Suryaa.co.in

Telangana

అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధికి, పెట్టుబడుల కోసం పాటుపడుతూనే ఉంటాము

– బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారింది
– తెలంగాణపై తమకు ఉండే ప్రేమ, అభిమానం ఇంకెవరికీ ఉండవు
– తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి సహకారం అందించండి
– యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసం త్రికరణశుద్దిగా పనిచేస్తూనే ఉంటామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ పరిశ్రమలు- ఐటి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాధకులుగా, మాతృభూమిపై తమకుండే మమకారం ఇంకెవరకీ ఉండదన్నారు.

యూకే పర్యటనలో ఉన్న కేటీఆర్ ను పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు,యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వ్యాపార నిర్వహణకు ఎదురవుతున్న సవాళ్లతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాలపై సమావేశంలో చర్చించారు.

ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలుచేసిన ప్రగతిశీల విధానాలు, తీసుకున్న పారిశ్రామిక అనుకూల నిర్ణయాలతో పది సంవత్సరాల కాలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన సంగతిని కేటీఆర్ ప్రస్తావించారు.

యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి కార్పోరేట్ దిగ్గజాలకు తెలంగాణ నయా చిరునామాగా మారిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు, తీసుకువచ్చిన పారదర్శక విధానాలతో పారిశ్రామిక రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణ గడ్డను ప్రేమించే వ్యక్తిగా అధికారంలో ఉన్న లేకున్నా రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి సాధ్యమైనంత సహకారం అందించాలని సమావేశానికి హాజరైన వారికి ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని కేటీఆర్ వారికి విజ్ఞప్తి చేశారు

LEAVE A RESPONSE