Home » పిన్నెల్లిపై ‘సుప్రీం’కు వెళతారా?

పిన్నెల్లిపై ‘సుప్రీం’కు వెళతారా?

– సీఎస్ జవహర్‌రెడ్డి చిత్తశుద్ధికి అగ్నిపరీక్ష
– ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులూ బెయిల్ ఊర ట
– 5 వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం
– మరి హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తారా?
– ఏబీకి క్యాట్ అనుకూల తీర్పు ఇచ్చినా హైకోర్టులో అపీల్
– హైకోర్టు తీర్పులపై గతంంలో సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్ సర్కార్
– మరి పిన్నెల్లి బెయిల్‌పైనా సుప్రీంకు వెళతారా?
– అందరి చూపూ సీఎస్ వైపే
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘మహా మాంచోడ’ని ముఖ్యమంత్రి జగనన్నతో సర్టిఫికెట్ తీసుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రపంచం మెచ్చేలా.. ప్రజాస్వామ్యం తలెత్తుకునే చేసిన ఈవీఎం విధ్వంసం కేసు కొత్త మలుపు తిరిగింది. హైదరాబాద్‌కు పారిపోయి దర్జాగా తిరుగుతున్న ‘మంచోడు పిన్నెల్లి’ని, జూన్ 5 వరకూ అరెస్టు చేయవద్దని బెయిల్ మంజూరు చేస్తూ మాననీయ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది.

మరోవైపు పొన్నూరు వైసీపీ అభ్యర్ధి, మంత్రి అంబటి రాంబాబు సోదరుడైన అంబటి మురళి కూడా, ఈవీఎం పగలకొట్టడం తప్పుకాదని ‘మంచోడు పిన్నెలి’్లకి మరో సర్టిఫికెట్ ఇచ్చారు. ‘డేటా సేఫ్‌గా ఉంటే పగిలిన ఆ ఈవీఎంకు విలువే లేదు. జవహర్‌రెడ్డి సీఎస్. ఎన్నికలకు ఆయనకూ ఏం సంబంధం? రామకృష్ణారెడ్డి ఏ నేరం చేయలేదు. స్వాతిముత్యం కమలహాసన్ మాదిరిగా కడిగిన ముత్యంలా బయటకు వస్తార’’ని సెలవిచ్చారు.

సరే.. అంబటి బ్రదర్స్ సర్టిఫికెట్‌ను పక్కనపెడితే… హైకోర్టు ‘మహా మాంచోడ’యిన పిన్నెల్లికి ఇచ్చిన బెయిల్ రద్దు కోసం, ఇప్పుడు సీఎస్ జవహర్‌రెడ్డి పాత సంప్రదాయం ప్రకారం సుప్రీంకోర్టుకు వెళతారా? లేదా? అన్నదే తెలుగు ప్రజల ధర్మసందేహం. ఇప్పుడు జరుగుతున్న చర్చ కూడా అదే. ఎందుకంటే.. సీఎం జగనన్నది తన సొంత కడప జిల్లా అయినప్పటికీ.. ఆయన కారణంగానే తాను సీఎస్ అయినప్పటికీ… ముక్కుసూటిగా వెళ్లే అధికారి.. పక్షపాతం ఎరుగని నిజాయితీపరుడు.. ఎవరి ఒత్తిళ్లకూ లొంగని ధీశాలి.. పక్షపాతం అనేది ఆయన డిక్షనరీలోనే ఉందన్న ప్రచారం నడుస్తోంది కాబట్టి, ఇప్పుడు సహజంగానే ఆయన నిష్పాక్షిక నిర్ణయం కోసం, తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సహజంగా రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులను.. గత ఐదేళ్ల నుంచి జగనన్న సర్కారు సుప్రీంకోర్టులో సవాలు చేస్తూనే ఉంది. మాజీ సీఎం చంద్రబాబునాయుడు, రఘురామకృష్ణంరాజు కేసులతోపాటు.. రాజధాని కేసులు, సీఐడీ కేసుల్లో హైకోర్టులో దెబ్బతిన్న ప్రతిసారీ, సుప్రీంకోర్టుకు అపీలుకు వెళుతోంది. దానికోసం కోట్ల రూపాయలు లాయర్లకు ఫీజుల రూపంలో చెల్లిస్తోంది.

ఎక్కడిదాకో ఎందుకు? సీనియర్ ఐపిఎస్, డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తాజా వ్యవహారమే ఒక ఉదాహరణ. ఆయనపై విధించిన సస్పెన్షన్ చెల్లదు. ఏబీని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని క్యాట్ ఆదేశించింది. అంతకుముందు ఒకసారి హైకోర్టు, ఇంకోసారి సుప్రీంకోర్టు కూడా ఏబీకి అనుకూలంగా తీర్పులిచ్చాయి. ఇన్ని కోర్టుల్లో సవాల్ చేసిన జగన్ సర్కారు..ఏబీకి వ్యతిరేకంగా ఒక చిన్న కాగితం ముక్కను కూడా ఆధారంగా చూపలేకపోయింది. అయినా కేసును ఐదేళ్లు సాగదీసింది. కారణం ఆయనకు పోస్టింగ్ ఇవ్వకూడదన్న ఏకైక లక్ష్యమే అని మెడపై తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది.

లేటెస్టుగా క్యాట్ ఏబీకి పోస్టింగ్ ఇవ్వాలని, జగన్ సర్కారును ఈనెల 8న ఆదేశించింది. అప్పుడు ఎన్నికల కోడ్ నిబంధన అమలులో ఉంది. ఇపుడూ అమలులో ఉంది. అది వేరే విషయం. ఆ సమయంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. సీఎం ప్రభుత్వ కారు కూడా వాడకూడదు. అసలు సీఎస్ సహా, ఉన్నతాధికారులంతా ఎలాంటి ఫైళ్లను సీఎంకు పంపించకూడదు. సీఎస్ ఒక్కరే వాటిపై నిర్ణయాధికారి. ఈసీ అనుమతి మేరకు నిర్ణయాలు తీసుకోవాలి.

కానీ నీతి,నిజాయితీకి-కర్తవ్య దీక్షా పరాయణుడైన సీఎస్ జవహర్‌రెడ్డి.. క్యాట్ ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించారు. సీఎం జగనన్న ఆదేశాల మేరకు, సీఎస్ ఆ నిర్ణయం తీసుకున్నారన్నది మీడియా వార్తల కథనం. అదే నిజమైతే కోడ్ అమలులో ఉన్న కాలంలో సీఎం ఎలా ఆదేశిస్తారన్నది మరో ప్రశ్న. ఆ ప్రకారంగా ఏబీకి వ్యతిరేకంగా జగన్ సర్కారు హైకోర్టు అపీలుకు వెళ్లడం.. మూడున్నర గంటల వాదనల తర్వాత, హైకోర్డు జడ్జి తీర్పును రిజర్వులో పెట్టడం తాజా పరిణామం.

మరి అంతే శ్రద్ధతో.. అంతే చిత్తశుద్ధితో.. అదే కర్తవ్యదీక్షతో సీఎస్ జవహర్‌రెడ్డి..సీఈసీ చెప్పినట్లు, ఈవీఎం పగులకొట్టి సిగ్గుమాలిన పనిచేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి.. బెయిల్ ఇచ్చిన హైకోర్టు తీర్పును, నిజాయితీగల అధికారిగా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారా? లేక ఎటూ జగనన్నే ‘మహా మాంచోడ’ని క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చిన ందున, ‘కరుడుగట్టిన ప్రజాస్వామ్యవాది’ పిన్నెల్లి బెయిల్‌ను సవాల్ చేయకుండా మౌనంగా ఉంటారా? చూడాలి!

Leave a Reply