భారతదేశ మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం
మార్చి 14, 1921, కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, పెద్దపాడు గ్రామంలో మునిదాసు గారు , సుంకలమ్మ గారికి, “మాల” కుటుంబంలో జన్మించారు.. తాను పుట్టిన మూడు రోజుల్లోనే తండ్రిని కోల్పోయినా,, కష్టపడి చదువు కొనసాగించిన ఆయన ఆరోజుల్లోనే మద్రాస్ లా కాలేజీ నుండి,, లాయర్ డిగ్రీ పొందారు..
ఆయన గురించి చెప్పాలి అంటే,, ఆయన స్నేహితుల మాటలు ఇక్కడ చెప్పాలి.. “” పెద్దపాడు నుండి కర్నూలు మునిసిపల్ బడికి చిరిగిన బట్టలు వేసుకుని,, 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి, రోజూ జొన్న రొట్టెలో కారం వేసుకుని తెచ్చుకునే సంజీవయ్య,, ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు అనుకుంటారు,, అతని కష్టమే అతన్ని అక్కడ నిలబెట్టింది..
మద్రాసులో లా చదివే రోజుల్లో,, మెస్ చార్జీల కోసం ఆయన గణిత ఉపాధ్యాయిడిగా పని చేస్తూ కష్టపడి చదువుకున్నారు.
అపజయం ఎరుగని రాజకీయ దురంధరులు – దామోదరం సంజీవయ్య
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్రాస్ లా కాలేజీలో చదివే రోజుల్లోనే,, స్వతంత్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొని, నెహ్రు లాంటి జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు, దామోదరం సంజీవయ్య గారు… అనర్గళంగా ప్రజలను అర్రుతలు ఊగించేలా ఇంగ్లీషులో ప్రసంగించి,, నెహ్రు చేత.. “” సంజీవయ్య సార్”” అని పిలిపించుకుని,, ఒక తిరుగులేని రాజకీయ వ్యూహకర్తగా మన్ననలు అందుకున్న సంజీవయ్య గారు,, అతి చిన్న వయసులో కాంగ్రెస్ నాయకులుగా ఎన్నో రికార్డులు విజయాలు సాధించారు.. అందులో కొన్ని..
▪️29 సంవత్సరాల వయసులో మొదటిసారిగా MLA గా ఎన్నిక అయ్యారు.. అప్పట్లో అదొక రికార్డు
▪️31 సంవత్సరాల వయసులో ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వంలో, సి.రాజగోపాలచారి కాబినెట్ లో మంత్రిగా ఎన్నిక అయ్యారు.. అదొక రికార్డు
▪️39 సంవత్సరాల వయసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా,, దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా, అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని పొందిన రాజకీయ నేతగా పేరు ప్రతిష్టలు దక్కించుకున్నారు..
▪️ఒంటిచేత్తో 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించిన సంజీవయ్య గారు AICC జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నిక అయ్యి కేంద్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన మొదటి దళితుడి కూడా ఆయనే
▪️1964 సంవత్సరంలో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సంజీవయ్య గారు,, కొంతకాలం నెహ్రు ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా,, మరికొంతకాలం వాణిజ్య శాఖ మంత్రిగా,, తర్వాత ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో,, మరోసారి ఇందిరా గాంధి ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, ఎన్నికై, కార్మిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు..
సంజీవయ్య గారు తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు
ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యాక సంజీవయ్య గారు మొదటిసారి తన తల్లి సుంకలమ్మ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు, తిరిగి వస్తూ, 100 రూపాయలు ఆవిడ చేతిలో పెట్టారు.. ఆవిడ ఆ 100 తీసుకుంటూ,, నాకంటే నువ్వు ఉన్నావు,, నాలాంటి ఎంతో మంది పేదలకు సహాయం చేయడానికి ఎవరు ఉన్నారు అని ప్రశ్నించింది.. ఆవిడ ప్రశ్న సంజీవయ్య గారి మనసుని తొలిచి వేసింది… ఆ ఆలోచన నుండి పుట్టినదే… “”వృద్ధాప్య పింఛను””.. ఆ తర్వాత ఆయన పేదల కోసం, బడుగుల కోసం, కార్మికుల కోసం తీసుకొచ్చిన పథకాలు, భారతదేశ రాజకీయాలనే ప్రభావితం చేశాయి..వాటిలో కొన్ని
▪️దేశంలో మొట్టమొదటి వృధాప్య పింఛన్ల పథకం
▪️దేశంలో మొట్టమొదటి వితంతు పింఛన్ల పధకం
▪️1960 సంవత్సరంలో దళితులకు 6 లక్షల ఎకరాల ఇళ్ల పట్టాల పంపిణీ
▪️ఆంధ్రప్రదేశ్ లో SC రిజర్వేషన్లు 14% నుండి 17 % పెంచడం, BC రిజర్వేషన్లు 24% నుండి 38% పెంచి, కాపులకు రిజర్వేషన్లు కల్పించడం.. (తర్వాతి ప్రభుత్వాలు ఈ చట్టాలను వెనక్కు తీసుకున్నాయి)
▪️1961 లో దేశంలోనే మొట్టమొదటిసారి,, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో SC, ST, BC లకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయడం.
