– కోనసీమ కులసీమగా మారడం వెనక…?
– ఈ పరిణామాలు ఎవరికి లాభం?
( మార్తి సుబ్రహ్మణ్యం)
కోనసీమ గురించి చెప్పాలంటే మనగురించి మనం చెప్పుకున్నట్లే లెక్క. ఇప్పటికే ఆ ప్రాంతం గొప్పతనంపై లెక్కలేనన్ని కథలు, కవితలు, కథనాలు ప్రచారంలో ఉన్నవే. తెలివి ‘అతిగా’ ఉండే ప్రాంతమన్నది చాలామంది భావన. ఒక్క కోనసీమ మాత్రమే కాదు. అసలు ఆంధ్రా అంటేనే కులాల కంపు. శ్వాస పీల్చినా, వదిలినా అందులోనూ కులంకోణాన్ని దర్శించే అద్భుత రాష్ట్రం.
కోస్తాలో కమ్మ-కాపు-రెడ్డి, సీమలో రెడ్డి-బలిజ, ఉత్తరాంధ్రలో తూర్పు కాపు-కళింగ-వెలమ అధిపత్యపోరు ఈనాటిదికాదు. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు-బలిజ-దళిత వర్గాల మధ్య ఘర్షణలకు కారణమే అవసరం ఉండదు. ఏ చిన్న సందర్భం వచ్చినా అది కులచిచ్చుకు దారితీస్తుంటుంది. కాపులకు వ్యతిరేకంగా బీసీ-ఎస్సీలు ముఠాలు కడుతూనే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో రాజులు-దళితులకు, మరికొన్ని ప్రాంతాల్లో ఓసీ-దళితులకు సరిపడదు. అందుకే సంఖ్యాబలం, ఆర్ధిక బలం ఉన్నప్పటికీ కాపులు ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించలేకపోతున్నారు. ఇలాంటి విచిత్ర కుల సమీకరణలు ఉన్నప్పటికీ, ఎవరూ హద్దుదాటిన సందర్భాలు లేవు. దానిని తాజా ఘటన చెరిపేసింది. కోనసీమను పక్కా కులసీమగా మార్చే దారులు వేసింది. రాజకీయ రాబందులు కొబ్బరిచెట్లపైకెక్కి చేసిన రాజకీయ రెక్కల చప్పుళ్లు.. కోనసీమ కలతకు కారణమయింది.
కోనసీమ జిల్లా ముందు-వెనుక ఎలాంటి పేర్లూ పెట్టవద్దంటూ, కోనసీమ జిల్లా సాధన సమితి గతకొద్దికాలం నుంచీ డిమాండ్ చేస్తోంది. అయినా ప్రభుత్వం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చి, ఉత్తర్వులిచ్చింది. దానితో కోనసీమను జిల్లాగా మార్చిన జగనన్నకు రుణపడి ఉంటామన్న అనే జనం, కొత్త నిర్ణయంతో అదే జగనన్న సర్కారుపై పళ్లు నూరాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించేముందు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించినప్పటికీ, దానిని ఎమ్మార్వో- ఆర్డీఓ స్థాయికి విస్తరించి అక్కడ కూడా అభ్యంతరాలుంటే చెప్పవచ్చని ప్రకటిస్తే సరిపోయేది. అప్పుడు జిల్లా వాసులంతా అమలాపురం వరకూ రోజూ రావలసిన పని తప్పేది. కానీ అలాకాకుండా, అమలాపురం వచ్చి అందించిన ఫిర్యాదులను తీసుకోకపోవడమే ప్రజల ఆగ్రహానికి కారణమయింది. అది చివరకు మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబెట్టేవరకూ వెళ్లింది. ఇదీ ఇప్పటివరకూ అందరికీ తెలిసిన కోనసీమ కల్లోల కథ.
