– హాజరడిగితే హాహాకారాలెందుకు?
– రూల్సుకు టీచర్లు అతీతులా?
– పనిచేయమంటే పగ ఎందుకు?
– ఏపీలో ‘పంతుళ్ల పంచాయితీ’
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘ చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉద్యోగులను వేధిస్తోంది. సంబంధం లేని పనులు చెబుతున్నారు. మేమూ మనుషులమే. సీపీఎస్ హామీ ఇవ్వని టీడీపీకి ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం’’
– ఎన్నికల ముందు ఏపీ ప్రభుత్వోద్యోగులు
‘‘మేం జగనన్న సీఎంగా రావాలని రెండుచేతులతో ఓట్లేసి గెలిపించాం. సీఎం అయిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. కానీ ఇప్పుడు మాకు గుణపాఠం నేర్పారు. సమయం కోసం ఎదురుచూస్తున్నాం’’
– ఏపీ ప్రభుత్వోద్యోగుల తాజా ఆగ్రహం.
‘‘ అప్పుడంటే మాకు అవగాహన లేక సీపీఎస్ రద్దుపై హామీ ఇచ్చాం. ఇప్పుడు అన్నీ పరిశీలిస్తున్నాం’’
– ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య.
‘‘ టీచర్లు 9 గంటల కల్లా యాప్‌లో హాజరు ఇవ్వాలని ఆదేశించడం దుర్మార్గం. మాకు అనేక సమస్యలుంటాయి. ట్రాఫిక్ సమస్యలతోపాటు, సంబంధం లేని అనేక పనులు మాకు అంటకట్టారు. వాటిని తొలగించండి. ఈ ఉపాధ్యాయ వ్యతిరేక ప్రభుత్వానికి సరైన సమయంలో గుణపాఠం చెబుతాం’’
– లేటెస్టుగా ఏపీ టీచరు సంఘాల హెచ్చరిక.
ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తోంది? చేసిన పనులకు అనుభవించక తప్పదన్న పెద్దలమాట నిజమేననిపించడం లేదూ?! పాలకులతో సాగినంతకాలం సాగించుకున్న ప్రభుత్వోద్యోగులకు.. అదిరించి,బెదిరించి కాలం గడిపేసిన ప్రభుత్వోద్యోగులకు.. అపాయింటుమెంట్లు లేకుండా, ఇంటి అల్లుళ్లమాదిరిగా ఎప్పుడంటే అప్పుడు సీఎంలను కలిసి వెళ్లే ఉద్యోగసంఘాలకు… అసలు ‘అపాయింటుమెంటే ఇవ్వను పొమ్మని’ బేఖాతరు చేసే మొనగాడు.. ‘సరైనోడు’ ఏపీకి సీఎంగా వచ్చాడన్న వ్యాఖ్యలు వినిపించడంలో పెద్ద ఆశ్చర్యమేమీ కనిపించడం లేదు. ఎందుకంటే.. అది నిజమే కాబట్టి!
టీచర్లు ఉదయం 9 గంటలకు ఠంచనుగా యాప్‌లో కనిపించాలన్నది తాజాగా జగనన్న సర్కారు ఆదేశం. ఒక్క నిమిషం లేటయినా ఆరోజు సెలవుగా పరిగణిస్తామన్నది అదే జగన్ సర్కారు హెచ్చరిక. అయితే.. వాటిని తాము పాటించేదిలేదని, ఇది నియంతృత్వమన్నది టీచర్ల సంఘాల విమర్శ. ఎవరూ సర్కారు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవద్దని నేతల పిలుపు. ఇదీ ఇప్పుడు ఏపీలో సర్కారు-టీచర్లకు జరుగుతున్న ఫొటోల పంచాయితీ.
అయితే.. టీచర్ల వాదనకు జనం నుంచి పెద్దగా మద్దతు కనిపించటం లేదు. పిల్లలు ఆలస్యంగా వస్తే వారికి ఏవిధంగా అయితే లేటు మార్కులేస్తారో, అదేవిధంగా ఆలస్యంగా వచ్చే టీచర్లకూ అదే పనిచేస్తే తప్పేమిటన్నది వారి ప్రశ్న. పైగా వేలాది రూపాయల జీతం తీసుకుంటున్న పంతుళ్లను.. సమయానికి స్కూళ్లకు వెళ్లాలని ఆదేశిస్తే, అది నేరమెలా అవుతుందన్నది మరో ప్రశ్న. అయినా..సక్రమంగా స్కూలుకు వెళ్లకుండా ఎగనామం పెట్టి, హెడ్మాష్టర్లను మేనేజ్ చేసుకునే పంతుళ్లు భయపడాలే తప్ప, హాజరుపై టీచర్లంతా ఎందుకు హాహాకారాలు పెడుతున్నారో తమకు అర్ధం కావడం లేదన్నది మరికొందరి ప్రశ్న.
