– సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్యే చెప్పింది
– చంద్రబాబు కుట్రలను సింగయ్య భార్య బద్దలు చేసింది
– నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా?
– తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకె శైలజానాథ్
తాడేపల్లి: సత్తెనపల్లి లో ప్రమాదవశాత్తు మృతి చెందిన దళితుడు సింగయ్యను చంద్రబాబు కుక్కతో పోల్చడం దారుణమని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్య వెల్లడించడం ద్వారా చంద్రబాబు పన్నిన కుట్రలను బద్దలు చేశారని అన్నారు.
నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా? ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకైమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా చంద్రబాబు భాషలో మార్పు రావడం లేదు. దళితులు, అణగారిన వర్గాల పట్ల తన అసహనాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోతున్నారు. సత్తెనపల్లి లో జరిగిన సింగయ్య మరణంపై చంద్రబాబు నీచంగా మాట్లాడటం ద్వారా తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు.
కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే కుక్క పిల్లలా లాగిపడేశారని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తిని కుక్కతో పోల్చడం వెనుక దళితులపై చంద్రబాబు తనకు ఉన్న చులకలభావాన్ని చాటుకున్నారు. సింగయ్య మరణాన్ని అడ్డం పెట్టుకుని, వైయస్ జగన్‌పై పన్నిన కుతంత్రంను సింగయ్య భార్య ధైర్యంగా మాట్లాడి పటాపంచలు చేశారు.
సింగయ్య భార్య లూర్దు మేరి వైయస్ జగన్‌ని కలిశారు. తమ కుటుంబానికి వైయస్ జగన్ అంటే అభిమానమని, ఆయన్ను చూడటానికి తాను, తన భర్త సింగయ్య బయటకు వచ్చామని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు తన భర్తే స్వయంగా మా పేర్లు, ఫోన్ నెంబర్లు చెప్పారని, అంబులెన్స్ లోకి చేరేవరకు బాగానే ఉన్నారని, బాగానే మాట్లాడుతున్నారని, తనకు కొద్దిపాటి దెబ్బలే తగిలాయని చెప్పిన విషయం ఆమె గుర్తు చేశారు.
ఆటోలో తీసుకెళ్తామని చెప్పినా వినకుండా అంబులెన్స్‌లో తరలించారు. బాగా మాట్లాడుతున్న వ్యక్తి ఎలా చనిపోయాడని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఎస్పీ సైతం ప్రమాదం జరిగిన్పపుడు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారు. నారా లోకేష్ 50 మందిని తన ఇంటికి పంపించి బెదరించారని బాధితురాలు మేరీ చెబుతోంది. ఇవన్నీ సింగయ్య మరణంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా కనీసం దానిపై ఒక్క స్టేట్‌మెంట్ ఇచ్చారా? మంగళగిరి నియోజకవర్గంలో దళితులు నడిచారని రోడ్డు మైలపడిందని పసుపు నీళ్లతో కడిగిన దారుణం ఇప్పటికీ మా కళ్లలో కదులుతూనే ఉంది. సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లెలో ఒక దళిత బాలికపై టీడీపీ యువకులు 16 మంది రెండేళ్లుగా అత్యాచారం చేస్తే వారి కుటుంబానికి న్యాయం చేశారా?
ఆ బాలిక తండ్రి మీ పార్టీ కార్యకర్త అని, మీ పార్టీ విజయోత్సవ సంబరాల్లో ప్రమాదవశాత్తు చనిపోతే ఆ వారి కుటుంబాన్ని ఆదుకోకపోగా ఇంత దారుణంగా మృతుడి కుమార్తెకి అన్యాయం చేస్తారా? ఇలా ఏ ఒక్క ఘటనలోనూ నిందితులపై చర్యలు తీసుకున్నారా? ఒక దళితుడిని కారులో పక్కన కూర్చోబెట్టుకుని ఇంటికి వెళ్లినంత మాత్రాన దళితులను ఉద్దరించినట్టు ప్రజలకు అనుకుంటారనే భ్రమల్లో నుంచి బయటకు రండి. మైకులు పెట్టి ఇచ్చిన స్ర్కిప్టు చదివితే మేం నమ్మేస్తామని ఎలా అనుకుంటారు?