్ డైలాగులు రాసిస్తే ఈ లూజు మాటలు ఏమిటి అని ప్రశ్నించారు. మనది రెక్కలు విరిగిన ఫ్యాను అని దాని ఎవరూ ఇంట్లో పెట్టుకోరు, బయటపడేస్తారని అన్నారు. అంతగా కావాలనుకుంటే కొత్త ఫ్యాన్ కొనుక్కుంటారు కానీ నీ గుర్తుగా ఉన్న ఫ్యానును ఎవరు కొనుక్కునే అవకాశం లేదని అన్నారు. గుర్తుల గురించి లూజు మాటలు మాట్లాడి మరింత తేలిక కావొద్దని జగన్ మోహన్ రెడ్డికి హితవు పలికారు.

సిద్ధం సభ ఖర్చు ప్రభుత్వానిదా?, పార్టీదా??
సిద్ధం సభ ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించారా?, పార్టీ ఖర్చుతో నిర్వహించారా?? అన్నది అణా పైసలతో సహా లెక్క చెప్పాలని రఘురామకృష్ణ రాజు డిమాండ్ చేశారు. 6000 ఆర్టీసీ బస్సులకు డీజిల్ ఎవరు కొట్టించారని ప్రశ్నించారు. సిద్ధం సభకు ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించినందుకు ఎంత డబ్బులు కట్టారని నిలదీశారు. సభకు విచ్చేసిన వారికి పంచిన లిక్కర్ కు ఎంత ఖర్చయిందన్న ఆయన, సిద్ధం సభకు హాజరు కావడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వినియోగించిన హెలికాప్టర్ ఖర్చును ఏ ఖాతాలో రాశారు? అంటూ ప్రశ్నించారు. ఎందుకంటే సిద్ధం సభ వైకాపా ఎన్నికల ప్రచార సభ అని పేర్కొన్నారు.

ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాను…
ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మేళ్లను ప్రజలకు వివరించి వైకాపాకు ఓటు వేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందేనని రఘురామకృష్ణ రాజు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రకటనను సాక్షి దినపత్రికలో, మీడియాలోనూ ప్రసారం చేశారని, ఆ వార్తాపత్రిక క్లిప్పింగ్, సాక్షి మీడియాలో ప్రసారమైన వీడియోను జతచేస్తూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని రఘురామకృష్ణ రాజు తెలిపారు. సిద్ధం సభ కోసం అయిన ఖర్చు మీ పార్టీ ఖాతాలో రాసుకున్నారా? లేదా?? అన్నది కూడా ఇంపార్టెంట్ అని అన్నారు.

ఇకపై ఇలాంటి చెత్త వాగుడు వాగితే ఎన్నికల కమిషన్ తప్పక చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పెనమలూరు వైకాపా అభ్యర్థి, మంత్రి జోగి రమేష్ చర్చి ఫాదర్లతో సమావేశమై మనమంతా క్రైస్తవ కుటుంబంలో జన్మించాం… క్రీస్తు తనయుడైన జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని నిసిగ్గుగా మత ప్రచారం చేశారని, పాస్టర్లకు కుక్కర్లు, కవర్లో డబ్బులు పెట్టి ఇచ్చి ప్రభుత్వం చేసిన మేళ్లను ప్రచారం చేయాలని వాలంటీర్లకు సూచించారని, ఇదే విషయాన్ని తాను ఎన్నికల కమిషన్ కు లేఖ ద్వారా వివరించానని తెలిపారు.

ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి క్షేత్రస్థాయి నివేదికను అందజేయాలని ఆదేశించినట్లు తెలిసిందని, రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు క్షేత్రస్థాయి వాస్తవాలను నివేదించాలని ఆదేశించినట్లు సమాచారం అందిందని అన్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలు వెలుగులోకి రాకుండా వైకాపా నాయకులు అధికారులను మేనేజ్ చేస్తారేమో తెలియదని, వారు చేసింది పచ్చి మోసం దగా అని, మిగిలిన వారు కూడా జగన్ మోహన్ రెడ్డి , జోగి రమేష్ బాటలోనే నడిస్తే ఎన్నికల కమిషన్ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని రఘురామకృష్ణ రాజు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ ఉన్మాదాన్ని ఆపాలని, పాస్టర్ల మేనేజ్మెంట్ ను నిలిపివేయాలని అన్నారు. పాస్టర్లకు కుక్కర్లు, డబ్బు కవర్లు ఇవ్వడం ఆపేస్తే మంచిదని సూచించారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 175 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని చెబుతూనే, మత ప్రచారం నిర్వహించడం ఏమిటంటూ ఆయన మండిపడ్డారు.

నేను హిందువుని.. నన్ను గెలిపించండని నేను ఎక్కడా ప్రచారం నిర్వహించలేదు…
నేను హిందువును నన్ను గెలిపించండని తాను ఎక్కడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేదని రఘురామకృష్ణ రాజు స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి మేనత్త అయిన విమలాదేవి క్రైస్తవుడైన జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని చర్చిలలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని, ఎన్నికల ప్రచారంలో మతాన్ని తీసుకురావద్దని, మనిషైన జగన్ మోహన్ రెడ్డి ని గెలిపించాలని కోరాలే కానీ మతాన్ని ఎన్నికల కోసం వాడుకోవటం ఏమిటని ప్రశ్నించారు.

జగన్ మోహన్ రెడ్డి మేనత్త అయిన విమలాదేవి వై.యస్. విమలాదేవి అయినప్పుడు షర్మిల … వై.యస్. షర్మిల రెడ్డి కాకుండా ఎందుకు పోతుందని విజ్ఞులైన వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అభిమానులకే తెలియాలని అన్నారు. ఇటువంటి వెర్రి మొర్రి వేషాలు వేస్తే, క్షేత్రస్థాయి వాస్తవాలను ఎన్నికల కమిషన్ కు అధికారులు నివేదించాలని, లేకపోతే వీడియోలను కట్ చేసి అందులో ఏం మాట్లాడారో ట్రాన్స్లేట్ చేసి ఎన్నికల కమిషన్ కు నివేదిస్తాం అని, అప్పుడు క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా నివేదికలను అందజేసిన రెవిన్యూ, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా లేఖలు రాస్తామని రఘురామకృష్ణ రాజు తెలిపారు. కొంత మంది పి ఎల్ వోలు వెదవ పనులు చేస్తే తమ జిల్లా కలెక్టర్ ప్రశాంతి వారిపై వేటు వేశారని, దానికి ఆమెను అక్కడ నుంచి బదిలీ చేసి మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా నియమించారని అన్నారు. కొత్త కలెక్టర్ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ పనిచేస్తారని ఆశిస్తున్నానని, ఒకవేళ జగన్ మోహన్ రెడ్డితో కుమ్మక్కైతే ఆయనపై కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇంగ్లీష్ మీడియాన్ని జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చారట…!
ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారట అని, ఆయన వచ్చాకే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు వచ్చాయని భ్రమ కల్పించేలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణ రాజు అన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఉన్నాయని, నేషనల్ పాలసీలో భాగంగా ఒక తరగతి వరకు మాతృభాషలో చదువుకునే వెసులుబాటును కల్పించాలని మాత్రమే తానైనా, ఇతరులైన కోరడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఊరుకున్నదో ఇప్పటికీ అర్థం కావడం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే, మళ్లీ తెలుగు మీడియం స్కూల్లే వస్తాయని జగన్ మోహన్ రెడ్డి  పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని, చంద్రబాబు నాయుడు హయాంలో 50% పైగానే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు విద్యార్థులకు అందుబాటులో ఉండేవని తెలిపారు.

