ప్రభుత్వాలు పటిష్టమైన సామాజిక రక్షణ పథకాలను అమలు జరపనట్లయితే వచ్చే దశాబ్ది కాలంలో ఆసియాలో 26 కోట్ల మంది దారిద్య్రంలోకి దిగజారే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక హెచ్చరించింది.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో దారిద్య్రం పెరుగుతోందని, అసమానతలు విస్తరిస్తున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
మొత్తంగా చూసినపుడు ఈ ప్రాంతంలోని 45 శాతం జనాలకు సామాజిక భద్రతా పథకాలు అమలు కావటం లేదు. అమలు జరుగుతున్న పథకాలు కూడా ఎంత మందికి మేలు చేస్తున్నాయన్నది ప్రశ్న. ఈ నివేదిక ఆసియా గురించి చెప్పింది గనుక మనదేశం మినహాయింపు కాదు.
మరోవంక, భారత ప్రభుత్వం జాతీయ సామాజిక సహాయ పథకం సోషల్ ఆడిట్ 2023 నివేదికను విడుదల చేసింది. 1995 నుంచి ఈ పథకం అమలు జరుగుతోంది. దీనికి ఐదు ఉప పథకాలు ఉన్నాయి. వాటిలో ఒకటైన వృద్ధాప్య పెన్షన్ కింద అరవై సంవత్సరాలు నిండితే నెలకు రూ.200, 80 ఏళ్లు దాటితే రూ.500 ఇస్తున్నారు. ఈ మొత్తాలు ఏమాత్రం అక్కరకు వస్తాయో తెలియదు.
ఆంధ్రప్రదేశ్‌లో నెలకు రూ. నాలుగు వేలు గరిష్టంగా ఇస్తున్నారు. కానీ చాలా రాష్ట్రాలలో వెయ్యి రూపాయలకు మించి ఇవ్వటం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకమైనా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచకుండా పాతికేళ్ల నాటి మొత్తాలే ఇస్తున్నారు. అంతర్జాతీయ సంస్థల దృష్టిలో ఇదొక ఉద్ధరణ పథకం.
ఒకవైపు కోట్లాది మందిని దారిద్య్ర రేఖ నుంచి ఎగువకు తెచ్చి ఉద్ధరించినట్లు చెప్పుకుంటూ, మరోవైపు సామాజిక సంక్షేమం కింద 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నట్లు చెప్పుకోవడం విస్మయం కలిగిస్తుంది. విషాదకరమైన అంశం ఏమిటంటే అసలు దారిద్య్ర రేఖకు ప్రాతిపదిక ఏమిటన్న విషయం మీద ఇంతవరకు ఏకాభిప్రాయం లేదా ప్రమాణం లేదు.
సాంకేతికంగా ఒక ప్రాతిపదికను గుర్తించినప్పటికీ అనేక దేశాల్లో దానికి ఎగువన వున్న అనేక కోట్ల మంది ఎప్పుడైనా దారిద్య్రంలో తిరిగి కూరుకుపోయే వారిగా ఉన్నారు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రపంచ బ్యాంకు 2017లో దుర్భర దారిద్ర్య రేఖ ప్రమాణంగా రోజుకు పిపిపి పద్ధతిలో ప్రతి మనిషికి 1.9 డాలర్లుగా ఉన్నదాన్ని 2.15 డాలర్లకు పెంచి అంత కంటే తక్కువ ఆదాయం వచ్చేవారిని నిష్ట దరిద్రులుగా వర్గీకరించింది.
మన కరెన్సీలోకి దీన్ని మార్చుకుంటే రోజుకు ప్రతి మనిషికి రూ.180 కంటే తక్కువ వచ్చే వారని అర్ధం. ఎవరికి వారు దీన్ని వర్తింప చేసుకొని తామెక్కడ ఉన్నదీ అర్ధం చేసుకోవచ్చు. మన దేశంలో నిష్ట దరిద్రులు 12.9 శాతం (2022 సంవత్సరం సమాచారం) మంది ఉన్నారు. ఇది ప్రపంచ సగటు తొమ్మిది శాతం కంటే ఎక్కువ.
భూతల స్వర్గం, ప్రపంచంలో అత్యధిక ధనవంతమైన దేశంగా పరిగణించే అమెరికాలో అంతకంటే తక్కువ రాబడి వచ్చేవారు 1.2 శాతం ఉన్నారు. ఈ కారణంగానే మన దేశంలో ఉచిత బియ్యం ఇస్తున్నట్లు అక్కడ పేదలకు ఆహార కూపన్లను ప్రభుత్వం ఇస్తున్నది. ఇళ్లు లేని వారు మన దేశంలో రోడ్ల మీద పడుకున్నట్లే అక్కడ పార్కుల్లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు కూడా ఉన్నారు.
ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 2019లో 2.15 డాలర్ల కంటే తక్కువ వచ్చే వారు 64.8 కోట్ల మంది ఉన్నారు. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ చెబుతున్నదాని ప్రకారం రోజుకు 1.25 డాలర్ల కంటే తక్కువ ఆదాయం వచ్చేవారు ఆసియా- పసిఫిక్‌లో 70 కోట్ల మంది ఉన్నారు.
నిజానికి ఈ 1.25 డాలర్లన్నది 1988 నుంచి 2005 వరకు 15 అతి పేద దేశాలలో ధరలు, కరెన్సీల విలువను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించారు. దీనిలో అసియా నుంచి రెండు దేశాలను మాత్రమే తీసుకున్నారు. నాటికి నేటికి వచ్చిన తేడాను పరిగణనలోకి తీసుకుంటే దారిద్య్ర నిర్మూలన, దారిద్య్రరేఖ నిర్ణయం అంతా అంకెల గారడీ తప్ప మరొకటి కాదు.
(నిజం టుడే సౌజన్యంతో)