Suryaa.co.in

Editorial

జనంలో ఉండటం నా బలం- బలహీనత

పబ్లిక్‌లీడర్ పద్మారావు పజ్జన్న ఎట్ ది రేట్‌ఆఫ్ తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు. పీజేఆర్ నుంచి కేసీఆర్ వరకూ అంతా పిలిచే పేరు పజ్జన్న. జనానికీ ఆయన పజ్జన్నగానే పరిచయం. మూడు దశాబ్దాలు దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్దన్‌రెడ్డి అనుచరుడు, సహచరుడిగా ఉన్నప్పటికీ 1986లో కార్పొరేటర్‌గా తప్ప, ఒక్కసారి కూడా కాంగ్రెస్ టికెట్ సాధించలేని పజ్జన్న.. కేసీఆర్‌తో కలసి అనుకోకుండా తెలంగాణ ఉద్యమ బరిలోకి దిగి కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రి, డిప్యూటీ స్పీకర్ పదవులు సాధించారు. ఇల్లు-ఆఫీసు చుట్టూ జనం, టెన్షన్ రిలీఫ్‌కు జనంతో మజాక్‌లు. తనకు ఆ జనమే బలం-బలహీనత, వాళ్లతో ఉంటే ఆ కిక్కే వేరంటున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఇన్నర్ వ్యూ ఇది
( మార్తి సుబ్రహ్మణ్యం)

* కుటుంబ నేపథ్యం?
– నేను పుట్టింది సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో. పెరిగింది అంతా టకారబస్తీ. మాది పెద్ద ఫ్యామిలీ. ఐదుగురు బ్రదర్స్. ఐదుగురు సిస్టర్స్. అందులో ఒక సిస్టర్ చనిపోయారు. మా బ్రదర్స్ అంతా గ వర్నమెంట్ ఎంప్లాయిస్. నాన్నది కల్లు వ్యాపారం. నా పదవ ఏటనే తండ్రిని కోల్పోయా. అప్పటి నుంచి అమ్మే అందరినీ చదివించి, పెద్ద చేసింది. మా ఫ్యామిలీ కోసం అమ్మ చాలా కష్టపడింది. ఆ తర్వాత నేను ఫ్యామిలీ బాధ్యత తీసుకున్నా. ఇంటర్ సికింద్రాబాద్ మహబూబ్‌కాలేజీలో చదివా. కొన్ని కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేసి, కల్లు వ్యాపారంలోకి దిగా. నాకు ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు చేశా. నా బ్రదర్స్ ఫ్యామిలీ మంచి చెడ్డలు కూడా నేనే చూస్తుంటా.

* అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులయిన తర్వాత బంజారాహిల్స్, జూబ్లీహిల్‌లో ఉండేందుకు ఇష్టపడతారు. లేదా గవర్నమెంట్ క్వార్టర్స్‌లో ఉండటానికి ఇష్టపడతారు. మీరేంటి? ఇంకా సికింద్రాబాద్ పాట్‌మార్కెట్ గల్లీలోనే ఉంటున్నారు?
– ఏమో. నాకు మొదటి నుంచి జనంలో ఉండటమే ఇష్టం. ఒకరకంగా అది నా బలం, బలహీనత. మంత్రి అయిన తర్వాత 11 నెలలు మినిష్టర్ క్వార్టర్స్‌లో ఉన్నా. కానీ సికింద్రాబాద్ నుంచి ప్రజలు రోజూ అంతదూరం నుంచి నాకోసం రావడం, వచ్చే ముందు ఫోన్లు చేయడం చూసి.. ‘నన్ను ఎన్నుకున్న
IMG-20220321-WA0058 పాపానికి వాళ్లు ఇంతదూరం డబ్బు ఖర్చు పెట్టుకుని రావడం భావ్యమా’ అనిపించింది. అదే నేను టకారబస్తీలోనే ఉన్నాననుకోండి… పగలు నుంచి రాత్రి వరకూ ఎప్పుడైనా నా ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది కదా అనిపించింది. అందుకే వెంటనే మళ్లీ టకారబస్తీకొచ్చేశా.

* సొంత నియోజకవర్గమైన సనత్‌నగర్ నుంచి కాకుండా సికింద్రాబాద్ నుంచి ఎందుకు పోటీ చేశారు?
– ఎందుకో నాకు సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలన్న పర్సనల్ ఫీలింగ్ బలంగా ఉండేది. ఒకప్పుడు సికింద్రాబాద్‌లోనే సనత్‌నగర్ ఉండేది. తర్వాతనే సనత్‌నగర్ వచ్చింది కాబట్టి ఒకరకంగా సికింద్రాబాద్ కూడా నా సొంత నియోజకవర్గం కిందే లెక్క.

