Suryaa.co.in

Editorial

అవును… జనం వాళ్లను ఇష్టపడ్డారు!

– డీజీపీగా ఏబీ వెంకటేశ్వరరావు
– స్పీకర్‌గా రఘురామకృష్ణంరాజు
– అభిమానుల ఊహలకు రెక్కలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఊహలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. ఎదుటివారితో పనిలేకుండానే అవి వచ్చేస్తుంటాయి. ఎందుకంటే అవి ఊహలే కాబట్టి! ఇప్పుడు జనాలు ఇద్దరు వ్యక్తుల విషయంలో ఎవరికి వారు.. ఆ ఇద్దరికీ సంబంధం లేకుండానే ఊహించేసుకుంటున్నారు. అది కూడా వారిద్దరి భవిష్యత్తుకు సంబంధించి! అది సాధ్యమా? అసాధ్యమా? అన్నది వారికి అనవసరం. వారిద్దరి ఇష్టాలతో ప్రమేయం లేకుండానే.. అసలు జరుగుతుందా అన్న దానితో సంబంధం లేకుండాదే ఊహలు సాగిపోతున్న వైచిత్రి. అందులో ఒకరు రిటైరయిన డీజీపీ స్ధాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. మరొకరు ఉండి టీడీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు!

ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా రిటైరయ్యారు. అయితే ఆయన డీజీపీ కావాలన్నది చాలామంది ఊహ. ఆ కోరిక నెరవేరుతుందా? అసలు సాధ్యమవుతుందా? అన్నది వారికి అనవసరం. వారి కోరిక మేరకు సోషల్‌మీడియాలో ఎవరికి నచ్చినట్లు వారు ఊహించేసుకుని, ఆయన డీజీపీ పోస్టు ఇచ్చేశారు. చంద్రబాబు సీఎం అయితే, ఏబీకి డీజీపీ పోస్టింగ్ ఇస్తారు. ఇదీ వారి ఊహ. ఎవరిష్టం వారిది!

ఇక రఘురామకృష్ణంరాజు. ఇంకా ఎన్నికల ఫలితాలు రానేలేదు. కానీ ఆయనను జనం ఏపీ శాసనసభ స్పీకర్‌గా ఫిక్సయిపోయారు. దానికి సంబంధించి కూడా భలే గమ్మతు ఊహలు. రాజు స్పీకర్ స్థానంలో ఉంటే, వైసీపీ పక్ష నేత జగన్ ఆ సీట్లో కూర్చోవడానికి ఇబ్బంది పడతారు. ఆయన మైక్ అందుకోవడానికి పైకి లేస్తే కట్ చేస్తారు. ఆయన మాట్లాడుతుంటే.. ‘మీరు మాట్లాడింది సరిపోతుంది. ఇక చాలించి కూర్చోండి’ అంటారు. ఇంకా జగనన్న వాదనకు దిగితే ఎహె..కూర్చోవోయ్ అంటారు. దానితో ఇక జగన్ అసెంబ్లీకి రారు.. ఇదీ రఘురామకృష్ణంరాజు అభిమానుల ఊహ.

నిజంగా స్పీకర్ అలా వ్యవహరిస్తారా? లేదా? అన్నది వారికి తెలియదు. వారికి అది అనవసరం కూడా. అంటే ఇంకా ఫలితాలు రాకముందే.. చంద్రబాబు క్యాబినెట్ తేలకముందే.. జనం రఘురామకృష్ణంరాజును స్పీకర్‌గా చేసేశారన్నమాట! ఊహలకు రెక్కలొస్తే ఎవరిని కంట్రోల్ చేస్తాం చెప్పండి?!

LEAVE A RESPONSE