షర్మిలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

-క్రైస్తవ, ముస్లిం ఓట్లు చీలిస్తే టీడీపీకే లాభం
-కాస్తో ఇస్తిష్కో షర్మిల మాటలతో ఓటర్లుగా మారితే అది వైకాపాకు నష్టం
-గతంలో పవన్ వలన టిడిపికి నష్టం జరిగినట్లే… ఈసారి షర్మిల వలన జగన్ కి నష్టం
-వైకాపా ఉక్కిరిబిక్కిరి

2019 ఎన్నికల్లో షర్మిల తెలంగాణలో ఉండే. వైకాపాకు ఆంధ్రా స్టార్ క్యాంపెనర్ ఆమెతో పాటు మోహన్ బాబు, ఆలీ, జీవిత రాజశేఖర్, పృధ్వీ వంటి వారు స్టార్ క్యాంపెనర్. వీరు అన్నకు అనుకూలంగా ప్రచారం చేసినవారే. తెలంగాణ వ్యక్తులకు ఆంధ్రా ప్రభుత్వం సలహాదారు పదవులు ఇచ్చారు. ఇవన్నీ దాచేసి.. ఇపుడు ప్రాంతీయ తత్వం తెలంగాణ లో ఉండి , ఇక్కడికి వచ్చి పోయేవారు స్టార్ క్యాంపెనర్ అంటూ… మిమ్మల్నే నమ్ముకున్నా.. మీరే స్టార్ క్యాంపెనర్అంటూ.. విలువలు లేని కబుర్లు‌. షర్మిల వలన ఎవరికి నష్టం అనేది హాట్ టాపిక్.

ముందుగా ఓటర్ల రకాలు చూస్తే.. పార్టీ సంస్థాగత ఓటర్లు, ప్రభుత్వ అనుకూల ఓటర్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు, అమ్ముడుపోయే ఓటర్లు, తటస్థ ఓటర్లు & ట్రెండ్ ఓటర్లు,

టిడిపి వైకాపా (గతంలో కాంగ్రెస్) కుల & విధానాల పరంగా పార్టీ సంస్థాగత ఓటర్లు ఇరు పార్టీలకు 30% ఉన్నారు. పార్టీ విధానాలతో సంబంధం లేకుండా ఎంత ప్రలోభ పెట్టినా వీరు ఆ పార్టీలకే ఓటు వేస్తారు. బానిస ఓటర్లు అనొచ్చు.

అధికార పార్టీ విధానాలు పథకాలు వలన లబ్దిపొందిన వారు ప్రభుత్వ అనుకూల ఓటర్లు. అధికార పార్టీ విధానాలు/ చెప్పినవి చేయకపోవడం వలన నష్టపోయిన నిరాశపడినవ వారు ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు. చివరి రోజున ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికి ఓటు వేసే వారు అమ్ముడుపోయే ఓటర్లు
ప్రధాన పార్టీల మంచి చెడులు చూసి రాష్ట్ర ప్రయోజన కోణంలో ఓటు వేసే వారు తటస్థ ఓటర్లు
ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని భావిస్తే ఆ పార్టీ వైపు మొగ్గు చూపే ఓటర్లు ట్రెండ్ ఓటర్లు

ప్రస్తుతం జగన్ సర్కార్ పాలనలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు 85% కుటుంబాలే ప్రభుత్వ అనుకూల ఓటర్లు అని పంచిన నగదే తమ బలం అని వైకాపా అంచనా.

సంక్షేమ పథకం అందుకున్న ప్రతి కుటుంబంలో, బాధిత వర్గాలు ఆశించి నిరాశ పడిన వర్గాలుగా ఉన్న వారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు కాబట్టి.. అదే సమయంలో గతం కన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తాం అన్నారు కాబట్టి కలిసొస్తుంది అనేది టిడిపి అంచనా.

