Suryaa.co.in

Features

నిబంధనలు అతిక్రమించిన ప్రైవేటు కళాశాలలపై చర్యలు చేపట్టలేరా?

( డా. యం. అఖిలమిత్ర – విద్యా పరిరక్షణ కమిటీ)

ఓ సమాజం ఆర్థికంగా నిలదొక్కు కో గలగాలి, లేదా అభివృద్ధి చెందాలి అంటే, విద్య అత్యవసరం. సిద్ధాంతాల ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాల కంటే, పేద దేశాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతాయి. కారణం, అభివృద్ధి చెందిన దేశాలు ప్రయోగాత్మకంగా ఉపయోగించే విధానాలు. కానీ కొందరు ఆర్థిక వేత్తలు దీన్ని అంగీకరించరు, వారి దృష్టిలో “అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతూనే వుంటాయి.

వాటికున్న వనరులలాంటివి. పేద దేశాలు పేద దేశాలు గానే వుండి పోతాయి వాటికున్న వనరులలాంటివి”,. సమాజానికి చెందిన బలహీనతల నుంచి సమాజాన్ని రక్షించాలంటే, కేవలం విద్య మాత్రమే మార్గం. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం సమాజ నిర్మాణమే. దశాబ్ద కాలంలో విద్య ని విస్మరించిన ప్రభుత్వం ఎక్కువగా ప్రైవేటు పరం చేసింది. ప్రభుత్వ కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించే విద్యార్థులు ప్రైవేటు కళాశాలలతో పోల్చుకుంటే వెయ్యోవంతు కూడా ఉండరు. అత్యధికంగా విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్నారు. మరి వీరికి చదువు చెబుతున్న అధ్యాపకుల పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రయివేటు అధ్యాపకుల బతుకు అగమ్యగోచరంగా తయారయింది. చాల కళాశాలల్లో అధ్యాపకులను పొమ్మనక పొగ పెడుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా జీతాలు ఇవ్వని కళాశాలలు, పాఠాలు చెప్పించుకొని అడ్డమైన చాకిరీ చేయించుకొని అర్థ జీతంతో సరిపెట్టిన కళాశాలలు. కొన్ని కళాశాలల్లో పిహెచ్డి పూర్తీ కాలేదని కొందరిని ఇంటికి పంపారు, మరికొన్ని కళాశాలల్లో రాటిఫై కాలేదని మరికొన్ని కళాశాలల్లో సీనియర్లకు జీతాలు ఎక్కువ ఇస్తున్నామని ఇంటికి పంపారు. మరి కొన్ని కళాశాలలు ఆరు నెలలు జీతాలు ఇవ్వక రాబోవు నెలల్లో జీతాలు ఇవ్వలేము.

మీ దారి మీరు చూసుకోండి అని హెడ్స్ ప్రిన్సిపాల్ తో మీటింగులు పెట్టి చెబుతున్నారు. అసంఘటిత రంగంలో ఉండే కార్మికుల కన్నా హీనమైన బతుకు. రోడ్డెక్కుదాం అనుకుంటే రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం. బోధన తప్ప వేరే పని తెలియని వైనం. ప్రభుత్వ అధ్యాపకుల అజమాయిషీ పెత్తనం భరించలేక ఉద్యోగం వొదులు కోలేక సతమతమవుతున్నారు. ఇప్పడు సాంకేతిక విద్యలో ఎక్కువ గా మూక్స్ విధానం అవలంబించడం వలన ఉపాధ్యాయులను తొలగిస్తున్నారు. ఆన్లైన్ కోర్సుల ద్వారా విద్యాభ్యాసంలో కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్ ద్వారా దేశంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.

studentsఆన్-లైన్ విద్య ఓ రకంగా దూరవిద్య. ఈ విధానంలో అభ్యసన , అవగాహనల కొరకు ఓ ప్రత్యేక అనుకూల స్థితి కలుగుతుంది. ఇది చాలా లాభదాయకంగానూ నిరూపింపబడింది. దీని నష్టాలు కూడా నేటి ప్రపంచం గమనిస్తూ ఉంది. విద్యార్థులలో పాఠశాలల పట్ల అనాసక్తి, ఉపాధ్యాయుల పట్ల అనాదరణ, విద్యా విధానం పట్ల సరియైన పట్టు లేకుండా పోతున్నది. భౌతికంగా అభ్యసన జరుగుతుంది కాని మానసికంగా విద్యాభ్యాసం జరగడం లేదు. విషయ సంగ్రహణ జరుగుతున్నది గాని, విషయ పరిజ్ఞానం పెంపొందింప బడడంలేదు.