కేసీఆర్ వద్దన్నా సికింద్రాబాద్ సీటు తెచ్చుకున్నా
2004 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నన్ను పిలిచి ‘పజ్జన్నా సనత్‌నగర్‌లో పోటీ చేయడానికి రెడీగా ఉండు’ అన్నారు. అయితే నాకు సికింద్రాబాద్ కావాలని అడిగా. కానీ ఆయన సనత్‌నగర్‌లో సర్వే రిపోర్టులన్నీ నీకే అనుకూలంగా ఉన్నాయని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ‘నువ్వు అడిగితే ఖైరతాబాద్ సీటు ఇవ్వమన్నా ఇస్తా. సరే నీ ఇష్టం’ అని అంగీకరించారు. దానితో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేశా. తొలి ప్రయత్నంలోనే గెలిచా.

* అసలు మీరు తొలి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నారు. పైగా పీజేఆర్‌కు సన్నిహితులు. మరి కాంగ్రెస్ నుంచి టికెట్ ఎందుకు తెచ్చుకోలేకపోయారు? పీజేఆర్ ఏమీ సాయం చేయలేదా?
– నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ కాంగ్రెస్‌లోనే ఉన్నా. పీజేఆర్ వల్లే నేను రాజకీయాల్లోకి వచ్చా. కానీ నాకు ఆయన చేసినదానికంటే, నేను ఆయనకు చేసిందే ఎక్కువ. నేను ఒకరోజు వెళ్లకపోతే ఆయనే మా ఇంటికి వచ్చేవాడు. లేకపోతే ఎవరినయినా పంపించేవాడు. ఒక్కోసారి నేను ఆయన మీద అలిగేవాడిని. ఆయన నామీద జోకులేసేవాడు. కానీ సనత్‌నగర్ నుంచి మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. మరి నేను ఆయన కంటే పెద్దవాడని కాదు కదా? నాది ఆయన స్థాయి కాదు కదా? అందువల్ల సహజంగా టికెట్ ఆయనకే వస్తుంది. అందుకే పోటీ చేసే చాన్సు రాలేదు. పీజేఆర్ నాకోసం ప్రయత్నించినా ఒక్కసారి కూడా టికెట్ ఇప్పించలేకపోయారు. ఏం ఉపయోగం? ఆ ఎన్నికల్లో సనత్‌నగర్‌లోని మా 9 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లం చెన్నారెడ్డి కోసం పనిచేశాం. తర్వాత ఆయన సరోజినీపుల్లారెడ్డిని మా ఇంటికి పంపి, తన దగ్గర ఉండమని రాయబారం పంపించారు. కానీ నేను తిరస్కరించా. నేను అప్పటికే పీజేఆర్‌తో ఉండేవాడిని. ‘ఇది వ్యాపారం కాదు కదమ్మా. నేను నమ్ముకున్నవాళ్ల నుంచి రాలేను’ అని చెప్పి పంపించా.

* మరి తర్వాత పీజేఆర్ మిమ్మల్ని ఏమీ అనలేదా?
– నేను కలిసినప్పుడల్లా ‘పజ్జూ.. ఇంకేంది? నీవు అనుకున్న గోల్ సాధించావు. ఇంకా ఎందుకు నన్ను బనాయించి, సతాయిస్తావ్’ అని నవ్వుతూ అనేవాడు. కానీ ఆయన చనిపోవడం వ్యక్తిగతంగా నాకు చాలా లోటు. మేమిద్దరం అలా ఉండేవాళ్లం.

నా మెజారిటీనే నా కారు, మోపెడ్ నెంబర్లు
2004 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేశా. అది చాలా టఫ్ ఎలక్షన్. అప్పటికే శ్రీను (శ్రీనివాసయాదవ్) రెండుసార్లు మంత్రిగా ఉన్నారు. ఆయనపై పోటీ చేసి గెలవడం కష్టమని, కాంగ్రెస్ వాళ్లకు పార్టీ జెండాలు ఎగురవేసే పరిస్థితి లేదని చాలామంది నాకు చెప్పారు. సరే చూద్దామన్న పట్టుదలతో పనిచేశా. ఆ ఎన్నికల్లో నాకు 3067 ఓట్ల మెజారిటీ వచ్చింది. మీరు గమనించారో లేదో నా కారు, మోపెడ్, ఇతర వాహనాలకు అన్నీ అదే నెంబరు ఉంటుంది. నా రాజకీయ జీవితంలో ఆ ఎన్నిక మర్చిపోలేనిది.

* తొలిసారి కార్పొరేటర్ అవకాశం ఎలా వచ్చింది?
– 1986లో ఎంసీహెచ్ ఎన్నికలొచ్చాయి. పీజేఆర్ నన్ను మోండా నుంచి పోటీ చేయమన్నారు. కానీ నేను వద్దన్నా. అప్పటో నేను చాలా దూకుడుగా ఉండేవాడిని. నా హెయిర్ స్టెయిల్, మాట తీరు ఇప్పటికి పూర్తి భిన్నంగా ఉండేది. అయితే పీజేఆర్ ‘నేనున్నా పోటీ చేయమని’ బలవంతం చేయడంతో పోటీ చేశా. అది నా రాజకీయ జీవితంలో తొలి విజయం. మొత్తం 7 వేల ఓట్లు పోలవుతే, అందులో నాకొచ్చిన ఓట్లు నాలుగువేలు. రెండువేల ఓట్లతో గెలిచా. అప్పుడు టీడీపీ నుంచి ప్రకాష్, జనాత పార్టీ నుంచి శ్రీనివాసయాదవ్ పోటీ చేశారు.