షర్మిల ప్రసంగం వాడిగా వేడిగా ఉంది. నాడు అన్న ప్రతిపక్షం పై ఎక్కుపెట్టిన బాణం.. నేడు ప్రతిపక్షానికి ఆయుధం అయింది. ఒక్కో మాట నిప్పు కణిక. అభివృద్ధి ఇచ్చిన మేనిఫెస్టో హామీలు వైఎస్ ఆశయాలు.. భాజపాతో అంతర్గత పొత్తు, హోదా విభజన హామీలు, దళితులపై దాడులు నమ్మిన వారిని మోసం వంచన వగైరా వంటి అంశాలు.. షర్మిల మాటలు. వాస్తవానికి ఇవి కొత్తవి కాదు. గత నాలుగేళ్లుగా ప్రతిపక్షం చెబుతున్న మాటలు అయితే షర్మిల వలన ఆ Impact ఉంటుంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక వలన లేదా జగన్ వ్యతిరేక విధానాల వలన టిడిపికి ఓటు వేయాలి అనుకునే వారు కొందరు, షర్మిలకు వేయడం వలన టిడిపికి నష్టం జరిగే అవకాశం ఉంది అని కొందరి వాదన.‌ షర్మిల ప్రధానంగా సంక్షేమం వైఎస్ ఆశయాలు దళితులు మైనారిటీలు అనే అంశాలపై ఫోకస్ ఎక్కువ కనపడుతోంది. వీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు కాదు. జగన్ అనుకూల ఓటర్లు. కాస్తో ఇస్తిష్కో షర్మిల మాటలతో ఓటర్లుగా మారితే అది వైకాపాకు నష్టం.

గతంలో పవన్ వలన టిడిపికి నష్టం జరిగినట్లే… ఈసారి షర్మిల వలన జగన్ కి నష్టం కలిగే అవకాశం ఎక్కువ. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికార పార్టీకి లబ్ది అనే సూత్రం పనిచేయడం లేదు. వ్యతిరేక ఓటు consolidate అవుతోంది. ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంటే, ఆ అధికార పార్టీని ఓడించే పార్టీ వైపు జనం మొగ్గుచూపుతున్నారు.

ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లుగా ఉన్న బాధిత నిరాశపడిన వర్గాల వారు, తమకు న్యాయం జరగాలి అంటే..గెలిచే పార్టీ వైపు ఉంటారు కనుక టిడిపికి పెద్దగా నష్టం ఉండదు.‌

తెలంగాణ ఎన్నికలకు ముందుగానే లేదా ఏడాది క్రితం షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఉంటే.. షర్మిల వాగ్దాటి వలన రాష్ట్రంలో కచ్చితంగా భారీగా పుంజుకునే అవకాశం ఉండేది. అయితే కాంగ్రెస్ లక్ష్యం ఈ ఎన్నికలు కాదు. వైకాపాను ఓడిస్తే ఆ ఓట్లు తదుపరి ఎన్నికలలో బదిలీ అయ్యేది తమ పార్టీకే గనుక.. ఏ రకంగా అయినా వైకాపాను ఓడించాలి అనేది కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం. ఆ దిశగా రేవంత్ రెడ్డి సంకేతాలు కూడా పంపారు. వైకాపాలో ఉన్నా ఓడిపోతాం అనుకున్నవారు కాంగ్రెస్ వైపు వెళ్లి, కాంగ్రెస్ లో తమ స్థానం పదిలం చేసుకునే ఆలోచన కూడా కొందరు చేస్తున్నారు ఈ సంఖ్య ఎంత అనేది వచ్చే నెలలో తెలుస్తుంది.‌

షర్మిల వలన రాయలసీమలో ప్రత్యేకించి రెడ్డి ప్రాబల్యం ఉన్న జిల్లాలలో దళిత రెడ్డి ముస్లిం క్రిస్టియన్ ఓట్లను , షర్మిల కాస్తో ఇస్తిష్కో చీల్చగలిగితే టిడిపికి అవకాశాలు మెరుగవుతాయి.

ఇపుడు రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ షర్మిల. గత ఎన్నికల్లో అన్న వదిలిన బాణం రివర్స్ లో అన్నవైపు దూసుకు వచ్చింది. నిప్పులు మాత్రమే అయితే నీటి బాణం ఎక్కుపెట్టి ఆర్పవచ్చు. కానీ సుదర్శన చక్రం తరహా , ఫ్యాన్ కి మించిన స్పీడుతో రాష్ట్రమంతటా గిరాగిరా తిరుగుతోంది. వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఘాటైన విమర్శలు సంధిస్తుంటే, సమాధానం చెప్పుకోలేని వైకాపా శ్రేణులు.. చెల్లి అని కూడా చూడకుండా వ్యక్తిత్వహననానికి దిగడం, వారి నికృష్ట వైఖరిని జనంలో వేలెత్తి చూపిస్తోంది. జగన్ సర్కార్ ఏమీ చేయకే ఇలా ఉంటే కాస్తో ఇస్తిష్కో మంచి చేసి ఉంటే ఇంకెలా ఉండేవారో అనిపిస్తుంది.

– పిపిఎన్

Leave a Reply