Home » పనిచేయాలనే తపన, పట్టుదలతో వచ్చా

పనిచేయాలనే తపన, పట్టుదలతో వచ్చా

-పేదరికం లేని మంగళగిరి నా లక్ష్యం
-హక్కులపై అడిగితే దళితులను చంపేస్తున్న జగన్!
-మంగళగిరిలో స్వర్ణకార భవన్ ఏర్పాటుచేస్తాం
-మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత లోకేష్

మంగళగిరి: 2019 ఎన్నికల్లో ఓడిపోయినపుడు ఒక రోజు బాధ పడ్డా, 2వరోజునుంచి ప్రజలకి సేవ చెయ్యడం ప్రారంభించాను, మంగళగిరి ప్రజల మనసు గెలవాలని నిర్ణయించుకున్నా, దేశంలో ఎక్కడా లేనివిధంగా సొంత నిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి, మంగళగిరి షరాఫ్ బజార్, ఇందిరానగర్ లలో నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు.

పెదవడ్లపూడి ప్రజలు యువనేతపై పూలవర్షం కురిపిస్తూ బ్యాండుమేళాలతో గ్రామంలోకి ఘనంగా స్వాగతించారు. తొలుత గ్రామంలోని పునీత మిఖాయేలు వారి పుణ్యక్షేత్రమైన చర్చిని లోకేష్ సందర్శించగా, పాస్టర్ నల్లపాటి శౌరి ప్రార్థనచేసి ఆశీర్వదించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం జరిగిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… 25సంవత్సరాలుగా మంగళగిరిలో రెండు కుటుంబాలకు అవకాశమిచ్చారు, వారు నేను చేసిన సంక్షేమంలో పదోవంతైనా చేశారా? గుండెలపై చేయివేసుకొని ఆలోచించాలి.

పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే ఏనాడైనా గ్రామంలోకి వచ్చి సమస్యలు తెలుసుకున్నారా? పనిచేయాలనే తపన, పట్టుదల నాలో ఉంది. పేదరికం లేని మంగళగిరి నా లక్ష్యం, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక చెప్పిన పనులన్నీ చేసి ఇక్కడి ప్రజలతో శభాష్ అన్పించుకుంటా. కోవిద్ తర్వాత పాదయాత్ర చేసి ఈ ప్రాంతంలో సమస్యలు తెలుసుకున్నా. అధికారంలోకి వచ్చాక ఇక్కడ దీర్ఘకాలంగా నివసిస్తున్న పేదల భూములకు శాశ్వత భూహక్కు కల్పించే బాధ్యత నాది. మురుగునీటి సమస్య అధికంగా ఉంది. భూగర్భ డ్రైనేజి ఏర్పాటుచేసి దోమలబెడద నివారిస్తా. పొలాలకు వెళ్లే డొంకరోడ్లు వేయాల్సి ఉంది. దళితులకు కమ్యూనిటీ హాలు నిర్మిస్తాం. భూమి కొనుగోలుచేసి శ్మశానానికి స్థలం కేటాయిస్తాం. పనిచేయడానికే మంగళగిరి వచ్చా. నియోజకవర్గ రూపురేఖలు మార్చే బాధ్యత నాది. మీరు నా చుట్టూ తిరగడం కాదు, నేనే మీ చుట్టూ తిరిగి సమస్యలు పరిష్కరిస్తా.

దళితులంటే జగన్ కు చిన్నచూపు
ముఖ్యమంత్రి జగన్ కు దళితులంటే చిన్నచూపు. గత అయిదేళ్లుగా హక్కుల గురించి పోరాడిన దళితులను చంపేస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వం దళితుల కోసం 27 సంక్షేమ పథకాలు అమలుచేస్తే జగన్ వచ్చాక వాటన్నింటినీ రద్దుచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసిపి పాలనలో దళితులపై దాడులు పెరిగాయి. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్యే అనంతబాబు కిరాతకంగా హత్యచేసి డోర్ డెలివరీ చేశాడు. అటువంటి వ్యక్తిని జగన్ పక్కన కూర్చొబెట్టుకోవడం దేనికి సంకేతం?

ముస్లింలను కూడా జగన్ ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. గతంలో తాము రంజాన్ తోఫా, మసీదులకు రంగులు వేసేందుకు నిధులు, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనాలు అందిస్తే… జగన్ వాటన్నింటినీ రద్దుచేశారు. ఇస్లాంలో హత్యలు, ఆత్మహత్యలు మహాపాపం. జగన్ సర్కారు వేధింపులు తాళలేక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. పలమనేరులో మిస్బా ఆత్మహత్య చేసుకుంది. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడిన ఇబ్రహీంను నర్సరావుపేటలో దారుణంగా నరికిచంపారు. సిఎఎపై టిడిపిపై దుష్ప్రచారం చేస్తున్న వైసిపి నాయకులు పార్లమెంటులో ఆ బిల్లుకు అనుకూలంగా గంపగుత్తగా ఓట్లేశారు. వైసిపి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు, మైనారిటీలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం.

