– రైతుల ఆత్మహత్యలు నివారించలేమా ?
రైతులు, రైతుకూలీల ఆత్మహత్యల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర 4064 బలవన్మరణాలు మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాలతో 1065 ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, 889 ఆత్మహత్యలతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి. రైతు సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు, రైతులకు లక్షల కోట్ల హామీలు గుప్పించారు, వ్యవసాయాన్ని పండుగలా మారుస్తాం, రైతులు సంతోషంగా ఉండేట్లు చూస్తాము అని ఉత్తర ప్రగల్భాలు పలుగుతున్నారు.
రైతు సమస్యలను ఏ మాత్రం పట్టించుకోలేదు. గత్యంతరం లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వందలాది రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. రైతు చనిపోతే రూ. 7 లక్షలు అన్న జగన్ గారు రైతు బతికుండగా ఎందుకు పట్టించుకోరు? గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉంటున్నాయి. వాటిని నివారించేందుకే తెలంగాణ లో 2018 కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పథకం ప్రవేశపెట్టింది. 2019 లో ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా పథకం ప్రవేశపెట్టింది.
ప్రభుత్వ చర్యల కారణంగానే గత ఏడాది రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలంగాణ మంత్రులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా పథకాలు, సాగు నీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడం, సకాలంలో విత్తనాల సరఫరా, మద్దతు ధరకే పంటలను కొనుగోలు చేయడం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించని కారణంగా రైతుల ఆత్మహత్యలు తగ్గాయి.
ఆంధ్రప్రదేశ్ లో రైతుకు ప్రతికూల పరిస్థితి కొనసాగుతోంది. గత నాలుగు సంవత్సరాలుగా సూక్ష్మ బిందు సేద్యానికి, డ్రిప్, స్ప్రింక్లర్, మల్చింగ్ షీట్ ఇతర ఉపకరణలకు నయాపైసా కేటాయించలేదు. దీనికి తోడు కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక పథకాలకు మద్దతు తెలుపుతున్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగిస్తున్నారు. భూమి లేని కౌలు రైతులకు, ఆదివాసీ ప్రాంతాల రైతులకు రైతు బంధు, రైతు బీమా అమలు కావడం లేదు.
మహిళా రైతులను రైతులుగా గుర్తించడం లేదు. కౌలు రైతులను, పోడు రైతులను గుర్తించి వారికి రైతుబంధు రైతు భరోసా ఇవ్వగలిగి, బీమా పథకం వర్తింపజేస్తే రైతు ఆత్మహత్యలు మరింత తగ్గుతాయని కన్నెగంటి రవి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ కూలీలకు సమగ్ర సాంఘిక సంక్షేమ పథకం అమలు చేయాలి. ఈ కుటుంబాలకు కూడా బీమా పథకం అమలు చేయాలి. నూతన ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగం మూలాధారం. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, అభివృద్ధిలో పెట్టుబడులు పెంచడం, వ్యవసాయ విస్తరణకు ఆ వ్యవస్థ బలోపేతం చేయడం, పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం, నిల్వ సామర్థ్యం పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి.
రైతు మెరుగైన జీవితం గడపడానికి అవసరమైన ద్రవ్యాన్ని ఇచ్చేదీ గిట్టుబాటు ధర కానీ మార్కెట్లో ధరలు పడి పోయి రైతు తీవ్రంగా నష్టపోతే పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు కొంత సహాయం లేదా వెసులుబాటు కల్పించే నిమిత్తం మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఇది గిట్టుబాటు ధర కాదు. రైతులు గిట్టుబాటు ధర కోరుతున్నా ఇచ్చేది లేదా ప్రకటించేది కనీస మద్దతు ధర మాత్రమే. కనీస మద్దతు ధర కనీసంగానే నిర్ణయిస్తుంది. దీనివల్ల రైతులకు లాభం చేకూరడం లేదు. ప్రజలకు ఆహారాన్ని అందించడానికి రైతు శ్రమ పడుతున్నారు.
రైతు శ్రమను, రిస్క్‌ను ప్రభుత్వం, సమాజం గుర్తించాలి. వ్యవసాయం రైతుకు గిట్టుబాటు కావాలి. అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇస్తున్నారు. దేశంలో అన్ని రకాలుగా వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతులు అష్టకష్టాలు పడుతున్న వారిని అన్ని రంగాల్లోనూ సంపూర్ణంగా ఆదుకోవడానికి ప్రభుత్వ విధానాలు, చట్టాలు సవరణలు చేయాల్సిన అవసరం ఉంది.వ్యవసాయ అభివృద్ధి రేటు పెరుగుతుందని అనుకున్నా అదే దామాషాలో రైతుల ఆదాయాలు పెరగలేదు.
ఉత్పత్తి పెరుగుదలకు అనుగుణమైన గిరాకీ ఉంటేనే వ్యవసాయోత్పత్తులు వాస్తవ ధరలు నిలకడగా ఉంటాయి. వ్యవసాయం ద్వారా లభించే ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచడంతోపాటు, వైవిద్యమైన ఆహారధాన్యాల ఉత్పత్తి చేయాలి. దేశంలో మార్కెటింగ్ వ్యవస్థ చాలా బలహీనంగా ఉన్నది. దానిని పటిష్ట పరచాలి. రైతులకు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి ప్రభుత్వం నుంచి సకాలంలో లభించడం లేదు.
అందుచేత రైతు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పుచేసి పెట్టుబడి పెట్టి పంటను అప్పు తీర్చడానికి సరిపెట్టి చివరకు దివాళా తీస్తున్నారు. రైతులు సాధారణంగా పేదలు, నిరక్షరాస్యులు కావడంతో ఆధునిక పద్ధతులు అనుసరించడానికి వెనుకాడుతున్నారు.