Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాను కలిసిన అచ్చెన్నాయుడు, ఇతర నేతలు

• ఓట్ల అక్రమాలపై టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుంటే, కేంద్ర ఎన్నికల బృందానికి ఫిర్యాదు చేస్తాం
• వైసీపీ కుట్రపూరితంగా, పథకం ప్రకారం తొలగిస్తున్న అర్హుల ఓట్లు, దొంగఓట్ల నమోదుపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ని కోరిన టీడీపీ
• అధికారపార్టీ ఆదేశాలే పరమావధిగా ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కి ఓట్ల అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ చెప్పారు
• ప్రతి అధికారి..బీ.ఎల్.వో…జిల్లా కలెక్టర్ సహా ఎవరిని వదలకుండా అందరికీ మెమోలు ఇస్తామని కమిషనర్ స్పష్టమైన హామీ ఇచ్చారు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కలిసిన అనంతరం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, నేతలు బొండా ఉమామహేశ్వరరావు, పయ్యావుల కేశవ్
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

“ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, ముఖ్యమంత్రి తీరు దొంగే దొంగ అన్న తీరుగా ఉంది. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడటం.. దొంగఓట్లు సృష్టించడం… అర్హుల ఓట్లు తీసేయడం చేస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి తాము వస్తున్నామని తెలిసి, నేడు హడావుడిగా వైసీపీనేతలు.. మంత్రులు ఏపీ ఎన్నికల కమిషనర్ని కలిసి, టీడీపీపై ఫిర్యాదు చేశారు. తప్పు చేస్తున్నది జగన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీనేతలు.. ప్రభుత్వం. కానీ నిందలే మో టీడీపీపై వేస్తున్నారు.

ఓటమి ఖాయమని తెలిసే జగన్ రెడ్డి, వైసీపీ బరితెగించి ఓట్ల అక్రమాలకు పాల్పడుతున్నాయి
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ రెడ్డి, అతని పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని వారికి అర్థమైంది. అందుకే బరితెగించి మరీ రాష్ట్రవ్యాప్తం గా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లతోపాటు, అర్హుల ఓట్లు కూడా తొలగి స్తున్నారు. ప్రభుత్వ కుట్రలకు కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. 8 జిల్లాల కలెక్టర్లు అయితే వైసీపీ కార్యకర్తలకంటే దారుణంగా పనిచేస్తూ, పాలకుల కుట్రలు.. కుయుక్తులకు సహకరిస్తున్నారు. వారందరూ తప్పకుండా శిక్షింపబడ తారని హెచ్చరిస్తున్నాం.

శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు పూర్తిగా సరెండర్ అయ్యారు. వారి పనితీరుపై జరుగుతున్న పరిణమాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. కిందిస్థాయి అధికారులు ..కొంద రు కలెక్టర్లు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను బుట్టదాఖలు చేస్తున్నారని ఎన్నికల ప్రధానాధికారికి తెలియచేశాం. ఫామ్-6, ఫామ్-7, ఫామ్-8 సహా, నకిలీ ఓట్ల తొలగింపు, ఇతర టీడీపీ దరఖాస్తులపై ఎలాంటి చర్యలు లేవు. అవన్నీ కలిపి దాదాపు రాష్ట్రంలో 11 లక్షల వరకు ఉన్నాయి. వాటన్నింటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ ని కోరాం.

పరిధిదాటి అధికారపార్టీ కోసం పనిచేస్తున్న అధికారులు.. నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ఓట్ల అక్రమాలను ఆధారాలతోసహా ఎన్నికల కమిషనర్ కు తెలియచేశాం.

రాప్తాడు నియోజకవర్గంలో 20వేల బోగస్ ఓట్లు ఉన్నాయని, తక్షణమే వాటిని తొలగించాలని మా పార్టీ ఇన్ ఛార్జ్, మాజీ మంత్రి పరిటాల సునీత చేసిన ఫిర్యాదు ను అనంతపురం జిల్లా కలెక్టర్ పట్టించుకోవడంలేదు. ఫామ్-7 దరఖాస్తులు పెట్టు కోండి.. విచారణ జరిపించి తీసేస్తామని కలెక్టర్ చెబుతున్నారు. అదే అధికారులు వైసీపీ నేతలు చెప్పిన వెంటనే టీడీపీవారి ఓట్లతో పాటు..ఇతరుల ఓట్లు కూడా వెంటనే తొలగిస్తున్నారు.

