Suryaa.co.in

Editorial

కాంగ్రెస్ చానెల్‌కు కూటమి ‘బిగ్’ ఆఫర్

– బిగ్ టీవీకి 59 లక్షలతో ప్రచార బాధ్యతలు
– జీఓ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
– తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ యుద్ధం
– కూటమిపై యుద్ధం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ టీవీకి బాధ్యతలా?
– ఇది తెలంగాణలో బీజేపీ ప్రయోజనాలకు విరుద్ధం కాదా?
– బాబుకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటుంది ఎవరు?
– బీజేపీ మనోభావాలు పరిగణనలోకి తీసుకోరా?
– రేపు తెలంగాణ బీజేపీ నేతలు విమర్శిస్తే ఎలా?
– సోషల్‌మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

అది తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార చానెల్. ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పుట్టిన చానెల్. ఇంకా చెప్పాలంటే.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో పుట్టిన టీవీ చానెల్ అన్నది ప్రచారం. మిగిలిన చానెళ్ల మాదిరిగానే.. తన పార్టీ ప్రత్యర్ధులను విమర్శించడమే కాదు. తన పార్టీ- ప్రభుత్వాన్ని జనంలోకి తీసుకువెళ్లడమే దాని లక్ష్యం. తప్పు లేదు. ఈ మాదిరిగా దేశం, రాష్ట్రాల్లో.. చాలా చానెళ్లు, పత్రికలు, యూబ్యూబులు, వెబ్‌సైట్లు పనిచేస్తున్నాయి. ఆ చానెళ్లు నిర్వహించే పార్టీలు అధికారంలోకి వస్తే వాటికి ప్రకటనల పండుగే.

తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉంటే.. నమస్తే తెలంగాణ పత్రిక, టీ న్యూస్ చానెల్‌కు ప్రభుత్వ ప్రకటనల వరద వస్తుంది. అధికారంలో లేకపోతే ఏమీ ఉండదు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంటే, సాక్షికి వందల కోట్ల ప్రకటనల పండగ. టీవీ 9, ఎన్టీవీకి సేమ్ టు సేమ్. అధికారం లేకపోతే ఏమీ ఉండదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5కి టీడీపీ అధికారంలో ఉంటేనే ప్రకటనల వర్షం. లేకపోతే ఉండవు. ఇవన్నీ అందరికీ తెలిసిన బహిరంగ ర హస్యాలే.

తెలంగాణలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత, సోషల్‌మీడియా విభాగాన్ని పటిష్టం చేశారు. అప్పటికే ఆయకంటూ సొంత సోషల్‌మీడియా దళం ఉండనే ఉంది. ఇక పీసీసీ చీఫ్ అయిన తర్వాత.. తన రాజకీయ ప్రత్యర్ధులైన బీఆర్‌ఎస్, బీజేపీపై విరుచుకుపడుతూ, కాంగ్రెస్‌ను జనంలోకి తీసుకువెళ్లేందుకు రేవంత్ సొంత మీడియా బృందం సక్సెస్ అయిందన్నది నిష్ఠుర నిజం.
ఆ తర్వాత దానిని మరింత వ్యవస్థీకృతం చేసేందుకు ‘బిగ్ టీవీ’ని తెరపైకి తీసుకువచ్చారని, దానికి రేవంత్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్నది బహిరంగంగా జరిగిన చర్చనే. ఆ ప్రకారంగా..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సొంత మీడియా లేని లోటును ఆ టీవీ తీర్చింది. మరికొన్ని మీడియా ఏజెన్సీలూ కాంగ్రెస్-రేవంత్ ప్రచారం కోసం ‘కనిపించని నాలుగో సింహం’లా, రంగంలో ఉన్న విషయం తెలిసిందే.