యువనేత దృష్టికి పెదవడ్లపూడి సమస్యలు
పెదవడ్లపూడి ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తెచ్చారు. గ్రామంలో నంబూరు కాల్వకట్ట వద్ద దీర్ఘకాలంగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నాం, పాములు, ఇతర విషపురుగుల మధ్య భయంతో జీవిస్తున్నాం. పక్కాఇళ్లు నిర్మించాలి. కొత్తపాలెంలో మసీదు నిర్మాణం చేపట్టాలి. 20ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. పడిపోయిన ఇళ్లస్థానంలో కొత్తవి ఇళ్లు కట్టించి ఇవ్వాలి. 5,6వార్డుల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నాం. వాటర్ ట్యాంకు ఉన్నా ఎటువంటి ప్రయోజనం లేదు.

నీళ్లు కొనుక్కొని తాగాల్సి వస్తోంది. కృష్ణాజలాలను వడ్లమూడికి అందించండి. క్రైస్తవులకు ఫంక్షన్ హాలులేదు. ఏదైనా శుభకార్యం చేసుకోవాలంటే 60వేల నుంచి లక్షరూపాయలు వెచ్చించి ప్రైవేటు ఫంక్షన్ హాళ్లలో చేసుకోవాల్సి వస్తోంది. 4వవార్డులో విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుచేయాలని కోరారు. యువనేత నారా లోకేష్ స్పందిస్తూ… నియోజకవర్గ వ్యాప్తంగా ఇళ్లులేని 20వేలమంది పేదలకు ఇళ్లునిర్మించి తాళాలు అందజేసే బాధ్యత నాది. కృష్ణానది నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికీ తాగునీటి కుళాయిల ద్వారా నీరందిస్తాం. క్రైస్తవులకు ఫంక్షన్ హాలు నిర్మిస్తాం. వందరోజుల్లో 4వవార్డులో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుచేస్తాం.

స్వర్ణకార భవన్, కార్పొరేషన్ ఏర్పాటుచేస్తాం
స్వర్ణకారులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్, మంగళగిరిలో స్వర్ణకార భవన్ ఏర్పాటుచేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. షరాఫ్ బజార్ లో జరిగిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వర్ణకారులను ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేస్తాం. మంగళగిరిలో స్వర్ణకారులను పోలీసులు వేధిస్తున్నారు. నాకు ఓట్లు వేశారనే నెపంతో షాపులపై దాడులు చేయించారు. ఎక్కడో దొంగతనం జరిగితే ఇక్కడి వారిపై నెపం మోపారు. జిఎస్టీ అధికారులతో దాడులు చేయించారు. నీతి,నిజాయితీతో వ్యాపారం చేసే స్వర్ణకారులపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడటం దారుణం.

టిడిపి అధికారంలోకి వచ్చాక ఇటువంటి వేధింపులకు అడ్డుకట్ట వేస్తాం. స్వర్ణకారులకు గుర్తింపు కార్డులిస్తాం. మంగళగిరిలో గోల్డ్ సెజ్ ఏర్పాటుచేసి ల్యాబ్ డైమండ్, ఆధునిక ఆభరణాల తయారీపై శిక్షణ ఇస్తాం. దక్షిణభారతదేశంలో మంగళగిరిని గోల్డ్ హబ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు. షరాఫ్ బజార్ రచ్చబండ సభలో యువనేత లోకేష్ ఎదుట స్థానికులు సమస్యలను విన్నవించారు. షరాఫ్ బజార్ ప్రాంతంలో ఇరుకురోడ్లు, డ్రైనేజి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. ఇళ్లులేక అద్దెఇళ్లలో ఉంటూ ఇబ్బంది పడుతున్నాం. చేనేత సహకార సంఘాల్లో పనిచేసే కార్మికులు మరణిస్తే ఆప్కో 15వేలు సాయం బయటి చేనేతలకు కూడా ఇవ్వాలి.

చేనేతల ఆత్మహత్యలను నివారించాలి. స్వర్ణకారులు దొంగబంగారం కొన్నారంటూ పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. స్వర్ణకారులకు ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించాలి. స్వర్ణకార భవన్ ఏర్పాటుచేయాలి. నారా లోకేష్ స్పందిస్తూ… ఇళ్లులేని వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం. రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన ఆప్కోను ప్రక్షాళన చేస్తాం. స్వర్ణకారులపై వేధింపులు అరికడతామని హామీ ఇచ్చారు.

Leave a Reply