– ఎల్బీ స్టేడియంలోని యోగ కౌంట్ డౌన్ మహోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ : నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో 24 గంటల ముందు కౌంట్ డౌన్ మహోత్సవం ప్రారంభమైంది. ఈ వేడుకల్లో ప్రముఖ యోగా సంస్థలు, విద్యా సంస్థలు, సామాజిక సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ నటినటులు సాయిధరమ్‌తేజ్ ఖుష్బూ, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగ. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో యోగను గుర్తించి, ఆచరిస్తున్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన అంశం. ప్రధాని నరేంద్ర మోదీ యోగను ప్రపంచానికి పరిచయం చేసినందుకు తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వక కృతజ్నతలు తెలియజేస్తున్నాం.
నేడు తేదీన అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో వేడుకలు జరుపుకోవాలి. శుక్రవారం నుంచి 24 గంటల కౌంట్ డౌన్ వేడుకలను ఎల్బీ స్టేడియంలో నిర్వహించుకుంటున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలుగు నేల విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి యోగలో పాల్గొనడం సంతోషకరం. తెలుగు ప్రజలు గర్వించాల్సిన విషయం.
యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. యోగ ద్వారా మానసికంగా, శారీరకంగా బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది.. మన కుటుంబం, సమాజం, ప్రపంచం బాగుంటుంది. యోగనే మనకు ప్రథమ డాక్టర్. యోగ సర్వరోగ నివారిణి. యోగా పాటించినట్టయితే జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. యోగను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరుతున్నాను.