– మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి: సమాజాభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రజలకు సేవలు అందించడంలో యువత స్ఫూర్తిదాయకంగా నిలవాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు. గతేడాది చోటు చేసుకున్న బుడమేరు వరద బీభత్సంతో అతలాకుతలమైన విజయవాడలో ప్రజలకు రాత్రింబవళ్లు సేవాస్ఫూర్తితో సేవలు అందించిన 427 మంది యువతకు మంత్రి ఫరూక్ ప్రశంసా పత్రాలు అందజేశారు. బుధవారం సచివాలయంలోని న్యాయ మైనార్టీ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
బుడమేరు ముంపు ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సత్వరమే అండగా నిలిచేందుకు తాను ఇచ్చిన పిలుపుతో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లి ఆధ్వర్యంలో సమితి బృంద సభ్యులు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం అభినందనీయమని మంత్రి అన్నారు. యువత సేవలను అభినందిస్తూ వారికి ప్రశంసా పత్రాలను అందజేసి భవిష్యత్తులో కూడా సమాజాభివృద్ధిలో, ప్రజా సంక్షేమం కోసం యువత తన వంతు కృషి చేయాలని మంత్రి సూచించారు. బుడవేరు వరద ముంపు ప్రాంతాలలో సేవలందించిన 427 మంది స్కౌట్, జమీయాత్ యూత్ సభ్యులను అభినందించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ కార్యక్ర మాలపై రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమీక్షించారు. బుధవారం మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి కె.హర్షవర్ధన్, మైనారిటీ సంక్షేమ శాఖ కమీషనర్ సిహెచ్ . శ్రీధర్ లతో చర్చించారు.