వేల కోట్ల పెట్టుబడుల వెనుక ఉన్నది ఎవరు?

-షిరిడి సాయి కంపెనీకి సెంట్రల్ డిస్కం చైర్మన్ పద్మా జనార్దన్ రెడ్డి విపరీతంగా ఆర్డర్లు
-షిరిడి సాయి కంపెనీకి చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేసే సామర్థ్యం
-పార్టీ కార్యదర్శి శివ శంకర్ రెడ్డి వియ్యంకుడే పద్మా జనార్దన్ రెడ్డి
-పద్మా జనార్దన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక, శిరిడి సాయి కంపెనీకి ఇష్టారాజ్యంగా ఆర్డర్లు
-ముఖ్యమంత్రితో సన్నిత సంబంధాలు ఉండడం వల్లే, శిరిడి సాయి రెడ్డికి ఆర్డర్లు
-ఆ కంపెనీకి వేల కోట్ల పెట్టుబడుల సామర్థ్యం ఉందా?
-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రఘురామకృష్ణం రాజు

ఆంధ్ర ప్రదేశ్ లో షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ పెట్టనున్న వేలకోట్ల రూపాయల పెట్టుబడుల వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరని నర్సాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో 1,20,000 కోట్ల రూపాయల నూతన పెట్టుబడులతో పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. అందులో షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ పెట్టుబడులు ఎంత?, ఆ కంపెనీకి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఉందా? అని ప్రశ్నించారు.

ఆ పెట్టుబడులు ఎక్కడ నుండి వస్తున్నాయన్న రఘురామకృష్ణం రాజు, విదేశీ పెట్టుబడులైతే అర్థం చేసుకోవచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వైయస్సార్ జిల్లా పైడిపాలెం దగ్గర షిరిడి సాయి కంపెనీ 7200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టును 32 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇండో సోల్ అనే సంస్థ పేరిట ఏర్పాటు చేయనుందని తెలిపారు . ఈ ప్రాజెక్టును 2028 వరకు పూర్తి చేయనున్నట్లు, దీని ద్వారా 7200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నట్లు రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. నెల్లూరు జిల్లా రామాయంపట్నం దగ్గర ఇండో సోల్ కంపెనీ 5147 ఎకరాలలో పాలిసెలికాన్, మెటాలజికల్ గ్రేడ్ సిలికాన్, ఫ్లోట్ రోల్డ్ గ్లాసెస్ తయారీ సంస్థను 43 వేల 143 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనుందన్నారు.

ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా 11,500 మందికి ప్రత్యక్షంగా, మరో 11 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. షిరిడి సాయి కంపెనీ 76 వేల కోట్ల రూపాయలతో రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలంటే… బ్యాంకులు ఎంత అధిక మొత్తం రుణాన్ని మంజూరు చేసినా , ఈక్విటీలో 25% మొత్తం అంటే 21 నుంచి 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రమోటర్లు పెట్టుబడి గా పెట్టాలన్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని అంటున్నారని, ఆ పెట్టుబడులు పెట్టేది సూట్ కేస్ కంపెనీలా? అని ప్రశ్నించిన ఆయన, దీనికి కాలమే సమాధానం చెబుతుందన్నారు .

రెడ్డి గారి ప్రభుత్వంలో మరొక రెడ్డి పెట్టుబడులు పెట్టడం అభినందనీయం అంటూనే, తాను కులాన్ని ఉద్దేశించి మాట్లాడడం లేదని స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా ఆవుకు, అనంతపురం జిల్లా శింగనమల లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు ప్రాజెక్టులను 6315 కోట్ల రూపాయలతో అరబిందో రియాల్టీ ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈ కంపెనీ కే కాకినాడ పోర్ట్, ఎస్ ఈ జెడ్, 108, 104 వాహనాల నిర్వహణతో పాటు, అంబులెన్స్ల నిర్వహణ బాధ్యత లను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడం జరిగిందన్నారు. ఇదే కంపెనీ కార్యాలయంలో అడాన్ డిస్టలరీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ ఎస్ ఈ జెడ్ లో లైఫ్ ఏజ్ ఫార్మా సంస్థను ఏర్పాటు చేస్తున్నారన్నారు.

విశాఖపట్నంలో ఎన్నో భూములను తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి ప్రమేయం లేకుండానే, వారే కొనుగోలు చేశారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న వారు, గతం లో ఎన్నో ఆర్థిక నేరాల కేసుల్లో ఏ 2 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి బంధువు కాగా , మరొకరు ఏ 1 నిందితుడి గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వ్యక్తి అని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలో ఇతరులు ఎవరు పెట్టుబడులు పెట్టడం లేదని, తమ వాళ్ల చేతనే ముఖ్యమంత్రి, తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి పెట్టుబడులు పెట్టిస్తున్నందుకు ఆనందించాలన్నారు.

