– భయభ్రాంతులకు గురి చేస్తున్న చంద్రబాబును తరిమికొట్టండి
– మున్సిపల్ మాజీ వైన్ చైర్మన్ అడపా బాబ్జి పిలుపు
గుడివాడ, అక్టోబర్ 20: అత్యంత ప్రమాదకరంగా మారిన తెలుగుదేశం పార్టీని రాష్ట్రం నుండి బహిష్కరించాలని మున్సిపల్ మాజీ వైస్చర్మన్ అడపా బాబ్జి పిలుపునిచ్చారు. బుధవారం గుడివాడ పట్టణం శరత్ థియేటర్లోని నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్మోహనరెడ్డిని రాష్ట్ర ప్రజలు ఎంతగానో అభిమానిస్తున్నారని, గత ఎన్నికల్లో 151 సీట్లను కట్టబెట్టి ముఖ్యమంత్రి స్థానంలో ఆయనను కూర్చోబెట్టారన్నారు. కోట్ల మంది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న జగన్మోహనరెడ్డిని ఇష్టానుసారంగా దుర్భాషలాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. వాక్ స్వాతంత్ర్యం లేదని చెబుతున్న టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని తిట్టడమేనా అని ప్రశ్నించారు. సీఎం జగన్మోహనరెడ్డి దెబ్బకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హెూదాను కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. గత రెండేళ్ళుగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతోందన్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో, అంతకు ముందు జరిగిన పంచాయతీ, మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్నారు.
రాష్ట్రంలో టీడీపీని బతికించుకోవాలంటే ఏదో ఒక దుర్మార్గపు కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనకు చంద్రబాబు వచ్చారన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజలకు కన్పించని చంద్రబాబు హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్లోకి దిగిపోయారన్నారు. టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభితో ప్రెస్మీట్ పెట్టించి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని దుర్భాషలాడించారన్నారు. ప్రజలను కూడా రెచ్చగొట్టేలా మాట్లాడడమే గాక కార్యకర్తలతో టీడీపీ కార్యాలయంపై దాడులు చేయించుకున్నారన్నారు. ఆ నెపాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై నెడుతున్నారని చెప్పారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సంయమనం పాటించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే కార్యక్రమాలను చేపట్టవద్దని ఆదేశించారన్నారు. టీడీపీ మాత్రం ప్రజలను పట్టించుకోకుండా బంద్ కు పిలుపునివ్వడం సరికాదన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా బంద్ ప్రభావం కన్పించనే లేదన్నారు. కరోనా కష్టాలు కొనసాగుతున్నా రాష్ట్రంలో ఎక్కడా సంక్షేమం ఆగలేదన్నారు. ప్రతి నెలా సంక్షేమ క్యాలెండర్ను అమలు చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలకు అందజేయడం జరుగుతోందన్నారు. సీఎం జగన్మోహనరెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక సీఎం జగన్మోహనరెడ్డిని దుర్భాషలాడే స్థాయికి దిగజారారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్మోహనరెడ్డి నెరవేర్చుతున్నారని అన్నారు. ప్రజలను కులాలు, మతాల పేరుతో రెచ్చగొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న చంద్రబాబునాయుడును తరిమికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండల హనుమంతరావు, గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవి నారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకట లక్ష్మి, నాయకులు తులిమిల్లి యేషయ్య, నైనవరపు శేషుబాబు, తోట రాజేష్, షేక్ బాజీ, మెండా చంద్రపాల్, మామిళ్ళ ఎలీషా, వెంపటి సైమన్ తదితరులు పాల్గొన్నారు.