నా డివిజన్‌లో ఎన్టీఆర్ 4 సార్లు ప్రచారం చేశారు
1986 హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అప్పటి సీఎం ఎన్టీఆర్ 4 సార్లు నా డివిజన్‌లో ప్రచారం చేయడం నాకు బాగా గుర్తు. ఎన్టీఆర్ వస్తే గెలవడం కష్టమని నన్ను చాలామంది నిరాశ పరిచారు. అదీ చూద్దామనుకున్నా. అప్పటి హోంమంత్రి వసంత నాగేశ్వరరావు మా డివిజన్ ఇన్చార్జి. ఆయన నా స్టైల్, మాట తీరు చూసి నన్ను ధూల్‌పేట నుంచి వచ్చి పోటీచేశారనుకున్నాట్ట. రావుగోపాలరావు, మురళీమోహన్ కూడా వచ్చి టీడీపీకి ప్రచారం చేశారు. ఇక నా కోసం అప్పటి కేంద్రమంత్రి జలగం వెంగళరావు, పీజేఆర్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ నేత శీలం రాందాస్ నాకు గంట ముందు ఫోన్ చేసి, మీటింగ్ పెట్టమని చెప్పారు. నాకు ఇబ్బందనిపించినా సభ పెట్టా. ఒక్క గంటలోనే రెండువేల మందిని జమ చేశా. జలగం వెంగళరావు గంట క్రితమే కదా నువ్వు ఈ పిల్లాడికి ఫోన్ చేసి చెప్పింది. అప్పుడే అంతమంది ఎలా వచ్చారని రాందాస్, నన్ను చూస్తూ ఆశ్చర్యపోయారు. మోండాలో మార్వాడీలు నాతోనే ఉంటారు. వారికి నేనంటే అభిమానం. నువ్వు గెలుస్తున్నావని వెంగళరావుగారు చెప్పారు. ఈలోగా పీజేఆర్ నాకు క్లాసులిచ్చేవాడు. రఫ్‌గా ఉండవద్దు. పొలైట్‌గా ఉండు. అందరితో మంచిగా ఉండు. ఎన్టీఆర్ కూడా ఇక్కడే దృష్టి పెట్టారు జాగ్రత్త అని చెప్పేవాడు. దానితో నేను నా తత్వం
IMG-20220321-WA0064 మార్చుకున్నా. అప్పట్లో నా జుట్టు స్టైల్ వేరుగా ఉండేది. చెవి కింద వరకూ పట్టీలు, కింద వరకూ మీసాలు. భుజం వరకూ జుట్టు ఉండేది. దానితో వాటిని సగం తగ్గించుకోవలసి వచ్చింది.

కేసీఆర్ వచ్చి నాకు కండువా వేశారు
* అసలు టీఆర్‌ఎస్‌లోకి ఎలా వచ్చారు?
కంటోన్మెంట్‌లో నా ప్రెండ్స్ రాఘవరెడ్డి, జంపన ప్రతాప్ ఓ రోజు నాకు ఫోన్ చేసి రేపు పొద్దునే బయటకు వెళ్లాలని రడీగా ఉండమన్నారు. వారిద్దరూ ఉదయమే రెండుకార్లలో వచ్చారు. మధ్య కారులో మేమున్నాం. అక్కడి నుంచి నేరుగా నన్ను జలదృశ్యం టీఆర్‌ఎస్ ఆఫీసుకు తీసుకువెళ్లారు. ఇక్కడికెందుకు తీసుకువచ్చారన్నా. నన్ను కింద ఉంచి వాళ్లిద్దరూ పైకి వెళ్లారు. పదినిమిషాల తర్వాత కేసీఆర్ పై
IMG-20220321-WA0052 నుంచి కిందకు వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. నీలాంటి వాళ్లు అవసరం అని అప్పటికప్పుడు కండువా వేశారు. పైన ప్రెస్‌వాళ్లున్నారు. ఇంకేముంది. ఫొటోలు తీసి, నేను టీఆర్‌ఎస్‌లో జాయిన్ అయినట్లు పొద్దున పేపర్లలో రాశారు. మధ్యాహ్నానికి ఈ వార్త రేడియోలో వచ్చింది. అని విన్న మా మోండా జనం, మిత్రులు మాకు తెలియకుండా ఎందుకు చేరావంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అందరికీ సర్దిచెప్పి పంపించి, దూరం నుంచి మా ఇంటివైపు చూస్తూ నిలబడ్డా. ఒక్కసారి ఏడుపొచ్చింది. అన్నేళ్ల కాంగ్రెస్‌ను వీడటం బాధించింది. అందుకే నాకు తెలియకుండానే కన్నీరొచ్చాయి. ఇక అక్కడి నుంచి ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు.