ఉరవకొండ నియోజకవర్గంలో స్థానిక వైసీపీ ఇన్ ఛార్జ్ చెప్పిన వెంటనే అక్కడి కలెక్టర్ హుటాహుటిన 10వేల టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడానికి సిద్ధమయ్యాడు. అనంతపురం కలెక్టర్ రాప్తాడులో ఒకరకం గా.. ఉరవకొండలో మరోరకంగా వ్యవహరించడం ముమ్మాటికీ అధికారపార్టీకి ఊడిగం చేయడమే. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపుగా 20వేల ఓట్లు తొలగించారు. అక్కడి టీడీపీ ఇన్ ఛార్జ్ పులివర్తి నాని.. వారి సతీమణి ఎందరు అధికారులకు ఫిర్యాదు చేసినా స్థానిక యంత్రాంగం స్పందించలేదు.

దేశంలో ఎక్కడా లేని విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గమైన చంద్రగిరి లో 79 కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, 59 పోలింగ్ స్టేషన్ల మార్పిడిని ఇష్టానుసారం చేసేశారు. పోలింగ్ స్టేషన్ల మార్పు..కొత్తవి ఏర్పాటు చేయడమనేది ఎన్నికల నిబంధనల ప్రకారమే జరగాలి. రాజకీయ పార్టీల్ని సంప్రదించాలి. కానీ అక్కడ అలా జరగలేదు. ఈ అంశంపై కూడా గతంలోనే ఫిర్యాదు చేశాం. పర్చూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తే గంపగుత్తగా ఫామ్-7లు అప్ లోడ్ చేస్తున్నాడు.

ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో వైసీపీప్రభుత్వంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఉరవకొండ.. చంద్రగిరి.. పర్చూరు.. విజయవాడ సెంట్రల్..రాప్తాడు…కాకినాడ సిటీ.. గుంటూరు వెస్ట్.. మచిలీపట్నం.. గురజాల..మాచర్ల.. విశాఖపట్నం దక్షి ణం, తిరుపతి నియోజకవర్గాల్లో జరుగుతున్న ఓట్ల అవకతవకలపై ఆధా రాలతో సహా ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశాం. ప్రధానంగా ఈ 17 నియోజకవర్గాల పై దృష్టి పెట్టి, తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాం.

నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే ప్రతి అధికారి.. బీ.ఎల్.వో.. కలెక్టర్ కు మెమోలు ఇస్తామన్నారు
ఈరోజు నుంచి ఫామ్-6, ఫామ్-7, డూప్లికేషన్స్, మైగ్రేషన్స్ వంటి వాటికి సంబంధించి నోటీసుల ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్టు చేస్తే దానికి బీ.ఎల్.వోలే బాధ్యులు అవుతారంటూ సాయంత్రానికి అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారం ఇస్తామని ఎన్నికల కమిషనర్ చెప్పారు. వైసీపీ వాళ్లు చెప్పినట్టు చేసే ప్రతి బీ.ఎల్.వో, ప్రతి కలెక్టర్,ఇతర అధికారులకు మెమోలు ఇస్తామన్నారు. తెలుగు దేశం పార్టీ కూడా ఇకనుంచి తప్పుచేసే కలెక్టర్లు..ఇతర అధికారులు.. బీ.ఎల్.వో లపై కఠినంగా వ్యవహరిస్తుంది. త్వరలో రాష్ట్రానికి రానున్న కేంద్ర ఎన్నికల బృందానికి కూడా ఆధారాలతో సహా అన్ని అంశాలపై ఫిర్యాదు చేస్తాం.” అని అచ్చెన్నాయుడు తెలిపారు.

వైసీపీ ఏజెంట్లుగా పనిచేస్తున్న 8 మంది కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల బృందానికి ఫిర్యాదు చేస్తాం : బొండా ఉమామహేశ్వరరావు
“ రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఏపీ ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశాం. గతంలో టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించి వచ్చేనెల 10వ తేదీన కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటించి, తాము చేసిన ఫిర్యాదులపై విచారణ చేపట్టనుంది. 8 మంది కలెక్టర్లపై కూడా తాము కేంద్ర ఎన్నికల బృందానికి ఫిర్యాదు చేస్తాం. ఎన్నికల నిబంధనలకు విరు ద్ధంగా తాడేపల్లి ఆదేశాలతో పనిచేసే ప్రతి కలెక్టర్.. ఇతర అధికారులు.. బీఎల్ వోలు ఎవరూ చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేరు.

మరో మూడునెలల్లో జగన్ రెడ్డి రాష్ట్రం విడిచిపోవడం.. అతని ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడం ఖాయం. ఈ విషయం గ్రహించి.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న 8 జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు వారి పనితీరు మార్చుకుంటే మంచిదని సూచిస్తున్నాం. వారిపై చర్యలు తీసుకునేవరకు టీడీపీ వదిలిపెట్టదు. అవసరమై తే న్యాయపోరాటం చేసైనా సరే తప్పుడు అధికారుల్ని శిక్షించే తీరుతాం.” అని బొండా ఉమా హెచ్చరించారు.

అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఎన్నికల కమిషనరే నివ్వెరపోయారు : పయ్యావులు కేశవ్
“ అనంతపురం జిల్లా కలెక్టర్ నియోజకవర్గానికో విధంగా నిబంధనలు మారుస్తు న్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఓట్ల అక్రమాల గురించి చెప్పగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా నివ్వెరపోయారు. ఎన్నికల సంఘం పకడ్బందీగా రూపొందించిన విధానాలను కొందరు అధికారులు అధికారపార్టీ నేతలకు అనుకూలంగా మార్చేస్తున్నారు.కొత్తగా ఓటు పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకునే ఫామ్-6 ను రెండు రకాలుగా ప్రాసెస్ చేయవచ్చు.

బీ.ఎల్.వో లకు ఇవ్వడం.. ఆన్ లైన్లో దరఖాస్తు చేయడం. కానీ వైసీపీనేతలు ఉరవకొండ నియోజకవర్గంలో భారీస్థాయిలో ఫామ్-6 దరఖాస్తులు ఆన్ లైన్లో నమోదు చేయించారు. వాటిని పరిశీలించిన ఏ.ఈ.ఆర్.వోలు.. స్థానిక బీ.ఎల్.వోలకు పంపించాలి. అప్పుడు బీ.ఎల్.వోలు ఇంటింటికీ తిరిగి దరఖాస్తుల్లోని నిజానిజాలు పరిశీలించి పూర్తి సమాచారాన్ని తిరిగి ఏ.ఈ.ఆర్.వోలకు పంపిస్తే, వారు వాస్తవా లు తెలుసుకొని ఆ దరఖాస్తుల్ని తిరిగి ఈ.ర్.వోలకు పంపిస్తారు. ఈ.ఆర్.వోలు ఓకే అంటే ఓటర్ లిస్టులో కొత్త ఓటర్ల వివరాలు నమోదు అవుతాయి.

వైసీపీ నేతలు తమకు పంపిన ఫామ్ -6 దరఖాస్తుల్ని ఎమ్మార్వోలు నేరుగా ఈ.ఆర్.వోలకు పంపిస్తున్నారు
కానీ ఉరవకొండలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. వైసీపీనేతలు ఆన్ లైన్లో ఫామ్-6 దరఖాస్తులు అప్ లోడ్ చేసి, వాటి వివరాల్ని నేరుగా ఎమ్మార్వోలకు తెలియచేస్తారు. వైసీపీనేతలు ఆన్ లైన్లో అప్ లోడ్ చేయగానే.. ఎమ్మార్వోలు నేరుగా ఈ.ఆర్.వోకు పంపిస్తున్నారు. దాంతో ఈ.ఆర్.వో నేరుగా ఎమ్మార్వోలు పంపించారు కదా అని ఓటర్ జాబితాలో వివరాలు అప్ లోడ్ చేస్తున్నారు. కింద బీ.ఎల్.వోల వెరిఫికేషన్ లేకుండానే ఇదంతా జరిగిపోతోంది. వైసీపీనేతల ఆదేశాలతో పగలు పనిచేయని తహసీల్దార్లు దొంగఓట్లు నమోదు చేయడానికి మూడురోజులు ఏకబిగిన రాత్రిళ్లు పనిచేశారు. ఇదంతా ఎన్నికల కమిషనర్ కు చెబితే, ఆయన కూడా అవాక్కయ్యారు.

