-
పార్టీ ఆఫీసుపై దాడి చేసిన వారిని చేర్చుకుంటారా.. హవ్వ?
-
వైసీపీతో అంటకాగిన వారికి పోస్టింగులు ఇస్తారా?
-
పోస్టింగులకు డబ్బులే ప్రధానమా?
-
నియోజకవర్గాల్లో తండ్రి, అన్న, కొడుకు, భార్య, బావ, బావమరుదుల పెత్తనమేంటి?
-
ఓ జిల్లాలో మంత్రి తండ్రి-బావలదే పెత్తనం
-
ఇంకో జిల్లాలో సీనియర్ మంత్రి అల్లుడే రారాజు
-
మరో జిల్లాలో ఇద్దరు పీఏలదే పెత్తనం
-
వారేమైన కష్టకాలంలో పార్టీ జెండా మోశారా?
-
కూటమి శ్రేణుల మనోభావాలు పట్టవా?
-
రేషన్ షాపులు పార్టీకి వారికి ఇవ్వరా?
-
కర్నూలు జిల్లా అధ్యక్షుడి బహిరంగ ఆవేదన పట్టించుకునేదెవరు?
-
సొంత పార్టీ వారిపైనే కేసులు పెట్టిస్తారా?
-
నాయకత్వం చెప్పినా లెక్కచేయరా?
-
ఎమ్మెల్యేల పనితీరుపై కూటమి శ్రేణుల కన్నెర్ర
-
వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఇన్చార్జి నియోజకవర్గాల నుంచే అధిక ఫిర్యాదులు
-
టీడీపీ వారిపై దాడులు చేసిన అధికారులకు పోస్టింగులు ఇప్పిస్తున్న వైనంపై ఆగ్రహం
-
కార్యకర్తల ఫిర్యాదులు ఎవరూ పట్టించుకోని దుస్థితి
-
అందుకే సోషల్‌మీడియాను ఎంచుకుంటున్న వైనం
-
సోషల్‌మీడియాలో వచ్చిన తర్వాత దిద్దుబాటుకు దిగుతున్న వైచిత్రి
-
పట్టించుకోని జిల్లా ఇన్చార్జి, జోనల్ ఇన్చార్జిలు
-
సోషల్‌మీడియా సైనికుల ప్రశ్నాస్త్రాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగన్ జమానాలో మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిలో కొంతమంది అరె స్టయ్యారు. మరికొందరు పారిపోయారు. మరి మిగిలిన వారేమయ్యారు? ఏమయ్యారంటే.. టీడీపీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుని పార్టీలో చేరారు. ఇది నమ్మశక్యం కాకపోయినా నిఖార్సయిన నిజం.
జగన్ హయాంలో రెచ్చిపోయి.. టీడీపీ వారిపై దాడులకు దిగి, ఆర్ధికంగా-శారీరకంగా-మానసికంగా నష్టపరిచిన వైసీపీ గ్రామ-నియోజకవర్గ నేతలు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారంటే.. స్థానిక ఎమ్మెల్యేలను మంచి చేసుకుని టీడీపీలో చేరుతున్నారు. టీడీపీ కాదంటే జనసేన. అక్కడ కుదరకపోతే బీజేపీ. ఏదైతేనేం.. కూటమిలోనే తలదాచుకుంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ టీడీపీలో చేసిన వారంతా.. ఇప్పుడు టీడీపీలో ఉన్న తమ పాత ప్రత్యర్ధులపై కేసులు పెడుతున్నారు. అదీ విచిత్రం.
వైసీపీ పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకుని.. ఆయనను అర్ధరాత్రి, సెల్‌ఫోన్ల వెలుగులో పాదయాత్ర చేయించారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఏర్పాట్లను ధ్వంసం చేసి, తమ్ముళ్లపై అక్రమ కేసులు పెట్టారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుని.. వారిపై లాఠీలు ఝళిపించిన డీఎస్పీ, సీఐ, ఎస్‌లు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంకెక్కడుంటారు?.. అదే రేంజిలో ఎమ్మెల్యేలకు ముడుపులు సమర్పించి, ఎంచక్కా పోస్టింగు తెచ్చుకుంటున్నారు.