* టీఆర్‌ఎస్ పెట్టినప్పుడు హైదరాబాద్ సిటీలో పెద్ద బలం లేదు కదా? పైగా మీరు అధ్యక్షుడిగా పనిచేశారు. సభలు, సమావేశాలు. కేసీఆర్ నుంచి ఏమైనా ఒత్తిళ్లు ఉండేవా?
– మీరు చెప్పింది నిజమే. అప్పుడు సిటీలో పార్టీ ఎలా ఉండేదో మీకు తెలుసు. నేను 11 సంవత్సరాలు సిటీ ప్రెసిడెంట్‌గా చేశా. ఒక్కోసారి కేసీఆర్ ఫోన్ చేసి ఎల్లుండి బహిరంగసభ పెట్టమని చెప్పేవాళ్లు. ఇంత తక్కువ సమయంలోనా అని నేను సందేహిస్తే… నేనున్నా. కానీయ్ అనేవాళ్లు. ఇలాంటివి చాలా
IMG-20220321-WA0061 ఉన్నాయ్. నాపై కేసీఆర్‌కు ఉన్న నమ్మకం అలాంటిది. నేను కూడా అప్పటికప్పుడు బయట నుంచి డబ్బులు సమకూర్చుకుని సభలు సక్సెస్ చేసే వాడిని. కేసీఆర్ నుంచి నాపై ఎప్పుడూ ఒత్తిళ్లు ఉండేవి కాదు. నన్ను ఆయన గైడ్ చేసేవారు.

నా జీవితంలో రెండు షార్టేజీలు
* మీరు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పడుకోరు. అయినా అప్పుడు-ఇప్పుడు ఫిజిక్ ఒకేలా ఉండటం ఎలా సాధ్యమయింది?
– నా జీవితంలో రెండు షార్టేజీలున్నాయి. ఒకటి తిండి. రెండు నిద్ర. నాకు మూడు గంటల వరకూ నిద్రపట్టదు. సగం రాత్రి వరకూ ఫ్రెండ్స్‌తో బయట అరుగుమీద కూర్చుని ముచ్చట్లు చెబుతా. నా సంగతి తెలిసిన మా పార్టీ లీడర్లు కూడా, నేను అర్ధరాత్రయితే ఫ్రీగా ఉంటానని కనిపెట్టి ఆ సమయంలో వచ్చేవాళ్లు. అలా వాళ్లతో మాట్లాడుతుంటే ఒక్కోసారి మబ్బుల్లో నాలుగవుతుంది కూడా. ఇక అప్పుడు పడుకుంటా. అప్పట్లో ఉదయ పదిగంటలకు లేచేవాడిని. ఇప్పుడు 7 గంటలకే లేవాలి. ఒక గంట సేపు అన్ని పత్రికలూ చదువుతా. టీవీ చానళ్లు పెద్ద చూడను. యోగా, వాకింగ్ వంటివేమీ అలవాటు లేదు. మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు. క్రైమ్ సీరియళ్ము బాగా చూస్తా. అదేంటో గానీ మొదటి నుంచి కూడా తిండి కొంచెమే తినే అలవాటు. పాన్ తప్ప మిగిలిన ఏ అలవాట్లూ లేవు. గవర్నమెంటు కొలువు చేస్తున్నట్లు రోజూ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ, మళ్లీ సాయంత్రం నుంచి రాత్రి వరకూ క్యాంపు ఆఫీసులోనే ఉంటా.

