Suryaa.co.in

Telangana

ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎన్నికల ప్రచారం చేస్తారా?

– రేవంత్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా మోడీ
– రాహుల్ గాంధీ కి టకీ టకీ మని రేవంత్ రెడ్డి పైసలు పంపుతున్నారు
– రోమ్ చక్రవర్తి నీరో లెక్కనే రేవంత్ రెడ్డి
– రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ యాదికొస్తున్నారు
– రోజుకు ఒక రైతు చొప్పున ఇప్పటివరకు 450 మంది రైతులు చనిపోయారు
– కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: కేవలం 48 గంటల్లోనే రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎంఎల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజుకు ఒక రైతు చొప్పున ఇప్పటివరకు 450 మంది రైతులు చనిపోతే, రేవంత్ రెడ్డిలో కనీసం చలనం కూడా రావడం లేదన్నారు.

ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకొని ఉన్నా పట్టించుకోకుండా, 36 వ సారి రేవంత్ ఢిల్లీకి పోయిండని విమర్శించారు. ఒకప్పటి రోమ్ చక్రవర్తి నీరో లెక్కనే రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నాడని అన్నారు. 15 నెలల స్వల్ప కాలంలోనే అధికార పార్టీని వదిలిపెట్టి, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటే ఆ పార్టీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతం ఇది.

ఒక్క స్టేషన్ ఘన్పూర్ మాత్రమే కాదు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో కూడా కాంగ్రెస్ పార్టీని వదిలి బిఆర్ఎస్ లో చేరుతున్నారు. కేవలం 48 గంటల్లోనే రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకొని ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎం.ఎల్.సి ఎలక్షన్ గెలిచిన ఓడిన ఫరక్లేదని రేవంత్ చిద్విలాసంగా మాట్లాడుతున్నాడు. ఒకప్పటి రోమ్ చక్రవర్తి నీరో లెక్కనే రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నాడు.

ఇప్పుడు 36 వసారి కూడా ఢిల్లీ పోయిండు. ఎన్నిసార్లు ఢిల్లీ పోయి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడు. హోం శాఖ ,విద్యాశాఖ, సంక్షేమ శాఖకు మంత్రులను కూడా నియమించుకోలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి కెసిఆర్ ఆనవాళ్లను చెరిపి వేస్తాడా? రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ యాదికొస్తున్నారు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తాను ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి కలలో కూడా ఊహించుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజుకు ఒక రైతు చొప్పున ఇప్పటివరకు 450 మంది రైతులు చనిపోయారు.

రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమేనని, బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లోనే ప్రకటించడం కేసిఆర్ పాలన దక్షత, రైతులపై ప్రేమకు నిదర్శనం. శివుడు గంగమ్మ తల్లిని దివి నుంచి గుడికి తీసుకొస్తే, కేసీఆర్ గోదావరి నదిని 80 మీటర్ల నుంచి 618 మీటర్ల పైకి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ ను నింపారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజ్లలో 340 పిల్లర్లు ఉన్నాయి. అందులోని ఒక పిల్లర్ పర్రే బాస్తే ఇదే కాంగ్రెస్ నాయకులు నానా యాగి చేశారు .

కాంగ్రెస్ నాయకులు దున్నపోతు ఈనింది అంటే బీజేపీ వాళ్లు దుడ్డే కట్టేయమన్నట్టు, కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసి తెలంగాణ ప్రజల మనసుల్లో విష బీజాలు నాటారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయినా, ఎస్ ఎల్ బి సి టన్నెల్ కూలిపోతే, ఖమ్మం పెద్దవాగు బ్రిడ్జి కొట్టుకపోతే ఏ బిజెపి నాయకుడు మాట్లాడడం లేదు. ఇవాళ రేవంత్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా ప్రధాని మోడీ పనిచేస్తున్నాడు. కాళేశ్వరం పిల్లర్ పర్రె బాయడంపై హడావుడి చేసిన ఎన్.డి.ఎస్. ఏ ఈ ప్రమాదాల విషయంలో మౌనంగా ఎందుకు ఉంది.?

