పదవులిచ్చి ప్రలోభ పెడుతుంటే…సీఎంకు వ్యతిరేకంగా సాక్షులు సాక్ష్యం చెబుతారా?

-నరసాపురం ఎంపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

సాక్షులకు పదవులిచ్చి ప్రలోభ పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా
సాక్ష్యం ఎలా చెబుతారని ? నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులైన సాక్షులకు పదోన్నతులు కల్పిస్తుండగా, సహా నిందితులకు జగన్మోహన్ రెడ్డి… రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారని తెలిపారు. మురళీధర్ రెడ్డి పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదని, సహా నిందితుడే ముఖ్యమంత్రి అయినప్పుడు విచారణకు ఎలా అనుమతిస్తారన్నారు.

శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకునే అవకాశమే లేని చోట, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సాక్షులు సాక్ష్యం చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం, సహా నిందితులకు రాజకీయంగా పదవులను ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్నారు.

అనుకూలంగా ఆర్డర్ వస్తుందనుకోలేదు
సాక్షి దినపత్రిక ప్రచురించిన రఘురామకృష్ణంరాజు చుక్కెదురు అన్న వార్త కథనంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న తమ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ న్యాయస్థానాలు పలుమార్లు తిరస్కరించిన ఇదే సాక్షి దినపత్రికలో శివ శంకర్ రెడ్డి కి చుక్కెదురన్న వార్త ఎందుకు రాయలేదని విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని కోరారు .

ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ను పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించగా, ఆ వార్తను కూడా సాక్షి దినపత్రికలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదన్నారు. న్యాయస్థానాలలో కొన్నిసార్లు చుక్కెదురు కావడం సహజమేనని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని తాను దాఖలు చేసిన పిటిషన్ పై, అవతలిపక్షానికి నోటీసులు ఇవ్వమని కోరగా… హై కోర్టు తిరస్కరించిందన్నారు. అవతలిపక్షానికి నోటీసులు ఇవ్వకుండానే వాదనలు ముగిసిన కేసులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని అనుకునేంత అమాయకున్ని కాదని రఘురామకృష్ణను రాజు తెలిపారు.

పది రోజుల వ్యవధిలోనే హై కోర్టు తన తీర్పును వెలువరిస్తుందని భావించానని, కానీ తీర్పు వెలువరించడానికి 10 నెలల ఐదు రోజుల సమయం పట్టిందన్నారు. కోర్టు తీర్పు వెంటనే వచ్చి ఉంటే, తాను సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అప్పటి సింగల్ బెంచ్ జడ్జి, ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారని, సిబిఐ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తిగా పదోన్నతి పొందారన్న రఘురామ కృష్ణంరాజు, న్యాయస్థానం తీర్పును తాను తప్పు పట్టడం లేదని స్పష్టం చేశారు. తాను దాఖలు చేసిన పిటిషన్ పై అవతలి వారి వాదనలు వినవలసిన అవసరం లేదని కోర్టు భావించినప్పుడే… తీర్పు ఎలా ఉంటుందో తనకు అర్థమయిందన్నారు.

జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ఎందుకు దాఖలు చేశానో ప్రజలకు వివరించడం… తన బాధ్యత అని చెప్పారు. బెయిల్ రద్దు కోసం తాను పిటీషన్ దాఖలు చేయగానే సిఐడి పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చేసి కస్టడీలో కాళ్లు కట్టేసి చిత్రహింసలకు గురి చేశారన్నారు. న్యాయస్థానం తన ఆవేదనను పరిగణించలేదు కాబట్టి, ప్రజా న్యాయస్థానంలో ప్రజలు ఆలోచించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డికి అనేకమార్లు కోర్టుల నుంచి ఊరటలు లభించాయని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డికి అడిగే హక్కు ఉందన్న ఆయన, కోర్టుకు ప్రసాదించే అధికారం ఉందన్నారు. అందులో తప్పేమీ లేదని, కడిగిన ముత్యంలా జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి బయటికి వస్తారని, ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ప్రజలు భావించడంలో అతిశయోక్తి లేదన్నారు. తనకు కూడా ఎటువంటి అనుమానం లేదని, తాను ఈ విషయాన్ని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నట్లు స్పష్టం అవుతుందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

జగన్మోహన్ రెడ్డి పై సిబిఐ విచారణ అనంతరమే ఈడీ విచారణ చేపట్టాలని ఆదేశించారన్నారు. అయితే సిబిఐ అనేక ఉల్లంఘనలకు అవకాశమిచ్చిందని, అందుకే జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయమని కోరుతూ తాను పిటీషన్ దాఖలు చేశానని తెలిపారు. ఒక ఎంపీ ని చితగొట్టిన తర్వాత బుద్ధున్నవారెవరైనా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారా? అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో జగన్మోహన్ రెడ్డి కొనసాగకుండా ఉండడంతో పాటు ఆయన బెయిల్ ను రద్దు చేస్తే న్యాయం జరుగుతుందేమో నన్న సదుద్దేశంతో తాను పిటిషన్ దాఖలు చేశానని వివరించారు. కోర్టులు న్యాయం చేయడమే కాదని, చేస్తున్నట్లుగా కూడా కనిపించాలన్న ఆయన, సిబిఐ కోర్టు ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని ఆదేశించగా, హైకోర్టు హాజరు కావలసిన అవసరం లేదని పేర్కొన్నదని వెల్లడించారు.

తనకు న్యాయస్థానాలపై అపారమైన గౌరవం ఉన్నదని, చట్టానికి కళ్ళు లేవు చెవులు మాత్రమే ఉన్నాయని తెలుసునని… ఆలస్యంగా నైనా న్యాయం జరుగుతుందని నమ్ముతానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎన్ని ఎదురు తీర్పులు వచ్చినా… ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ న్యాయ వ్యవస్థను నమ్ముకుందామని అన్నారు. అంతకంటే మరొక ప్రత్యామ్నాయం లేదని చెప్పారు.

