పల్నాడు రైతుల సమస్యలు పరిష్కరిస్తా

– గోదావరి జలాలను సాగర్‌ కుడి కాల్వకు చేర్చేలా చర్యలు
– కొండవీడులో తాగునీటి సమస్యపైనా రాజకీయం చేశారు
– అందుబాటులో ఉండి అభివృద్ధి చేసే వారికే ఓటేయండి
– నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు
– కొండవీడు, పుట్టకోటలో ఎన్నికల ప్రచారం

వ్యవసాయాధారితమైన పల్నాడులో పంట సీజన్‌కు తగ్గట్టుగా నీరు అందక రైతన్నలు ఇబ్బంది పడుతున్నా రని నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. ప్రకాశం బ్యారేజీకి చేరుతున్న గోదావరి వరద జలాలను లిఫ్ట్‌ చేసి సాగర్‌ కుడి కాల్వకు చేర్చుకుంటేనే నీటి కొరత తీరుతుందని, రైతన్నలు, ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. యడ్లపాడు మండలం కొండవీడు, పుట్టకోట గ్రామాల్లో శనివారం చిలకలూరిపేట అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ప్రచారం నిర్వహిం చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలంటే టీడీపీని గెలిపించుకోవాలని కోరారు. కొండవీడు గ్రామంలో నీటి సమస్య ఉందని, గ్రామానికి వచ్చిన ప్రతిసారీ మహిళలు, గ్రామస్తులు సమస్య చెప్పేవారన్నారు. నిధులు ఇస్తానని చెప్పినా ఒక్కరు కూడా వచ్చే వారు కాదని, తాగునీటి దగ్గర కూడా కొందరు నాయకులు రాజకీయాలు చేశారని, ఇదేమి దౌర్భాగ్యమని ప్రశ్నించారు. రేపు అధికారంలోకి రాగానే నీటి సమస్య తప్పకుండా తీరుస్తానని, అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరైతే అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తారో వారికే ఓటేయాలని కోరారు.

Leave a Reply