సుంకిశాల ప్రమాదంపై వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద అప్లై చేస్తే, దేశ భద్రతకు సంబంధించిందని రేవంత్ ప్రభుత్వం చెప్తుంది. తెలంగాణలో రాహుల్ రేవంత్ టాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ ఆరోపించినా, ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు బిజెపి ప్రభుత్వం తీసుకోలేదు. రెండు కోట్ల లాభం మాత్రమే అర్జించిన రేవంత్ బామ్మర్ది కి సంబంధించిన శోధా కంపెనీకి, 1137 కోట్ల అమృత్ కాంట్రాక్టును రేవంత్ రెడ్డి అక్రమంగా కట్టబెట్టిండు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఆరు నెలలు అవుతున్న ఇప్పటిదాకా చర్యలు లేవు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడి దాడులు జరిగిన ఇప్పటిదాకా అసలు ఏం జరిగిందో ఈడి బయట పెట్టడం లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ను విమర్శించే రేవంత్ రెడ్డి, బిజెపినీ ఒక్క మాట కూడా అనడు. బిఆర్ఎస్ పార్టీ, కెసిఆర్ ఉన్నన్ని రోజులు తమ పప్పులు ఉడకవని కాంగ్రెస్, బిజెపిలు కుట్రలు చేస్తున్నాయి. లగచర్లలో తన అల్లుడి ఫ్యాక్టరీకి భూములు ఇవ్వనందుకే, అక్కడి రైతులపై రేవంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టిండు. లగచర్ల లంబాడ సోదరుల కోసం ఢిల్లీ వరకు వెళ్లి కొట్లాడి వాళ్లకు బెయిల్ ఇప్పించినం.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెడతామంటూ కొడంగల్ నియోజకవర్గంలోనే తిరుగుబాటు మొదలైంది. కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలి. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. అక్కడ బిఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయనందుకు బాధపడుతున్నారు.

రేవంత్ రెడ్డిని చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ విలువ అర్థమవుతుంది. రైతుల ఖాతాల్లో టకీ టకీమని పైసలు పడతలేవు కానీ, ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ కి మాత్రం టకీ టకీ మని రేవంత్ రెడ్డి పైసలు పంపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారు పది నెలల కెసిఆర్ పాలనలో మేము చేసిన అప్పు సంవత్సరానికి 41 వేల కోట్లు.

ఆ అప్పులతో సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని సంస్కరించాము. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలేశ్వరం ను కట్టాం. గుక్కెడు మంచినీళ్ల కోసం కిలోమీటర్లు నడిచే దురవస్థ నుంచి తెలంగాణ ఆడబిడ్డలను కాపాడేందుకు మిషన్ భగీరథను ప్రారంభించినం. ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్లు ఇచ్చినం. రైతుబంధు రూపంలో 73 వేల కోట్ల రూపాయలను 70 లక్షల రైతుల ఖాతాలో టైం కు వేసినం. 28 వేల కోట్ల రూపాయలతో నీ రెండుసార్లు లక్ష రూపాయల వరకు రుణమాఫీ. జిల్లాకొక మెడికల్ కాలేజీ కట్టినం.వరంగల్లో తెలంగాణలోని అతిపెద్ద హాస్పిటల్ ని కట్టినం.

ఘన్పూర్లో కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ని కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతదేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ పార్కును పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 200 గురుకుల పాఠశాలలను 1000 కి పెంచింది. సంవత్సరానికి 40 వేల కోట్ల అప్పుచేసి కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఇన్ని కార్యక్రమాలను చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 14 నెలల కాలంలో 1,50,000 కోట్ల అప్పు చేసింది.

ఈ అప్పుతో ఒక్క ప్రాజెక్ట్ అయినా రేవంత్ రెడ్డి ప్రారంభించిండా.? కొత్తగా ఒక్క ఇటుకైనా పేర్చిండా గోడైన కట్టిండా? కాంగ్రెస్ కు ఓటేస్తే రైతుబంధుకు రామ్ రామ్ అయితదని కెసిఆర్ ముందే చెప్పిండు. ఈ లక్షన్నర కోట్ల అప్పుతో ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు. రాజయ్య నేతృత్వంలో స్టేషన్ ఘన్పూర్ లో బిఆర్ఎస్ పార్టీ అద్భుతంగా పనిచేస్తుంది.

సంస్థాగతంగా పార్టీని అద్భుతంగా నిర్మించుకుందాం. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడేది కేసీఆర్ , గులాబీ సైన్యమే. పార్టీ రజతోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకుందాం.

LEAVE A RESPONSE