అంటే ఆ ప్రకారంగా… చాలామంది టీచర్లు, స్కూళ్లు ఉన్న చోట స్థానికంగా నివాసం ఉండకుండా, టౌన్లలో కాపురం ఉంటారన్న విమర్శలు నిజమే అనుకోవాలి మరి. చాలామంది వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారన్న నిందలు నిజమనుకోవాలి. పిల్లలకంటే ముందు ఉండాల్సిన టీచర్లే ఆలస్యంగా వస్తే.. ఆలస్యంగా వచ్చే పిల్లలకు ఏం బుద్ధి చెబుతారు? వారికి ఏం సంకేతం ఇస్తారు? రేపు పిల్లలు కూడా ఇదే మాదిరిగా.. మేం ఆలస్యంగా వచ్చినప్పుడు, ఆబ్సెంటు వేస్తే ఊరుకునేది లేదని ఇలాగే ధర్నాలు చేస్తే, దానిని టీచర్లు స్వాగతిస్తారా? అనుమతిస్తారా? తలిదండ్రులను పిలిపించి, వారికే అక్షింతలు వేస్తారు కదా? మరి టీచర్లే ఆలస్యంగా వచ్చినప్పుడు జీతమిస్తున్న ప్రభుత్వం వారికి తలంటితే తప్పేంటి?
అయినా స్కూళ్లను విలీనం చేయాలా? రద్దు చేయాలా అన్నది ప్రభుత్వ నిర్ణయం. దానితో అసలు టీచర్లకు సంబంధం ఏమిటి? ఎక్కడ పోస్టింగు ఇస్తే అక్కడ పనిచేయడమే ఉద్యోగుల ధర్మం కదా? తమ సమస్యలపై పోరాటం చేస్తే తప్పు లేదు. సక్రమంగా జీతాలివ్వకపోతే పోరాడాలి. ప్రమోషన్లలో అన్యాయం జరిగితే కోర్టుకెళ్లవచ్చు. కానీ తమ విధుల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని ఆశించడం తప్పు మాత్రమే కాదు, అత్యాశనే కదా? ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రభుత్వం చెప్పింది చేయడం. అంతేకానీ ప్రభుత్వాన్ని శాసించడం కాదు. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ, ప్రభుత్వాన్ని శాసించే ప్రయత్నం చేయడం నిస్సందేహంగా అది ధిక్కారమే. అదే ధిక్కరణ ప్రైవేటు సంస్థల్లో జరిగితే, యాజమాన్యం నిమిషాల్లోనే వారిని తొలగిస్తుంది. మరి ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఐదురెట్లు ఎక్కువ కష్టపడే ప్రైవేటు ఉద్యోగులకు రక్షణ ఎవరు? వారితో పోలిస్తే ఎన్నో రెట్ల స్వేచ్ఛ-సౌకర్యాలున్న ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు అతిగా ఉంటే, వారికి ప్రజల మద్దతు ఎలా ఉంటుంది? అసలు ప్రజల మద్దతు ఆశించడమే అవివేకం, అత్యాశ కదా? అన్నది బుద్ధిజీవుల విశ్లేషణ.
దశాబ్దాల నుంచి విజయవంతంగా కొన‘సాగుతున్న’ ఉద్యోగుల పెత్తనం జగనన్న రావడంతో బ్రేక్ పడింది. గతంలో ఏ ప్రభుత్వం-ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, పాలకులు ఉద్యోగులకు భయపడి, అడిగింది చేసి పెట్టేవారు. ఎన్టీఆర్ లాంటి మహామహులనే ఉద్యోగులు నీళ్లు తాగించి, రోడ్డుమీద పడుకునేలా చేశారు. చంద్రబాబునాయుడు కొత్తగా సీఎం అయిన రోజుల్లో.. జన్మభూమి-ప్రజల వద్దకు పాలన వంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. ఇవన్నీ ఉద్యోగుల భాగస్వామ్యం ఉన్న కార్యక్రమాలే. సమయానికి ఆఫీసులకు రాని ఉద్యోగులను, ఆకస్మిక తనిఖీలలో సస్పెండ్ చేశారు. ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల వరకూ వెళ్లకుండా, అధికారులనే ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాలు రూపొందించారు.