మళ్లీ కార్పొరేటర్ అవకాశం ఎలా వచ్చింది?
– దాదాపు 10 ఏళ్ల తర్వాతనుకుంటా. 2002లో ఎంసీహెచ్ ఎన్నికలొచ్చినయ్. కేసీఆర్ నన్ను పిలిచి మోండా నుంచి నామినేషన్ వేయమన్నారు. అది చివరి నామినేషన్ల రోజనుకుంటా. నేను చేయనన్నాను. నేను అసెంబ్లీపైనే దృష్టి పెట్టానని చెప్పా. కేసీఆర్ ఒత్తిడి చేయడంతో మళ్లీ రెండోసారి కార్పొరేటర్‌గా పోటీ చేశా. అయితే నా టార్గెట్ అసెంబ్లీ సీటేనని ఆయనకు చెబితే, కేసీఆర్ కూడా ఓకే పజ్జన్నా అని హామీ ఇచ్చారు. అప్పట్లో టీఆర్‌ఎస్‌కు సిటీలో ఎంత బలం ఉందో మీకు తెలుసు. అయినా నాతోపాటు, మాణికేశ్వరనగర్ నుంచి యాదయ్య ఇద్దరమే టీఆర్‌ఎస్ నుంచి గెలిచాం. అలా రాజకీయంగా మళ్లీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలయింది.
———————————————–
కేసీఆర్ పెద్ద పోర్ట్‌ఫోలియో తీసుకోమన్నా భయంతో వద్దని చెప్పా
రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఎన్నికలు జరిగిన తర్వాత మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచా. నాకు పెరేడ్‌గ్రౌండ్‌లో సభ బాధ్యతలు అప్పగించారు. 2 రాత్రులు, 2 పగలు అక్కడే ఉన్నా. ఈలోగా వెంటనే వచ్చి కలవమని కేసీఆర్ నుంచి ఫోన్. కేసీఆర్ నన్ను పిలిచి పంచాయితీరాజ్, ఆర్‌అండ్‌బి ఇంకేదో శాఖ ఇస్తా. ఏది కావాలో కోరుకో అన్నారు. నాకు భయమేసింది. మంత్రి పదవి ఇస్తామంటున్నారు. పైగా పెద్ద పెద్ద శాఖలు. దానితో ‘నాకు అవేమీ వద్దు. ఎక్సైజ్ శాఖ ఇవ్వమన్నా’. దానికి కేసీఆర్ ‘నీకు తెలివుందా? పెద్ద శాఖలిస్తానంటే చిన్న శాఖ అడుగుతున్నావ్’ అని మందలించారు. నేను మాత్రం ఎక్సైజ్ శాఖనే
DSC-0726 అడిగా. నాకు ఆ శాఖ గురించి అవగాహన ఉంది. పైగా కొత్త కదా అని సర్దిచెప్పే ప్రయత్నం చేశా. ఆయన అయిష్టంగానే సరేనని,అక్కడికి వచ్చిన హరీష్‌ను పజ్జన్నకు నచ్చచెప్పమని వెళ్లిపోయారు. ‘సారేమో నిన్ను పెద్ద పదవిలో చూడాలనుకుంటున్నారు. నువ్వేంటి చిన్నశాఖ అడిగావ్. సార్ చెప్పింది విను’ అని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ నేను ఎక్సైజే అడిగా. నిజానికి అప్పుడు బాగా కాంపిటేషన్ ఉంది. శ్రీనివాసగౌడ్ కూడా మంత్రి పదవి ఆశించాడు. అయితే తొలి నుంచి కష్టనష్టాల్లో తన వెంట ఉన్న నాపై కేసీఆర్ ప్రత్యేకాభిమానం చూపించారు. నేనంటే ఆయనకు చాలా అభిమానం. నేను కూడా పార్టీకి అంతే చేశా. నా కష్టం కేసీఆర్‌కు తెలుసు కాబట్టే, అడగకుండానే పిలిచి మంత్రి పదవి ఇస్తానన్నారు. అయితే శ్రీనివాసగౌడ్‌కు వచ్చేసారి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి, అప్పుడు నన్ను ఎక్సైజ్ మంత్రిగా తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీనివాసగౌడ్‌కు అన్నమాట ప్రకారం మంత్రి పదవి ఇచ్చారు.
————————————————
* ఇప్పుడున్న క్యాబినెట్‌లో చాలామంది మీకంటే పార్టీలో జూనియర్లే. కానీ రెండోసారి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తి చెందలేదా? కేసీఆర్‌ను కలవలేదా?
– ఇటు చూడండి. ప్రాంతీయ పార్టీల్లో ఏదైనా బాస్ నిర్ణయమే. పార్టీకి ఏది మంచిదో బాసే నిర్ణయించుకుంటాడు. కేసీఆర్‌కు అందరిమీద అంచనాలున్నాయి. నాకేమీ అసంతృప్తి లేదు. నాకు అప్పుడు అడగకుండానే పెద్ద శాఖలు ఇస్తానన్నది కేసీఆరే కదా. మరి నాకు అసంతృప్తి ఎలా ఉంటుంది చెప్పండి? ఆయనకు తెలుసు కదా ఎవరికి ఏమి ఇవ్వాలో? ఇవ్వకపోయినా నేనేమీ ఫీలవలేదు.
———————————————–
అప్పుడు మిగిలిన జుట్టు కూడా తీసేయాల్సి వచ్చింది
– నేను ఎమ్మెల్యే అయిన తొలిసారి అడ్డగుట్టలో ప్రోగ్రాముకు వెళ్లాల్సి వచ్చింది. నేను వెళ్లబోతుంటే కొంతమంది మహిళలు వచ్చారు. వాళ్లు నేను వచ్చేవరకూ అక్కడే ఉండటం చూశా. మధ్యాహ్నం రెండయింది. భోజనం చేశారా అని అడిగితే లేదన్నారు. నేను వెంటనే పక్కనే ఉన్న హోటల్ నుంచి వెజిటబుల్ బిర్యానీ తెప్పించి తినమని చెప్పా. వాళ్లు వద్దన్నారు. అలాగయితే నేనూ తినను అని చెప్పా. వాళ్లు తిన్న తర్వాత సమస్య చెప్పారు. వాళ్లు బయటకు వెళ్లిన తర్వాత మా శేఖర్ ఆ మహిళలతో ఏదో
DSC-0724మట్లాడుతుండటం గమనించా. పిలిచి మహిళలతో ఏం మాట్లాడుతున్నావ్ అని అడిగా. శేఖర్ ముందు మొహమాటపడినా తర్వాత అసలు విషయం చెప్పాడు. ‘అన్న గురించి బయట ఏదేదో చెప్పారు. కానీ చాలామంచోడు. కాకపోతే ఆయన జుట్టు, మీసం స్టైల్ చూస్తే కొంచెం భయమేసింది’ అన్నారు. తర్వాత నాకు అర్ధమయింది. వెంటనే నేను ఎంతో ప్రేమతో పెంచుకున్న మిగిలిన జుట్టు, మీసం, పట్టీని పూర్తిగా తగ్గించుకుని, ఇదిగో ఇలా తయ్యారయ్యా. ఒకసారి కార్పొరేటర్‌గా, ఇంకోసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా హెయిర్‌స్టైల్ మార్చుకోవలసి వచ్చింది.

