కృష్ణా జలాల వినియోగం పున:సమీక్షతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరెత్తడం లేదు?
• 2016లో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జలదీక్షలు చేసిన జగన్..ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి మౌనంగా ఉండటం ఎవరి ప్రయోజనాల కోసం?
• రాష్ట్రాన్ని ఎడారి చేసే నీటి సమస్య..నీటి కేటాయింపులపై జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం నిజంగా ఏపీకి శాపం కాదా?
• కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచినా, అప్పర్ భద్ర.. లోయర్ భద్ర , సింగూరు ప్రాజెక్టుల నిర్మాణం తలపెట్టినా జగన్ ఎందుకు నోరెత్తలేదు?
• నవంబర్ 22, 23 తేదీల్లో బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట కృష్ణాజలాల కేటాయింపులకు సంబంధించి జరిగే విచారణలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారా..లేదా?
• నదీ జలాల సమస్యను.. నీటి వివాదాలను రాజకీయం చేయడం, స్వప్రయోజనాలకోసం రాష్ట్ర, రైతుల ప్రయోజనాల్ని పాలకులు గాలికి వదిలేయడాన్ని టీడీపీ ఎంతమాత్రం సహించదు.
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్
తెలుగునేలకు ప్రాణాధారమైన కృష్ణానది నేడు ఆంధ్రప్రదేశ్ పాలకుల నిర్లక్ష్యవైఖరితో ప్రాభవం కోల్పోయిందని, పట్టించుకోవాల్సిన వారే అచేతనావస్థలో ఉండటంతో కృష్ణ మ్మ వెలవెలబోయిందని, ఏపీ, తెలంగాణకు గతంలో కేటాయించిన కృష్ణా నదీ జలాల వినియోగాన్ని పున: పరిశీలించాలని తాజాగా కేంద్రప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యున ల్ ను ఆదేశించినా, ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం బాధాకర మని టీడీపీ అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. మంగళగరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
సుప్రీంకోర్టుతో సంబంధం లేకుండా ఏపీ – తెలంగాణ నీటి కేటాయింపుల సమస్యను బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎలా పరిష్కరిస్తుంది.. సమన్యాయం పాటించాల్సిన కేంద్రం ఆ దిశగా ఎలా ఆదేశాలిచ్చింది?
“ అంతరాష్ట్ర నదీజలాల వివాద పరిష్కార చట్టం -1956లోని, సెక్షన్ 3, 5(1), 12 ల ప్రకారంఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీల కృష్ణాజలాల కేటాయింపు లపై, గోదావరి జలాలకు సంబంధించిన అదనపు నీటి మళ్లింపుపై సమీక్ష జరిపి, వాటిని పంపిణీ లేదా కేటాయింపు చేయాలని కేంద్రప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ను గత నెలలో ఆదేశించింది. 2013లో రాష్ట్రానికి జరిగిన నీటి కేటాయింపుల్లోనే ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని గతంలోనే మన రాష్ట్రం తరుపున ట్రైబ్యునళ్ల ఎదుట వాదనలు వినిపించడం.. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు వేయడం జరిగింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూడా నీటికేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ మరో స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టులో వేసింది.
నదీజలాల చట్టం -1956లోని సెక్షన్ 5 (2) ఆ ట్రైబ్యునల్ నివేదికను పక్కనపెట్టాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా గతంలో సుప్రీంకోర్టును అభ్యర్థించింది. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ నీటి కేటాయింపులకు సంబంధించిన అవార్డు అమలైతే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, ముఖ్యంగా ఏపీలోని రాయలసీమ, ప్రకాశంజిల్లాలోని కొన్నిప్రాంతాలు ఎడారిగా మారే అవకాశముందని చెప్పడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు తాత్కాలికంగా జరిపిన కృష్ణా జలాల కేటాయింపులపై పున:సమీక్ష చేయాలని తెలంగాణ కూడా ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది.