ప్రజలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్లనే కోరుకుంటే వాటిని పెంచుతారని, జాతీయ విధానంలో భాగంగా కొన్ని తరగతుల వరకు మాతృభాషలో విద్యా బోధన జరగాలన్న నిబంధనలు ఉన్నాయని, ఇదే విషయాన్ని తాను పార్లమెంట్లో గుర్తు చేస్తే తనపై పడి ఏడ్చారని అన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు, జగన్ మోహన్ రెడ్డికి సంబంధం లేదని, గుజరాతి మీడియంలో చదువుకున్న నరేంద్ర మోడీ పది సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా కొనసాగగా, మరో ఐదేళ్లపాటు ప్రధానమంత్రి కాబోతున్నారని, అదే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న జగన్ మోహన్ రెడ్డి కేవలం ఐదేళ్లకే ముఖ్యమంత్రి పదవి ముగించుకొని సెలవు తీసుకోబోతున్నారని అన్నారు. ఇది మాతృభాషలో చదువుకున్న వారికి, పరాయి భాషలో చదువుకున్న వారికి ఉన్న తేడా అని రఘురామకృష్ణ రాజు అన్నారు.

అమెరికాలో భారతీయులకే ఎందుకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అంటే వారిలో ఉన్న ప్రతిభ కారణమని, అమెరికా పౌరులు మనకంటే చక్కటి ఇంగ్లీషే మాట్లాడుతారని, అయినా వారి కంటే మనకే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. భాష అన్నది కేవలం కమ్యూనికేషన్ కోసమేనని రఘురామకృష్ణ రాజు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో సి బి ఎస్ ఈ సిలబస్ ప్రవేశపెడతానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఐబీ సిలబస్ ప్రవేశపెడతానని పేర్కొంటున్నారని, రాష్ట్రంలోని పాఠశాలలో ఉన్న సౌకర్యాలను పరిశీలించిన సీబీఎస్ఈ ప్రతినిధులు కేవలం 1000 స్కూల్లలో మాత్రమే సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి అనుమతిని ఇస్తామన్నారని, దీనితో రాష్ట్రంలో 40 వేల స్కూళ్లలో ఐబీ సిలబస్ ప్రవేశపెడతానని జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా ప్రకటించారని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఐబీ స్కూల్లు కేవలం 3000 ఉండగా, ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే జగన్ మోహన్ రెడ్డి 40 వేల స్కూళ్లలో ఐబీ సిలబస్ ను ప్రవేశపెడతానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఐబి సిలబస్ ఫీజుల కోసమే 2000 కోట్ల రూపాయలు చెల్లించాలట అని, నాడు నేడు లో భాగంగా రాష్ట్రంలోని 40,000 స్కూళ్లలో కేవలం 15 వేల స్కూళ్లలో మాత్రమే మరమ్మత్తులు చేపట్టారని, ఇప్పటికీ రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలలో వీధుల్లో చెట్ల కింద కొన్ని వేల పాఠశాలలు కొనసాగుతున్నాయని, జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టడానికే రాష్ట్రంలోని పాఠశాలలలో తొలుత సీబీఎస్ఈ, ఇప్పుడు ఐబీ సిలబస్ ప్రవేశపెడతామని అంటున్నారని రఘురామకృష్ణ రాజు విమర్శించారు.

ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టుపై దాడులా? ఇదెక్కడి విడ్డూరం??
రాప్తాడు సిద్ధం బహిరంగ సభకు హాజరైన జనం మధ్యలోనే వెళ్లిపోతుండగా ఫోటోలను తీసిన ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫోటో జర్నలిస్ట్ పై దాడి చేయడం అమానుషమని రఘురామకృష్ణ రాజు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి సాక్షి దినపత్రికను నిర్వహిస్తూనే, ఫోటో జర్నలిస్ట్ ను అంత నీచంగా హింసిస్తారా అంటూ మండిపడ్డారు. ఒకవైపు వైకాపా నేతలే ఫోటో జర్నలిస్ట్ పై దాడి చేసి, మరొక పక్క టీడీపీ నేతలు దాడి చేశారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఫోటో జర్నలిస్ట్ పై ఎవరు దాడి చేశారో వీడియో విజువల్స్ క్లియర్ గా ఉన్నాయని, ఫోటో జర్నలిస్టుపై దాడిని నిరసిస్తూ రాయలసీమ వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన చేస్తున్నారని, దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన నిర్వహించి ఈ దమనకాండను ప్రపంచానికి తెలియజేయాలన్నారు.

