Home » ‘దక్కన్’ దందా

‘దక్కన్’ దందా

– అధికారుల కనుసన్నల్లోనే
– అనుమతులకి మించి తవ్వకాలు
– సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతర్
వడ్డించే వాడు మనోడైతే బంతి చివరన కూర్చున్నా ఏం కాదు అన్నట్లు ఉంది దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ తెంపరితనం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పాలకవీడులో నెలకొన్న డీసీఎల్ మొదట ఒక మినీ సిమెంట్ పరిశ్రమగా ప్రారంభమైంది. క్రమంగా విస్తరిస్తూ నేడు మూడో మైన్ దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఆ పరిశ్రమ పలు నిబంధనలు యథేచ్ఛగా అతిక్రమించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పలువురు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు.
విషయానికొస్తే ఇటీవల ఈ పరిశ్రమ మూడో మైనింగ్ విస్తరణ కోసం పర్యావరణానికి సంబంధించి ప్రజాభిప్రాయం చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని పరిశ్రమ నెలకొన్న ప్రాంతంలోని గ్రామాల్లో నిర్వహించాలి. అందుకు విరుద్ధంగా పరిశ్రమ ప్రాంగణంలోనే నిర్వహించింది. వందలాది పోలీసులను ఆయా గ్రామాల్లో మోహరింపజేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. నిరాక్షరాష్యులైన పలువురు ఆ ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంతానికి వెళ్లేందుకే భయపడే పరిస్థితి నెలకొంది. పైగా ప్రజాభిప్రాయ సేకరణను పొల్యూషన్ బోర్డ్ జిల్లా ప్రభుత్వాధికారి అధ్యక్షతన నిర్వహించాల్సి ఉండగా సాక్షాత్తు డీసీఎల్ జీఎం ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
అన్ని వేల మంది గ్రామస్థులు ఉన్న ఆ గ్రామాల నుంచి కేవలం వంద మంది కంటే తక్కువ మంది హాజరు కావడం గమనార్హం. వారిలో కూడా 90%నికి పైగా స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులే అభిప్రాయాలు వెల్లడించారు. వారు కూడా పర్యావరణానికి సంబంధించి మాట్లాడకుండా కేవలం ఉద్యోగాలు, తమ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు.
దీన్ని బట్టి చూస్తే ఈ కార్యక్రమానికి పరిశ్రమ అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్నారని, వ్యక్తులను కూడా తమకు అనుకూలంగా మాట్లాడే విధంగా ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు
deccan1
వినిపిస్తున్నాయి.అన్ స్కిల్డ్ మహిళలకు కనీసం 20రోజుల పనిదినాలు కూడా కల్పించడం లేదు. పరిశ్రమ కోసం వేసిన రైల్వే లైన్ వల్ల భూములు కోల్పోయిన రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారంలో నేటికీ 20శాతం బకాయిలు ఉన్నాయి. రెండో మైనింగ్ కోసం తవ్విన ప్రాంతాన్ని పూడ్చిన తర్వాతనే 3వ మైనింగ్ చేపట్టాలని నిబంధనలున్నాయి.
అనుమతులు తీసుకున్న దానికంటే ఎక్కువ 1.20 లక్షల మెట్రిక్ టన్నుల అక్రమ తవ్వకాలు జరిపారని జిల్లా కలెక్టర్ సర్వే నివేదిక ప్రకారం NGT తేల్చి చెప్పింది. అందుకు గానూ రూ.5.83 కోట్ల జరిమానా తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాలని పరిశ్రమ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఒకేసారి రెండు మైనింగ్ తవ్వకాలు జరపడం చట్ట విరుద్ధం.
ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో భాజపా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి సంకినేని వరుణ్ మాట్లాడుతూ డీసీఎల్ రెండో మైనింగ్ తవ్వకాలకు 2050 వరకు అనుమతులున్నాయని, ఆ ప్రకారం అప్పటి వరకు మూడో మైనింగ్ చేపట్టరాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి మూడో మైన్ తవ్వకాలు 2014 నుంచే ప్రారంభించారని విశ్వసనీయ సమాచారం. సుప్రీంకోర్టు సూచనల మేరకు రెండో మైనింగ్ పూర్తి కాకముందే మూడో మైనింగ్ ప్రారంభించరాదు. డీసీఎల్ మాత్రం ఆ సూచనలు తుంగలో తొక్కి యథేచ్ఛగా తవ్వకాలు ప్రారంభించింది.
ఈ అక్రమ మైనింగ్ విషయమై గతంలో కోటేశ్వరరావు అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. So1533,sep14/2006EIA నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల డీసీఎల్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందని ఆయన ఆరోపిస్తున్నారు. పర్యావరణ నిర్వహణ విషయంలో గతంలో NGT ఈ పరిశ్రమ యాజమాన్యానికి రూ.28 లక్షల జరిమానా విధించడం జరిగింది ఆ డబ్బులు యాజమాన్యం చెలించింది.
ఇక్కడ ప్రస్తావించడం అవసరం. ఇలా యథేచ్ఛగా నిబంధనలు తుంగలో తొక్కి మూడో మైనింగ్, ప్లాంట్ నిర్మాణం చేపట్టిన డీసీఎల్ కు ఉన్నతాధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయేమోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే 3వ ప్లాంట్ విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి, అందుకు ప్రజాభిప్రాయ సేకరణ ,ప్రజాప్రతినిధులు,అధికారులను, సహకారంతో యాజమాన్యం ముందుకు సాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply