Suryaa.co.in

Andhra Pradesh

అసెంబ్లీకో….నమస్కారం!

– మళ్లీ సీఎం అయ్యాకే అడుగుపెడతా
– చంద్రబాబు శపథం
– అవమానంపై తొలిసారి కన్నీరు
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పదమందిలో తొలిసారి కన్నీరు పెట్టుకున్నారు. తన కుటుంబసభ్యులపై, వైసీపీ సభ్యులు సభలో చేసిన దూషణకు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన జీవితంలో ఇన్ని అవమానాలు చూడలేదన్నారు. తనకు ఈ కౌరవ సభ అవసరం లేదన్నారు. మళ్లీ సీఎం గానే సభలో అడుగుపెడతా. అప్పటిదాకా అసెంబ్లీకో నమస్కారం అంటూ గద్గద స్వరంతో.. అవమానభారంతో సభ నుంచి నిష్క్రమించారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన.. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబును, సభ నుంచి శాశ్వతంగా నిష్క్రనమించేలా చేసింది.
వివరాల్లోకి వెళితే…
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. తాను తిరిగి సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. కాగా.. అసెంబ్లీ ప్రారంభమైంది మొదలు టీడీపీతో పాటు పార్టీ అధినేతపై దూషణల పర్వానికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమయం వెచ్చిస్తున్నారు. ఒకవైపు మంత్రి కొడాలి నాని.. చంద్రబాబును‘లుచ్ఛా’అంటూ నోటికి పని చెబుతుండగా.. మరోవైపు మరో మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు తమదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతటితో ఆగక చంద్రబాబును అవమానపరుస్తూ మాట్లాడటమే కాకుండా ఆయన కుటుంబంలోని మహిళలపై సైతం నోరు పారేసుకున్నారు. ఆయన భార్యతో పాటు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన చంద్రబాబు కంటతడి పెట్టారు. అనంతరం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.‘‘పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశాం. జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశాం. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నాం. ఏనాడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు నేను చూడలేదు.


అదే విధంగా ఇన్నేళ్లుగా జరగని అవమానాలను భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి.. కుప్పం ఎన్నికల తర్వాత నేను రావాలి. నా ముఖం చూడాలన్నా కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్‌లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా విమర్శించారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ పరువు కోసం పని చేశానో.. ఇన్నేళ్లుగా బతికామో.. నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి(మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసిన స్పీకర్) అవమానించారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా’’అని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
అప్పుడు తల్లిని … ఇప్పుడు నా భార్యని..
గతంలో శాసనసభలో ఆవేశాలు, కోపాలుండేవని, సభ వాయిదా పడేదని, తిరిగి సమావేశమైన తర్వాత ఎవరిది తప్పయితే వారికి స్పీకర్ చెప్పేవారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం శాసనసభలో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులను వైసీపీ నేతలు అవహేళన చేస్తూ విమర్శలు చేశారు. దీనిపై ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. అప్పుడు తన తల్లిని దూషించారు.. ఇప్పుడు తన భార్య విషయం తీసుకువచ్చి అవమానించారంటూ భోరున విలపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తన తల్లిని దూషించారని చంద్రబాబు తెలిపారు. దీనిపై గట్టిగా వైఎస్‌ను ప్రశ్నించానన్నారు. దీంతో తప్పు జరిగింది.. క్షమించమని అడిగారన్నారు. ఇవాళ వైసీపీ నేతలు నీచ రాజకీయాల కోసం తన భార్యను లాగే ప్రయత్నం చేశారన్నారు. రెండున్నరేళ్లుగా తనను అవమానిస్తూ వస్తున్నారని, ప్రజల కోసం భరిస్తున్నానన్నారు. దేశం కోసం తప్పితే స్వార్థం కోసం ఆలోచించలేదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. తన భార్య ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశానని, జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశానని చంద్రబాబు అన్నారు. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు తాను చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రెస్ మీట్లో గుండెలవిసేలా విలపించిన చంద్రబాబు
మళ్లీ సీఎం అయ్యేవరకూ ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టబోనంటూ శపథం చేసి ఆ తర్వాత విలేకరుల సమావేశంలో గుండెలవిసేలా విలపించారు. రెండు నిమిషాలపాటు మాట్లాడలేకపోయారు. ఏనాడూ ఇంటినుంచి బయటకు రాని భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. భువనేశ్వరి చేసిన త్యాగం గొప్పదన్నారు. ప్రతి సంక్షోభంలోనూ ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్న వారి ఇళ్లల్లోని వారిని కూడా ఇలాగే తిడితే ఎలా

ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానిస్తోందని, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను అవమానించడం పరిపాటిగా మారిందన్నారు. వైసీపీ నేతలు భువనేశ్వరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చంద్రబాబు చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ వ్యక్తిగతంగా అవమానించలేదన్నారు. రాజకీయాల్లో విలువలు ఇంత నీచంగా పడిపోయాయనుకోలేదంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, పంచుమర్తి అనురాధ కంటతడిపెట్టుకున్నారు.
ఇంతటి ఘోరమైన సభ చూడలేదు
కౌరవుల సభలా వ్యవహరించారు
నా భార్యని నీచ రాజకీయాలలోకి లాగడం హేయం. తప్పని చెప్పాల్సిన స్పీకర్ నోరు మెదపలేదు. తమ్మినేని గతాన్ని మర్చిపోయారు ..ఆత్మ విమర్శ చేసుకోవాలి. తమ్మినేని నాకు మైక్ ఇవ్వకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇంతకంటే నాకు ఎం పదవులు అవసరం లేదు ప్రజలు తెలుసుకోవాలి.
తప్పులని వేరొకరిపై రుద్ది పైశాచిక ఆనందం పొందుతున్నారు. ధర్మానికి , అధర్మానికి జరుగుతున్న యుద్ధం ఇది. ప్రజాక్షేత్రంలో తేలుచుకుంటా …రికార్డులు నాకు కొత్త కాదు …
రాజకీయాలకు సంబంధం లేని నా భార్యని దూషించడం నీచం. రాజకీయాల్లో విలువల ఉండాలనే ఇంతకాలం ఊరుకున్నాను.
క్రమశిక్షణ ఉంది కాబట్టే …సైలెంట్ ఉన్నాను.
మాకు చేతకాక కాదు. ఇంత కంటే నీచంగా మాట్లాడగలను. ప్రజలు నాకు మద్దతు ఇవ్వాలి ..రాష్ట్రానికి పాటి పీడ వదలాలి. మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ లో అడుగుపెడాతా.మన ఇంటి వాళ్ళని అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అదే నా ఆవేదన ..అంటూ కన్నీటితో ప్రెస్ మీట్ ముగించిన చంద్రబాబు.

LEAVE A RESPONSE