చాలాకాలం నుంచి ఆ చానెల్ తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీపై విరుచుకుపడుతోంది. వారి విధానాలను తూర్పారపడుతూ, కాంగ్రెస్‌ను జనంలోకి తీసుకువెళుతోంది. ప్రధానంగా ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీపై ఒంటికాలితో లేస్తు, కాషాయపార్టీకి తలనొప్పిలా మారింది. ఇటీవల పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారాన్ని చర్చ లాంటి రచ్చతో, ఆ వ్యవహారాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడంలో సక్సెస్ అయింది. ఫలితంగా తెలంగాణలో కూడా క్రైస్తవులు రోడ్డెక్కి, ఆంధ్రాలో జరిగిన పాస్టర్ మృతిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రాలో ఆ చిచ్చు ఇంకా చల్లారడం లేదు.

అలాంటి కాంగ్రెస్ పార్టీ అనుకూలముద్ర ఉన్న చానెల్‌కు.. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఏపీ ప్రభుత్వం, తన ప్రభుత్వ ప్రచారానికి 59 లక్షలు కేటాయిస్తు, ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమయింది. ఒకవైపు తెలంగాణలో బీజేపీపై విరుచుకుపడుతున్న చానెల్.. అదే బీజేపీ భాగస్వామిగా ఉన్న ఏపి ప్రభుత్వం 59 లక్షల రూపాయలు ప్రచారం కోసం ఇవ్వడం ఆశ్చర్యమే.

నిజానికి ఇలాంటి కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలిసి జరగాలి. లేదా ఆయన తర్వాత బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి లోకేష్‌కయినా తెలియాలి. మరి వారిద్దరికీ తెలిసే ఈ జీఓ వచ్చిందంటే నమ్మటం కష్టమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా చిన్న చిన్న అంశాలనే ఒకటికి పదిసార్లు రాజకీయ కోణంలో ఆలోచించే చంద్రబాబునాయుడు, ఇలాంటి నిర్ణయాలు ఆమోదించరన్నది పార్టీ వర్గాల వాదన. అసలు ఇది ఏ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారో అర్ధం కావడం లేదంటున్నారు.

కాగా బిగ్ టీవికి ప్రచార బాధ్యతలు అప్పగిస్తూ ఇచ్చిన జీఓ కాపీ.. ఉదయం నుంచీ సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తెలంగాణలో బీజేపీ యుద్దం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా ప్రచారంలో ఉన్న టీవీ చానెల్‌కు, ఈ బాధ్యత ఎలా ఇస్తారు? బాబుకు తెలియకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఇది బీజేపీని మనస్తాపానికి గురిచేస్తుందన్న కనీస రాజకీయ స్పృహ కూడా లేదా? కూటమికి బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారైన చానెల్‌కు ప్రచారం కోసం 59 లక్షల రూపాయలు కేటాయించడం ద్వారా ఏం సంకేతాలు పంపిస్తున్నారు? రేపు తెలంగాణ బీజేపీ నేతలు దీనిని విమర్శిస్తూ, మీడియాకెక్కితే అప్పుడు తలదించుకోవలసింది ఎవరు? అంటూ విరుచుకుపడతున్నారు.

ఈ సందర్భంలో వారు గతంలో జగన్ ప్రభుత్వం ప్రచారం కోసం రెండు మీడియా సంస్థలకు కోట్ల రూపాయలు కట్టబెట్టిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో ఇండియాటుడే, టైమ్స్‌కు జగన్ ప్రభుత్వం కోట్ల రూపాయలు ప్రచారానికి కేటాయించిన ప్పుడు మనం విమర్శించిన విషయం మర్చిపోతే ఎలా? ఇప్పుడు మనమే ఆ పనిచేస్తే, ఇక మనకూ జగన్‌కూ తేడా ఏముంటుంది? మనమూ జగన్ దారిలోనే నడుస్తున్నామని క్యాడర్, జనం అనుకునే ప్రమాదం లేదా? అంటూ పసుపు సైనికులు, సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇదిలాఉండగా, మరో చానెల్‌కూ మరో 50 లక్షల రూపాయలతో ప్రచార బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

LEAVE A RESPONSE