జగన్ రెడ్డి దిగిపోయేనాటికి ఏపి అప్పులు రూ 10లక్షల కోట్లకు చేరుకుంటాయి

-వీటిపై చెల్లింపుల భారమే ఏడాదికి రూ లక్ష కోట్లు..?
-ఈ లెక్కాజమా లేని అప్పులు ఏపిలో అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి
-ఈ అప్పుల బరితెగింపుపై కేంద్రం ఇంకెన్నాళ్లు రాష్ట్రాన్ని హెచ్చరిస్తుంది..?
-సంక్షేమ పథకాల అమలుకన్నా సాక్షిలో యాడ్స్ కే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నాడు
-మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే జగన్ రెడ్డి ఏపీని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాడు.
-రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదు, ఉపాధి కల్పన గుండు సున్నా, యువతలో అశాంతి నెలకొంది
-బాధిత వర్గాల ప్రజలే వైసిపికి బుద్ది చెప్పడం ఖాయం
– శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు

జగన్ రెడ్డి సృష్టించిన ఆర్ధిక సంక్షోభం, వ్యవస్థల విధ్వంసం కారణంగా ఆంధ్రప్రదేశ్ సరిదిద్దలేని అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. ఈ సంక్షోభం నుంచి బైటేసే ప్రణాళికలుగాని, దూరదృష్టిగాని, ఆ దిశగా ప్రణాళికలు గాని ఆయన వద్దలేవు. బహిరంగ మార్కెట్ అప్పులకు, కార్పోరేట్ రుణసేకరణకు కేంద్రం అడ్డుకట్ట వేయకపోతే, రాష్ట్రానికి పూడ్చలేని నష్టం వాటిల్లుతుందనేది ప్రజాభిప్రాయం. ఏపిలో ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధింపు మినహా కేంద్రానికి మరో మార్గం కనిపించని పరిస్థితి నెలకొంది.

కార్పోరేట్ బారోయింగ్స్, బడ్జెటేతర రుణాలను రాష్ట్రం అప్పులుగానే పరిగణిస్తామని, పార్లమెంటులో కేంద్రం ఇటీవలే చెప్పింది కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వాటి తిరిగి చెల్లింపులను రాష్ట్ర బడ్జెట్ నుంచే చేస్తుందంటూ, ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొంది. వీటి చెల్లింపుల భారం రాష్ట్రంపైనే పడటం వల్ల ఆర్ధికంగా దివాలాతీసే దుస్థితి వచ్చింది. చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికి మరిన్ని అప్పులు చేస్తుండటమే దీనికి కారణం.

జగన్ రెడ్డి దిగిపోయే నాటికి బడ్జెటేతర అప్పులతో కలిపి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.10లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఈ విధమైన పొంతనలేని అప్పుల కారణంగా చెల్లింపుల భారమే ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు కానుంది. బడ్జెట్ అంచనాలు, మొత్తం వ్యయంలో వృద్ధి నత్తనడకన ఉంటే, తిరిగి చెల్లింపులు చాంతాడంత కానుంది. ఉదాహరణకి 2022-23 బహిరంగ మార్కెట్ అప్పులు తొలి 3నెలల్లోనే రూ 38వేల కోట్ల పైచిలుకు చేరడం ఆందోళనకరం (బడ్జెట్ లో పెట్టింది రూ 48వేల కోట్లు). ఈ అప్పుల బరితెగింపుపై కేంద్రం ఇంకెన్నాళ్లు రాష్ట్రాన్ని హెచ్చరిస్తుంది..?

తాను మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే జగన్ రెడ్డి ఈవిధంగా రాష్ట్రాన్ని భవిష్యత్తులో కూడా తిరిగి కోలుకోలేని దెబ్బ తీయాలని చూస్తున్నాడు. రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడం, ప్రజలను ఆర్ధికంగా బలోపేతం చేయడంపై జగన్ కు ఆసక్తి లేదు. ఆయనకు ఎంతసేపూ తన స్వలాభం, పార్టీ ప్రయోజనాలపైనే దృష్టి. వచ్చే ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి ప్రజాతీర్పును కాలరాసేందుకే జగన్ రెడ్డి అవినీతి కుంభకోణాలకు, అక్రమార్జనకు తెగబడ్డాడు. జగన్ అవినీతి, అక్రమ సంపాదన నేలమాలిగలు వెలికితీసే పనిపై కేంద్రం దృష్టి పెట్టాలి.

భవిష్యత్తులో పేదల సంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి నయాపైసా లేకుండా పెనువిపత్తులో రాష్ట్రం కూరుకుపోవడానికి, ఆకాశాన్నంటిన ఆర్ధిక సంక్షోభానికి జగన్ రెడ్డిదే పూర్తి భాధ్యత. ఈ లెక్కాజమా లేని అప్పులు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. దానికి తోడు ఇటీవలి మంత్రిమండలి మార్పు వైసిపి కొంపలో కుంపటి అయ్యింది. జగన్ అనుభవ రాహిత్యం, అహంభావం రాష్ట్రాన్ని అన్నిరంగాలలో అధ: పాతాళానికి దిగజార్చాయి, ప్రజా కంటక ప్రభుత్వంగా మార్చాయి. శ్రీలంక తరహాలోనే రాష్ట్ర ప్రజల్లో నిరాశానిస్పృహలు ప్రబలాయి. ఆ దేశాధ్యక్షుడు కూడా ఇలాగే తన వైఫల్యాలను కప్పిపెట్టి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటించాడు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం అంచుల్లో ఉంది. జగన్ పాలనతో ప్రజలంతా విసిగిపోయారు. నవరత్నాల పేరుతో దారుణంగా మోసగించిన జగన్ రెడ్డిని తిరిగి అధికార పీఠంపై కూర్చోబెట్టాలని ఎవరూ కోరుకోవడం లేదు. గత 3ఏళ్ల పాలనలో పేదరికం ప్రబలింది. ధనికులు, పేదల మధ్య అంతరం పెరిగింది. ఆర్ధిక అసమానతలు పెరిగిపోయాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, జగన్ డిబిఎఫ్ (ప్రత్యక్ష నగదు బదిలీ) పథకం ఒక ఫార్స్ గా మారింది. ప్రత్యక్ష నగదు బదిలీలో ఏపీ 19వ స్థానంకు పడిపోయింది. సంక్షేమ పథకాల అమలుకన్నా సాక్షిలో వాటి యాడ్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నాడు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదు, ఉపాధి కల్పన గుండుసున్నా. ఈ పరిణామంతో యువతలో అశాంతి ప్రబలుతోంది. జగన్ రెడ్డి యువతను కూడా దారుణంగా మోసగించాడు. బాధిత వర్గాల ప్రజలే రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ది చెబుతారు.

Leave a Reply