మరి జగన్ జమానాలో ఐదేళ్లు పోస్టింగులు లేకుండా బలైన అధికారుల సం‘గతే’మిటి? కూటమి వచ్చిన తర్వాత మూడునెలలకు చచ్చీచెడీ పోస్టింగు దక్కించుకున్న అమరావతి సీఐ లాంటి వాళ్లను, మళ్లీ ఎందుకు వీఆర్‌కు పంపిస్తున్నారు? అంటే ఎమ్మెల్యేలకు నచ్చకపోతే వీఆర్‌కు పంపించేస్తారా? మరి ఐదేళ్లు జగన్ జమానాలో బలిపశువులకు కూటమి చేసే న్యాయమేమిటి? కమ్మకులంలో పుట్టడమేనా వారు చేసుకున్న పాపం?!
మరి ఇవన్నీ నాయకత్వానికి తెలియవా?.. ఎవరూ చెప్పరా?.. నిఘా నివేదికలివ్వదా?.. దానికోసం ఏర్పాటుచేసిన అన్నేసిన టీములు ఏం చేస్తున్నట్లు? కనీసం ఎమ్మెల్యేలు తెలుసుకోరా? ఎమ్మెల్యేలకు డబ్బులే ప్రధానమా? ఎవరు డబ్బులిస్తే వారికి సిఫారసు లెటర్ ఇచ్చేస్తారా? అతగాడు గతంలో పార్టీ నేతలపై ఎన్ని కేసులు పెట్టాడని ఆరా తీయరా? అసలు ఇప్పుడు ఉన్నది ఎవరి ప్రభుత్వం? మారింది ముఖ్యమంత్రా? ప్రభుత్వమా? పాత వైసీపీ వారికి, ఇప్పుడున్న వైసీపీ నేతలకే ఎందుకు పనులవుతున్నాయి? సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా డబ్బులు తీసుకోవడం ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడే ఎందుకిలా? ..ఇవీ టీడీపీ కార్యకర్తలు సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు.
కార్యకర్తలేకాదు.. కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడి బహిరంగ ఆవేదన ఇది. ఇలాంటి జిల్లా అధ్యక్షులు చాలామంది ఉన్నారు. ఇప్పటికి గళం విప్పింది ఆయనొక్కరే. ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడే మనసులో వేదన వెళ్లగక్కారంటే, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏమిటి? అయినా వారి వేదన అరణ్యరోదనే. వైసీపీ నుంచి టీడీపీలో చేరి.. ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఈ రోదనలు-వేదనలూ ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, పార్టీ జెండాను భుజం పుళ్లుపడేలా మోసిన తమకు న్యాయం జరగటం లేదన్నది వారి వేదన.
సీఎం మారారే తప్ప ప్రభుత్వం మారినట్లు లేదన్నది వారి వాదన. వాటినే సోషల్‌మీడియాలో ఆవేదన.. ఆగ్రహం.. అసంతృప్తి రూపంలో ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. మళ్లీ వాటితో అప్రమత్తమై, దిద్దుబాటుకు దిగుతున్న వైనం. అదేదో ముంందుగానే ఆచితూచి నిర్ణయం తీసుకుంటే, ఈ సమస్యలు ఉండవు కదా? గత ఏడునెలల నుంచి జరుగుతోంది ఇదే!
రాంబాబుకు ఎలా పోస్టింగ్ వచ్చిందబ్బా?
జగన్ జమానాలో ఉధృతంగా జరిగిన అమరావతి రైతుల ఉద్యమం గుర్తుంది కదా? అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళలు ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద పాదయాత్రగా వెళుతున్న సందర్భంగా, అప్పటి సీఐ రాజుపాలెం రాంబాబు వారిపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడంతో.. చాలామంది గాయపడగా, నాటి విపక్ష నేత చంద్రబాబునాయుడు సైతం దానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు దానిని ఖండించారు.
