నీదారిలో నువ్వు రా… నా దారిన నేను వస్తా

-చెప్పటం నా ధర్మం, వినకపోతే 18 తర్వాత మీ ఖర్మం
-సీఎం నాయకత్వంలో, డిజిపి నేతృత్వంలో భీమవరం సభకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు
-ఆ రెండు రోజులు కాకుండా, ఆ తర్వాత ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధం
-అదనపు రక్షణ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ 
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

భీమవరంలో ఈనెల నాలుగవ తేదీన జరిగే అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నా దారిలో నేను వస్తా… నీ దారిలో నువ్వు రా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు సూచించారు. ప్రధాని మంత్రి పాల్గొనే సభలో ఒక ఎంపీ ని పాల్గొనకుండా అడ్డుకునేందుకు కుట్ర చేయడం సరికాదని హితవు పలికారు. చెప్పటం తన ధర్మమని, వినకపోతే 18వ తేదీ తర్వాత మీ కర్మం అంటూ… అల్లూరి విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.

తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని భీమవరంలో, అది తన ఇంటికి కూతవేటు దూరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరవుతుంటే, ఎంపీగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం తన బాధ్యత అని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. తాను సభలో పాల్గొంటే ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది ఏమిటో.. అర్థం కాలేదన్నారు. తాను ఆయనకంటే పొడుగ్గా ఉన్నానని భావిస్తే, దూరంగా నిలుచుంటానని… సంస్కారవంతుడిని కాబట్టి ముఖ్యమంత్రి ఎదురుపడితే నమస్కారం పెడతానని వెల్లడించారు. నమస్కారం పెట్టిన వారికి ప్రతి నమస్కారం పెట్టడం సంస్కారమని, ఆ సంస్కారాన్ని కూడా తాను పాటించలేనని ముఖ్యమంత్రి తనకు ఎవరితోనైనా చెప్పిస్తే… ఆయన ఎదురుపడినా కూడా నమస్కారం పెట్టనని తెలిపారు. ప్రధాని సభకు కష్టపడి డ్వాక్రా మహిళలను పిలువ వలసిన అవసరం లేదని, తాను సభలో పాల్గొంటున్నానంటే ప్రజలు హాజరవుతారని చెప్పారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలు నాయకుడిగా కీర్తిస్తున్న ప్రధానమంత్రిని చూడడానికి వస్తారన్నారు. మీరు వస్తున్నారంటే కొంతమంది తగ్గవచ్చు కానీ, సభ విజయవంతం అవ్వడం ఖాయమని పేర్కొన్నారు. సభకు ఎటువంటి అడ్డంకులు సృష్టించవద్దని పోలీసులకు చెప్పాలన్నారు. తనకు అదనపు భద్రత కల్పించాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశానని తెలిపారు. కోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లుగా రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ప్రధాని పాల్గొని సభలో పాల్గొనడం ప్రతి పౌరుడికి ఉన్న హక్కు అని, ఒక ఎంపీగా తన ప్రాథమిక హక్కు న్యాయస్థానం కాపాడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. లోక్ సభ నాయకుడు, ప్రధానమంత్రి మోడీ, తన సహచర ఎంపీ హక్కులకు భంగం కలగకుండా చూసుకుంటారని ఆశిస్తున్నట్లు రఘురామ పేర్కొన్నారు. భీమవరంలో జరిగే అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడానికి తన శ్రేయోభిలాషులందరూ చెప్పినట్లుగా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నట్లు తెలిపారు.

