సీఎం వస్తుంటే జనం వణికిపోవాలా?

– కల్వకుంట్ల రాజ్యాంగంలో జీ హుజూర్..అంటూ వంగి దండాలు పెట్టాలా?
– కేసీఆర్ ఫాంహౌజ్ దాటితే ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్ట్ చేస్తారా?
– బీజేపీ కార్యకర్తలు, నాయకులందరినీ అరెస్టు చేయడం నీచాతినీచం
– ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నిజాం నిరంకుశ పాలనలో ఉన్నామా?
– పోలీసులే టీఆర్ఎస్ కార్యకర్తల్లా మారిపోవడం సిగ్గుచేటు
– తక్షణమే కార్యకర్తలందరినీ భేషరతుగా విడుదల చేయాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ముఖ్యమంత్రి కేసీఆర్ జనగాం పర్యటన సందర్భంగా బీజేపీ ప్రజాప్రతినిధులు హౌజ్ అరెస్టు చేయడంతోపాటు నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి నిర్బంధించడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బయటకు వస్తే జనం భయంతో వణికిపోవాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫాంహౌజ్ బయటకు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీల నాయకులను హౌజ్ అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. గత రెండ్రోజులుగా జనగాం జిల్లా కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి నానా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.

‘‘ గతంలో ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వస్తున్నారంటే… జనం సంతోషంగా ఉండేవాళ్లు. సమస్యలు పరిష్కారమవుతాయనే భావన ఉండేది. జనం వినతి పత్రాలతో సీఎంను కలిసేందుకు సిద్ధంగా ఉండేవాళ్లు. కానీ సీఎం కేసీఆర్ వస్తుంటే జనం భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంది. పోలీసుల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నరు. ప్రతిపక్షాల ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ హౌజ్ అరెస్ట చేస్తున్నరు. కార్యకర్తలను అరెస్టు చేస్తున్నరు. సామాన్య ప్రజలను కట్టడి చేస్తూ నిర్బంధిస్తున్నారు. ఇంతటి దుర్మార్గమైన పాలన దేశంలో మరెక్కడా చూడలేదు.’’అని బండి సంజయ్ పేర్కొన్నారు.

కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ కో న్యాయం … బీజేపీ కో న్యాయం అమలవుతోందని మండిపడ్డారు. ‘‘ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మలు తగలటెట్టిన టీఆర్ఎస్ నేతలపై కేసులుండవు. పైగా రక్షణ కల్పిస్తారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు తగలబెడితే మాత్రం నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తారు. కల్వకుంట్ల రాజ్యాంగమంటే ఇదేనా? కల్వకుంట్ల రాజ్యాంగం పూర్తిగా అమలైతే ప్రజలకు మరింత ప్రమాదం ఏర్పడుతుందన్నాన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ బయటకొస్తే… చెప్పులు విడిచి జీ హుజూర్.. అంటూ వంగి వంగి దండాలు పెట్టాలేమో’’అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ జనగాం జిల్లాకు వెళుతున్నారని బీజేపీ కార్యకర్తలను రెండ్రోజులుగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం అన్యాయమన్నారు. ‘‘వాళ్లేమైనా ఉగ్రవాదులా? నిషేధిత సంస్థ సభ్యులా? సీఎంకు బీజేపీ కార్యకర్తలంటే ఎందుకంత భయం? రెండ్రోజులుగా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడమేంది? తీవ్రవాదులకు మద్దతిచ్చే పార్టీల నాయకులు యధేచ్చగా తిరుగుతుంటే వారికి వత్తాసు పలుకుతూ ఆ పార్టీ నేతల చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కేసీఆర్ జనం కోసం పోరాడే బీజేపీ కార్యకర్తలను నిర్బంధాలకు గురిచేయడమేంది? పోలీసులను అడ్డం పెట్టుకుని ఇంకెన్నాళ్లు పాలన కొనసాగిస్తారు?’’అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.

టీఆర్ఎస్ గూండాల దాడిలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించడానికి వెళుతుంటే బీజేపీ ఫ్లోర్ లీడర్ రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు లను హౌజ్ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బండి సంజయ్ ఖండించారు. ‘‘ పోలీసుల సమక్షంలోనే బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నారు. డీజీపీ, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నిజాం నిరంకుశ పాలనలో ఉన్నామా… అర్ధం కాక ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. మహోజ్వలిత పోరాటమైన తెలంగాణ ఉద్యమంలోనూ ఇట్లాంటి పరిస్థితిని చూడలేదు. ఇట్లాంటి దుస్థితి మరే రాష్ట్రంలో లేదు’’అని దుయ్యబట్టారు.

ఒకప్పుడు పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుండేదని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ పేరును చెడగొట్టారని మండిపడ్డారు. కొంతమంది పోలీసులైతే ఏకంగా టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని… చివరకు పోలీసు వాహనాలకు సైతం టీఆర్ఎస్ జెండాలను పెట్టుకు తిరుగుతుండటం నీచాతినీచమని వ్యాఖ్యానించారు. ఎంతమందిని అరెస్టు చేసినా… మరెన్ని దాడులు చేసినా బీజేపీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదన్నారు. నక్సలైట్లకు ఎదురొడ్డి నిలబడ్డ పార్టీ బీజేపీ అనే సంగతి కేసీఆర్ గుర్తుంచుకోవాలని తెలిపారు.

తక్షణమే అరెస్టు చేసిన కార్యకర్తలందిరినీ బేషరతుగా విడుదల చేయాలని, దాడులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.