* ఆ విధంగా డిప్యూటీ స్పీకర్ ఇస్తే సర్దుకుపోయారా?
– లేదు. డిప్యూటీ స్పీకర్ ఇస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. నాకు వద్దు. ఎమ్మెల్యేగానే ఉంటానని చెప్పా. ఒకసారి మంత్రిగా చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి, ఎమ్మెల్యేగానే కొనసాగుతా అని చెప్పా. అప్పుడు రామ్ (కేటీఆర్ )వచ్చి ‘చిచ్చా. డిప్యూటీ స్పీకర్ తీసుకో. సార్ కూడా చెప్పాడ’ని నచ్చ చెప్పారు. రామ్ నన్ను చిచ్చా అంటాడు. అయితే నాకు ఇస్తామంటున్న డిప్యూటీ స్పీకర్ పదవి కూడా అడ్జస్ట్‌మెంట్‌లో ఇంకెవరయికయినా ఇవ్వండి అని కూడా చెప్పా. అది నేను అసంతృప్తితోనో, ఆగ్రహంతోనో చెప్పలేదు. అదే మాట రామ్‌తో కూడా అన్నా. కానీ రామ్ వినలేదు. తీసుకోవలసిందేనని చెప్పడంతో నీ ఇష్టమని డిప్యూటీ స్పీకర్ తీసుకున్నా.

* మరి మీకు డిప్యూటీ స్పీకర్ కొత్త కదా? పైగా మొన్నీమధ్య వరసగా మూడురోజులు స్పీకర్ చైర్‌లో కూర్చుకున్నారు. ఎలా అనిపించింది?
– 15 సంవత్సరాలు హౌజ్‌లో ఉన్నా కదా. అన్నీ తెలుసుకున్నా. మీరన్నట్లు డిప్యూటీ స్పీకర్‌గా హౌస్‌లో నాది పరిమిత పాత్ర. కానీ ఇదే సెషన్‌లో స్పీకర్‌గారు 3 రోజులు సెలవు పెట్టినప్పుడు సభ నేనే నడిపా. ఎవరు మైకు అడిగితే వారికి ఇచ్చా. ఎప్పుడూ సభలో ముందు వరసలో నా పక్కన భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉంటారు. వాళ్లు మాకు అవకాశం ఇవ్వడం లేదు. స్పీకర్ మా వైపు చూడటం లేదని తరచూ బాధపడేవారు. వారి కామెంట్లు వినేవాడిని. అందుకే ఆ మూడురోజులూ అడిగిన వారందరికీ మైకు ఇచ్చా. అలా దాదాపు అందరికీ మాట్లాడే అవకాశం వచ్చింది. చాలామంది డిప్యూటీ స్పీకర్ అంటే చిన్న పదవి అనుకుంటారు. కానీ అది గౌరవప్రదమైన పదవి అని చాలామందికి తెలియదు. స్పీకర్ చైర్‌లో కూర్చుంటే అందరూ లేచి నిలబడి నమస్కరించాల్సిందే. మంత్రి పదవిలో ఉంటే ఆ అవకాశం ఉండదు కదా? పైగా గవర్నర్, స్పీకర్, సీఎం వంటి ఐదారుమంది ప్రొటోకాల్‌లో డిప్యూటీ స్పీకర్ ఉంటారు.

