Suryaa.co.in

Andhra Pradesh

వైకాపా ప్రభుత్వానికి మనుగడ లేదు

– రానున్నది తెదేపా కూటమి ప్రభుత్వమే
-జగన్ భారతి కలసి గుడికి వెళ్ళరా?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వానికి మనుగడ లేదని, రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు.

గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తన నియోజకవర్గ యాత్రలో ఊహించిన దాని కన్నా ఎన్నో రెట్లు అధిక ప్రజాదరణ లభించింది. అనూహ్య ప్రజాస్పందన మధ్య నియోజక వర్గానికి చేరుకోవడానికి పదిన్నర గంటల సమయం పట్టింది. రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని వర్గాల ప్రజలు వచ్చి నన్ను కలుసుకున్నారు. ఈ అపూర్వ ప్రజాదరణ చూసిన తర్వాత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల చేత ఎంత నిరాధారణకు గురయ్యారో స్పష్టమవుతుందన్నారు.

సర్వేలలో ప్రజాభిప్రాయం సూచనగా తెలుస్తున్నప్పటికీ, వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడినప్పుడు వారి అభిప్రాయం ఏమిటో స్పష్టంగా అర్థం అయ్యింది. ఇక ఎంత మాత్రం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మనుగడలేదు. రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

నరసాపురం నియోజకవర్గ పరిధిలో నాకు ఎంతటి ప్రజాదరణ లభించిందో సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రజలంతా ప్రత్యక్షంగా వీక్షించారు. అన్ని దినపత్రికలు ప్రముఖంగా వార్తలను ప్రచురించగా, సాక్షి దినపత్రిక కనీసం ఒక్క ఫోటోను కూడా ముద్రించలేదు. క్రేన్ల సహాయంతో 8 నుంచి 10 గజమాలలను వేసి, మంగళ హారతులతో మహిళలు స్వాగతం పలికారు.

తెదేపా, జనసేన నాయకులు కార్యకర్తలు 1000 ద్విచక్ర వాహనాలతో స్వాగత ర్యాలీని నిర్వహించారు. అయినా ఇవేవీ సాక్షి దినపత్రికకు కనిపించలేదు కానీ రఘురామకృష్ణం రాజుకు గుణపాఠం చెబుతామని సంపత్ కుమార్ అనే వ్యక్తి చేత మాట్లాడించి, అదే వార్తను సాక్షి దినపత్రిక ప్రముఖంగా ప్రచురించడం సిగ్గుచేటు.

సంపత్ కుమార్ ఏమి దేశ్ కి నేత కాదు. రాజమండ్రి విమానాశ్రయం వద్ద నాకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని ఈ పాలకులు పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేశారు. విమానాశ్రయం గేట్లను మూసివేశారు. భారీ సంఖ్యలో కార్లలో వచ్చిన వారిని అనుమతించలేదు. కాన్వాయిని కూడా ముక్కలుగా విడగొట్టారనీ, అయినా ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

సంక్షేమానికి ఆధ్యుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు
రాష్ట్రం లో సంక్షేమ పథకాలకు ఆధ్యుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి నాలుగు సంక్షేమ పథకాల అమలుకు బటన్ నొక్కి … నేను నొక్కినంత బటన్ ఎవరూ నొక్కలేదని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పేదల సంక్షేమం కోసం ఎన్టీ రామారావు అనునిత్యం పరితపిస్తూ, అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఆ మహానుభావుడు అడుగుజాడల్లోని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు ముందుకు నడిపిస్తున్నారు. ప్రజల ఆదరాభిమానాలతో తెలుగుదేశం పార్టీ అప్రహతీతంగా కొనసాగుతోంది. రాజకీయాలలో ఎత్తుపల్లాలు సహజం. రాష్ట్ర ప్రజలు తాము చేసిన తప్పు తెలుసుకొని నందమూరి తారక రామారావు పై ప్రమాణం చేసి, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికల్లో అద్వితీయ విజయాన్ని చేకూరుస్తామని శపథం చేయాలని రఘురామ కృష్ణంరాజు కోరారు.

