– నిబంధనలు విస్మరించిన గుత్తేదారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి
– జిల్లా అభివృద్ధికి అధికారుల చొరవ అవసరం
– బాపట్ల జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఇన్చార్జి మంత్రి కొలుసు పార్ధసారథి
బాపట్ల: ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా జిల్లాను అభివృద్ధి చేయడానికి అధికారులంతా ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. సమావేశానికి వచ్చిన మంత్రులకు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఘనంగా ఆహ్వానం పలికారు. సమావేశానంతరం ముగ్గురు మంత్రులు డిఆర్సి సమావేశంపై సంక్షిప్తంగా మీడియాతో మాట్లాడారు.
స్వర్ణాంధ్ర ప్రదేశ్-2017 నిర్దేశించిన లక్ష్యాలు సాధించడానికి అధికారులు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే బాధ్యత అధికారులపై ఉందన్నారు.
గుంతలు పూడ్చే కార్యక్రమంలో జాప్యంపై పలువురు ప్రజా ప్రతినిధులు ఆర్ అండ్ బి అధికారులను ప్రశ్నించారు. నిధులు ఇస్తున్నప్పటికీ ఎందుకు పనిచేయడం లేదని నిలదీశారు. నేటికీ పనులు ప్రారంభించక పోతే రద్దు చేయాలని, నిబంధనలు విస్మరించిన గుత్తేదారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గుత్తేదారులు సరిగా చేయకపోతే ఇంజినీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారన్నారని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు శ్రద్ధతో పని చేస్తేనే పురోగతి ఉంటుందన్నారు. 92 ఎత్తిపోతల పథకాల కింద 1.07 లక్షల ఎకరాలు పంటలు సాగు అవుతుండగా, 67 పథకాలు మాత్రమే పని చేస్తున్నాయన్నారు.
వందరోజుల పని దినాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రూ.110 కోట్లతో బాపట్లలో ఉపాధి పనులు జరుగుతుండగా, రూ.31 కోట్ల పనులు మిగలడంపై అసహనం వ్యక్తం చేశారు. సూర్యలంక, చీరాల బీచ్ అభివృద్ధిపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని జిల్లా ఇంచార్జి మంత్రి పార్థసారథి చెప్పారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97 కోట్లతో డిపిఆర్ సిద్ధం చేసి కేంద్రానికి నివేదించామన్నారు. సర్వీస్ సెక్టార్లు పెరిగితే ఉపాధి అవకాశాలు, ఆదాయం వృద్ధి అవుతోందన్నారు. ఇందుకోసం రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించేలా సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
విద్యుత్ సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సూర్య ఘర్ పథకం కింద 334 యూనిట్లు ఏర్పాటు చేశామని, మరింత విస్తరింప చేయడానికి బ్యాంకులు సహకరించాలన్నారు. అద్దంకి నియోజక వర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటూమన్నారు. దెబ్బతిన్న పాత స్తంభాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. పొలాలలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు అరికట్టడానికి, రాగి కొనుగోలు చేసే వ్యక్తులను పట్టుకోవాలన్నారు. సాగు కాల్వల పెండింగ్ బిల్లులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కొరిశపాడు ఎత్తిపోతల పథకం భూసేకరణ పూర్తి చేయాలని, సమీక్షలో చర్చించిన అంశాలపై అధికారులు పనిచేస్తేనే ఫలితం ఉంటుందన్నారు.
బల్లికురవ మండలంలోని కొనిదెన, తదితర నాలుగు గ్రామపంచాయతీలలో ఏడు నెలలుగా పనులు చేయకపోవడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. సర్పంచులను సంప్రదించి పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద నిర్మించే తొమ్మిది అడుగుల సిసి రోడ్లతో ఇబ్బందిగా ఉందని, 15 అడుగులకు పెంచి నిర్మించాలన్నారు. బాపట్ల మండలం చింతగుంపల గ్రామంలో 80 స్తంభాలు నూతనంగా వేయాలని ఆదేశించారు.
సాగునీటి కాల్వల మరమ్మతు పనులు అత్యవసరంగా చేపట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. వెల్లటూరు కాల్వ పనులలో జాప్యం చేయరాదన్నారు. రేపల్లె నియోజకవర్గంలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలు చేయాలన్నారు. ఇటీవల జరిగిన తనిఖీలలో దస్త్రాలు చూపకుండా పలుమార్లు ఇబ్బందులు పెడుతున్న వ్యక్తులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. రేపల్లె రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమం నాణ్యతలో పించిందన్నారు. టైల్స్ ముక్కలు వేసి గుంతల పూడ్చడం ద్వారా ప్రమాదం జరిగి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా పనిచేస్తే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారన్నారు. బాధ్యతగా పనిచేయండి, విధుల పట్ల శ్రద్ధ చూపాలని హెచ్చరించారు.
బాపట్ల కు వైద్య కళాశాల నిర్మాణానికి మూడో విడతలో నిధులు విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటి నీరు సరఫరా చేయడానికి రూ.3,500 కోట్లతో డిపిఆర్ పంపామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. సాగు కాలువల ఆక్రమణ అరికట్టాలని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ మంత్రిని కోరారు.
లంక గ్రామాలలో తాడిగిరి పాలెం, పోతుర్లంక ఎత్తిపోతల పథకలు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మంత్రిని కోరారు. వివిధ పనులకు సంబంధించిన బిల్లులు నిలిచాయని, నిధుల విడుదలకు మండల స్థాయి అధికారులు పట్టించు కోవడం లేదని మంత్రి దృష్టికి తెచ్చారు.
పర్చూరు నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలు నిర్వహణ అధ్వానంగా ఉందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు చెప్పారు. చీరాల నియోజకవర్గం ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి ఉందని, మరమ్మతు పనులు వేగంగా చేపట్టాలని చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్య మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవిన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.