* ఒకప్పుడు కేసీఆర్ బెడ్‌రూమ్‌కు నేరుగా వెళ్లేంత చనువు, స్వేచ్ఛ ఉన్న అతి తక్కువమందిలో మీరూ ఒకరుగా ఉండేవారు కదా. మరిప్పుడు అదే చనువు కొనసాగుతుందా?
– ఎందుకు లేదనుకుంటున్నారు? అయితే నాకేమీ పనులుండవు. ఎప్పుడూ సీఎం చుట్టూ కనిపించాలన్న షోకు నాకు ఎప్పుడూ లేదు. మా ఇద్దరి మధ్య బంధం అలాగే ఉంది.

సీఎంఆర్‌ఎఫ్‌లో కేటీఆర్-హరీష్‌తోనే పోటీ
– పేదవాళ్లు ఆపదలో ఉన్నప్పుడు సాయం చేసే సీఎం రిలీఫ్‌ఫండ్ కోసం చాలామంది ఆశగా ఎదురుచూస్తుంటారు. మీ ప్రెస్‌వాళ్లతో సహా చాలామందికి సీఎంఆర్‌ఎఫ్ ఇప్పించా. మీకో విషయం తెలుసా. ఆ విషయంలో కేటీఆర్- హరీష్‌తో నాకు ఎప్పుడూ పోటీ ఉంటుంది. వాళ్లు ఒక్కోసారి కోటి ఎక్కువ
DSC-0719 తీసుకుంటే, నేను మరోసారి ఎక్కువ తీసుకుంటా. ఇప్పటికి నేనొక్కడినే 40 కోట్ల రూపాయల వరకూ సీఎం రిలీఫ్‌ఫండ్ ఇప్పించా. నా దగ్గరకు అన్ని జిల్లాల వాళ్లు వస్తారు. ఇక్కడ ఆసుపత్రిలో చేర్చామని చెబుతారు. వాళ్లకూ లెటర్ ఇవ్వాల్సివస్తుంది. ఇక సిటీలో నియోజకవర్గాల సంగతి సరేసరి.

* మీరు టైమ్ మెయిన్‌టెయిన్ చేయరని, ఫోన్లు కూడా తీయరని, మంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగులకూ ఒక్కోసారి లేటుగా వెళ్లేవారంటున్నారు. నిజమేనా?
– క్యాబినెట్ మీటింగులకు సీఎం కంటే మంత్రులు ముందుండాలి. కాబట్టి ఆ ఆరోపణ అబద్ధం. నేను వ్యక్తిగతంగా ఒక పదిమందికి సాయం చేసే స్థాయి ఉందనుకోండి. చేయవచ్చు. కానీ వందమందికి నేను సాయం చేయలేను కదా? నాకొచ్చే ఫోన్లన్నీ జనం వ్యక్తిగత అవసరాలకు సంబంధించినవే ఎక్కువ ఉంటాయి. అవసరం, సందర్భం బట్టి ఫోన్లు తీస్తుంటా. ఇక రోజూ నేను ఈ ఆఫీసుకు ఉద్యోగం చేస్తున్నట్లు వస్తా. అట్ల ఎవరైనా వస్తారేమో నాకు చెప్పండి. మళ్లీ సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఇంట్లో అందుబాటులోనే ఉంటా. నా ఆఫీసు సిబ్బంది అయితే రోజులో 15 గంటలు ఇక్కడే ఉంటారు.

కరోనా సమయంలో కోటిన్నర రూపాయలతో కార్యక్రమాలు
కరోనా సమయంలో అంతా దెబ్బతిన్నారు. పేదవారికి ఎలాగూ ప్రభుత్వం సహాయం చేస్తుంది. డబ్బున్నవాళ్లకు ఎవరి సాయం అవసరం లేదు. కానీ మధ్య తరగతి వారికే ఎవరూ సాయం చేయరు. వారూ సాయం అడగరు. అందుకే నేను కోటి 60 లక్షల ఖరీదు చేసే నిత్యావసర వస్తువులను, 25 వేల మందికి రెండువారాలకు సరిపడా అందించా. వాటి ప్యాకింగ్-పంపిణీకి నెల పట్టింది. నిజానికి అప్పుడు నా దగ్గర సరిపడా డబ్బు కూడా లేదు. ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నా. ఆ తర్వాత నన్ను చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు స్ఫూర్తిగా తీసుకుని పంపిణీ చేయడం తృప్తినిచ్చింది.

* మీ గాడ్‌ఫాదర్ ఎవరు?
– నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది పీజేఆర్. కానీ ఆయన నాకోసం ప్రయత్నించినా ఏమీ చేయలేకపోయారు. ఇక నన్ను మళ్లీ కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రి నుంచి ఈస్థాయికి తెచ్చింది మాత్రం కేసీఆరే. కాబట్టి నాకు ఆయనే గాడ్‌ఫాదర్. నేను ఎక్కడున్నా నా శక్తికి మించి కష్టపడి పనిచేశా.

* మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన?
– ఎమ్మెల్యేగా విజయం సాధించడం.
* బాధపెట్టిన సంఘటన?
– మమ్మల్ని కష్టపడి పెంచిన అమ్మ చనిపోవడం. నాన్న మరణించిన తర్వాత అన్ని బాధ్యతలూ ఆమెనే తీసుకుంది.