అదే ఆ మహానుభావుడికి ఇచ్చే నిజమైన నివాళిగా పేర్కొన్నారు. తెలుగువారి ఇలవేల్పు అయిన నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. సరిగ్గా 28 సంవత్సరాల క్రితం 1996 జనవరి 18వ తేదీన నందమూరి తారక రామారావు మహాభినిష్క్రమణం జరిగింది. తెలుగు జాతి అంతా తల్లడిల్లి పోయింది.

తెలుగు జాతి జాతిని దశ దిశల వ్యాప్తి చేసిన ఎన్టీ రామారావు ను కడసారి తిలకించడానికి ఎల్బీ స్టేడియం లోపలికి వెళ్లినప్పటికీ, జన సందోహం తీవ్రంగా ఉండడం వల్ల దగ్గరికి వెళ్లలేక నేను వెనుతిరిగాను. దైవ సమానులైన ఎన్టీ రామారావు మరణాన్ని ఈనాడు దినపత్రిక మహాభినిష్క్రమంగా పేర్కొంది. అంతకుముందు, ఆ తర్వాత ఈ పదాన్ని ఎవరికీ ఉపయోగించిన దాఖలాలు లేవని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

న్యాయస్థానం తీర్పులో ఏముంది? … సాక్షి దినపత్రిక ఏమి రాసింది??
స్కిల్ కేసు లో ఎఫ్ ఐ ఆర్ క్వాష్ చేయాలని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సాక్షి దినపత్రిక, మీడియా వక్రీకరించిందని రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 16వ తేదీన తీర్పు వెలువరించింది. 17వ తేదీన మీడియాకు పూర్తి తీర్పు కాపీ అందింది.

గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, వైకాపా ప్రజా ప్రతినిధులు తీవ్రంగా అవమానించిన సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలోని ఫోటో ను ఉపయోగించుకుని , సుప్రీం కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినందుకు చంద్రబాబు నాయుడు బిక్క మొహం వేశారన్న భావనను ప్రజల్లో కలిగించే ప్రయత్నాన్ని సాక్షి మీడియా, పత్రికా చేసింది. సుప్రీం కోర్టు తీర్పు కాపీని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని చదివే అవకాశం లేదు కనుక, తీర్పు సారాంశాన్ని క్లుప్తంగా వివరిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్కిల్ కేసు లో ఎఫ్ ఐ ఆర్ క్వాష్ పిటీషన్ ను ద్విసభ్య ధర్మాసనం న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, బేలా త్రివేది లు విచారించారు. త్రిసభ్య ధర్మాసనంలో సహజంగానే న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. కానీ ద్విసభ్య ధర్మాసనంలో అటువంటి సంఘటనలు బహు అరుదుగా జరుగుతుంటాయి. ఈ కేసులో న్యాయమూర్తులు అటువంటి తీర్పే విలువరించారు .

న్యాయవాదులు వినిపించిన వాదనలు ఒక న్యాయమూర్తికి ఒకరకంగానూ, మరొక న్యాయమూర్తికి మరొక రకంగా అర్థమయిందేమో నన్న మీ మాంస ఏర్పడింది. బొబ్బిలి పులి సినిమాలో కథానాయకుడు ఎన్టీ రామారావు కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఈ మార్పు ఏమిటనీ ప్రశ్నిస్తారు. కానీ ఒకే కోర్టులో ఒక న్యాయమూర్తి ఒకరకంగా, మరొక న్యాయమూర్తి దానికి పూర్తి భిన్నంగా తీర్పును వెలువరించడం జరిగింది. దాన్ని సాక్షి దినపత్రిక, మీడియా ఇంకొకరకంగా అన్వయించుకుంది. సీనియర్ న్యాయమూర్తి అనిరుద్ధ బోస్ తన తీర్పులో… సంఘటన ఎప్పుడు జరిగిందన్నది అప్రస్తుతం.

విచారణ ప్రారంభించిన తేదీనే పరిగణలోకి తీసుకోవాలి. అవినీతి నిరోధక చట్టాన్ని 2018 జూలై మాసంలో పార్లమెంట్ ఆమోదం ద్వారా సవరించారు. ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులను నమోదు చేయాలంటే, సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించాలి. అదే ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రి అయితే గవర్నర్ అనుమతి తీసుకోవాలి.

