Suryaa.co.in

Andhra Pradesh

నూతన విద్యా విధానంతో ఉజ్వల భవిష్యత్

ఎంపీ విజయసాయి రెడ్డి

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసిన నూతన జాతీయ విద్యా విధానంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం ఆయన పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించారు.

నూతన జాతీయ విద్యా విధానంతో విద్యార్థులు అనేక విధాలుగా లాభపడతారని పేర్కొన్నారు. దేశంలో అనేక విదేశీ విద్యా సంస్థలు ఏర్పడతాయని తద్వారా విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందుబాటులోకి వస్తుందని అన్నారు. డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు ఉత్తమ నైపుణ్యమైన విద్య పొందుతారని అన్నారు.

ఈ కొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులు ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ వంటి విదేశీ భాషలతో పాటు, యోగా, క్రీడలు, నాట్యం, సంగీతం వంటివి కూడా నేర్చుకునే అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక కోర్సులు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. మొత్తంగా దేశీయ విద్యాప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు.

విమాన ప్రయాణీకులకు ప్రవర్తనా నియమావళి అవసరం
కొందరి విమాన ప్రయాణీకుల నేరపూరిత అనుచిత ప్రవర్తన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఈ మేరకు విమాన ప్రయాణీకుల ప్రవర్తనా నియమావళి రూపొందించడం అవసరమని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించి 18కోట్ల విమాన ప్రయాణీకులతో పాటు విమానయాన రంగంలో పనిచేస్తున్న సిబ్బంది భద్రతకు సంబంధించి తక్షణమే చర్యలు చేపట్టాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కోరుతున్నట్లు తెలిపారు.

నకిలీ కాల్ సెంటర్లపై చర్యలు చేపట్టాలి
బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ప్రజలను నమ్మించి, సొమ్ములు కాజేస్తున్న నకిలీ కాల్ సెంటర్లపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరుతున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు.. అటువంటి నకిలీ కాల్ సెంటర్లను గుర్తించేందుకు, శిక్షించేందుకు, ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము రికవరీ చేసేందుకు పటిష్టమైన చర్యలు అవసరమని అన్నారు. ఇప్పటికే చేపడుతున్న పలు చర్యలు నిష్ప్రయోజనంగా మారడంతో నకిలీ కాల్ సెంటర్ల కుంభకోణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని అన్నారు.

LEAVE A RESPONSE