బీజేపీ… ఇటు నుంచి అటు

ఆంధ్రప్రదేశ్ లో గత ఆరేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలను నిర్ద్వందం గా, ఏకపక్షం గా, నిర్మొహమాటం గా, ప్రత్యక్షం గా పరోక్షంగా గా సమర్థిస్తూ వచ్చిన బీజేపీ కేంద్ర నాయకత్వం…. ఇప్పుడు ఆయనను హఠాత్తుగా వదిలేసింది. వదిలేయడం తో పాటు, తనకు పుట్టు రాజకీయ, సామాజిక ప్రత్యర్థి అని జగన్మోహనరెడ్డి భావించే చంద్రబాబు నాయుడు తో జతకట్టింది. ఇది కలయో… వైష్ణవ మాయో… జనానికి అర్ధం కానంత పొలిటికల్ ట్విస్టు.

2018 లో బీజేపీ కౌగిలి నుంచి తెలుగు దేశం పార్టీ బయటకు వచ్చేసింది. వెంటనే, జగన్మోహన రెడ్డి నేతృత్వం లోని వైసీపీ పార్టీ బీజేపీ కి దగ్గరైంది. దీనివల్ల, అప్పటి ఎన్నికల సంఘం టీడీపీ ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది. టీడీపీ ప్రభుత్వం లో ఏ – అధికారి వద్దు – అని వైసీపీ అనుకుంటే, ఆ అధికారిని ఎన్నికల సంఘం విధుల నుంచి తొలగించింది. అప్పటి నిఘా విభాగం అధిపతి గా ఉన్న ఏ బీ వెంకటేశ్వర రావు ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని, మరి కొందరు అధికారులను పక్కన బెట్టింది. (ఇక, దేశ వ్యాప్తం గా ఈవీఎం ల పాత్ర గురించి కూడా అదేపనిగా మీడియా లో వార్తలు వచ్చాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ అనే స్వచ్చంద సంస్థ కూడా… మూడు వందల పైబడి లోకసభ నియోజక వర్గాలలో అవకతవకలు జరిగాయి అంటూ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది.)

చంద్రబాబు ను ఆంధ్రాలో ఓడించాలి అని ప్రతిన బూనారా అన్నంతగా బుసలు కొడుతున్న నరేంద్రమోడీ , అమిత్ షా కు, తెలంగాణ సీ. ఎం.చంద్రశేఖర్ తోడయ్యారు. కేంద్ర ప్రభుత్వం పగబడితే, ఎవరు మాత్రం తట్టుకోగలరు!?.

ఆ పరిస్థితుల్లో, చంద్రబాబు కు పీడ కల లాటి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం కు 23 స్థానాలు లభించడం… నిజంగా గొప్పే! అవి కూడా చంద్రబాబు కు ఎలా లభించాయి అబ్బా అని అటు జగన్, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రధాని మోడీ ఆశ్చర్యపడి పోయినా… పోయి ఉండవచ్చు.

ఇక అక్కడి నుంచి; ఆంధ్ర పై బీజేపీ స్వైర విహారం మొదలైంది.
జగన్ ప్రభుత్వ వ్యవహార శైలిని, పద్ధతులను నూటికి నూరు శాతం కేంద్రం లోని పెద్దలు సమర్ధిస్తున్నారు అనే అభిప్రాయం తెలుగువారికి బలంగా కలిగించారు. చంద్రబాబు పై కోపం తో ఆంధ్రప్రదేశ్ ను జగన్ కు అప్పగించి, కేంద్రం కాలక్షేపం చేస్తూ వచ్చిందనే భావం జనం లో బలంగా వ్యాపించింది. దీనికి తోడు ; పుండు మీద కారం జల్లినట్టు బీజేపీ కండువాలు వేసుకు తిరుగుతూ, ” మేమూ నాయకులమే ” అనే వాళ్ళు కొందరు జగన్ ప్రభుత్వానికి మద్ధతుగా వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు.

రాజధాని అనేది ఉనికిలో లేకుండా పోయినా, పోలవరం ప్రాజెక్టు పాపికొండల్లోకి వెళ్ళిపోయినా, విశాఖకు రైల్వే జోన్ కు కేంద్రం ఎర్ర జండా ఊపినా, విశాఖ ఉక్కు…. కేంద్రం హక్కు గా మారిపోయినా, అదిగో స్పెషల్ ప్యాకేజీ అంటూ స్పెషల్ స్టేటస్ ఇవ్వక పోయినా, చివరికి ఆ స్పెషల్ ప్యాకేజీ కూడా హుష్ కాకి అయిపోయినా…. కేంద్రం లోని పెద్దలతో జగన్, విజయసాయి రెడ్డి వంటి వారి సఖ్యత కు లోపం లేకుండా బీజేపీ చూసుకుంది. బీజేపీ కి కోపం రాకుండా వైసీపీ పెద్దలు చూసుకున్నారు.

తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, బెంగాల్ లో బీజేపీయేతర రాజకీయ నేతలను పరుగులు పెట్టించిన…. పెట్టిస్తున్న సీ బీ ఐ, ఈడీ, ఇన్ కమ్ టాక్స్ మొదలైన కేంద్ర సంస్థలు… అందుకే, ఆంధ్ర ప్రదేశ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు అంటే – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకులకు ఆత్మీయ, స్నేహ బంధం ఎంత ధృఢం గా ఉన్నదో ఊహించు కోవచ్చు.