ఆయన అనుమతించిన తర్వాతే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలి. చంద్రబాబు నాయుడు పై గవర్నర్ అనుమతి తీసుకోకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. ఈ కేసును కొనసాగించాలనుకుంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఆయన అనుమతించే వరకు చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు.. ఇక జూనియర్ న్యాయమూర్తి బేలా త్రివేది తన తీర్పులో… సంఘటన ఎప్పుడు జరిగిందన్నదే ప్రామాణికంగా తీసుకోవాలి. సంఘటన ఎప్పుడు జరిగిందన్నది కాకుండా కేసు ఎప్పుడు పెట్టారన్నది ఈ చట్టం యొక్క ఉద్దేశం కాదు.

చట్టం చేసిన వారి ఉద్దేశంలోకి ఆమె లోతుగా వెళ్ళినట్లు ఉందన్న రఘురామ కృష్ణంరాజు, వారి ఉద్దేశం కాకుండా, చట్టంలో ఏమి రాశారన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. 2018 జూలై 7వ తేదీ చట్ట సవరణ తర్వాత జరిగిన సంఘటనలకు తప్ప, అంతకు ముందు జరిగిన సంఘటనలకు అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన వర్తించదని బేలా త్రివేది స్పష్టం చేశారు. స్కిల్ కేసు 2016 లో జరిగిందని, దానికి 17 A నిబంధన వర్తించదనేది బేలా త్రివేది ఉద్దేశమన్నారు.

రాఫెల్ యుద్ధ విమానాలకు కొనుగోలులో అవినీతి చోటు చేసుకుందని సిబిఐ విచారణకు ఆదేశించాలని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినీతి నిరోధక చట్టం సవరణల నేపథ్యంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

2016 కంటే పూర్వమే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియ జరిగింది. అయినా, కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విచారణ చేపట్టాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టులో అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన వర్తింపుపై ముగ్గురు న్యాయమూర్తులు తీర్పు రూపం లో తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ముగ్గురు న్యాయమూర్తులలో ఇద్దరు న్యాయమూర్తులు జోసెఫ్, అనిరుద్ధ బోస్ లు ఒకే రకమైన అభిప్రాయాన్ని వెల్లడించగా, బేలా త్రివేది మాత్రం బిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బేలా త్రివేది చట్టం చేసిన వారి మదిలో దూరి ఒక ఉద్దేశాన్ని ఊహించుకున్నారు. ఆమె ఊహ నిజమా?, తప్పా?? అన్నదానిపై మనం వ్యాఖ్యలు చేయకూడదు. అయితే ముగ్గురు న్యాయమూర్తులలో ఇద్దరు న్యాయమూర్తులు అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన వర్తింపు పై ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రి స్థాయి హోదా కలిగిన వ్యక్తులపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరని అదే విషయాన్ని అనిరుద్ధ బోస్ తన తీర్పులో వెల్లడించారు. ఈ కేసులో ఇద్దరు న్యాయమూర్తులు వేరు వేరు అభిప్రాయాలను కలిగి ఉన్నప్పటికీ, ఇద్దరు కలిసి తుది తీర్పులో ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసును విచారించడానికి త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేయాలని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు.

అయితే సాక్షి దినపత్రిక, మీడియా బేలా త్రివేది తీర్పుని చూసి చంకలు కొట్టుకుంది. రిమాండ్ సబబే అన్న ఆమె వ్యాఖ్యలను మాత్రమే హైలెట్ చేసింది. రిమాండ్ పై ఎవరికి ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన వర్తింపు పైనే భిన్నాభిప్రాయం ఉంది. న్యాయమూర్తులు ఇచ్చే తీర్పు కాపీ చివరి పేజీలో కంక్లూడ్ రిమార్క్స్ రాస్తారు. ఇద్దరూ న్యాయమూర్తులు ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తూ, త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని కోరారు.

అయితే ఈ లోపే ప్రభుత్వ కరపత్రిక సాక్షి దినపత్రిక మాత్రం ఇది ప్రభుత్వానికి దక్కిన విజయం గా, సిఐడి ఏమైనా చేసుకోవచ్చు అని ముద్రించిందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

ఇప్పటివరకు జరిగిన వాదనలన్నీ వృధానే
స్కిల్ కేసులో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై ఇరు పక్షాలు ఇప్పటివరకు చేసిన వాదనలన్నీ వృధానేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు. త్రిసభ్య ధర్మాసనం పై ఈ వాదనలు ఎటువంటి ప్రభావాన్ని చూపవని స్పష్టం చేశారు.

త్రిసభ్య ధర్మాసనంలో అనిరుద్ధ బోస్, బేలా త్రివేది సభ్యులుగా ఉండే ఛాన్స్ లేకపోవచ్చు. ఈ ఏడాది మేలో అనిరుద్ధ బోస్ రిటైర్డ్ కానున్నారు. త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు కోసం ఇంకో రెండు మూడు నెలల వ్యవధి పెట్టవచ్చు. త్రిధర్మాసనం ఏర్పాటు అయిన తర్వాత కూడా, నిర్విరామంగా బెంచ్ వాదనలు వినే అవకాశాలు లేవు. ఈ కేసులో మరో ఆరు నెలల వరకు తీర్పు వెలువడే అవకాశం లేదు.

ఈ ఏడాది మే మాసంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కేసులో నస తప్పితే పస లేదు. ఈ కేసుల్లో ఐపీసీ సెక్షన్లు ఉన్నప్పటికీ వాటిని ప్రత్యేకంగా విచారించి, ముగించవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా సీ మెన్స్ కంపెనీ ఇన్ కైండ్ గా, అసోసియేట్స్ ఫిజికల్ గా ఎక్విప్మెంట్స్ అందజేశారు.

ఇన్ కైండ్ గా సీ మెన్స్ అందజేసిన సేవలకు వారు వెల కట్టారు . అందులో 10 శాతం మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చించి, 40 నైపుణ్య శిక్షణ కేంద్రాలలో ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చింది. సీ మెన్స్ ఇన్విజిబుల్ విలువను ప్రశ్నించడానికి వీలు లేదు. ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బులకు నైపుణ్య శిక్షణ కేంద్రాలలో ఎక్విప్మెంట్ ఉంది. లక్షల మంది నిరుద్యోగులకు లబ్ధి చేకూరింది. ఎంతోమందికి ఉపాధి అవకాశం దక్కింది.

అయినా ఇవేవీ పట్టించుకోకుండా దేశ చరిత్రలో గత ప్రభుత్వం అంతటి అవినీతి ప్రభుత్వం లేదని అవాకులు, చవాకులు పేలడం చూసి నాకు మనస్థాపాన్ని కలిగించింది. ఈ కేసులో కడిగిన ముత్యములా నారా చంద్రబాబు నాయుడు బయటకు వస్తారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆయన్ని ఏమీ చేయలేరని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.

గుడి సెట్టింగులో కామెడీలా? నిర్వహకులకు సిగ్గుందా?
సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ నివాసంలో దేవాలయాన్ని సినిమా సెట్టింగ్ మాదిరిగా వేశారు. ఈ సెట్టింగ్ కోసం రెండు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చయిందని చెబుతున్నారు. కచ్చితంగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఉంటుందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో తిరుమల కు వెళ్లి వచ్చిన 10 లక్షల రూపాయలకు మించి ఖర్చు అయి ఉండేది కాదు. పండగ రోజు హిందువులైన వారు గుడికి వెళ్తారు. నేను మా ఊరిలోని మావుళ్ళమ్మను దర్శించుకున్నాను. దేవాలయానికి ముఖ్యమంత్రి సతీమణి భారతి రెడ్డి రాదు కానీ సెట్టింగ్ గుడికి మాత్రం వస్తారు. దేవాలయం అంటే ఒక గర్భగుడి ఉంటుంది. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత దేవుడిగా కొలుస్తారు.

అయోధ్యలో ట్రస్ట్ వారు కూడా శ్రీరాముడి విగ్రహానికి అలాగే ప్రాణ ప్రతిష్టను చేయనున్నారు. ఒక శిల్పాన్ని చెక్కి దేవుడిగా మలిచి ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత దాన్ని ఎవరు కూడా రాయి అనరు. దేవుడి గానే పూజిస్తారు. చర్చిలో జీసస్ క్రీస్తును పెట్టాక భగవంతుడి గానే కొలుస్తారు. విగ్రహం అని ఎవరు కూడా అనరు.

తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన సెట్టింగ్ దేవాలయంలో ముఖ్యమంత్రి దంపతులు దేవునికి వీపును చూపిస్తూ కూర్చోవడం విస్మయాన్ని కలిగించింది. ప్రాణ ప్రతిష్ట జరిగిన దేవాలయం కాదు కాబట్టి పీల్ కావలసిన అవసరం లేదు. కానీ నిర్వాహకులకు సిగ్గుందా?, దేవాలయంలో కామెడీ షోలు ఏమిటి??. జగన్మోహన్ రెడ్డిని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రశంసించారని, సినీ కథానాయకులు శోభన్ బాబు, కృష్ణ లు పొగిడినట్లుగా మిమిక్రీ చేశారు. మిమిక్రీ కళాకారుడి విన్యాసాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి దంపతులు ఆనందపడ్డారు.

ఇక్కడ వారిని ఎవరూ పొగడడం లేదు కాబట్టి, స్వర్గంలో ఉన్నవారు పొగుడుతున్నట్లుగా చెప్పుకున్నారని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. కామెడీలో భాగంగా లక్ష్మీపార్వతి గొంతును కూడా అనుకరించాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆమెను నేరుగా పిలిపించి ఉంటే బాగుండేది కదా అని ఆమె గొంతును రఘురామకృష్ణం రాజు అనుకరించారు.

పండుగ రోజున పక్కనే ఉన్న కనకదుర్గమ్మ గుడికి వెళ్లి ముఖ్యమంత్రి దంపతులు దర్శనం చేసుకుని ఉంటే బాగుండేది. కానీ దేవాలయానికి వైయస్ భారతి రెడ్డి వెళ్ళదు. ఆమె సెట్టింగ్ దేవాలయాలకు మాత్రమే అటెండ్ అవుతారు. ఇప్పట్లో పండగలు ఏమీ లేవు. మళ్లీ పండగలు వచ్చేసరికి మీ పదవీకాలం అయిపోతుంది.

హిందువులను ప్రసన్నం చేసుకోవాలంటే మా మతాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఆలయాలకు దంపతులు కలిసి వెళ్లాలి. ప్రసాదాన్ని వాసన చూడడం కాదు. భక్తితో అంతఃకరణ శుద్ధితో దేవాలయానికి వెళ్లి దేవుని ప్రసన్నం చేసుకోవాలి. ప్రసాదాన్ని వాసన చూసే బదులు, హైజనిక్ గా ప్రసాదాన్ని సిద్ధం చేయిస్తే బాగుంటుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు .

బిసి, ఎస్సీ విద్యావేత్తలకు వైస్ ఛాన్స్లర్ పదవి కట్టబెట్టకుండా ఈ బరితెగింపు ఏమిటి?
ఎన్నికలు నెత్తి మీద ఉన్న నేపథ్యంలో నా బీసీలు ఏసీలు ఎస్టీలు అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ పదవులు బీసీ, ఎస్సీ విద్యావేత్తలకు కాకుండా తన సామాజిక వర్గానికి చెందిన వారికి కట్టబెట్టడం ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

వైకాపా కార్యకర్తగా ముద్రపడిన ప్రసాద్ రెడ్డికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ పదవి పొడగించడం హాస్యాస్పదంగా ఉంది. అలాగే శ్రీకాంత్ రెడ్డి పదవీ కాలాన్ని కూడా పొడిగించడం విడ్డూరం. మరో రెండు నెలలు మాత్రమే అధికారంలో కొనసాగే ఈ ప్రభుత్వం వైస్ ఛాన్స్లర్లుగా ఎస్సీ బీసీ విద్యావేత్తలను నియమించకపోవడం ఏమిటని ప్రజలు ఆలోచిస్తున్నారు.