ఎమ్మార్వో కార్యాలయాల్లోని కంప్యూటర్ ఆపరేటర్లు ఔట్ సోర్సింగ్ సిబ్బంది. వారిద్వారానే చాలా తతంగం నడుస్తోంది. కానీ దొంగలు దొరక్కుండా తప్పించుకోలేరు. అసలు దరఖాస్తు ఎవరికి ఎన్ని గంటలకు వచ్చింది.. ఎవరి నుంచి ఏ సమయానికి ఇతరులకు వెళ్లిందనేది తెలు స్తుంది. డిజిటల్ ఫుట్ ప్రింట్ లో వారు చేసే తప్పులన్నీ కనిపిస్తాయి. ఉరవకొండ లో ఇలా జరిగిన ఓట్ల అక్రమాలు ఎన్ని అనేది ఇంకా తమకే తెలియదు. ఓటర్ల జాబితాలోని తప్పులపై మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే ఆ వ్యవహారం అంతా రహస్యమన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు.

ఒకవైపు ఇంటింటి సర్వే జరుగుతుండగానే వారంలోనే రాజకీయ పార్టీలు.. బీ.ఎల్.ఏలకు చెప్పకుం డానే నేరుగా పై అధికారులకు పంపిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక అధికారు కు తాము 5 లేఖలు రాసినా ఆయన నుంచి స్పందనలేదు. ఇంటింటి సర్వే ముగియగానే నేరుగా వివరాలను ఎన్నికల సంఘానికి పంపించారు.

తప్పుచేసే కలెక్టర్లు.. ఇతర అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ స్పష్టమైన హామీ ఇచ్చాకే బయటకు వచ్చాం.
ఇదలా ఉంటే.. మరోపక్క సీక్రెట్ సర్వేలు చేస్తున్నారు. ఈ సర్వేలపై కూడా ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశాం. ఉరవకొండలో మొదటిసారి 6,604 ఓట్లు తొలగించారని తాము చేసిన ఫిర్యాదుపై ఇద్దరు ఈ.ఆర్.వోలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి 5 నెలలు అవుతున్నా.. జిల్లాకలెక్టర్ సదరు అధికారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఈ విషయంపై కూడా ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశాం. అధికారులపై చర్యలు తీసుకోనివారు కూడా బాధ్యులు అవుతార ని ఆయన చెప్పారు. అవసరమైతే తానే స్వయంగా సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు.

ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. నేడు తమ సమస్యలు.. ఫిర్యాదుల పై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించేలా చేయాలని, అవసరమైతే రాత్రంతా ఇక్కడే కూర్చోవాలనే కృతనిశ్చయంతోనే వచ్చాం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తమ విజ్ఞప్తులపై గట్టిగా స్పందించారు. వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చాకే బయటకు వచ్చాం. ఏపీ ఎన్నికల సంఘం గతంలో అధికారులు.. బీ.ఎల్.వోలకు ఇచ్చిన డిక్లరేషన్… దానిలోని నిబంధనలు వారికి వర్తిస్తాయని కమిషనర్ చెప్పారు.

తప్పులుచేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసేవారికి కచ్చి తంగా మెమోలు ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పటికిప్పుడు కాకున్నా ఎప్పుడో ఒకరోజు తప్పులు చేసే వారికి శిక్ష తప్పదు. ఎన్నికల కమిషనర్ని నేడు తాము ఒకటే అడిగాం. రాజకీయ నేతలమైన మేం ప్రజలపక్షాన పోరాడాలా..లేక ఓటర్ల జాబితా లో జరుగుతున్న అవకతవకలపై పోరాడాలా అని ప్రశ్నించాం. ఆయన మాకు స్పష్టమైన హామీ ఇచ్చాకే బయటకు వచ్చాం.” అని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

ఎన్నికల కమిషనర్ ని కలిసిన వారిలో టీడీపీనేతలు వర్ల రామయ్య, పయ్యావుల కేశవ్, బొండా ఉమామహేశ్వరరావు, నక్కాఆనంద్ బాబు, గద్దె రామ్మోహన్ రావు, పరుచూరి అశోక్ బాబు, పులివర్తి నాని, సుధారెడ్డి, కోవెలమూడి రవీంద్ర, రామాంజనేయులు, నసీర్ అహ్మద్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, పిల్లి మాణిక్యరావు తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE