ఎస్టీ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సిపిదే హవా …

ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పుటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మొత్తం ఏడు ఎస్టీ నియోజకవర్గాల్లో ఆరింటిని వైఎస్‌ఆర్‌సిపి, ఒకటి టిడిపి గెల్చుకునే అవకాశాలున్నాయి. పీపుల్స్‌ పల్స్‌ పొలిటికల్‌ రీసర్చ్‌ సంస్థ ఈ నియోజవకర్గాల్లో ట్రాకర్‌ పోల్‌ సర్వే నిర్వహించింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు 44.25 శాతం, టిడిపికి 39.39 శాతం, జనసేన 8.19 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయని మొదటి ట్రాకర్‌ పోల్‌లో తేలింది. టిడిపిపై వైఎస్‌ఆర్‌ పార్టీ 4.86 శాతం పైగా ఆధిక్యత కనబరుస్తోంది. టిడిపి-జనసేన మధ్య అవగాహన కుదిరి రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో… మొత్తం ఈ ఏడు నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి పరిశీలిస్తే రంపచోడవరం, పాడేరు, అరకు, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజవకర్గాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, పోలవరం నియోజకవర్గంలో టిడిపి పార్టీలకు సానుకూల వాతావరణం కనిపిస్తుందని పీపుల్స్‌ పల్స్‌ సర్వేలో తేలింది.

2019 ఎన్నికలతో పాలిస్తే, నాటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా పొందని టిడిపి ఈ సారి మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కలిపి సగటున దాదాపు 9.6 శాతం ఓట్లు అధికంగా పొందుతున్నప్పటికీ, ఒక్క పోలవరం సీటు మాత్రమే సాధిస్తుందని తాజా సర్వేలో తెలుస్తోంది. ఇక్కడ కూడా ఓట్ల వ్యత్యాసం 1.93 శాతం మాత్రమే! మరోవైపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ 2019 తో పోలిస్తే ఈసారి 4.94 శాతం ఓట్లను కోల్పోనుంది. పోలవరంలో టిడిపికి ఆధిక్యత లభించడానికి ప్రధాన కారణం పోలవరం ముంపు గ్రామాల్లో పునరావాసంపై పురోగతి లేకపోవడం, దీనికి తోడు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవడం, విలీన మండలాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమవడమేనని తెలుస్తోంది. జనాభిప్రాయాన్ని బట్టి ఇటువంటి కారణాల వల్లే పరిస్థితులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మారాయి. రంపచోడవరంలో 13.97, అరకులో 9.23, కురుపాంలో 9.09, పోలవరంలో 7.27, పాడేరులో 7.29, సాలూరులో 5.18, పాలకొండలో 5.3 శాతం ఓట్లు జనసేన పొందుతుందని మొదటి ట్రాకర్‌ పోల్‌లో వెల్లడవడంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కీలక పాత్ర పోషించనుందనే సంకేతాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి.

టిడిపి- జనసేన పొత్తు పెట్టుకుంటే రాబోయే ఎన్నికలపై దాని ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. వైఎస్‌ఆర్‌సీపీ గెలిచే ఆస్కారమున్న స్థానాల్లోని పాలకొండ ‘నువ్వా`నేనా?’ అన్నట్టుంది. అది మినహాయించి మిగతా చోట్ల వైఎస్‌ఆర్‌సిపి`టిడిపిల మధ్య ఓట్ల వ్యత్యాసం 6 నుండి 8 శాతం ఉంది. పాలకొండలో కేవలం 1.31 శాతం ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. మొదటి ట్రాకర్‌పోల్‌ ప్రకారం పాలకొండలో జనసేన 5.3 శాతం ఓట్లు పొందనుంది. ఇక్కడ జనసేన కీలకం కానుంది. పోలవరంలో టిడిపి 1.93 శాతం వ్యత్యాసంతో ఆధిక్యత కనబరుస్తోంది. ఇక్కడ జనసేనకు 7.27 శాతం ఓట్లు రానున్నాయి. పొత్తు కుదిరితే ఈ కూటమికి మరింత ప్రయోజనం చేకూరుతుంది. టిడిపి-జనసేన పార్టీల మధ్య పొత్తు ఎస్టీ రెసెర్వెడ్ నియోజకవర్గాల్లో కీలక పాత్రను పోషించనుందని ఈ ట్రాకర్‌పోల్‌ ఆధారంగా చెప్పవచ్చు.

రాష్ట్ర విభజన అనంతరం 2014లో టిడిపి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది, ఆ ఎన్నికల్లో ఒక్క పోలవరం సీటు మాత్రమే టీడీపీ గెల్చుకోగా మిగతా ఆరు సీట్లను వైఎస్‌ఆర్‌సిపి కైవసం చేసుకుంది. 2019 ఎన్నికల్లో టీడీపీకి కనీసం ఒకసీటు కూడా రాలేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల ఫలితాలను పరిశీలిస్తే టిడిపి ఒక్క అరకులో మాత్రమే గెలవగా, కాంగ్రెస్‌ మిగిలిన ఆరు స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల చరిత్ర, ఫలితాల సరళి గమనిస్తే ఎస్టీ రెసెర్వెడ్ నియోజకవర్గాల్లో టిడిపికి మొదటి నుండి పట్టు తక్కువగానే ఉందని చెప్పవచ్చు.