* జీవితంలో ఏదైనా గోల్ మిగిలి ఉందా?
– నేను మోండాలోని టకారబస్తీ అనే మిడిల్‌క్లాస్ లోకాలిటీ నుంచి కార్పొరేటర్- మంత్రి- డిప్యూటీ స్పీకర్ దాకా వచ్చా. పజ్జన్న దగ్గరకెళితే పనులవుతాయన్న పేరుంది. ఒక మిడిల్‌క్లాస్ వ్యక్తి ఈ స్థాయికి రావడం సాధారణ విషయం కాదు కదా? అది చాలు నాకు. ఇంక గోల్ ఏమీలేదు.

* మరి వ్యాపారాల సంగతేమిటి?
– నేనుండే టకారబస్తీలోని ఇళ్లు కొని అమ్ముతుంటా. మరి నాకూ ఫ్యామిలీ ఉంది. బతకాలి కదా? నేనెక్కడా అవినీతికి పాల్పడను. అలా ఉంటే మీరంతా ఎప్పుడో రాసేవాళ్లు కదా?
* రాజకీయాల్లో వారసత్వం గురించి మీ అభిప్రాయం?
– తప్పేంటి? భారతదేశంలో వారసులు లేని లీడర్లు ఎవరో చెప్పండి నాకు. అంటే కుటుంబంలో ఒకరితోనే ఆగిపోవాలని ఎక్కడైనా ఉందా? ప్రతిభ-అర్హత ఉంటే ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. ఇప్పుడు జనం ఎంత మంది నా దగ్గరకు వస్తారో, నా పెద్ద కొడుకు రామేశ్వర్ దగ్గరకూ అంతేమంది వస్తారు. వాడూ కొన్ని డివిజన్లు చూస్తున్నాడు. మొన్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల బాధ్యతలు చూశాడు. పోటీవరకూ తండ్రుల పేరు కలసివస్తుంది. కానీ ప్రజలను ఎలా మెప్పించాలన్న దానిపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది ఎవరికైనా వర్తించే సూత్రం. కేసీఆర్ నా కుమారుడిని ఎలక్షన్‌కు తయారుచేయమని చెప్పారు. కానీ వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తున్నా.

* కేటీఆర్‌ను కాబోయే సీఎం అంటున్నారు. అంగీకరిస్తారా?
IMG-20220321-WA0050– ఎందుకు అంగీకరించం? నేను ఇందాకే చెప్పా. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబసభ్యులు రావడం సహజం. అందులో కేటీఆర్ ఎప్పుడో పాలిటిక్స్‌లోకి వచ్చారు. పార్టీలో బాధ్యతలు నిర్వహించారు. జనంలో నిలిచి గెలిచారు. కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని తన సమర్ధతతో నిరూపించుకున్నారు. కవిత కూడా అంతే. కష్టపడుతున్నారు. వాళ్లెవరికీ ఓవర్‌నైట్‌లో, కష్టపడకుండా పదవులు రాలేదు. సమర్ధత నిరూపించుకున్న తర్వాతే పదవులొచ్చాయి.

* ఇప్పుడు మంత్రులకు పెద్దగా అధికారాలు, స్వేచ్ఛ లేదన్న విమర్శలున్నాయి. అన్నీ సీఎంఓ కేంద్రంగానే నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో మంత్రిగా ఉన్న మీకూ అంతే ఉండేదా?
– ఇప్పుడు నేను క్యాబినెట్‌లో లేను కాబట్టి ఆ విషయం నాకు తెలియదు. కానీ నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను నాకు సంబంధించిన శాఖ గురించి అన్నీ సీఎంగారికి చెప్పేవాడినిని. ఒక నోట్‌కూడా ఇచ్చేవాడిని. మాకు స్వేచ్ఛ ఉండేది. నన్ను ఏదైనా అడిగితే నా అభిప్రాయం చెప్పేవాడిని.

* చాలామంది పదవులొస్తే ఏదో ఒక రూపంలో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. మీరేంటి? విదేశాలకు వెళ్లడం ఇష్టం లేదంటారట. నిజమేనా?
– ఏమో. కారణం తెలియదు కానీ, నాకు విదేశాలకు వెళ్లాలంటే పెద్దగా ఇష్టం ఉండదు. నాకు ఇన్విటేషన్లు వస్తుంటాయి. రెండేళ్లయితే కొరియో వాళ్లు రెండేళ్లు ఒత్తిడి చేశారు. నాకు నా ఇళ్లు, ఆఫీసు, నా సికి ంద్రాబాద్ జనం. అదే నా లోకం. చెప్పా కదా? జనం మధ్య ఉంటే ఆ కిక్కే వేరని. నాకు అదొక నషా.
pdr

LEAVE A RESPONSE