సీన్ కట్ చేస్తే.. అదే రాంబాబుకు తాజాగా బాపట్ల సీఐగా పోస్టింగ్ ఇవ్వడం, తెలుగుతమ్ముళ్ల ఆగ్రహానికి గురయింది. బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న వర్మ ఇచ్చిన సిఫారసు లేఖ ఆధారంగానే, ఆయనకు అక్కడ పోస్టింగు దక్కిందన్నది తమ్ముళ్ల ఆరోపణ. అమరావతి రైతులపై లాఠీచార్జి చేసిన అధికారికి సిఫార్సు లేఖ ఇవ్వడానికి మనసెలా వచ్చింది? ఆ అధికారి కోసం మీ దగ్గర ఎవరు పైవరీలు చేశారు? అంటూ బాపట్ల, ప్రకాశం జిల్లా తమ్ముళ్లు వర్మపై విరుచుకుపడతున్నారు.
గతంలో చీరాల వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి.. ప్రస్తుతం మరో పార్టీలో ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడైన ఈ పోలీసు అధికారికి, పక్కనే ఉన్న బాపట్లలో ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తమ్ముళ్లు విరుచుకుపడతున్నారు. వైసీపీ హయాంలో ఆయనపై అనేక ఆరోపణలున్నప్పటి కీ, ఐజి ఆయనకు ఎలా పోస్టింగ్ ఇచ్చారో అర్ధం కావడం లేదని టీడీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మిగిలిన ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోని ఐజి, అమరావతి రైతులపై అమానవీయంగా లాఠీ చేసిన సీఐ రాంబాబును మిగిలిన వారిలా వీఆర్‌కు పంపించకుండా, కీలకమైన సీఐ పోస్టింగ్ ఎలా ఇచ్చారని టీడీపీ నేతలు నిప్పులు కురిపిస్తున్నారు. పోనీ ఇది సోషల్‌మీడియాలో వచ్చిన తర్వాత కూడా పట్టించుకోవడం లేదంటే, ప్రభుత్వంలో ఏం జరుగుతోందో సులభంగా అర్ధమవుతోందని చెబుతున్నారు.
అసలు ఒక మాజీ డీజీపీ, మాజీ ఐజి సారథ్యంలో జరుగుతున్న బదిలీల వడపోత నుంచి, రాంబాబు ఎలా తప్పించుకున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంటే వారిద్దరికీ క్షేత్రస్థాయి నిజాలు తెలియవా? అవేమీ తెలియకుండానే బదిలీలలో చక్రం తిప్పుతున్నారా? అన్న సందేహాలు పార్టీ సీనియర్లలో వ్యక్తమవుతున్నాయి.
పార్టీ ఆఫీసుపై దాడి చేసిన వారిని చేర్చుకుంటారా?
మీకు గుర్తుందా? మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై.. వైసీపీ ముష్కరులు అనాగరికంగా దాడి చేసి అద్దాలు-కార్లు ధ్వంసం చేసి, అక్కడ పనిచేసే సిబ్బందిని చావగొట్టిన వైనం పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. ఒక పార్టీ ఆఫీసుపై దాడి చేయడం అదే తొలిసారి. అది కూడా డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో. దానికి సూత్రధారులపై కేసు నమోదు చేసి, దాడిలో పాల్గొన్న చాలామందిని అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. అయితే దాడిలో పాల్గొన్న కొందరు మాత్రం తెలివిగా.. టీడీపీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుని, పార్టీలో చేరడం కార్యకర్తల ఆగ్రహానికి కారణమవుతోంది.
గుంటూరు ఎమ్మెల్యే గళ్లా మాధవి నియోజకవర్గంలో, టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిని పార్టీలోకి తీసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతునాయి. సుదీర్ఘకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న వాణిజ్యవిభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసు పొదిల, గత ఎన్నికల్లో 11 పోలింగ్ బూతులకు ఇన్చార్జిగా పనిచేశారు. అయితే ఇప్పుడు ఆయనతోపాటు కార్పొరేటర్‌గా పోటీచేసిన ఆమె భర్త, పార్టీ క్లస్టర్ ఇన్చార్జి, జనసేన వార్డు ఇన్చార్జిపై.. మొత్తం నలుగురిపై ఎన్నికల ముందు వైసీపీ నుంచి చేరిన నాయకుడు కేసు పెట్టారు.
