Suryaa.co.in

Editorial

ఎవరా ఇద్దరు?

– ఎవరా ఇద్దరు?
– రెండు ఎమ్మెల్సీ ఖాళీలు
– మూడేళ్ల పదవీకాలం
– రామచంద్రయ్య, ఇక్బాల్ రాజీనామా
– మళ్లీ ఆ ఇద్దరినీ కొనసాగిస్తారా?
– కొత్త వారికి అవకాశమిస్తారా?
– కొత్తగా తెరపైకి వర్మ, వంగవీటిరాధా
– రేసులో బీద రవిచంద్ర, మంతెన రాజు, కోనేరు సురేష్, మాల్యాద్రి, పట్టాభి, వర్ల
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ సర్కారు ఏర్పడిన కొద్దిరోజుల్లోనే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు రావడం సందడిగా మారింది. ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఇక్బాల్, సి.రామచంద్రయ్య తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. రామచంద్రయ్యపై అనర్హత వేటు వేశారు. ఆరకంగా ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నిక జరగనుంది. మూడేళ్ల పదవీకాలం ఉండటంతో, ఆశావహుల సంఖ్య కూడా బాగానే కనిపిస్తోంది.

ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ, తాజా ఎన్నికల్లో తెరవెనుక పనిచేసిన నేతలకు ఈసారి అవకాశం ఇస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమయింది. ఆ ప్రకారంగా మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్, మంతెన సత్యనారాయణరాజు, టీడీఎల్పీ ఆఫీసు కార్యదర్శి కోనేరు సురేష్ పేర్లు చర్చకు వస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో బీద, మంతెన ఇటీవలి ఎన్నికల్లో ట్రబుల్‌షూటర్స్‌గా పనిచేశారు. ఆశావహులతో చర్చలు, బుజ్జగింపులు, కీలక అంశాలపై అభ్యర్ధులతో చర్చలు, జిల్లా నేతలతో సమన్వయం తదితర అంశాల్లో వారిద్దరే కీలకపాత్ర పోషించారు. వీరికి కొన్ని జిల్లాల సమన్వయ బాధ్యతలు కూడా అప్పగించారు. బీద-మంతెనకు వివాదరహిత నేతలన్న పేరుతోపాటు, లోకేష్ వర్గంగా పేరుండటం అనుకూలించే అంశం.

వీరిలో బీద యాదవ సామాజికవర్గానికి చెందిన నేత కావడం మరో సానుకూల అంశం. పార్టీ కష్టకాలంలో ముందుండే బీదకు, నాయకత్వానికి ఇష్టుడిగా పేరుంది. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా దానిని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈయన లోకేష్ టీంలో కీలకనేత. ఈ కోణంలో బీద రవిచంద్రయాదవ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఒకవేళ కులసమీకరణ కుదరకపోతే.. బీదకు టీడీపీ చైర్మన్ పదవి వరించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీలలో అత్యధిక శాతం మంది ఉన్న యాదవులకు టీటీడీ చైర్మన్ ఇవ్వడం ద్వారా, వారిని మెప్పించినట్లవుతుంది.

ఇక మంతెన సత్యనారాయణరాజు కూడా, చాపకింద నీరులా తనకు అప్పగించిన బాధ్యత పూర్తిచేసే నైజం ఉన్న యువనేత. ఈయన కూడా లోకేష్ టీమ్‌లో కీలకనేత. కిందస్థాయి పార్టీ శ్రేణులు-నియోజకవర్గస్థాయినేత మనోభావాలు నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లే రాజుది లో ప్రొఫైల్ శైలి.ఈ క్రమంలో మంతెనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.

పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు కీలకమైన దొంగఓట్ల ఏరివేత అంశంలో క్రియాశీల పాత్ర పోషించి, దాదాపు 40 లక్షల దొంగఓట్లను ఈసీ ద్వారా తొలగించేలా చేయడంలో కీలకపాత్ర పోషించిన, టీడీఎల్పీ ఆఫీసు కార్యదర్శి కోనేరు సురేష్ పేరు కూడా ఎమ్మెల్సీ పేరుకు వినిపిస్తోంది. ఆయన ఆ మేరకు పార్టీ అధినేతకు దరఖాస్తు చేశారంటున్నారు.