2009 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజారాజ్యం ప్రభావం కూడా ఎస్టీ నియోజకవర్గాల్లో నామమాత్రంగానే ఉంది. కేవలం కురుపాంలో రెండవ స్థానం పొందింది. 2019 ఎన్నికలకు సంబంధించి సీఎస్‌డిఎస్‌-లోక్‌నీతి నివేదిక ప్రకారం గిరిజనుల్లో 86 శాతం మంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను, 14 శాతం మంది టిడిపిని బలపరిచారు. గిరిజనుల్లో ఉపకులాల మధ్య వైరుధ్యం ఉంది. ఈ ఏడు స్థానాల్లో కోయా, కొండా రెడ్డి, కోయ దొర, కొండ కమ్మరి, కొండ దొర, బగత, వాల్మీకీ, కొండ కుమ్మరి, కోండు, కోటియ, కోడు, జాతాపు, సవర, కాపు, షెట్టి బలిజ, కమ్మ, మాల, మాదిగ, కొప్పుల వెలమ, తూర్పు కాపు సామాజిక వర్గాలు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి.

పీపుల్స్‌ పల్స్‌ మొదటి ట్రాకర్‌ పోల్‌ సర్వే అంచనాల ప్రకారం ఎస్సీ,ఎస్టీ వర్గాలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు మద్దతిస్తుండగా, బీసీ, అగ్రకుల వర్గాలు టిడిపికి మద్దతుగా నిలుస్తున్నాయి. అగ్రకులాల్లో సుమారు 16 శాతం జనసేనకు మద్దతిస్తున్నారు. వయసుల రీత్యా పరిశీలిస్తే 36 నుండి 60 సంవత్సరాల వాళ్లు వైఎస్‌ఆర్‌కు మద్దతిస్తుండగా, 18-35 మధ్య వయస్సుగల యువతరం టిడిపి వెంట ఉన్నారు. 18-35 వయస్సుల వారిలో దాదాపు 14 శాతం మంది జనసేనకు మద్దతుగా ఉన్నారు. ఏడు నియోజకవర్గాల్లోనూ ఐటిడిఏ పనితీరుతో పాటు వారి ఎమ్మెల్యేల పనితీరుపై కూడా పౌరులు అసంతృప్తిగా ఉన్నారు. మైనింగ్‌లో అక్రమాలపై ప్రభుత్వ తీరును అత్యధికులు విమర్శిస్తున్నారు. గిరిజనులకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినా, ఆయా తెగల వారికి రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శ ఉంది. ఉపముఖ్యమంత్రి హోదా ఉన్నా వారు కేవలం సొంత నియోజకవర్గానికే పరిమితమవుతూ, మిగతా ఎస్టీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి.

ఎస్టీ నియోజకవర్గాల్లో ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్‌జీఓ సంస్థల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆశించిన మేరకు అభివృద్ధి పాలకపక్షాలు చేయలేదనే అభిప్రాయం గిరిజనులలో నెలకొని ఉంది. ప్రధాన రాజకీయపక్షాలైన టిడిపి- జనసేన, బిజెపి, కాంగ్రెస్‌ తదితర పార్టీలు గిరిజనుల సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదనే భావన వారిలో ఉంది. ఇదే సమయంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కొంతమేరకు వారి సంక్షేమం కోసం కృషి చేశాయని గిరిజనులు భావిస్తున్నారు. ఈ కారణంగా పోలవరం, రంపచోడవరం, అరకు, పాలకొండ నియోజవర్గాల్లో సీపీఐ(ఎం), పాడేరులో సీపీఐ పార్టీల ప్రభావం కొంతమేరకు కనిపిస్తోంది. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ ఈ నియోజకవర్గాల్లో ఉనికిలో కూడా లేవు.

పీపుల్స్‌పల్స్‌ 2023 జనవరి 16 నుండి 21 తేదీల మధ్య ట్రాకర్‌ పోల్‌ సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసుకొని శాస్త్రీయ పద్దతిలో శాంపిల్స్‌ను సేకరించింది. సమాజపు విభిన్న వర్గాలు, వయసు-చదువు-ఆర్థిక నేపథ్యాల పరమైన వైవిధ్యం కోసం ఓటరు జాబితా ఆధారంగా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 20`25 మందిని శాంపిల్‌గా తీసుకున్నారు. మొత్తం 700 శాంపిల్స్‌ను క్షేత్రస్థాయిలో సేకరించారు. సర్వేలో పురుషులు, మహిళలను సమానంగా ఎంచుకున్నారు. ముఖాముఖి పద్దతిలో ఈ సర్వే నిర్వహించబడిరది.

వివిధ రాజకీయ పార్టీల పట్ల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ర్లు ఈ సర్వేలో ప్రజా సమూహంతో చర్చలు జరిపి, వారి అంచనాలను కూడా సేకరించారు. ఇది మొదటి ట్రాకర్‌ పోల్‌, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చొప్పున మరో మూడు ట్రాకర్‌ పోల్‌ సర్వేలను పీపుల్స్‌పల్స్‌ నిర్వహించనుంది. మొదటి ట్రాకర్‌ పోల్‌ సర్వేలో పార్టీల పొత్తుల గురించి ప్రస్తావించలేదు. రాబోయే ట్రాకర్‌ పోల్‌ సర్వేల్లో పొత్తులను బట్టి, వాటిపై జనాభిప్రాయం, జనం మద్దతు తదితరాంశాల్లో విషయ సేకరణ చేపడుతుంది.

– ఆర్‌.దిలీప్‌రెడ్డి,
డైరెక్టర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ

Leave a Reply