కర్ణాటక, మహారాష్ట్రలు కూడా పిటిషన్లు వేశాయి. మొత్తంగా 5 స్పెషల్ లీవు పిటిషన్లపై బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కు విచారణపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉంది. అత్యున్నత న్యాయస్థానంలో వివాదం అపరిష్కృతంగా ఉండగానే కేంద్రప్రభుత్వం, బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కేవలం తెలంగాణ, ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణాజలాలపైనే సమీక్ష చేయాలని చెప్పడం దేనిలో భాగమనుకోవాలి?
సమన్యాయం పాటించాల్సిన కేంద్రప్రభుత్వం ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. 2013లో తెలంగాణ-ఏపీ నీటికేటాయింపులపై బచావత్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టుతో సంబంధంలేకుండా ఎలా మారుస్తారని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాం?
బచావత్ ట్రైబ్యునల్ నీటి కేటాయింపులపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ల విషయం తేలకుండానే కేంద్రం కొత్తగా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కు నీటికేటాయింపులపై సమీక్ష చేసే అధికారం కట్టబెట్టడం ఎంతమాత్రం చట్టబద్ధం కాదు. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ అభిప్రాయపడుతున్నట్టుగా ఉమ్మడి ఏపీకి కృష్ణా బేసిన్ నుంచి ఎప్పుడూ 2,578 టీఎంసీలు కాదుకదా..దానిలో సగం నీరు కూడా అదనంగా పై ప్రాంతాల నుంచి రాలేదు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టులన్నీ ప్రధానంగా మిగులు జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన మిగులు జలాల్లో కూడా తెలంగాణకు వాటా ఇవ్వాలని చెప్పడం నిజంగా బాధాకరం. మిగులుజలాలపై ఏపీకి ఉన్నహక్కులు మొత్తం హరించేలా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ వ్యవహరిస్తోంది.
గతంలో తెలంగాణ భూభాగం మీదుగా కృష్ణాజలాలు ఏపీకి తీసుకొస్తానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి.. నేడు కృష్ణాజలాల్లో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు నోరెత్తడం లేదు?
కృష్ణాజలాలపై ఏపీకి ఉన్న వాటాపై గట్టిగా నిలదీయాల్సిన పాలకులు మిన్నకుం డిపోయారు. కేవలం మొక్కుబడిగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి వైసీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. గతంలో జలదీక్షలు చేసిన జగన్మోహన్ రెడ్డి, నేడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. రాష్ట్రప్రయోజనాలకోసం అన్నిరాజకీయపార్టీలు.. రైతులు.. రైతుసంఘాలు.. ప్రజాసంఘాలతో చర్చలు జరిపి, రాష్ట్రప్రయోజనాల పరిరక్షణ కోసం ఎలా ముందుకెళ్లాలనే దిశగా ఎందుకు ఆలోచించడం లేదు?
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ – తెలంగాణకు కేటాయించిన నీటి కేటాయింపులపై పున:సమీక్ష చేయాలని కేంద్రమిచ్చిన ఆదేశాలను జగన్ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకించాలి. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు పూర్తిగా అమల్లోకి రాకముందే మహారాష్ట్ర 90 టీఎంసీల కృష్ణానీటిని, కర్ణాటక 300టీఎంసీలు వాడుకునేలా చేపట్టి ప్రాజెక్టుల విషయాన్ని కూడా ఏపీ లేవనెత్తాలి. నవంబర్ 22, 23 తేదీల్లో బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు జరగనున్నాయి. ఆ వాదనల్ల్లో ఏపీ గొంతు సమర్థవంతంగా వినిపించకపోతే అంతిమంగా నష్టపోయేది రాష్ట్రమే. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట సరైన వాదనలు వినిపించకుండా రాష్ట్రప్రయోజనాలు దెబ్బతీసింది.
అధికారానికి వచ్చిన కొత్తల్లో కేసీఆర్ తో అంటకాగి.. తెలంగాణ భూభాగం మీదుగా ఏపీకి కృష్ణాజలాలు తీసుకొస్తామని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు జరుగుతున్న పరిణా మాలపై ఎందుకు నోరెత్తడు? కేసీఆర్ చెప్పాడనే జగన్ పోలవరంఎత్తు తగ్గించడానికి కూడా సిద్ధమయ్యాడు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తుని 514 నుంచి 524 అడుగులకు పెంచడానికి అనుమతులు ఇచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు. నాలుగేళ్లలో ఏనాడూ వైసీపీ ప్రభుత్వం.. జగన్ ఏనాడూ నీటి కేటాయింపులు.. నీటినిల్వలపై దృష్టిపెట్టింది లేదు.
తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్ లను కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. అప్పర్ తుంగ..అప్పర్ భద్ర..సింగటూరు ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి, మరీ ముఖ్యంగా రాయసీమకు జరిగే నష్టం జగన్ కు కనిపించడం లేదా? రాష్ట్రంలోని కరువు మండలాలు కూడా సక్రమంగా గుర్తించలేని ఈ ముఖ్యమంత్రి.. రాబోయే కరువుని ముందే పసిగట్టి…రైతాంగాన్ని కాపాడలేని ఈ అసమర్థ ముఖ్యమంత్రి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాలు సాధిస్తాడా?
ఏపీ – తెలంగాణకు చెందిన కృష్ణజలాలపై పున:సమీక్ష చేయాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం పూర్తిగా అసంబద్ధం జగన్ స్వప్రయోజనాలకోసం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన కృష్ణాజలాలను వదిలేస్తానంటే టీడీపీ చూస్తూ ఊరుకోదు
ఏపీ తెలంగాణ రాష్ట్రాలకే కేటాయించిన కృష్ణజలాలపై పున:సమీక్ష చేయాలని కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయమే అసంబద్ధం.అంతరాష్ట్ర నదీజలాల వివాద చట్టం ప్రకారం నదీ జలాల కేటాయింపులపై సమీక్ష చేసే అధికారాన్ని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కు కట్టబెట్టడమే చట్టవిరుద్ధం. అంతరాష్ట్ర నదీజలాల వివాదపరిష్కార చట్టం 1956ను కేంద్ర ప్రభుత్వం 2002లో సవరించింది. సవరించిన చట్టంలోని సెక్షన్ -4, ఆర్టికల్ 2 ప్రకారం 2002కు ముందున్న నదీజలాల అవార్డ్స్ ను కొత్తగా వచ్చే ట్రైబ్యు నల్స్ సమీక్ష చేయకూడదనే నిబంధన ఉంది.
బచావత్ ట్రైబ్యునల్ నీటి కేటాయిం పులకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలు సుప్రీంకోర్టు డిక్రితో సమానమైనవి. అలాంటి ఆదేశాలపై సమీక్ష చేసే అధికారం బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కు లేదు. పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణాడెల్టాకు తరలించే గోదావరి నీటిలో వాటా అడుగుతున్న తెలంగాణ … కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 213 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాబేసిన్ లో కలుపుతున్నప్పుడు ఆ నీటిలో కూడా ఏపీకి వాటా ఇవ్వాలిగా! ఈ వాదనను బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట కేంద్రం ఎందుకు ఉంచలేదు? గోదావరి-కృష్ణా జలాల్లోనే పనిగట్టుకొని ఏపీకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు?
జగన్ సర్కార్ ఇతరపార్టీలను కలుపుకొని నీటి వివాదాలపై కేంద్రప్రభుత్వంతో ఎందుకు సంప్రదింపు లు జరపడం లేదు? నేడు జగన్ అధికారంలో ఉండొచ్చు..రేపు మరొకరు ఉండొచ్చు.. కానీ రాష్ట్రానికి అన్యాయం చేయడం..భవిష్యత్ తరాలకు తీరని ద్రోహం చేయడం.. రైతాంగాన్ని వంచించడం ఎంతమాత్రం సరైన విధానం కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోఉన్నా.. ప్రతిపక్షంలోఉన్నా ఎప్పుడూ ప్రజలకోసం..రాష్టప్రయోజనాల కోసమే పోరాడింది. జగన్మోహన్ రెడ్డి కృష్ణాజలాలపై రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే టీడీపీ చూస్తూ ఊరుకోదు” అని విజయ్ కుమార్ స్పష్టం చేశారు.