Suryaa.co.in

Telangana

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడని తప్పితే.. కేటీఆర్ కు ఉన్న అర్హత ఏంటి?

– పారాచూట్ లా ఉద్యమంలో దూరి వారసత్వ రాజకీయాలతో ఎదిగినవ్
-ఒక జేబులో రూపాయి పెట్టి…. వెనక జేబులోంచి పది రూపాయలు కొట్టేస్తున్నరు
– బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ 

హైదరాబాద్.: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరు చెప్పి రైతులకు ఇతర వ్యవసాయ పథకాలు, సబ్సిడీలకు కోత పెట్టిందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఉచిత ఎరువులు, ఉచిత విత్తనాలు, పంట బీమా, కనీస మద్దతు ధరకు బోనస్ అంటూ ప్రగల్బాలు పలికి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ , బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా , కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీఆర్ఎస్ కుటుంబ పాలన, అరాచకాలను ప్రజాకోర్టులో నిలదీస్తే కేటీఆర్ జీర్ణించుకోలేక కుసంస్కారంగా విమర్శలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్ , రాణి రుద్రమ , తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడిన ముఖ్యాంశాలు:

కేటీఆర్… కనీస గౌరవం లేకుండా, కుసంస్కారంగా ప్రధాని మోదీ పై నోటికొచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై.. కేటీఆర్ తన స్థాయి మరిచి మతిభ్రమించినట్లు, ఇష్టానుసారంగా మాట్లాడటడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణలో మొన్న ప్రధాని మోదీ … ఆ తర్వాత నడ్డా , నిన్న అమిత్ షా బీఆర్ఎస్ సర్కార్ బండారాన్ని బయటపెట్టారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన, అరాచకాలను ప్రజాకోర్టులో నిలదీస్తుంటే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నడు. కాలు కాలిన పిల్లిలా ఆగమాగమై సోయి తప్పి మాట్లాడుతుండు, వణికిపోతున్నడు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడని తప్పితే.. కేటీఆర్ కు ఉన్న అర్హత ఏంటి? పారాచూట్ లా ఉద్యమంలో దూరి వారసత్వ రాజకీయాలతో ఎదిగినవ్. మోదీ గారు, అమిత్ షా గారు బూత్ స్థాయి కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, ప్రజల మెప్పుపొందారు. బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే.. కేసీఆర్, కేటీఆర్ రైతు బాంధవులమంటూ మభ్య పెడుతున్నారు.

రైతుబంధు పేరు చెబుతూ వ్యవసాయ పథకాలకు కోత పెట్టారు.ఉచిత ఎరువులు, ఉచిత విత్తనాలు, పంట బీమా, కనీస మద్దతు ధరకు బోనస్ అని ప్రగల్భాలు పలికారు. ఒక జేబులో రూపాయి పెట్టి…. వెనక జేబులోంచి పది రూపాయలు కొట్టేస్తున్నరు.తెలంగాణలో సర్వత్రా బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి బస్తా యూరియాకు రూ.2,236 సబ్సిడీ ఇస్తోంది. అలాగే ప్రతి DAP బస్తాకు రూ. 2,422 సబ్సిడీ ఇస్తోంది. ఒక ఎకరం పొలంలో ఒక పంటకు రైతుకు 2 బస్తాల యూరియా, 2 బస్తాల DAP అవసరం. వీటికి కేంద్రం అందిస్తున్న సబ్సిడీ రూ.9,316. ఏడాది కాలంలో రెండు పంటలకు గాను ఒక్క ఎకరాకు యూరియా, DAP మీద అందిస్తున్న మొత్తం సబ్సిడీ రూ.18,632. పీఎం కిసాన్ నిధి రూ. 6 వేల చొప్పున ఇస్తున్నది.