ఆ దన్ను…. కేంద్రం నుంచి ఉండబట్టే ; 175 కి 175 అసెంబ్లీ స్థానాలు తమకు ఖాయం అని వైసీపీ నమ్మింది. ఆ నమ్మకం తోనే టీడీపీ, జనసేన చేతులు కలిపితే ; వైసీపీ నేతలు – డోంట్ కేర్ అన్నారు. అటు కేంద్రం బేషరతు మద్దతు, ఇటు చేతిలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, కుప్పలు తెప్పలుగా పోగడిపోయి ఉన్న ఓటర్లకు కావలసిన సరంజామ, తాయిలాలు చేతిలో ఉన్నవారు ఎవరైనా, “సిద్ధం” అనే అంటారు. అందుకే, ముఖ్యమంత్రి జగన్ “సిద్ధం” గా ఉన్నారు, మరో సారి తన విశ్వరూపం ప్రదర్శించడానికి.

అయిదేళ్లుగా, తన చుట్టూ తిరిగి; ఆత్మీయభిమానాలు ఇచ్చి పుచ్చుకున్న బీజేపీ, తమ చెవిలో కమలం పెడుతుందని వైసీపీ నేతలు కలలో సైతం ఊహించలేదు. అందుకనే, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులలో కొందరు – తాము వైసీపీ నేతల్లా వ్యవహరిస్తున్నారనే భావన జనానికి కలిగినా, నిశ్చింతగా ఉన్నారు.

కానీ, బీజేపీ…. జగన్ ను వదిలేసింది. తెలుగు దేశం శిబిరం లోకి ఫిరాయించింది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోకసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో…. ” మీరు ఇచ్చినన్ని… మేము పుచ్చుకున్నన్ని…. ” అని అన్నది.

సీట్లు ఫైనలైజ్ చేసుకోడానికి, కేంద్రం లో సీనియర్ మంత్రి, బీజేపీ నేత గజేంద్ర సింగ్ షెకావత్ విజయవాడ వచ్చి, చంద్రబాబు తో ఎనిమిది గంటలు కూర్చున్నారు. ఈ పరిణామం వైసీపీ పెద్దలు, పిన్నలు ఊహించలేదు. కల లాగా జరిగిపోయింది.
ఎందుకిలా అయింది!?

బీజేపీ కి సంబంధించినంత వరకు, దానికి తెలుగు దేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి తేడా ఏమీ లేదు. దానికి, వచ్చే ఎన్నికల్లో 370 లోకసభ స్థానాలు స్వంతం గానూ, మితపక్షాలు వంటి వాటితో కలిపి 405 స్థానాలు గెలిచి ; నరేంద్ర మోడీ పేరు.. స్వతంత్రానంతర భారత ప్రజాస్వామిక చరిత్ర లో చిరస్థాయిగా నిలిచి పోవాలి.

ఆంధ్ర లో చూస్తే, బీజేపీ పరిస్థితి…. ఒక శాతానికి ఎక్కువ, రెండు శాతానికి తక్కువ. జగన్ కు ఎంత దన్నుగా ఉన్నప్పటికీ ; ఎన్ డీ ఏ లో కలవడానికి సిద్ధం గా వైసీపీ లేదు. దానివల్ల, జగన్ పార్టీ తో పొత్తు పెట్టుకునే పరిస్థితి బీజేపీ కి లేదు. అంటే, కొత్త లోకసభలో బీజేపీ కి ఏపీ నుంచి ప్రాతినిధ్యం ఉండదు.

జగన్ పార్టీ పాతిక సీట్లకు పాతిక గెలిచినా, ఎన్ డీ ఏ లో చేరడం లేదు. అందువల్ల ఎన్ డీ ఏ కౌంట్ తగ్గిపోతుంది. వైసీపీ కేమో అటు కేంద్రం మద్దతూ కావాలి, ఇటు ముస్లింల మద్దతూ కావాలి.

అందువల్ల, వైసీపీ ని వదిలేసి ; టీడీపీ కి జై అని బీజేపీ అన్నది. చంద్రబాబు ఎన్ డీ ఏ లో చేరతారు. రేపు గెలిస్తే, బీజేపీ కీ మంత్రి పదవులు ఇస్తారు, కైకలూరు నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేసే కామినేని శ్రీనివాస్ తో పాటు మరొకరికి. కేంద్రం లో టీడీపీ మంత్రులు సైతం ఇద్దరు ముగ్గురుంటారు. ఇదీ బీజేపీ కి ఒనగూడే రాజకీయ ప్రయోజనం.

ఇక, తెలుగు దేశం ప్రయోజనానికి వస్తే, రాష్ట్రం లో ఎన్నికలు…. ఎన్నికల్లా జరుగుతాయని తెలుగుదేశం ఆశిస్తున్నది. ఇన్నాళ్ళు ఆ ఆశ లేదు. ఇప్పుడు టీడీపీ కి ధైర్యం వచ్చింది. ఇప్పటికే ఓ పదిహేను మంది వరకు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల జాబితాను కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు టీడీపీ నాయకులు అందచేశారని వార్తలు మీడియా లో వచ్చాయి.

ఇక, రోజూ ఓ జాబితా ఢిల్లీ వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకు ఓ లెక్క.
నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఓ లెక్క.

భోగాది వేంకట రాయుడు

Leave a Reply