వీరంతా కలసి తనను కొట్టారని ఫిర్యాదు చేసిన ఆ నాయకుడి ఇంటికి ఎమ్మెల్యే గాళ్ల మాధవి వెళ్లి, పరామర్శించడం కార్యకర్తల ఆగ్రహానికి కారణమయింది. అసలు తొలినుంచి పార్టీలో పనిచేస్తున్న తమపై అక్రమ కేసు పెట్టిన వ్యక్తి ఇంటికి, ఎమ్మెల్యే మాధవి ఎలా వెళతారని కార్యకర్తలు విరుచుకుపడతున్నారు. తమతో మాట్లాడకుండా ఆమె ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తుందన్న ఆవేదన వ్యక్తమయింది. దానితో ఆమె కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యేను ఉద్దేశించి రాష్ట్ర నేత వాసు పొదిల పెట్టిన పోస్టు సంచలనం సృష్టించింది.
దానితో రంగంలోకి దిగిన లోే ష్ కార్యాలయ సిబ్బంది, విచారణ నిర్వహించి లోకేష్ కార్యాలయానికి నివేదిక ఇచ్చారు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఎమ్మెల్యే- ఆమె భర్తకు పార్టీలో పనిచేసిన వారెవరో తెలుసుకోవాలి కదా అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ తొలి నుంచి పార్టీకి పనిచేసిన తమకు, ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందంటున్నారు. పోనీ ఎంపికి చెబుదామా అంటే ఆయన వీకెండ్ ఎంపీగా తయారయ్యారని పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమలాపురంలో ఎంపి హరీష్ అనుచరుడైన పంబల నాగేంద్ర అనే నాయకుడు, ఇటీవల సంక్రాంతి సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టారు. అయితే తమ విధులకు అడ్డు వస్తున్నారన్న పంచాయితీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదుతో, పోలీసులు పార్టీ నేత నాగేంద్రను రిమాండ్‌కు పంపటంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. మాజీమంత్రి విశ్వరూప్ అనుచరుడిగా ముద్రపడిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపె,ై సొంత పార్టీ కార్యకర్తలను ఎలా అరెస్టు చేస్తారని విరుచుకుపడతున్నారు.
రామచంద్రాపురంలో సొంత పార్టీనేత, శెట్టిబలిజ నాయకుడైన మేడిశెట్టి ఇస్రాయెల్‌ను, ఒక మంత్రిగారి వర్గీయుల ఫిర్యాదుపై కేసు పెట్టి రిమాండ్‌కు పంపిన వైనం స్థానికంగా చర్చనీయాంశమయింది. మంత్రి, ఆయన కుటుంబసభ్యుల తీరుపై ఇస్రాయెల్ అనేక పోస్టులు పెట్టడమే దానికి కారణం. ఇద్దరూ ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారే కావడం గమనార్హం.
సొంత పార్టీ వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ద్వారా పార్టీ కార్యకర్తలకు ఏం సంకేతాలిస్తున్నారు? మంత్రి తండ్రి, బావ ఇద్దరూ వ్యవహారాలు చక్కబెడుతున్నారన్నది కార్యకర్తల ఫిర్యాదు. అయితే తాను నియోజకవర్గానికి కొత్త కావడంతో ఎదురవుతున్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని మంత్రి సన్నిహితులకు చెబుతున్నారట.
బాబును నడిపించినా ఆ సీఐకి భలే పోస్టింగ్
కాగా ఎన్నికల ముందు అనపర్తిలో చంద్రబాబును అడ్డుకుని, ఆయనను రాత్రివేళ సెల్‌ఫోన్ల వెలుగులో 7 కిలోమీటర్లు నడిపించిన ఒక ఇన్స్‌పెక్టర్‌కు, అమలాపురం జిల్లా ఎస్‌బిలో పోస్టింగ్ ఇవ్వడంపై జిల్లా పార్టీ కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఒక మంత్రి, అదే జిల్లాకు చెందిన ఒక సీనియర్ మాజీ మంత్రి అండతో, ఆ పోస్టింగు సాధించారని అటు పోలీసులు వర్గాల్లో సైతం ప్రచారం జరిగింది.
సదరు అధికారి అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుని, వారిని రామచంద్రాపురంలో నిలిపి, కేసులు పెట్టారని కార్యకర్తలు గుర్తు చే స్తున్నారు. అలాంటి అధికారికి కీలకమైన ఎస్‌బిలో ఎలా పోస్టింగ్ ఇస్తారని కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఇప్పుడాయన ఎస్పీకి సన్నిహితుడిగా మారారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. జిల్లాలో కీలకమైన సమాచారం సేకరించే స్థానం, అలాంటి అధికారికి ఎలా అప్పగిస్తారని కార్యకర్తలు నిలదీస్తున్నారు.
అల్లుడుగారి గిల్లుళ్లు!
ఇక క్యాబినెట్‌లోనే సీనియర్ మంత్రి అయిన ఒకరి అల్లుడు కడప, నెల్లూరు జిల్లాల్లో వసూళ్ల పర్వానికి తెరలేపిన వైనం నాయకత్వానికి తలనొప్పిలా మారింది. అల్లుడు గారు సొంత పార్టీ నేతల వద్ద సైతం వసూళ్లకు పాల్పడుతున్న వైనం, నాయకత్వం వరకూ చేరిందట. కాగా సుదీర్ఘకాలం నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్న ఆ సీనియర్ మంత్రి సైతం తన శాఖ-జిల్లాలో వాటాలు అడుగుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఆయన సన్నిహితులు సైతం ఆశ్చర్యపోతున్నారట. మాజీ మంత్రి సోమిరెడ్డిని, పార్టీ నేతలను వేధించిన పోలీసు-రెవిన్యూ అధికారులను సదరు మంత్రిగారు, తన నియోజకవర్గంలో నియమించుకోవడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి.
‘రూపు’ మారుతున్న మైనింగ్
ఇక ఇదే జిల్లాలో వైసీపీ నుంచి ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఒక డిప్యూటీ మేయర్, ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఎంపి దన్నుతో.. మైనింగ్‌లో రెచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో ఇద్దరూ ఎన్నికల ముందు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారే కావడం గమనార్హం. ఈ ‘బెట్టింగ్ రాజా’ ఒక్కరికే నాలుగు మైకా గనులు కేటాయించి.. పార్టీకి విరాళాలు ఇస్తున్న మిగిలిన వ్యాపారాలకు, మొండిచేయి చూపిన వైనం మీడియాలోనూ రచ్చయింది. అయితే ఎన్నికల తర్వాత మూసేసిన మైకా గనులకు తాజాగా కొన్ని లైసెన్సులు ఇచ్చినా.. పర్మిట్ మాత్రంఇవ్వడం లేదని, అది కావాలంటే ‘బెట్టింగ్ రాజా’తో సెటిల్ చేసుకోవాలన్న నిబంధన రచ్చగా మారింది.
‘మైనింగ్ జిల్లా’లో మంత్రి సన్నిహితుడే ‘సారథి’ట!
మైనింగ్ జిల్లాగా పేరున్న ఆ జిల్లాలో కొత్తగా పదవి తీసుకున్న మంత్రి గారి పీఏ, ఆంతరంగికుడే చక్రం తిప్పుతున్నారట. ఆ జిల్లాలో క్వారీలు, ఫ్యాక్టరీలకు లెక్కలేదు. దాదాపు 500 ఫ్యాక్టరీలున్న జిల్లా అది. క్వార్డ్జు, బ్లాక్ పెరల్‌కు ఆ జిల్లా ప్రసిద్ధి. పార్టీకి చెందిన వారి ఫ్యాక్టరీలలోని రాళ్లను.. తమ కంపెనీకే, తాము చెప్పిన రేటుకు ఇవ్వాలని లక్ష్మణ రేఖ విధించిన వైనం విమర్శలకు దారితీస్తోంది.
నియోజకవర్గం నుంచి వెళ్లే క్వారీ ముడిసరుకు, బియ్యం, గ్రావెల్ వసూళ్లకు మంత్రి గారి సన్నిహితుడే ‘సారధి’ అన్నది పార్టీ నేతల విమర్శ. ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించి.. జాతీయ రహదారులపై జరిగే పనులు, వాడరేవు-చిలకలూరిపేట రోడ్డు నిర్మాణానికి, అనంతపురం-అమరావతి రోడ్డు నిర్మాణానికి కావలసిన మట్టి, రాళ్లు, వేస్టేజీని టిప్పర్లతో తోలే పనులకు సదరు సన్నిహితుడే సారధి అని, పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
సదరు మంత్రి గారు నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోరని, శుక్ర-శని-ఆదివారాల్లో జల్సా కోసం హైదరాబాద్, సింగపూర్, దుబాయ్, మలేసియా తిరిగి వస్తుంటారన్న ప్రచారం బహిరంగమే. ఇటీవల హైదరాబాద్‌లో ఒక బీసీమంత్రిగారి సెటిల్‌మెంట్ల గురించి రాసిన ఓ మీడియా.. అదే మంత్రితో కలసి వెళ్లే ఈ కొత్త మంత్రిని మాత్రం మినహాయించడంపై, జిల్లా పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమయింది.
నూజివీడులో తమ్ముళ్ల రాజీనామాల షాక్
నూజివీడు నియోజకవర్గంలో మంత్రి కొలుసు పార్ధసారథి.. తన పాత నియోజకవర్గమైన పెనమలూరుకు చెందిన వైసీపీ నేతలకు, నందిగామకు చెందిన కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు ఇస్తున్నారంటూ టీడీపీ సీనియర్లు బాహాటంగానే విరుచుకుపడతున్నారు. బుజ్జి అనే నాయకుడికే ఇసుక, మట్టి కాంట్రాక్టు ఇచ్చిన వైనం అటు మీడియాలోనూ రావడంతో, స్థానిక పార్టీ నేతలు దానిపై నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రి తమను పట్టించుకోకుండా, వైసీపీ నుంచి వచ్చిన తన మనుషులకే కాంట్రాక్టులు ఇప్పిస్తున్నందుకు నిరసనగా.. పార్టీలో తొలి నుంచీ పనిచేస్తున్న మండల నేతలు ఇటీవల రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. ఆ సందర్భంగా వారు మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతూ విడుదల చేసిన వీడియో వైరల్ అయింది.
‘తిక్కన్న’ చెప్పిందే నిజమంటున్న తమ్ముళ్లు
పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కార్యకర్తల మనోభావాలకు అద్దం పట్టాయి. ‘నిన్న మొన్న వచ్చిన వైసీపోళ్లు బాగుపడుతున్నారు. వారికే పదవులు, పనులు ఇస్తున్నారు. వైసీపీపై పోరాటం చేసిన వారు మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నారు. ఇందుకోసనమేనా చంద్రబాబు జైలుకెళ్లింది? దీనికోసమేనా లోకేష్ పాదయాత్ర చేసింది? కొంతమంతి ఎమ్మెల్యేలు పార్టీ జెండాలు మోసిన కార్యకర్తల దగ్గర 3 లక్షలు, 5 లక్షలు తీసుకుని రేషన్‌షాపులు ఇస్తున్నారు. మన కార్యకర్తల దగ్గరే లంచం తీసుకుంటున్న వారిని ఏమనాలి? కార్యకర్తలకు తీరని అన్యాయం జరుగుతోంది. డబ్బులు ఇచ్చిన వారికి పదవులు, పనులు ఇస్తారా? అని ధ్వజమెత్తారు.
వైసీపీ హయాంలో వారితో పోరాడిన నాకు బుల్లెట్ గాయమయింది. ఓడిపోయి ఇన్చార్జులుగా ఉన్న వాళ్లు ఎంపీని కట్టడి చేస్తారా? ఎన్నికల్లో ఎవరు ఎలా పనిచేశారు? ఏ కార్యకర్త ఎలా కష్టపడ్డారు? వారికి న్యాయం చేస్తున్నామా? లేదా అని ఆత్మపరిశీలన చేసుకోండి’ అంటూ ఘాటుగా చేసిన వ్యాఖ్యలు.. పార్టీ జెండా మోస్తున్న పసుపు సైనికుల హృదయాలను తాకాయి.