రైతుకు ఒక ఎకరానికి కేంద్రం మొత్తం రూ.24,632 సాయం అందిస్తున్నది. రైతులను కేంద్రం ఆదుకుంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సొమ్మొకడిది.. సోకొకరిది అన్న మాదిరిగా వ్యవహరిస్తోంది. ప్రతిదాంట్లో కమీషన్ల కక్కుర్తే. కేసీఆర్ తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుస్తామన్నారు.. ఏమైంది? ఏజెన్సీలకు కొమ్ముగాసి నకిలీ విత్తనాలతో రైతుల పొట్టగొడుతున్నారు. మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పామాయిల్ కోసం అనేక రకాల రాయితీలు కల్పిస్తోంది.

బీఆర్ఎస్ సర్కారు రైతుల నుంచి కమీషన్లు వసూల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తోంది.నిన్న తెలంగాణలో పంట నష్టపోయి కౌలు రైతు దంపతులు అశోక్‌, సంగీత ఆత్మహత్య చేసుకున్నారు. ఇది దుస్థితి. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం కనికరం, మానవత్వం చూపని దౌర్భాగ్య సర్కారు బీఆర్ఎస్.

నదులకు నడక నేర్పినం.. రైతులను కడుపున పెట్టుకున్నం.. వ్యవసాయంలో నెంబర్ వన్.. విప్లవాత్మక సంస్కరణలు దేశానికే ఆదర్శమని మాటలు చెబుతున్నరు. దేనికి ఆదర్శం..? నదులకు నడక నేర్పిన సంగతి దేవుడెరుగు… కాని, మద్యాన్ని మాత్రం ఢిల్లీ, పంజాబ్ లకు ప్రవహింపజేసిన ఖ్యాతి కల్వకుంట్ల కుటుంబానికే దక్కుతుంది. కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో రూ. 9 లక్షల కోట్లతో తెలంగాణ అభివృద్ధికి దోహదపడింది.బీఆర్ఎస్ సర్కారు కేంద్రం ఇచ్చే గిరిజన మ్యూజియానికి, సైన్స్ సిటీకి, చర్లపల్లిలో సాటిలైట్ స్టేషన్ కోసం సరిగ్గా భూమిలియ్యలేదు.

ఉడాన్ పథకంతో విమానాశ్రయాల అభివృద్ధి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జక్రాన్ పల్లి వంటి ఎయిర్ పోర్టులకు భూమి కేటాయించలేదు.కేంద్రం దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు కట్టించింది. ఉత్తరప్రదేశ్ లో ఆరేళ్లలో 55 లక్షల మందికి ఇండ్లు కట్టించిన ఘనత యోగీ ప్రభుత్వానిది. తెలంగాణలో మాత్రం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దిక్కులేదు.

రాష్ట్రంలో ఇంటర్, టీఎస్ పీఎస్సీ పరీక్షలను ఒక్కదాన్నీ సక్రమంగా నిర్వహించకుండా లక్షలాది మంది నిరుద్యోగుల పొట్టగొట్టారు.మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను రూ.6 లక్షల కోట్ల అప్పులఊబిలో దింపారు.తెలంగాణలో ఎన్నికలంటే మద్యం ఏరులై పారుతోంది. కోట్లకు కోట్లు నోట్ల కట్టలు బయటకు వస్తున్నాయి.

ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన బీఆర్ఎస్ కు ప్రజలు కర్రుగాల్చి బుద్ధి చెప్పడం ఖాయం.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేలా కాంగ్రెస్ ను మోస్తున్నది బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్-బీఆర్ఎస్-మజ్లిస్ అవకాశవాద పార్టీలకు కాలం చెల్లే టైమొచ్చింది. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారును ఏర్పాటు చేసేందుకు ప్రజలు వేచిచూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అరాచకాలను ఎండగట్టేలా బిజెపి చార్జ్ షీట్ రూపొందించి ప్రజాకోర్టులో నిలబెడుతాం. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా పీపుల్ మేనిఫెస్టో రూపొందిస్తాం.

LEAVE A RESPONSE