మరి ప్రజల ఆగ్రహావేశం మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబెట్టేవరకూ ఎలా వెళ్లింది? ఎందుకు వెళ్లింది? అందులో ఆందోళనకారులెవరు? వారిని నడిపించిన అదృశ్య హస్తాలేమిటి? ఆత్మాహుతియత్నం చేసిన సాయి ఎవరి అనుచరుడు? అసలు కోనసీమలో కులచిచ్చు మొదలవుతుందని నిఘా దళం ఎందుకు ఊహించలేకపోయింది? చివరాఖరకు పోలీసులు ఎస్పీనే కాపాడుకోవలసిన దుస్థితి ఎందుకు దాపురించింది? డజన్ల మంది పోలీసులు క్షతగ్రాతులుయ్యేందుకు కారకులెవరు? ఇంత జరుగుతున్నా నిఘావర్గాలు ఎందుకు కళ్లుమూసుకున్నాయి? కోనసీమ జిల్లా సాధన సమితి మంగళవారం కార్యక్రమానికి వేలాదిమంది వస్తారని ఊహించడంలో విఫలమయినందుకు బాధ్యత ఎవరిది? ఈ మొత్తం వ్యవహారంలో నిఘా వర్గాల వైఫల్యం ఎంత? ఇంత జరిగినా ఈ ఘటనపై హోంమంత్రి కాకుండా సలహాదారు ఎందుకు మాట్లాడుతున్నారు? నిందితులను పట్టుకునేందుకు పోలీసులను పురమాయించి, పోయిన ప్రతిష్ఠ కాపాడవలసిన హోంమంత్రి.. ఘటనకు టీడీపీ-జనసేన కారమణమని ప్రకటించి విచారణకు ముందే నివేదిక ఇస్తే ఎలా? అంటే కోనసీమ కథలో రాజకీయకుట్ర కోణం దాగుందా? సూటిగా చెప్పాలంటే అరెస్టయిన కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ వ్యవహారాన్ని పక్కదారిపట్టించే రాజకీయ కోణం ఏమైనా ఈ అల్లర్ల వెనుక ఉందా?.. ఇవీ కొత్తగా తెరపైకి వచ్చిన ప్రశ్నలు.
కోనసీమ జిల్లాను అంతే ఉంచాలంటూ చాలాకాలం నుంచి వినిపిస్తున్న డిమాండు.. అదే సమయంలో అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలన్న డిమాండునూ వైసీపీ సర్కారు సరైన కోణంలో అర్ధం చేసుకున్నట్లు కనిపించలేదు. ముందు అంబేద్కర్ పేరు లేకుండా జిల్లా ప్రకటించిన ప్రభుత్వం.. తర్వాత ఆ పేరు చేర్చి వివాదానికి కారణమయిందన్నది కోనసీమవాసుల అభిప్రాయం. అసలు ప్రకటనరోజునే అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ప్రకటించి ఉంటే, నిన్నటి మూడుగంటల అరాచకం చూడవలసి వచ్చేది కాదు. జనసేనాధిపతి పవన్ కల్యాణ్ చె ప్పినట్లు.. అంబేద్కర్ పేరును మొదటే చేర్చిఉంటే, ఇన్ని సమస్యలు వచ్చేవి కావు. అయినా ఆయన పేరు పెట్టడాన్ని ఎవరూ ఆక్షేపించనవసరం లేదు. అంబేద్కర్ పుట్టిన రాష్ట్రంలోని ఏ జిల్లాకూ ఆయన పేరు పెట్టని నేపథ్యంలో, ఏపీలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడం గొప్ప విషయమే. అయితే, ఆ పనేదో జిల్లాల ప్రకటన రోజునే చేసి ఉంటే ఈ గత్తర వచ్చేది కాదు. మధ్యలో ప్రకటించటం వల్ల, కేవలం అంబేద్కర్ పేరును రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్న విమర్శ మూటకట్టుకోవలసి వచ్చింది.
సలహాదారు సజ్జల చెప్పినట్లు.. అఖిలపక్ష నిర్ణయం ప్రకారమే అంబేద్కర్ పేరు పెట్టిందనేది నిజమయితే.. ఆ పని జిల్లాల ప్రకటన రోజునే ఎందుకు చేయలేదన్నది ప్రశ్న. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను కూడా, పాలకులు సరైన పద్ధతి పాటించకపోవడంవల్ల కొత్త కష్టాలకు దారితీసింది. ఈ వైఫల్యాల దొంతర కలసి వెరసి, కోనసీమ న్నీరుకు కారణమయింది.
ఇప్పుడు ప్రభుత్వ దూరదృష్టిలోపం వల్ల కోనసీమలో దళితులు ఒకవైపు-మిగిలిన అన్ని కులాలు మరోవైపు నిలబడాల్సిన దురదృష్టకరపరిస్థితి. ఇలాంటి కులసమీకరణలు ఇప్పటివరకూ చూసింది లేదు. ఇది భవిష్యత్తు తరాలకు మరింత ప్రమాదం. అంబేద్కర్ పేరు వద్దంటున్న వర్గాలతో, అంబేద్కర్ పేరు ఉండాలనే వర్గం ఘర్షణ పడుతున్న పరిస్థితి పరిశీలిస్తే.. ఈ చిచ్చు చిన్నగా గోదావరి జిల్లాలు, అటుంచి గుంటూరు-కృష్ణా జిల్లాలకూ పాకే ప్రమాదం ఎంతో సమయం పట్టదనిపిస్తోంది. అంబేద్కర్ పేరు పెట్టినందుకే, మిగిలిన కులాలు వ్యతిరేకిస్తున్నాయన్న భావన ఇప్పటికే బలపడింది. అదే సమయంలో, ప్రభుత్వ నిర్ణయమే అందుకు కారణమన్న అభిప్రాయం కూడా అంతే బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు అంబేద్కర్ పేరు వద్దన్న వారంతా దేశద్రోహులు, దళిత ద్రోహులన్న పరిస్థితి ఏర్పడింది. రేపటి నుంచి కోనసీమలో ఈ వర్గాలన్నీ మొహమోహాలు చూసుకుని, కలసి జీవించే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఈ విచిత్ర, ప్రమాదకర పరిస్థితి భవిష్యత్తులో ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
ఇక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించి, ఇన్ని పరిణామాలకు టీడీపీ-జనసేన కారణమని ఆరోపిస్తున్న హోంమంత్రి.. ఆ ఆందోళనలో మంత్రి పినిపె విశ్వరూప్ ప్రధాన అనుచరుడయిన సాయి అనే నాయకుడు కూడా ఉండటాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి? ఆయనే కదా ఆత్మహత్యాయత్నం పేరిట హడావిడి చేసింది?అంటే ఈ ఆందోళన వెనుక వైసీపీ ఉందని అనుమానించాలా? సాయి అనే వైసీపీ నాయకుడు సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విశ్వరూప్ సహా వైసీపీ అగ్రనేతలతో ఉన్న ఫొటోలు ఇప్పటికే సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని హోమంత్రి వనిత ఎందుకు విస్మరించారు? మరి ఆ లెక్కన అధికార పార్టీనే అల్లర్లు రెచ్చగొట్టి, తాజాగా హత్య కేసులో అరెస్టయిన తన పార్టీ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ కేసును పక్కదోవపట్టించిందన్న ప్రతిపక్షాల ఆరోపణలూ పరిగణనలోకి తీసుకోవాలి కదా? అన్నవి బుద్ధిజీవుల ప్రశ్నలు. అందుకు తగినట్లే.. కోనసీమ ఘటన తెరపైకి రాగానే, ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ వ్యవహారం తెరమరుగయింది. రాజకీయాలు ఇలాగే ఉంటాయి.
తాజా పరిణామాలు వైసీపీకి రాజకీయంగా లాభదాయకమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాపులు, బీసీలు వైసీపీకి దూరమవుతున్న నేపథ్యంలో.. దళితులను గంపగుత్తగా తన వైపు మళ్లించేందుకే, అంబేద్కర్ పేరు చేర్చారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. అందువల్ల ఒక బలమైన వర్గం వైసీపీ అమ్ములపొదిలో అస్త్రంగా మారుతుందనేది వారి అభిప్రాయం. అయితే ఎస్సీలోని మాదిగలు ఎటువైపు ఉంటారన్నదే ఆసక్తికరమైన ప్రశ్న.
ఇదే సమయంలో కాపు-బీసీల కొత్త కలయిక కూడా ఆసక్తికర పరిణామమే. ఇప్పటిదాకా ఈ రెండు వర్గాలూ ఉప్పు-నిప్పులా ఉన్నవే. అంబేద్కర్ జిల్లా ప్రకటన నేపథ్యంలో ప్రారంభమయిన ఆందోళనపర్వంలో.. ఈ రెండు వర్గాలూ ఒకే గూటికి చేరడం రాజకీయంగా జనసేనకు ఎక్కువ లాభమయితే, టీడీపీకీ లాభమే. ఎందుకంటే శెట్టిబలిజలు టీడీపీతో ఉన్నారు కాబట్టి. కొత్తగా కాపులు జనసేన వైపు చూస్తున్నందున.. ఈ రెండు కులాలూ ఒకే గూటికి చేరితే అది సహజంగా వైసీపీకి నష్టమే. ఒకవేళ టీడీపీ-జనసేన కలిస్తే ఈ లెక్కలన్నీ వారికే అనుకూలంగా ఉంటాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో.. దళితులకు వ్యతిరేకంగా అన్ని కులాలూ ఏకమయినందున, వైసీపీ వ్యతిరేక ఓటు బలంగా మారుతున్నట్లు అర్ధమవుతుంది.