అయితే.. ఇలాంటి ‘పనిచెప్పే పాలకులను’ దుర్మార్గులు, ఉద్యోగ వ్యతిరేకులుగా ముద్ర వేసిన ఉద్యోగులు, బాబును ఓడించడంలో కీలకపాత్ర పోషించారు. ఆరకంగా ఉద్యోగులకు ఎవరూ పనులు చెప్పకూడదు. ఎవరన్నా పనిచెబితే, వచ్చే ఎన్నికల్లో పాలక పార్టీ పని అయిపోయినట్లేనన్న హెచ్చరిక భావన కల్పించారు.
ఆ తర్వాత ‘ఉద్యోగులకు పనిచెప్పడం నేరం’ అన్న ‘అనుభవంతో వచ్చిన తత్వం’ ద్వారా అర్ధం చేసుకున్న చంద్రబాబునాయుడు, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చినా వారి జోలికి వెళ్లడం మానేశారు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు వారానికి ఐదురోజులే పనిచేస్తే చాలన్నారు. ప్రయాణాల్లో ఎక్కడ కష్టపడిపోతారేమోనన్న దిగులతో, హైదరాబాద్ నుంచి అమరావతికి రోజూ ట్రైను వేయించారు. అమరావతిలోనే హాస్టలు వసతి కల్పించారు. లోటు బడ్జెటు ఉన్నప్పటికీ, తెలంగాణ సర్కారు కంటే ఎక్కువ పీఆర్సీ ఇచ్చారు. ఉద్యోగ సంఘ నేతలకు సొంత పార్టీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువసార్లు అపాయింట్‌మెంట్లు ఇచ్చారంటే, ఉద్యోగులకు బాబు ఎంత భయపడ్డారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ని చేసిన బాబు.. సీపీఎస్ రద్దుపై హామీ ఇవ్వలేకపోయారు. దానితో కోపమొచ్చిన ఉద్యోగులు, వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌కు రెండు చేతులా ఓట్లు వేసి.. వేయించి మరీ అధికారంలోకి తీసుకువచ్చారు. అక్కడివరకూ బాగానే ఉంది.
మూడున్నరేళ్లయినా సీపీఎస్ హామీ అమలుకు దిక్కులేకపోయినా గతంలో మాదిరిగా, ఎదిరించే ధైర్యం చేయలేకపోవడమే ఆశ్చర్యం. అసలు సీఎం జగనన్న అపాయింటుమెంట్ తీసుకునేంత పలుకుబడి, ఏ ఒక్క ఉద్యోగ నేతకూ లేదు. సలహాదారు సజ్జల దగ్గరకు వెళ్లడమే మహా గొప్ప. అదే మహద్భాగ్యం. ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు ఆయనే సీఎం. అయినా ఒక్క సమస్య పరిష్కారం కాకపోగా.. యాప్‌ల పేరిట ఉద్యోగుల మెడపై కత్తి పెట్టి పనిచేయిస్తున్న తీరు, ఉద్యోగుల పప్పులు జగనన్న దగ్గర ఉడక్కపోవడం వంటి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు సమరశంఖాలు పూరించి, పిడికిలి బిగించి సమరనాదం చేసి, డిమాండ్లతో చొక్కా పట్టుకున్న ఉద్యోగులు… ఇప్పుడు జగనన్న సర్కారు చెప్పింది చేస్తూ, కిక్కురుమనకుండా సర్దుకుపోతున్న వైనం చూస్తే.. రౌతు మెత్తనయితే గుర్రం మూడుకాళ్లమీద నడుస్తుందన్న సామెత గుర్తుకు రావడం లేదూ?! అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో.. ఉద్యోగులను ‘అనువించురాజా’ అని బ్యాక్‌గ్రౌండ్‌లో సినిమా సాంగేసి చూపిస్తున్నారు.