భూమి పుట్టాక ఇంత అనాగరికపాలన చూడలేదు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో తనని భీమవరం సభలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రధానమంత్రి పాల్గొనే సభలో, ఒక ఎంపీకి భద్రత కల్పించ లేకపోతే… వీళ్లే తప్పుడు కేసులు పెట్టారని అందరికీ అర్థమైతే, ఇప్పటికే ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సున్నా… లా అండ్ ఆర్డర్ జీరో, ఇక ఈ రాష్ట్రం వైపు ఎవ్వరు కన్నెత్తి కూడా చూడారని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ఇంతటి నిరంకుశ , ఆటవిక, అనాగరిక పరిపాలనను భూమి పుట్టాక ఎప్పుడు లేదన్నారు. అర్ధరాత్రి పోలీసులు ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి, అదేమని ప్రశ్నిస్తే… విధి నిర్వహణకు అడ్డుకున్నారని అదనంగా మరో కేసు పెట్టడమే ప్రజాస్వామ్యమా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఇంటిదగ్గర నిరసన తెలిపిన వారిపై అత్యాచార కేసు, ఎవరితో మాట్లాడకుండా ఇంట్లో కూర్చున్న వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడం ఈ రాష్ట్ర పోలీసుల ధమనకాండ కు ప్రత్యక్ష సాక్షాలని రఘురామకృష్ణం రాజు వీడుచుకపడ్డాడు. రాష్ట్ర పోలీసులు ఇప్పటికే ప్రజల దృష్టిలో చులకనయ్యారని, కోర్టు సహకరించమని ఆదేశాలు జారీ చేసిన తుగ్లకు వేషాలు వేస్తే కచ్చితంగా ప్రజల దృష్టిలో మరింత చులకన అవుతారని హెచ్చరించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించి, ఆ ఘర్షణలకు తానే కారణమని కేసులు పెట్టాలని ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పోలీసులు పథక రచన చేసినట్లు తెలిసిందన్నారు. మూడు, నాల్గవ తేదీలలో కాకుండా, నీ స్క్రీన్ ప్లే ప్రకారమే ఘర్షణలు జరిపించి ఆ తర్వాత సి ఆర్ పి సెక్షన్ 41 ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి ఎన్ని కేసులు పెట్టుకున్న తాను ఎదుర్కోవడానికి సిద్ధమేనని ప్రకటించారు. అల్లూరి విగ్రహావిష్కరణ శిలాఫలకంపై తన పేరు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా తనకు సమాచారం అందిందని, ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేసేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారని చెప్పారు. అయితే ఈ విషయమై తాను గోవిందు మోహన్ కు లేఖ రాశానని, ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడకుండా చూడాలని కోరానన్నారు. ఒకవేళ ఫోటో కాల్ ఉల్లంఘనలకు పాల్పడితే పార్లమెంట్ హక్కుల కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.

మీరు చెప్పిందంతా నమ్ముతాం… ఎందుకంటే మీ పార్టీలో ఉన్నాం
ఉడతలు 11 కెవి, 33 కెవి వైర్లను కొరుకుతున్నాయని, ఎలుకలు నాణ్యమైన మద్యంను తాగుతున్నాయని… ఆంధ్రప్రదేశ్ లోని జంతువుల ప్రాశస్త్యం ఏమిటో అంతుచిక్కడం లేదని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 11 కెవి, 33 కెవి వైర్లను కోరిక గలిగే ఉడతలు ఉన్నాయంటే, అది ఉడతల గొప్పతనం?, లేకపోతే వైర్ల లోపమా?? అంటూ ప్రశ్నించారు. ఏపీలో జరిగిన ఆటో విద్యుత్ ఘాతం ప్రమాదంపై సాక్షి దినపత్రిక కథనంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆటోపై ఇనుప మంచం ఉన్నట్లు… ఆటోలో కూర్చున్న ఒక వ్యక్తి నేలపై కాలు పెట్టినట్టు సాక్షి దినపత్రిక కథనాన్ని ప్రచురించిందని, దానికి ఉడత వచ్చి సాక్షి దినపత్రికకు సాక్ష్యం చెప్పిందా? అంటూ అపహాస్యం చేశారు.

రాష్ట్రంలో రథం తగలబడి పోయిందంటే, దానికి తేనే తుట్టెను కదల్చడానికి అర్ధరాత్రి నిప్పు పెట్టడమే కారణమని చెప్పుకొచ్చారని, మద్యం భారీగా తగ్గింది అంటే… ఎలుకలు నాణ్యమైన మద్యం తాగాలని చెప్పారని రఘురామ గుర్తు చేశారు. ఎలుకలు మద్యం బాటిల్ మూతలు తీసి తాగాయా? అంటూ అపహస్యం చేశారు. ఇక దొంగలను కుక్కలు తరిమితే కోర్టు హాలులో దూరి, అక్కడ కనిపించిన బ్యాగును సరదాగా, దొంగతనం చేయ బుద్ధి కావడంతో, దొంగతనం చేస్తే అందులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కి సంబంధించిన కేసు ఫైలు ఉన్నట్లు కట్టు కథలు చెప్పారని విమర్శించారు. మీరు ఎన్ని కథలు చెప్పినా నమ్ముతామని… ఎందుకంటే మీ పార్టీలో ఉన్నాము కదా అంటూ అపహాస్యం చేశారు.

Leave a Reply