మా ప్రభుత్వం రాకముందు ఆ కంపెనీకి ఇచ్చిన ఆర్డర్లు ఎన్ని?
కడప కు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి తమ జగనన్న ప్రభుత్వం రాకముందు ఇచ్చిన ఆర్డర్లు ఎన్ని, ప్రస్తుతం ఇస్తున్న ఆర్డర్లు ఎన్ని అని రఘురామకృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు. షిరిడి సాయి కంపెనీకి సెంట్రల్ డిస్కం చైర్మన్ పద్మా జనార్దన్ రెడ్డి విపరీతంగా ఆర్డర్లు ఇచ్చారన్నారు. షిరిడి సాయి కంపెనీకి చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లను సరఫరా చేసే సామర్థ్యం మాత్రమే ఉన్నదన్నారు. అయితే ప్రస్తుతం వ్యవసాయ మోటార్లకు బిగించనున్న స్మార్ట్ మీటర్ల సరఫరా కాంట్రాక్టును షిరిడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి అప్పగించారన్నారు.

స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు, ఐదేళ్ల నిర్వహణ కోసమని 35 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ మోటార్ మీటరుకు మహా అయితే ఐదువేల రూపాయలు ఖర్చు అవుతుందని , ఏడాదికి, ఏడాదికి కొత్త మీటర్ బిగించుకున్న 35 వేల రూపాయలు ఖర్చు కాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల కోసం అమలు చేస్తున్న ధరను, పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక లతో పోల్చి చూస్తే, అసలు విషయం వెలుగులోకి వస్తుందన్నారు.

ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ వింగ్ నుంచి సెంట్రల్ డిస్కం చైర్మన్ నియామకమా?
విద్యుత్ రంగంలో ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ విభాగం ఒకటి ఉంటుందని, ఈ విభాగం హెచ్ డి ట్రాన్స్ ఫార్మర్ ల ప్రమాదాల పై అధ్యయనం చేస్తుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ లో పనిచేసేవారిని, సాధారణంగా డిస్కములలోకి తీసుకోరన్నారు. అయితే మా జగనన్న ప్రభుత్వం మాత్రం ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్న పద్మా జనార్దన్ రెడ్డిని, సెంట్రల్ డిస్కం చైర్మన్ గా నియమించిందన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో ఏ 5 నిందితుడి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు లో ఉన్న తమ పార్టీ కార్యదర్శి శివ శంకర్ రెడ్డి వియ్యంకుడే, ఈ పద్మా జనార్దన్ రెడ్డి తెలిపారు. సెంట్రల్ డిస్కం చైర్మన్ గా పద్మా జనార్దన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక, శిరిడి సాయి కంపెనీకి ఇష్టారాజ్యంగా ఆర్డర్లు ఇచ్చారని తెలిపారు. తమ ప్రభుత్వం రాకముందు ఈ కంపెనీకి ఎన్ని ఆర్డర్లు ఇచ్చారో, ప్రస్తుతం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని ఆర్డర్లు ఇచ్చారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రితో సన్నిత సంబంధాలు ఉండడం వల్లే, శిరిడి సాయి రెడ్డికి ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు.