ఋషికొండ కు వెళ్లకుండా అరెస్టులు ఎందుకు?
ఋషికొండను సందర్శించకుండా తెలుగుదేశం పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని రఘురామకృష్ణం రాజు తీవ్రంగా ఖండించారు. ఋషికొండపై అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్తే, అక్రమ నిర్మాణాలు చేపడితే సహించమని హెచ్చరించి ఊరుకుంటున్నారే తప్పితే, వాటిని అడ్డుకునే చర్యలు చేపట్టడం లేదన్నారు. విశాఖను రాజధానిగా ఎవ్వరూ అడ్డుకోలేరంటున్నా మంత్రులు, ఋషికొండపై ముఖ్యమంత్రి నివాస, కార్యాలయ సముదాయ నిర్మాణాన్ని కూడా అడ్డుకోవడం ఎవరి చేతకాదంటూ హెచ్చరిస్తున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఋషికొండ అక్రమ నిర్మాణాలపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టుకు నివేదించాలని ఆదేశించిందన్నారు. అయితే హైకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ కనీసం ఇంప్లీడ్ కు కూడా ఇంకా స్వీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించానని, తాను దాఖలు చేసిన పిటీషన్ ఇంకా లిస్ట్ కాలేదని తెలిపారు. రుషికొండ ప్రకృతి విధ్వంసం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అక్రమ నిర్మాణాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వెళ్తానని రఘు రామకృష్ణంరాజు తెలిపారు.

ఋషికొండ కటింగ్ ఇప్పుడు రాష్ట్రం లో పాపులర్
ఋషికొండను మొత్తం గుండు కొట్టినట్లుగా కొట్టిన కటింగ్ రాష్ట్రంలోని హెయిర్ సెలూన్ లలో ఇప్పుడు పాపులర్ గా స్టైల్ గా మారిందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాత్రింబవళ్లు రుషికొండపై అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని అది కోర్టు దృష్టికి కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇక బీచ్ రోడ్డును మూసివేసి, కాలేజీకి విద్యార్థులను వెళ్లకుండా అడ్డుకోవడం చూస్తే… అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నియంతృత్వ పోకడలు పోతున్న ఇటువంటి ప్రభుత్వాలు వస్తాయని ప్రజలెవరికీ ఊహా కూడా వచ్చి ఉండదన్నారు. ఋషికొండపై అక్రమ నిర్మాణాలు చేపడితే ఆ తర్వాత కూల్చివేస్తామని న్యాయస్థానం పేర్కొనడం పట్ల రఘురామకృష్ణం రాజు విస్మయం వ్యక్తం చేస్తూ, అక్రమ నిర్మాణాలను తొలుతనే నిలువరించకుండా తరువాత కూల్చివేస్తామంటే పోయేది ప్రజల సొమ్మే కదా అన్నారు.

సి ఆర్ డి ఏ చట్టానికి భిన్నంగా జీవో లా?
అమరావతి రాజధాని బృహత్ ప్రణాళిక కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 107 ను జారీ చేయడం విస్మయాన్ని కలిగించిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. సి ఆర్ డి ఏ చట్టం ప్రకారం, ఈ జీవో చెల్లదని తెలిపారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి సి ఆర్ డి ఎ చట్టాన్ని మార్చాలని నిర్ణయించిందన్నారు. దానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారని మండిపడ్డారు. సిఆర్డిఏ పరిధిలో 49 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సత్సంకల్పంతో మానవత్వం మూర్తి వహించిన నిత్య కృషివలుడు యేడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని అపహాస్యం చేశారు. అమరావతిని బీదల రాజధానిగా మార్చి, ఆయన మాత్రం విశాఖపట్నం కొండలు, గుట్టలపై ప్యాలెస్ లను నిర్మించుకుంటున్నారన్నారు. ఇక విశాఖపట్నంలో నచ్చిన భూములన్నీ కొనుగోలు చేసుకుంటూ వెళ్తున్నారన్నారు. అమరావతి అభివృద్ధి కోసం సెల్ఫ్ డెవలప్మెంట్ కింద భూములను కేటాయించారన్నారు. ఇప్పుడు వాటిని పేదలకు పంపిణీ చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం పట్ల, అమరావతి రైతులు కోర్టును ఆశ్రయిస్తే… ఒకవేళ వారికి అనుకూలంగా స్టే వస్తే కోర్టులను మేనేజ్ చేశారని జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తారన్నారు. తనకు అనుకూలంగా తీర్పులు వస్తే ఒకలా, ఇతరులకు అనుకూలంగా తీర్పు వస్తే కోర్టులను మేనేజ్ చేశారని న్యాయ వ్యవస్థ ఇలా అయిపోయింది ఏమిటి అని బాధపడటం వారికే చెల్లిందన్నారు. రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కోరిక నెరవేరుతుందా?, లేకపోతే కోర్టు ఇంట్రిమ్ స్టే ఇస్తుందా చూడాలన్నారు.

వడ్డీలు చెల్లించడానికి అప్పులా?
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీలు చెల్లించడానికి అప్పులు చేయడం తప్పని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను రఘురామకృష్ణం రాజు స్వాగతించారు. అలాగే అప్పుచేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని చూడడం కూడా అర్థరహితమని ఆర్థిక మంత్రి పేర్కొన్నారన్నారు. అయితే, ఇదే విషయమై సోషల్ మీడియాలో… అప్పు ఇచ్చేది మీరే అయినప్పుడు, తెలిసి తప్పుకు అప్పు ఇవ్వడం ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారన్నారు.

Leave a Reply