Suryaa.co.in

Editorial

కౌంటింగ్ కుట్ర?

-కౌంటింగ్ కేంద్రాలలో అల్లర్లు?
-సజ్జల వీడియోతో కూటమి అప్రమత్తం
-ఏజెంట్లను రెచ్చగొట్టిన సజ్జలపై ఫిర్యాదు
-అధికారులతో వాదించాలన్న సజ్జల పిలుపుతో హై అలెర్ట్
-కౌంటింగ్ పారామిలటరీ ప్రవేశం తప్పదా?
-కౌంటింగ్ సెంటర్లో ఏజెంట్ల వెనుక పోలీసులు
-ఈసీకి కూటమి ఫిర్యాదుతో ఈసీ యోచన?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ ఎన్నికల కౌంటింగ్ రోజున హింస జరిగే అవకాశం ఉందా? వైసీపీ ఏజెంట్లు తమ పార్టీ ఓడిపోయే తరుణంలో అధికారులతో ఘర్షణకు దిగుతారా? సర్కారీ సలహాదారు సజ్జల వ్యాఖ్యలు ఈ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయా? అందుకే పోలింగ్ బూత్లో తొలిసారి పారా మిలటరీ పహారా కాసేందుకు సిద్ధమవుతోందా? ఆ మేరకు ఈసీ ఉత్తర్వులిచ్చేందుకు రంగం సిద్ధపడుతోందా?.. తాజా పరిణామాలు ఇలాంటి సంకేతాలిస్తున్నాయి.

కౌంటింగ్ రోజున కుట్ర జరుగుతుందా? ఆ మేరకు అధికార పార్టీ రంగం సిద్ధం చేసిందా? ఇప్పుడు ఎన్డీయే కూటమి ఆందోళన ఇదే. ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. కౌంటింగ్ ఏజెంట్లుగా అధికారులతో కొట్లాడేవారే ఉండాలని, అధికారులు సర్దిచెబితే మౌనంగా ఉండేవారిని ఏజెంట్లుగా పంపవద్దన్న సజ్జల వ్యాఖ్యలు, ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.

దానితో కౌంటింగ్ హాళ్లలో అల్లర్లు సృష్టించేందుకు, వైసీపీ కుట్రలకు పాల్పడుతోందన్న అనుమానం విస్తృతమయింది. ఆ మేరకు ఎన్డీయే కూటమి ఈసీకి ఫిర్యాదు చేసింది. ఏజెంట్లను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన సజ్జలను అరెస్టు చేయాలని ఫిర్యాదు చేసింది. ఫలితంగా కౌంటింగ్ సెంటర్లలో కూడా, పారామిలటరీ సిబ్బందిని ఉంచాలన్న కొత్త డిమాండు తెరలేచింది. కౌంటింగ్ సెంటర్లు పారామిలటరీ అధీనంలో ఉంటేనే, కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని కూటమి ఈసీని కోరుతోంది.

పోలీసులు సైతం ఏజెంట్ల వెనుక ఉండేలా ఆదేశించాలని కోరుతోంది. ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప, ఏపీలో కౌంటింగ్ ప్రశాంతంగా జరగదని స్పష్టం చేస్తోంది. అల్లర్లు సృష్టించడం ద్వారా, ప్రజల దృష్టి మరల్చాలన్నదే వైసీపీ ప్రధాన లక్ష్యమంటున్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్లో, తీవ్రమైన కేసులున్న వైసీపీ ఏజెంట్లపై దృష్టి సారించాలని కూటమి నేతలు ఈసీకి సూచిస్తున్నారు.

దీనితో ఈసీ సైతం కౌంటింగ్ సమయంలో, కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ మేరకు కౌంటింగ్ కేంద్రాలలో పారామిలటరీ సిబ్బందిని, భద్రత కోసం వినియోగించాలని ఆదేశించవచ్చంటున్నారు. దానితోపాటు ప్రతి ఏజెంటు వెనుక, ఒక పోలీసు ఉండేలా చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. అధికారులతో ఘర్షణకు దిగే ఏజెంట్లను అక్కడే అరెస్టు చేసి, కౌంటింగ్ ముగిసేవరకూ వారిని అక్కడే ఉంచేలా ఆదేశాలిచ్చే అవకాశాలు లేకపోలేదని సమాచారం.

LEAVE A RESPONSE