మేనల్లుడు వివాహానికి హాజరుకాని జగన్ మోహన్ రెడ్డి …
రాష్ట్రంలోని మహిళలను నా అక్కా చెల్లెమ్మలని చెప్పుకుంటూ వారి పిల్లలకు మావయ్యనని పేర్కొనే జగన్ మోహన్ రెడ్డి తన సొంత మేనల్లుడు రాజారెడ్డి వివాహానికి హాజరు కాలేదని రఘురామకృష్ణ రాజు అన్నారు. సొంత చెల్లి కుమారుడి వివాహానికే హాజరుకాలేనివాడు మనకేమి చేస్తాడని రాష్ట్రంలోని మహిళలంతా జోక్ లు వేసుకుంటున్నారని తెలిపారు. మాయ్య పెళ్లికి పోలేదా? అంటూ సోషల్ మీడియాలో నెటిజనులు సెటైర్లు వేస్తున్నారన్నారు. షర్మిల తనయుడి వివాహ రిసెప్షన్ కు తాను వెళ్తున్నానని, జగన్ మోహన్ రెడ్డి హాజరవుతారో లేదో తనకు తెలియదన్నారు.

రెండున్నర ఏళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాదులోని తన నివాసం ముందు ఒక దొంగ పోలీసు తచ్చాడుతూ కనిపించాడని, అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకొని తన రక్షణ సిబ్బంది గచ్చిబౌలి పోలీసులకు అప్పగించగా, ఉంగరం పోయిందని అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరిగి తనపై, తన కుమారుడిపై, తనకు రక్షణగా ఉన్న సి ఆర్ పి ఎఫ్ సిబ్బందిపై కేసు నమోదు చేశారని, ఆ కేసులో స్టే కోసం హైకోర్టును ఆశ్రయించగా నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించానని, సుప్రీంకోర్టులో ఆ కేసు ఇప్పుడు విచారణకు రాగా తెలంగాణ ప్రభుత్వం అప్పియర్ కాలేదు కానీ, కానిస్టేబుల్ తరుపున ఇద్దరు న్యాయవాదులు వాదనలను వినిపిస్తామని హాజరు కావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. ఓ కానిస్టేబుల్ ఇద్దరి న్యాయవాదులను నియమించుకునేంత ధనవంతుడా అంటూ రఘురామకృష్ణ రాజు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. లాకప్ లో చిత్రహింసలు పెట్టి తనను చంపాలని చూశారని, ఆ తర్వాత జైల్లోనూ, దొంగ పోలీసుల చేత హైదరాబాదులో తన నివాసం వద్ద చంపించే ప్రయత్నాలను చేశారన్నారు.

బెంబేలెత్తిపోతున్న వైకాపా శ్రేణులు…
ఈనెల 11వ తేదీ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం పేరిట నిర్వహిస్తున్న సభలతో వైకాపా శ్రేణులు బెంబేలెత్తిపోతున్నాయని రఘురామకృష్ణ రాజు అన్నారు. తన వాడి వేడి ప్రసంగాలతో నారా లోకేష్ దూసుకు వెళ్తున్నారని చెప్పారు. గతంలో యువ గళం పేరిట పాదయాత్ర నిర్వహించిన నారా లోకేష్ ఇప్పుడు శంఖారావం పేరిట నిర్వహిస్తున్న సభలకు ప్రజలు స్వచ్ఛందంగా హాజరవుతున్నారని చెప్పారు.

LEAVE A RESPONSE