▪️ ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత పెంచడానికి కారణం అయిన, నిర్బంధ ప్రాథమిక విద్య,, ఉన్నత చదువుల్లో పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు,, మధ్యాహ్న భోజన పధకం.
▪️1965లో కార్మిక శాఖ మంత్రిగా ఎన్నికయ్యాక, కార్మికులకు Bonus ఇచ్చేవిధంగా చట్టం
▪️కాంట్రాక్ట్ ఉద్యోగుల రక్షణ కోసం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం 1970
▪️కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం, ఇప్పుడు ఎంతో మంది కార్మికులకు బాసటగా నిలుస్తున్న ESI వ్యవస్థ..
వీటితో పాటు పాలన వ్యవస్థలో గణనీయమైన మార్పులు పరిచయం చేసారు సంజీవయ్య గారు.. వాటిలో కొన్ని..
▪️అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau), Prohibition and Excise డిపార్ట్మెంట్ లు నెలకొల్పారు..
▪️ఆంధ్రప్రదేశ్ లో మొదటి ల్యాండ్ సర్వే
▪️గ్రేటర్ హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు
▪️మొదటి లా కమీషన్ ఏర్పాటు..
▪️గాజులదీన్నే, వరదరాజుల స్వామి నీటి ప్రాజెక్టులతో రాయలసీమ కి సాగునీరు అందించడం..
▪️ పులిచింతల, వంశధార ప్రాజక్టుల నిర్మాణం
▪️కళాకారుల కోసం లలిత కళా అకాడెమీ స్థాపన – ఇలాంటిది దేశంలోనే మొదటిది..
▪️తెలుగుని రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించడం, ఉర్దూని రెండవ అధికారిక భాషగా ప్రకటించడం..
నిజాయితీ కి మారుపేరు నిస్వార్థమైన త్యాగజీవి – సంజీవయ్య
రాజకీయంగా అంతటి ఉన్నత పదవులు అనుభవించినా, చాలా నిరాడంబర జీవితాన్ని గడిపారు సంజీవయ్య గారు.. పిల్లలు ఉంటే, వాళ్ళ కోసం సంపద పోగేసే ఆలోచన వస్తుందేమో అని,, భార్య కృష్ణవేణమ్మ గారిని ఒప్పించి పిల్లలను కనకుండా జీవితం గడిపారు సంజీవయ్య గారు..
1967 లో ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైన సంజీవయ్య గారు.. తర్వాతి క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై,, 8 మే 1972 న తుదిశ్వాస విడిచారు..అదే రోజు వారి వివాహ వార్షికోత్సవం కావడం విశేషం..
చనిపోయే సమయానికి ఆయనకు మిగిలిన ఆస్తులు, పెదపాడు గ్రామంలో ఒక రేకుల కప్పు ఇల్లు,, తన హాఫ్ చేతుల కోటు పెట్టుకోవడానికి ఒక రేకు పెట్టె,, భోజనం చేయడానికి ఒక ఇత్తడి పాత్ర,, కొన్ని పుస్తకాలు…
సంజీవయ్య గారి సేవలు విస్మరించిన ప్రభుత్వాలు
సంజీవయ్య గారు చనిపోయాక వారికి వారసులు ఎవరూ లేకపోవడంతో,, ఆయన ఇంటిని అప్పటి కర్నూలు కలెక్టర్ Ch. విజయ మోహన్ స్వాధీనం చేసుకున్నారు.. అప్పటి ప్రభుత్వం ఆ ఇంటిని మ్యూజియంగా మారుస్తామని మాట ఇచ్చింది.. అది జరగలేదు.. మళ్ళీ ఎన్నికలప్పుడు అభ్యర్థులు ఆ ఇంటి స్థలంలో కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేస్తాము అని మాటలు చెప్పడమే తప్ప, చేతల్లోకి రాలేదు.. ఆయన నివాసం ఇప్పటికీ శిథిలావస్థలోనే ఉండిపోయింది..
హుస్సేన్ సాగర్ పక్కన సంజీవయ్య గారి సమాధిని ఏర్పాటు చేసి,, ఆ స్థలాన్ని “”సంజీవయ్య పార్కు”” పేరుతో ఏర్పాటై చేసినప్పటికీ,, అది కూడా రక్షణకు నోచుకోక,, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన సంగతి తెలిసిందే..
భారత ప్రభుత్వం 2008 సంవత్సరంలో ఫిబ్రవరీ 14న, సంజీవయ్య గారి జయంతి సందర్భంగా,, ఆయన గౌరవర్ధకం ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది..
దళిత వర్గాల నుండి వచ్చిన నాయకుల పట్ల ప్రభుత్వాల అలసత్వం మాములే,, కానీ,, ఇలాంటి గొప్ప విజయాలు సాధించిన స్ఫూర్తి ప్రధాత,, దళిత జాతికి అత్యధిక సేవ చేసిన నాయకులు,, నిస్వార్థంగా నిజాయితీగా బ్రతికిన త్యాగమూర్తి,, దామోదరం సంజీవయ్య గారిని,, కనీసం దళిత జాతి కూడా గుర్తుంచుకొని గౌరవించుకోకపోవడం,, దారుణం,, ద్రోహం.
– మూక్ నాయక్
చైతన్య నాగా