విద్యలో ఇదే కీలకం, ఇదియే లోపిస్తున్నది. నిన్నమొన్నటి వరకు విద్యార్థులకు పాఠాలు నేర్పిన గురువులు నేడు పొట్టకూటి కోసం ప్రత్యామ్నాయ పనులకు వెళ్లే పరిస్థితి. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల ఆగడాలకు అంతుమితము లేదు. భోధన నమ్ముకొని జీవనం సాగించిన వీరిని ఇప్పడు తొలగించే పద్దతి వెతుకుతున్నాయి. దీనికి తోడు కాలేజీ యంత్రాంగం మొత్తం విద్య వ్యవస్థ బీజేపీ, టిఆరేస్, వైసిపి నాయకుల చేతుల్లోనే ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కండువా కప్పి రంగంలోకి దూకుతున్నారు.

వీరి ఆగడాలకు ముకుతాడు వేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, విద్య శాఖ మంత్రులు కళ్ళు మూసుకొని ఉన్నారు. గత ఎనిమిది సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క అధ్యాపక పోస్టు భర్తీ చేయలేదు. విశ్వవిద్యాలయాలలో ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులు లేక మూసివేతకు గురైనాయి. విశ్వవిద్యాలయాలలో కొలువులు భర్తీ చేద్దామన్న ఇంకిత జ్ఞానం అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండా పోయింది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో కీలకమైన పరీక్షల విభాగం కాలేజీ అభివృద్ధి మండలి అన్నీ ఔట్సోర్సింగ్ ద్వారా నడుస్తున్నాయి. పరీక్షల మూల్యాంకణం, పేపర్ సెట్టింగ్ అన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతులలో ఉంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఎంసెట్, నీట్ పరీక్షలు పేపర్ లీక్ చేసిన వారిపై ఏ చర్యలు తీసుకున్నారో తెలియదు. గతంలో కరోనా ప్రభావంతో వచ్చిన లాక్‌డౌన్‌లో సగం జీతం ఇచ్చి ఇప్పుడు ఇస్తాం అప్పుడిస్తాం అని కల్లిబొల్లి మాటలతో తమ వృత్తిని వదిలి జీవనోపాధికోసం దొరికిన పనులువైపు మళ్లి జీవనోపాధి వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించాలని అధ్యాపకులు సంఘటితంగా ఆందోళన చేపట్టాలి. ప్రయివేట్‌ ఇంజినీరింగ్ మరియు ప్రొఫెషనల్ కాలేజి అధ్యాపకుల సంఘటితంగా ఉద్యమించాలి. సంవత్సరం నుంచి యాజమాన్యం జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్న కళాశాలలపై విశ్వవిద్యాలయ అధికారులు చర్యలకు ఉపక్రమించాలి.

విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ, జీతాలు చెల్లించకుండా లెక్చరర్ల జీవితాలతో ఆడుకుంటున్న కళాశాల కాలేజీ యాజమాన్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.అలాగే పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించి, ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ప్రశ్నిస్తే, ఉద్యోగం నుంచి తొలగించి కొత్తవారిని తీసుకుంటున్నారు. దీంతో కొంతమంది అధ్యాపకులు మనోవేదనకు గురై బాధపడుతున్నారు . తక్షణమే యాజమాన్యలు బకాయి జీతాలు చెల్లించి, అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, విశ్వవిద్యాలయ అధికారులు ఉన్నత విద్యాధికారులు చర్యలు చేపట్టకపోతే వీరి పైన క్రిమినల్ కేసులు పెట్టాలి. అధ్యాపకుల సమస్యలు పరిష్కరించడానికి ఒక ఓబడ్సుమేన్ ప్రతి విశ్వవిద్యాలయం నియమించి సత్వర చర్యలు చేపట్టాలి.

LEAVE A RESPONSE