ఢిల్లీకి చేరిన ఏపీ బీజేపీ పంచాయతీ

– రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై 30 మంది నేతల ఫిర్యాదు
– కేంద్రమంత్రి, రాష్ట్ర ఇన్చార్జి మురళీధరన్‌తో అసమ్మతి నేతల భేటీ
– వీర్రాజును కొనసాగిస్తే ఏపీలో బీజేపీలో ఎవరూ ఉండరని స్పష్టీకరణ
– నేతలను అవమానకర రీతిలో తొలగించారని ఫిర్యాదు
– ముఠా నేతగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
– సోము తీరు వల్లే కన్నా పార్టీ మారారని వివరణ
– సంఘటనామంత్రి మధుకర్‌జీ వైఫల్యంపైనా ఫిర్యాదులు
-మధుకర్‌జీ ఏమీ పట్టించుకోవడం లేదని స్పష్టీకరణ
– సోముపై వచ్చిన భూ కొనుగోలు ఫిర్యాదును విచారిస్తామన్న మురళీధరన్‌
– 20 నిమిషాలు ము రళీధరన్‌తో రాష్ట్ర నేతల భేటీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ బీజేపీ పంచాయితీ చివరకు ఢిల్లీకి చేరింది. ఒక ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఆ పదవి నుంచి తొలగించకపోతే, బీజేపీలో ఎవరూ ఉండే పరిస్థితి లేదని 30 మంది సీనియర్‌ నేతలు, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి-కేంద్రమంత్రి మురళీధరన్‌కు ఫిర్యాదు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేయడం, పార్టీలో కలకలం సృష్టిస్తోంది. దాదాపు 20 నిమిషాలు, రాష్ట్రపార్టీ పరిస్థితి గురించి వారంతా ఆయనకు వివరించారు. ఇటీవల సోము వీర్రాజు, మరికొందరు నాయకులపై వచ్చిన బలవంతపు దళితుల భూ కొనుగోలు ఆరోపణలను, మురళీధరన్‌కు పిర్యాదు చేయడం తాజా పరిణామాల్లో కొత్త మలుపు.

వర్గ విబేధాలతో రోడ్డునపడుతున్న ఏపీ అంతర్గత రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దాదాపు 30 మంది రాష్ట్ర-జిల్లా స్థాయి నేతలంతా, బుధవారం సాయంత్రం ఢిల్లీలోని కేంద్రమంత్రి మురళీధరన్‌తో భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్లను పక్కకుపెట్టి, తన సొంత మనుషులతో వ్యవహారం నడిపిస్తున్నారని వారంతా మురళీధరన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై వర్గ ముద్ర వేస్తున్నారని వివరించారు.

ఎలాంటి వనరులు అందుబాటులో లేకపోయినా, తాము రెండేళ్లపాటు సొంత ఖర్చులతో జిల్లాల్లో పార్టీని విస్తరిస్తే, అవమానకరరీతిలో తొలగించారని ఫిర్యాదు చేశారు. దళితుల భూమిని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకునే అంశంలో, పార్టీ ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతిన్నదని వారు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సోము వీర్రాజు ముఠా తత్వం- అవినీతి చర్యల వల్ల పార్టీ నష్టపోతోందని, ఆయనను కొనసాగిస్తే, బీజేపీలో తొలి నుంచీ పనిచేస్తున్న వారంతా, పార్టీ నుంచి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దానికి సంబంధించి వారంతా ఒక వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్ర పార్టీని సమన్వయపరిచి, నేతలను యుద్ధానికి సిద్ధం చేయాల్సిన సంఘటన మంత్రి మధుకర్‌రెడ్డి నిర్లిప్తత, నిర్లక్ష్యం కారణంగా పార్టీ నేతలు నిరాశకు గురవుతున్నారని ఫిర్యాదు చేశారు. ‘మధుకర్‌జీకి ఏం చెప్పినా, ఫలానా వారికి చెప్పమంటారు తప్ప, ఆయన ఏ సమస్య కూడా పరిష్కరించరు. సమస్య పరిష్కరించలేని ఆయనకు ఇక ఫిర్యాదు చేయడం వృధా అన్న భావన పార్టీ నేతల్లో ఏర్పడింది. సునీల్‌ దియోథర్‌, మధుకర్‌జీ, సోము వీర్రాజు, మరొక ఇద్దరు ఒక వర్గంగా ఏర్పడ్డారు. వీరంతా పార్టీ విస్తరణకు కాకుండా, వీర్రాజు రాజకీయ-ఆర్ధిక ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. వీరి వైఫల్యం వల్ల కన్నా లక్ష్మీనారాయణ లాంటి నేతలు వెళ్లిపోతున్నారు. పార్టీలో తొలినుంచి పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం ఉన్న సీనియర్లు కూడా, పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై మీరు సీరియస్‌గా దృష్టి సారించకపోతే ఏపీలో పార్టీ మనుగడ కష్టం’ అని సీనియర్లు నిర్మొహమాటంగా రాష్ట్ర ఇన్చార్జి మురళీధరన్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

వారందరి ఫిర్యాదును సావధానంగా విన్న మురళీధరన్‌.. సోము వీర్రాజు, మరికొందరు నేతలు కలసి దళితుల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలపై, విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. కాగా భార్యతో కలసి వేరే రాష్ర్టానికి వెళ్లే హడావిడిలో ఉన్న మురళీధరన్‌.. దాదాపు 20 నిమిషాల పాటు నిలబడే, బీజేపీ సీనియర్లతో మాట్లాడటం విశేషం.