Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్!

– ప్రజలకు మద్దతుగా…. కార్యకర్తలకు భరోసాగా నేతల పోరాటాలు
– వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
– క్షేత్ర స్థాయిలో పని చేయని నేతలను ఉపేక్షించేది లేదు
– అసెంబ్లీ, పార్లమెంట్ ఇంచార్జిలతో సమీక్షలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
– మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంతాపం తెలిపిన సమావేశం

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ పాలనతో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ పాలనలో నలిగిపోతున్న ప్రజలకు న్యాయం జరిగేలా, మద్దతిచ్చేలా పోరాటం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రభుత్వంపై చేసే పోరాటంలో పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా నేతలు వ్యవహరించాలన్నారు. నియోజవర్గ స్థాయిలో వైసిపి ఎమ్మెల్యేల అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని… వీటిపై నియోజకవర్గ ఇంచార్జిలు గళమెత్తాలన్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జిలు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో చంద్రబాబు జూమ్ ద్వారా సమీక్షించి, వివిధ అంశాలపై దిశానిర్థేశం చేశారు.

జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్:
ప్రజాసమస్యలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, త్వరలో చేపట్టబోయే పార్టీ సభ్యత్వ నమోదు, నేతల పనితీరు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఒక్క చాన్స్ అనే నినాదంతో వచ్చిన సిఎం జగన్ కు ఇదే చివరి చాన్స్ అని టిడిపి అధినేత అన్నారు. ఇంట్లో తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని సిఎం.. ఇక రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారనే చర్చ రాష్ట్రం అంతా ఉందని చంద్రబాబు అన్నారు. జగన్ రెడ్డి తన అసమర్ధ, స్వార్ధపూరిత విధానాలతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దెబ్బతీశారని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో చేతి వృత్తుల వర్గాలు తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లిపోయారని చెప్పారు.

రైతుల సమస్యలు, గ్రామాల్లో పాఠశాలల మూసివేత నిర్ణయాలపై క్షేత్ర స్థాయి పోరాటాలు చెయ్యాలన్ని సూచించారు. వివేకా హత్య విషయంలో జగన్ వైఖరితో అతని నైజం ఏంటో స్పష్టం అయ్యిందన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు పెంచాలని నేతలకు సూచించారు. వైసిపి నేతల రౌడీయిజం, సెటిల్ మెంట్లపై గట్టిగా నిలబడాలన్నారు. మైనింగ్ అక్రమాలపై 5 నియోజకవర్గాల్లో చేసిన పోరాటాలు మంచి ఫలితాలను ఇచ్చాయని అన్నారు. వైసిపి దగ్గర డబ్బు, అధికారం ఉంటే… మనకు ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. ఆ విశ్వాసాన్ని పెంచుకునేందుకు గ్రామ స్థాయి నుండి నాయకులు పర్యటించాలన్నారు.

పని చెయ్యని నేతలను పార్టీ భరించదు:
పని చెయ్యని నాయకుల్ని పార్టీ భరించాల్సిన అవసరం లేదని… పార్టీ అధిష్టానం సహనానికి హద్దు ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. పని చెయ్యని వారి విషయంలో కఠిన నిర్ణయాలకు వెనుకాడబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని…. అన్నింటికీ నేతలు సిద్దంగా ఉండాలని అన్నారు. టిటిడి నిర్ణయాలపైనా సమావేశంలో చర్చ జరిగింది. సామాన్య భక్తులకు శ్రీ వారిని దూరం చేసేలా టిటిడి నిర్ణయాలు ఉన్నాయని నేతలు వివరించారు. టీటీడీ బోర్డు తీసుకనే నిర్ణయాలపై భక్తుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని నేతలు తెలిపారు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలో మొదలవుతుందని… ఆన్ లైన్ ద్వారా సభ్యత్వం పొందే విధంగా ప్రణాళిక సిద్దం చేసినట్లు చంద్రబాబు నేతలకు తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చెయ్యాలని సూచించారు. పార్టీ గ్రామ, మండల స్థాయిలో పెండింగ్ లో ఉన్న కమిటీల నియామకాన్ని వెంటనే పూర్తి చెయ్యాలని సూచించారు. తెలుగు దేశం పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ 100వ జయంతి, మహానాడు నిర్వహణపై పార్టీ పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన సమావేశం:
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మృతికి సమావేశం సంతాపం తెలిపింది. అంత్యంత హుందాగా వ్యవహరించే మంత్రి మేకపాటి గుండెపోటుతో మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న గౌతమ్ రెడ్డి…. 50 ఏళ్ల పిన్న వయసులో మృతిచెందడం విచారకరం అని సమావేశం అభిప్రాయ పడింది.

LEAVE A RESPONSE