భూమి నొక్కుడు పథకంగా… జగనన్న శాశ్వత భూహక్కు
భూమి నొక్కుడు పథకంగా జగనన్న శాశ్వత భూహక్కు కార్యక్రమం మారిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . తనకున్న పబ్లిసిటీ పిచ్చితో ప్రజలపై ఈ కార్యక్రమాన్ని రుద్దారన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు పథకంలో భాగంగా పాసుపుస్తకాలపై ముందు వెనక పేజీ లతో పాటు, లోపలి పేజీ లలో నూ జగన్మోహన్ రెడ్డి తన ఫోటోను ముద్రించుకుంటున్నారని అన్నారు . జగనన్న శాశ్వత భూహక్కు పథకంలో భాగంగా పాస్ పుస్తకాలు ప్రజల చేతికిందాక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, ఈ పథకం రద్దు అవుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం మారినా ఈ పథకాన్ని రద్దు చేస్తుందని చెప్పారు. అయితే ఈ సంధి కాలంలోనే జగనన్న శాశ్వత భూహక్కు పథకంలో భాగంగా భూ యజమానుల తలరాతలు మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముదినేపల్లి లో మాజీ మంత్రి ఎర్నినేని సీతాదేవి కుటుంబ సభ్యులకు చెందిన 32 ఎకరాల భూమిని, జగనన్న శాశ్వత భూహక్కు పథకంలో భాగంగా ఇతరులకు హక్కులు కల్పిస్తూ పాసుబుక్ మంజూరు చేయడం జరిగిందన్నారు. తరతరాలుగా వారి కుటుంబమే సేద్యం చేసుకుంటున్న 32 ఎకరాల భూమిని, కేవలం 11 సెంట్లు ఉన్నట్లుగానే జగనన్న శాశ్వత భూహక్కు పథకంలో నమోదయిందని ఎర్నినేని సీతాదేవి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారన్నారు . టిడిపికి చెందిన వారికి ఇలా ఎందుకు జరిగిందని ఆయన ప్రశ్నించారు. తస్మదీయుల ఆస్తులను, అస్మదీయులకు కట్టబెట్టడానికి జగనన్న శాశ్వత భూహక్కు కార్యక్రమాన్ని తీసుకు వచ్చారా? అంటూ నిలదీశారు. ఇతరులకు చెందిన భూ హక్కులను తమకు కల్పించగానే, వారు విక్రయించుకొని సొమ్ము చేసుకుంటే ఎవరిని ప్రశ్నించాలన్నారు. బాధితుడు ఎన్ని పిటిషన్లు దాఖలు చేసిన ప్రయోజనం ఏముంటుందని నిలదీశారు. ముదినేపల్లి ఒక్క గ్రామంలోనే కాకుండా రాష్ట్రంలోని ఎన్ని గ్రామాలలో ఇలా జరుగుతుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంతగా బరితెగించి మాట్లాడుతారా?
స్త్రీ ఔన్నత్యాన్ని దిగజార్చేలా అసభ్యంగా, బరితెగించి మాట్లాడుతున్న మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మీ రెడ్డికి మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు ఇవ్వగలరా అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ చైర్మన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే నని గుర్తు చేశారు. న్యాయబద్ధంగా పరిష్కరించుకున్న సమస్యపై పదే పదే మాట్లాడుతున్న వ్యక్తులకు చెప్పు చూపించినందుకే పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసిన వాసిరెడ్డి పద్మ, తన కమిటీలో సభ్యురాలు అయిన గజ్జల లక్ష్మికి నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గజ్జల లక్ష్మీ రెడ్డి చేసిన ఒక ట్వీట్ ను మీడియా కు ముందు ప్రదర్శించారు. ఒకప్పటి తమ పార్టీ సోషల్ మీడియా సభ్యురాలు అయిన లక్ష్మీ రెడ్డి ఒక మహిళ గురించి, దిగజారుడు మాటలు మాట్లాడవచ్చా? అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని సూచించారు. తిట్ల పరీక్షలో ఫస్ట్ క్లాసులో బెస్ట్ గా నిలిచిన గజ్జల లక్ష్మీ రెడ్డికి మహిళా కమిషన్ సభ్యురాలిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగిందని ఎద్దేవా చేశారు. స్త్రీ ఔన్నత్యాన్ని దిగజార్చే విధంగా మాట్లాడిన గజ్జల లక్ష్మీ రెడ్డి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు , ప్రత్యేకించి ఆంధ్ర మహిళలు సహిస్తారా అంటూ ప్రశ్నించారు. మహిళా ఔన్నత్యాన్ని దిగజార్చే విధంగా మాట్లాడిన వారిని ఏమి చేద్దామన్నది ఆంధ్ర మహిళలు ఆలోచించాలని సూచించారు. ఎన్నికలకు ముందు డబ్బులు ఇవ్వవచ్చు కానీ విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

మీరు చెప్పకుండానే సుమోటో గా పోలీసులు కేసులు పెడుతున్నారా?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పకుండానే తనపై పెట్టినట్లుగా సిఐడి పోలీసులు సుమోటో గా కేసులు పెడుతున్నారా? అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని చెప్పుతో కొట్టాలని, తుపాకితో కాల్చాలని వ్యాఖ్యానించిన కేసులు పెట్టలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పై ఎవరైనా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే, దాన్ని ఫార్వర్డ్ చేస్తే చాలు వయోభేదం లేకుండా వారిపై కేసులు పెడుతున్నారన్నారు .
ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శోకతప్త, విషాద వదనంతో ఇటువంటి వారా… మన నాయకులు, ఇలాంటి వ్యవస్థను చూస్తే బాధ అనిపిస్తుంది, జాలేస్తుందనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరిని మోసం చేయడానికి ఈ అభినయం అంటూ విరుచుక పడ్డారు .

Leave a Reply