Suryaa.co.in

Andhra Pradesh

మా ప్రభుత్వ ఆలోచన ప్రకారం అమరావతి శాసన రాజధాని

– గవర్నర్ పై టీడీపీ సభ్యుల దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నాం
– అసెంబ్లీకి హాజరుపై టీడీపీకి నిర్దుష్టమైన విధానం లేదు.. కేవలం సానుభూతి డ్రామాలే
– వికేంద్రీకరణపై శివరామకృష్ణన్ కమిటీ చేసిన సూచనలు, సలహాలను చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు
– రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో… ఉమ్మడి సభలను ఉద్దేశించి ఈరోజు గవర్నర్ ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, దాదాపు 1.32 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు చేరవేయడం జరిగిందని చెప్పారు. దురదృష్టం ఏమిటంటే.. ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాజకీయ దుర్బుద్ధితో సభలో వ్యవహరించిన తీరును కూడా రాష్ట్ర ప్రజలంతా చూశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ ను దూషిస్తూ, సభలో టీడీపీ సభ్యులు చేసిన నినాదాలు, వారు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటివి పునరావృత్తం కాకూడదని కోరుతున్నాం.

అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై… తెలుగుదేశం పార్టీకి ఒక విధానం అంటూ లేదు. క్షణికావేశంతో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అమలు చేసే సమయంలో తిరిగి ఆలోచనలో పడిపోతారు. వారివి వ్యక్తిగత స్వార్థంతో తీసుకునే నిర్ణయాలు తప్పితే, అందులో ప్రజా ప్రయోజనాలు లేవు. మళ్ళీ వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుని, ఏదో ఉద్దరించటానికి చేస్తున్నట్టు, తద్వారా సానుభూతి పొందాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీకి వచ్చారు. ఆ పార్టీకి ఒక నిర్దుష్టమైన విధానం అంటూ లేదు. ఎంతసేపటికీ తమ స్వార్థం కోసం తప్ప ప్రజా ప్రయోజనాల కోసం గానీ, సమిష్టి నిర్ణయాలు, సమిష్టి అభిప్రాయాలు గానీ ఆ పార్టీకి లేవు.

చంద్రబాబు స్వార్థం కోసం, ఆ పార్టీ పెద్దలు దోచుకోవడానికి మాత్రమే అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. సమిష్టి నిర్ణయాలు ఆ పార్టీలో ఉండవనేదానికి అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై వారి కుప్పిగంతులే ఉదాహరణ. ఎప్పుడైనా, ఎక్కడైనా దీర్ఘకాలిక ఆలోచనలు, విశాలమైన దృక్పథం కలిగిన పార్టీల వల్లే ప్రజలకు మేలు జరుగుతుంది.

ముడు రాజధానుల బిల్లుపై.. మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ… వేచి చూడండి. తొందర ఎందుకు..?. ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల చేత, చట్టాలు చేయడానికే శాసనసభ, పార్లమెంటు ఉన్నాయి. రాజ్యాంగానికి లోబడే అవి చట్టాలు చేస్తాయి. చట్టాలు చేయకూడదు, న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వకూడదంటే ఎలా..? ఎవరి పరిధులు వారికి ఉంటాయి. న్యాయస్థానాలపై అపారమైన గౌరవం, నమ్మకం ప్రభుత్వానికి, ప్రజలకు ఉన్నాయి.

చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదనడంపై…. అందుకే ఈ అంశం చర్చనీయాంశం అని చెప్పాం. 2014 విభజన చట్టంలో, పదేళ్ళపాటు అంటే 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పారు. విభజన చట్టం అమలు మీద కేంద్రం శివరామకృష్ణన్ కమిటీ వేస్తే, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై ఆ కమిటీ విస్తృతస్థాయిలో పర్యటించి, అధ్యయనం చేసి కేంద్రానికి కొన్ని సూచనలు ఇచ్చింది. దురదృష్టవశాత్తు వాటిలో చంద్రబాబు ఒక్క సూచనగానీ, సలహాగానీ తీసుకోలేదు. అందులో ఒక సూచన వికేంద్రీకరణ కూడా.

వికేంద్రీకరణ వల్లే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందన్న సూచనను అప్పడు అధికారంలో ఉన్న చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. ఆ తర్వాత ఆదరాబాదరగా, నా లాంటి ఒక మంత్రిని ఛైర్మెన్ గా పెట్టి కమిటీ వేసి, వారి సూచనలు, సలహాల మేరకు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. వీళ్ళు చేసిన తీర్మానాన్ని ఢిల్లీకి, పార్లమెంటుకు పంపారా, వాళ్ళ అనుమతి పొందారా, ఏమైనా చట్టపరంగా చేశారా.. అంటే చేయలేదు. 2024 వరకు మన రాజధాని ఏదంటే హైదరాబాదే. దాన్ని ఆధారంగా చేసుకునే న్యాయస్థానాలు అలా మాట్లాడి ఉండవచ్చు.

రాజధానులు అనేవి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యపట్టణాలు గుర్తించడానికి. ఎగ్జిక్యూటివ్ రాజధాని, పరిపాలన రాజధాని, న్యాయ రాజధానులను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వ ఆలోచన, విధానం. మరోవైపు పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలను కూడా విస్తరిస్తున్నాం. మ్యానిఫెస్టోలో మేం ఇచ్చిన ఆ హామీలు చూసే ప్రజలు మాకు ఓటు వేసి గెలిపించారు.మా ప్రభుత్వ ఆలోచన, మా పార్టీ విధానం ప్రకారం.. అమరావతి శాసన రాజధాని మాత్రమే.

LEAVE A RESPONSE