ఒక్కో ఇంట్లో 27 ఓట్లు ఉన్న అంశాన్ని వెలుగులోకి తీసుకురావడంతో, డబుల్ ఎన్‌రోల్‌మెంట్, చనిపోయిన వారి ఓట్లు తొలగించడం, దొంగఓట్ల ఏరివేత కోసం నియోజకవర్గాల వారీగా నిర్వహించిన శిక్షణ శిబిరాలు-సమీక్షలకు నేతృత్వం వహించిన సురేష్ చాలా ఏళ్ల నుంచి, టీడీపీఎల్పీలో చురుకుగా పనిచేస్తున్నారు. వివాదరహితుడు,మేధావిగా, సమకాలీన రాజకీయాలపై అవగాహన ఉన్న సురేష్ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక వీరు కాకుండా నాలెడ్జ్ సెంటర్‌ను తీర్చిదిద్ది.. పార్టీ విధానాలు, దిశానిర్దేశం చేసి, నాయకత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడంలో కీలకపాత్ర పోషించిన మాల్యాద్రి పేరు కూడా ఎమ్మెల్సీ పదవికి వినిపిస్తోంది. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు జగన్ సర్కారుపై విరుచుకుపడి, ఆయన బాధితుడైన పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాణిని సమర్ధవంతంగా వినిపించిన పొలిట్‌బ్యోరో సభ్యుడు వర్ల రామయ్య పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

అయితే అసలు కొత్తవారికి ఎమ్మెల్సీలు ఇవ్వాలా? లేక పదవులు త్యాగం చేసి పార్టీలో చేరిన వారినే తిరిగి కొనసాగించాలా? అన్న విధాన నిర్ణయంపై, నాయకత్వం ఎటు మొగ్గుచూపుతుందో చూడాల్సి ఉంది. నిజానికి సి.రామచంద్ర య్య, ఇక్బాల్ పార్టీలో చేరే సమయంలో ఎమ్మెల్సీ పదవులకు, రాజీనామా చేయవద్దని నాయకత్వం సూచించిందని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయితే తమ నిజాయితీ నిరూపించుకునేందుకు ఇక్బాల్ రాజీనామా చేశారు.

నిజానికి గతంలో సి.రామచంద్రయ్యకు రాజ్యసభ ఇచ్చినా, పార్టీ కష్టకాలంలో వెళ్లిపోయారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక ఐపిఎస్ ఇచ్చిన తర్వాత కూడా, ఇక్బాల్ వైసీపీలో చేరారంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరికి ఈసారి ఎన్నికల్లో అవకాశం ఇవ్వవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలాఉండగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన, మాజీ ఎమ్మెల్యే వర్మ పేరు కూడా తెరపైకి రావడం చర్చనీయాంశమయింది. వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా, కాపులను మెప్పించడంతో పాటు, కొత్త తరానికి అవకాశం ఇచ్చినట్టవుతుందని భావిస్తున్నారు. నిజానికి రాధాకు గత ఎన్నికల్లోనే పోటీ చేయమని సూచించినప్పటికీ, ఆయన నిరాకరించారు. బందరు సీటు నుంచి పోటీ చేయాలని నాయకత్వం ప్రతిపాదించింది.

పిఠాపురంలో పవన్‌కు సీటు ఇచ్చినప్పుడు అసంతృప్తితో, స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగే సందర్భంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని నాయకత్వం హామీ ఇచ్చింది. దానితో పట్టుదలతో పనిచేసిన వర్మ, జనసేనాధిపతి పవన్ విజయం కోసం మనస్ఫూర్తిగా పనిచేశారు. వర్మ గతంలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి, విజయం సాధించిన విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE