Suryaa.co.in

Andhra Pradesh

నరసాపురం ఎంపీగానే పోటీ చేస్తా

– రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి
– నాకైతే న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది… న్యాయం జరగకపోతే జరిగేలా చూస్తాను
– బిజెపి రాష్ట్ర నాయకుల తప్పుడు సమాచారం వల్లే నాకు సీటు రాలేదు
– కేంద్ర బిజెపి నేతలతో సత్సంబంధాలే ఉన్నాయి…. ఇక్కడి నుంచే ఏదో తేడా జరిగి ఉంటుందనేది నా భావన
– నా జాతక ప్రకారం ఎంపీగా లేదంటే ఎమ్మెల్యేగా ఎన్నికవుతా
– పార్టీలు సీటు ఇస్తాయా?, ప్రజలు సీటు ఇస్తారా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది
– కర్నూలును న్యాయ రాజధాని చేశానన్న జగన్మోహన్ రెడ్డి మాటలన్నీ శుద్ధ అబద్ధాలు
– 99% హామీలను నెరవేర్చానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు
– గత ఎన్నికలకు ముందు మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పి, మద్య నిషేధం అమలు చేయలేదు సరి కదా… మారకద్రవ్యాలకు అడ్డాగా రాష్ట్రాన్ని మార్చాడు
– నిన్న మొన్నటి వరకు జరిగిన జగన్ మోహన్ రెడ్డి సభలన్నీ అట్టర్ ఫ్లాప్… లక్షన్నర మంది జనమని చెబితే 30 వేల మంది కూడా హాజరు కాలేదు
– రాష్ట్ర శ్రేయస్సు కోసం రాజకీయంగా ఇబ్బందులెదురైనా జనసేనాని ముందుకే వెళ్లారు
– రాష్ట్రానికి కచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు
– ఎఫ్ఐఆర్ లో అవినాష్ రెడ్డిని దోషిగా చూపెట్టినప్పటికీ బెయిల్ రావడం వల్లే ఆయన్ని అరెస్టు చేయలేదు
– బెయిల్ ఎందుకు వచ్చిందంటే అన్నయ్య దొరికేస్తాడు కాబట్టి
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తాను అనుకోవడం లేదని, నేనైతే ఎంపీగానే పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని వస్తున్న ఊహగానాలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా, ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. రిజర్వుడు స్థానాలను మినహాయించి, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసిన నన్ను నేను పరిచయం చేసుకోవలసిన అవసరం లేకుండానే ప్రజలే రాజుగారు రండి అని ఆహ్వానిస్తున్నారని తెలిపారు. శుక్రవారం రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి వారిని కూడా కూటమిలో కలుపుకోవడం జరిగిందన్నారు.

ఎమ్మెల్యేగా పోటీ చేసే అవసరం తనకు రాదని, ఒకవేళ ఆ అవసరమే వస్తే రాష్ట్రంలో ఏ అసెంబ్లీ స్థానం నుంచి అయినా పోటీ చేయవచ్చునని చెప్పారు. నరసాపురం ఎంపీ టికెట్ ఇప్పటికీ తనకు కేటాయిస్తారనే ఆశాభావంతోనే ఉన్నట్లుగా రఘురామ కృష్ణంరాజు పునరుద్ఘాటించారు. 2009 ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ టికెట్ బిజెపి తరఫున శ్రీనివాస్ వర్మకే కేటాయించారని , అప్పుడు పొత్తులు లేవు కాబట్టి ఆయన విజయం సాధించలేకపోయారన్నారు . ముందు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిగా శ్రీనివాస్ వర్మ కు టికెట్ కేటాయించాలన్న బిజెపి నాయకత్వ నిర్ణయం ముదాహముని పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు, ఇతర స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక లోను ఇవే ప్రమాణాలను పాటించక పోవడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు.

రాష్ట్ర నాయకత్వం నివేదించిన తప్పుడు సమాచారం వల్లే నాకు టికెట్ లభించలేదని, అంతేకానీ కేంద్ర బిజెపి నాయకులకు తనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. ఇక్కడే ఏదో జరిగి ఉంటుందనేది నా భావన అని పేర్కొన్న ఆయన, రాష్ట్ర బిజెపి నాయకులతో గత నాలుగు ఏళ్ళు గా తనకు పెద్దగా సంబంధాలు లేవని చెప్పారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ కొనసాగినప్పుడు ఆయనతో ఉన్న పరిచయం వల్ల, బిజెపి నాయకులతో చక్కటి సంబంధ బాంధవ్యాలే ఉన్నాయన్నారు. ఇప్పుడు ఆయన కూడా తెదేపాలో చేరిపోవడం వల్ల, రాష్ట్ర బిజెపి నాయకులతో పెద్దగా పరిచయాలు లేకపోవడమే తనకు సీటు రాకుండా దెబ్బేసిందేమోనని వ్యాఖ్యానించారు.

ఇప్పటికీ నరసాపురం స్థానాన్ని తనకు కేటాయిస్తారని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు నా జాతక ప్రకారం రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందని చెప్పారు. ఎంపీ స్థానాన్ని పార్టీలు ఇస్తాయా?, ప్రజలు ఇస్తారా? అన్నది తెలియదు కానీ, తాను మాత్రం ప్రజా ప్రతినిధిగా చట్టసభలలో అడుగుపెట్టడం ఖాయమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన కూటమిని బలపరచాలని ప్రజలను నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కోరారు. రాష్ట్రం మారాలని, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలన్నా లక్ష్యంతోనే మూడు పార్టీలు ఏకమయ్యాయని ఆయన తెలిపారు.

కేవలం అభివృద్దే ధ్యేయంగా , అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవడానికి ఏర్పడిన కూటమిని ప్రజలు ఆశీర్వదించాలన్నారు . రాష్ట్ర శ్రేయస్సు కోసం కూటమితో జట్టు కట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ముందుకే వెళ్లాలని నిర్ణయించుకోవడం అభినందనీయం అన్నారు. కూటమి తరపున కేటాయించిన స్థానాలలో కొంతమంది అభ్యర్థుల ఎంపికను చూసినప్పుడు కొందరికి కొన్ని, కొన్ని అనుమానాలు తలెత్తడం సహజమేనని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకుల నివేదికల ఆధారంగానే బీజేపీ అభ్యర్థుల ఎంపిక జరిగి ఉంటుందన్న ఆయన, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున అభ్యర్థుల ఎంపిక లోని లోపాలను సరి చేసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

రానున్న ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాలలో విజయం సాధించాలని ఆకాంక్షించిన రఘురామ కృష్ణంరాజు, ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదని చెప్పారు. రాముడిని ఆరాధించేవారు ఉన్నట్లుగానే, రావణుడికి కూడా అభిమానులు ఉంటారన్నారు. దుర్మార్గుడిని అభిమానించే వారికి కూడా కొదవలేదని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. నరసాపురం స్థానం నుంచే తిరిగి పోటీ చేస్తానని చెప్పిన రఘురామకృష్ణంరాజు, నాకైతే న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా పోటీలో ఉంటానని పేర్కొన్న ఆయన, తనకు న్యాయం జరుగుతుందని, జరగకపోతే న్యాయం జరిగేలా ప్రజలే చూస్తానన్నారు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న అబద్దాలను, చేస్తున్న దారుణాలను ప్రజలు గుర్తించి, రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోరారు.

కూటమికి 135 స్థానాలు
రానున్న ఎన్నికల్లో కూటమికి 135 స్థానాలు రావచ్చునని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు గతంలో సర్వేలు నిర్వహించినట్లుగానే, ఇప్పుడు ఏమైనా సర్వేలను నిర్వహించారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ… గతంలోనే కూటమికి 135 స్థానాలు వస్తాయని పేర్కొనడం జరిగిందన్నారు. ఇందులో ప్లస్ 15 స్థానాలు, లేదంటే మైనస్ 15 స్థానాల తేడా మాత్రమే ఉంటుందని, అంతకుమించిన తేడా ఉంటుందని తాను భావించడం లేదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని, కచ్చితంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు.

నన్ను చూసి ఓటు వేయండని జగన్మోహన్ రెడ్డి కోరడం హాస్యాస్పదం
రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని, నన్ను చూసి ఓటు వేయాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కోరడం హాస్యాస్పదంగా ఉందని రఘు రామ కృష్ణంరాజు విమర్శించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేసి, న్యాయ రాజధానిగా కర్నూలు ను అభివృద్ధి చేశానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటన్నారు. కర్నూలు ను న్యాయ రాజధానిగా పేర్కొనలేదని ఒక వైపు సుప్రీంకోర్టులో చెప్పి, ఇప్పుడు వీధుల్లో మాత్రం కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి చేశానని చెప్పడం చూస్తే… దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉందని మండిపడ్డారు.

కర్నూలు న్యాయ రాజధానిగా చేశానన్నది ఉత్తుత్తి మాటేనన్న ఆయన, సుప్రీంకోర్టు అనుమతి లేకుండా న్యాయ రాజధానిగా ఎలా ఏర్పాటు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. న్యాయస్థానాల్లో ఒక మాట చెబుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వీధుల్లో జగన్మోహన్ రెడ్డి మరొక మాట చెబుతున్నారని రఘురామ కృష్ణంరాజు ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేశానని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు మద్య నిషేధం అమలు చేస్తానని , సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేయకపోతే మళ్లీ ఓటే అడగనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్తున్నారో చెప్పాలని నిలదీశారు.

మద్య నిషేధం అమలు చేయకపోగా, మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు. మద్యాన్ని దశలవారీగా ఎత్తివేస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, నకిలీ, నాణ్యత లేని మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. మద్య నిషేధం మాట దేవుడెరుగు… మాదకద్రవ్యాలకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇటీవల విశాఖపట్నం పోర్టులో పట్టుబడిన కంటైనర్ జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన వాళ్లదేనని చెప్పారు.

గతంలోనూ పట్టుబడిన కంటైనర్ పై నమోదైన కేసు అడ్రస్ లేకుండా పోయిందన్నారు. దేశానికి రాష్ట్రాన్ని రాజధానిగా మార్చి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో కూడా మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చాయన్నారు. చివరకు స్కూల్ పిల్లలకు కూడా చాక్లెట్ల రూపంలో గంజాయి సరఫరా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతను నిర్వీర్యం చేసే మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసునని, ఇటువంటి పాలకులకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని రఘురామ కృష్ణంరాజు కోరారు.

జగన్మోహన్ రెడ్డి నిన్న, మొన్న నిర్వహించిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని తెలిపారు. లక్షన్నర మంది సభకు హాజరవుతారని చెప్పినప్పటికీ, 30 వేల మంది కూడా సభకు హాజరు కాలేదన్నారు. డబ్బులు, మద్యం ఇచ్చినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి సభలకు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. మరొకవైపు రాయలసీమ జిల్లాలలోనే పర్యటిస్తున్న తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తోన్న సభలకు విపరీతంగా జనం హాజరవుతున్నారని తెలిపారు. ప్రజలు తనను విశ్వసించడం లేదని తెలిసి జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్దాలను చెబుతున్నారన్న ఆయన, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చార్జిషీట్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ని దోషిగా పేర్కొన్నప్పటికీ ఎందుకు ఆయన్ని అరెస్టు చేయలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చిందని, అందుకే ఆయన్ని అరెస్టు చేయలేదన్న రఘు రామ కృష్ణంరాజు… బెయిల్ ఎందుకు వచ్చిందంటే అన్నయ్య దొరికేస్తారు కాబట్టి అంటూ సెటైర్ వేశారు.

LEAVE A RESPONSE