ఒకవేళ ముఖ్యమంత్రి తన సామాజిక వర్గానికి చెందిన వారిని వైస్ ఛాన్స్లర్లుగా నియమించాలనుకుంటే నిష్ణాతులను నియమిస్తే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. కానీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ప్రసాద్ రెడ్డి పదవీ కాలాన్ని పొడిగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్లుగా ఎంతోమంది మహానుభావులు పనిచేశారు.

సి ఆర్ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి వారు వైస్ ఛాన్స్లర్లుగా వ్యవహరించిన ఆంధ్ర యూనివర్సిటీ కి ప్రసాద్ రెడ్డి వంటి వైస్ ఛాన్స్లర్ ను నియమించడం విడ్డూరంగా ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

52 లక్షల దొంగ ఓట్లు… ఇప్పుడు 11 లక్షలకు వచ్చాయి
రాష్ట్రంలో గతంలో 52 లక్షల దొంగ ఓట్లను నమోదు చేయగా, ఎన్నికల కమిషన్ ఇప్పుడు సీరియస్ గా దృష్టి సారించడంతో 11 లక్షలకు చేరుకున్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆ 11 లక్షలను కూడా ఒకటి రెండు లక్షలకు తీసుకురావాలి.. గతం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి గిరీశ చేసిన ఓవర్ యాక్షన్ కు ఇప్పుడు ఎన్నికల సంఘం సరైన గుణపాఠాన్ని నేర్పింది.

తిరుపతిలో 30 వేల దొంగ ఓట్లను గిరీష చేర్పించారు. తిరుపతి ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గే వారు. అయినా మెజారిటీ కోసమని దొంగ ఓట్లను చేర్పించారు. అప్పుడు గిరిష ఇక్కడ వరకు పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న ఆయన్ని ఎన్నికల సంఘం శంకరగిరి మాన్యాలకు పంపించింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇకనైనా పిచ్చి పనులు చేయొద్దు.

తమ క్రెడిబిల్టీని కాపాడుకోవాలి. డబ్బులు ఎన్ని సంపాదించినా క్రెడిబిలిటీ అన్నది లేకపోతే ప్రయోజనం శూన్యం. ఇప్పుడు గిరీష ఇక్కడ పనిచేసిన ఆయనకు ఎటువంటి క్రెడిబిలిటీ ఉండదు. ఎవరు కూడా ఆయన్ని గౌరవించారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇప్పటికైనా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు దొంగ ఓట్లకు సహకరించే పిచ్చి వేషాలు వేయొద్దు. పాల సముద్రం వద్ద ప్రధానమంత్రి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. ఈ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదన్న రఘురామ కృష్ణంరాజు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నిజాయితీగా తమ పనులు చేయాలన్నారు.

తెదేపా, జనసేనలో నాకు టికెట్ లేదంటూ పిల్ల సజ్జల ప్రచారం
తెదేపా, జనసేన పార్టీలో నాకు టికెట్ లేదని పిల్ల సజ్జల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఊరిలో తెదేపా, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిశారు. అందరం కలిసి ముందుకు వెళ్లాం. తెదేపా, జనసేన పార్టీల జిల్లా అధ్యక్షులతో మొదలుకొని, పెద్ద నాయకుల వరకు అందరూ కలిశారు.

నా టికెట్ సంగతి మీకెందుకు… నాపై ఎవరిని పోటీకి దింపుతారో ముందు అభ్యర్థిని వెతుక్కోండి. నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో, ఆ పార్టీ నాయకత్వంతో మాట్లాడుతానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఢిల్లీ నుంచి న్యాయవాదులు కూలీకి వస్తారు… నేను ప్రాణం పెట్టి పని చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి పేర్కొన్నట్లుగా పత్రికల్లో చూశాను.

ఈ నాలుగేళ్లలో సుధాకర్ రెడ్డి 20 కోట్ల రూపాయలకు బిల్లులు పెట్టినట్లు తెలిసింది. ప్రాణం పెట్టి పని చేస్తానని చెబుతున్న అదనపు అడ్వకేట్ జనరల్ ఈ నాలుగేళ్లలో ఎంతకు బిల్లులు పెట్టారో చెప్పాలి. ఒకవేళ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేస్తే హ్యాట్సాఫ్ చెబుతానని రఘురామకృష్ణం రాజు అన్నారు.

LEAVE A RESPONSE